జార్ఖండ్ రాజకీయాల్లో గత నాలుగు దశాబ్దాలుగా దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం కీలకంగా మారింది. జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ పురిటి గెడ్డ దుమ్కాకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వృద్ధుడైన శిబు సోరెన్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ దుమ్కా గతంలో కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా దుమ్కా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ ఎన్నికల బరిలోకి దిగారు. ఇది మొదలు ఆమె జేఎంఎంపై మాటల యుద్ధం చేస్తున్నారు. దీనికి ప్రతిగా శిబు సోరెన్ చిన్న కోడలు కల్పనా సోరెన్ తన భర్త, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపినందుకు బీజేపీని కార్నర్ చేస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో శిబు సోరెన్ రాజకీయ ప్రతిష్ట దిగజారుతున్నదనే వాదన వినిపిస్తోంది. ఓ వైపు పార్టీ, మరోవైపు ఇంటి పెద్ద కోడలు.. మధ్యలో శిబు సోరెన్ నలిగిపోతున్నారని వినికిడి. ఇది సోరెన్ కుటుంబానికి మాత్రమే కాకుండా బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. 2019లో బీజేపీకి చెందిన సునీల్ సోరెన్ దుమ్కా నుంచి గెలిచి, శిబు సోరెన్ కోటను కూల్చివేశారు. ఈసారి సీతను అభ్యర్థిగా నిలబెట్టి, జేఎంఎం (కూటమి)ని గందరగోళపరిచేందుకు బీజేపీ ప్లాన్ చేసింది.
అయితే జేఎంఎం.. బీజేపీ అభ్యర్థి సీతకు వ్యతిరేకంగా కుటుంబం నుండి ఎవరినీ అభ్యర్థిగా నిలబెట్టలేదు. అయితే చిన్న కోడలు కల్పనా సోరెన్‌కు పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించింది. పార్టీ ఈ స్థానం టిక్కెట్‌ను నలిన్ సోరెన్‌కు కేటాయించింది. 1952లో మొదటిసారిగా దుమ్కా స్థానానికి ఎన్నికలు జరిగాయి. నాడు కాంగ్రెస్‌కు చెందిన పాల్ జుజార్ సోరెన్ విజయం సాధించారు. అప్పటి నుండి ఈ లోక్‌సభ స్థానం 19 ఎన్నికల్లో 11 సార్లు సోరెన్ వర్గం చేతికే దక్కింది. శిబు అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అయితే ఆయన పార్టీ ఆప్తమిత్రుడు నళిన్ సోరెన్ జెఎంఎం సత్తా చాటేందుకు రంగంలోకి దిగారు.
2019 ఎన్నికల డేటా ప్రకారం జార్ఖండ్‌లోని దుమ్కా లోక్‌సభ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 10 లక్షల 25 వేల 968. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 20 లక్షల 59 వేల 611. ఇక్కడి జనాభాలో 92 శాతం మంది గ్రామాల్లో, మిగిలిన వారు నగరాల్లో నివసిస్తున్నారు. కుల సమీకరణలను పరిశీలిస్తే ఎస్సీ కేటగిరీ జనాభా 7.84 శాతం, ఎస్టీ కేటగిరీ జనాభా 37.39 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment