సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా బీఆర్‌ఎస్ బల ప్రదర్శనకు సిద్ధమవుతోంది. 13న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ప్రధాని మోదీతో సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అంతకు మించేలా 17వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి భారీగా జన సమీకరణ చేయడంతోపాటు పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ స్థాయి నేతలను ఆహ్వానించనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు, ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ త్వరలోనే నేతలతో భేటీ కానున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు మోదీ సభ కోసం బీజేపీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. మొత్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఫిబ్రవరిలో సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా భారీ బహిరంగ సభలతో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి.
కేసీఆర్ పుట్టినరోజున ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయాన్ని వచ్చే నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం కొత్త సచివాలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం నిర్విరామంగా శ్రమిస్తోంది. వేద పండితుల సూచన మేరకు ఫిబ్రవరి 17వ తేదీ శుక్రవారం ఉదయం వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత 11.30 గంటల నుంచి 12.30 గంటల మధ్య సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆహ్వానిత ముఖ్యమంత్రులతో పాటు ఇతర నేతలు పాల్గొంటారు.
ఖమ్మం సభ తరహాలో..
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం, కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలతోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, వామపక్షాల జాతీయ నేతలు పాల్గొన్నారు. అదే తరహాలో సచివాలయ ప్రారంభోత్సవం, పరేడ్‌గ్రౌండ్స్ సభను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తోపాటు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ తరఫున జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌తో పాటు మరికొందరు ముఖ్య నేతలు పాల్గొంటారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు.
నాలుగు రోజుల తేడాలోనే..
పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ మోదీ సభకు, బీఆర్‌ఎస్ సభకు మధ్య కేవలం నాలుగు రోజులే గడువు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే భారీగా జన సమీకరణతో సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ సభకు తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఇతర నేతలు హాజరుకానుండటం బీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పెరిగేందుకు దోహదం చేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సభకు జన సమీకరణ, ఏర్పాట్లకు సంబంధించి సీఎం కేసీఆర్.. త్వరలో గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment