దేశ రాజకీయాల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నేతలు అరుదుగా కనిపిస్తారు. వారిలో ఒకరే జార్ఖండ్ అధికార ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత శిబు సోరెన్. పొడవాటి జుట్టు, మాసిన గడ్డంతో కనిపించే ఈ నేతకు 80 ఏళ్లు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిబు సోరెన్ అక్కడి బహిరంగ సభల్లో ప్రతీకాత్మకంగా కనిపిస్తుంటారు. అంటే మోర్చా వేదికల్లో పోస్టర్లు, బ్యానర్లలో ఆయన ఫొటో తప్పక కనిపిస్తుంది.
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనప్పటికీ ఆయన పేరు జార్ఖండ్‌లో వాడవాడలా వినిపిస్తుంటుంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల విముక్తిపై పోరాటంతో శిబు సోరెన్ రాజకీయ ప్రయాణం మొదలైంది. ధన్‌బాద్‌కు ఆనుకుని ఉన్న తుండి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని శిబు తన పోరాటాన్ని ప్రారంభించారు. తొలుత పాఠశాలలో విద్యపై గ్రామీణులకు అవగాహన కల్పించారు.
1977లో శిబు సోరెన్ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి విఫలమయ్యారు. అయితే 1980లో లోక్‌సభలో మొదటి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 1986, 1989, 1991, 1996లలో విజయాన్ని హస్తగతం చేసుకుంటూ వచ్చారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత బాబులాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. అయితే 2004, 2009, 2014లలో దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తిరిగి విజయాన్ని దక్కించుకున్నారు.
శిబూ సోరెన్ మొత్తం ఎనిమిది సార్లు దుమ్కా లో విజయపతాకం ఎగురవేశారు. శిబు సోరెన్ రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1984లో ఒకసారి జామా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటులో ఆయన పెద్ద కోడలు సీతా సోరెన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. శిబు సోరెన్‌పై పలు హత్యారోపణలు ఉన్నాయి. అయితే విచారణ తర్వాత అతనిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. శిబు సోరెన్ వివిధ కాలాల్లో మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment