సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ కూటమి ఒక దోపిడీ ముఠా అని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. పార్లమెంటులో ప్రజాసమస్యలు చర్చకు రాకుండా విపక్షా లు వ్యవహరించాయని, మణిపూర్ అంశంపై చర్చలు జరపాలని కాంగ్రెస్ గొడవ చేస్తుంటే బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్‌కు తోకపార్టీల్లా వ్యవహరిస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.
శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని, ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు పొందడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని సమాధానం కోసం పట్టుబట్టిన విపక్షాల నేతలు ఆయన మాట్లాడుతుంటే లోక్‌సభ నుంచి ఎందుకు పారిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.
యోధుల త్యాగాలను స్మరించేలా విగ్రహాలు
ఎంఐఎం పార్టీ ఒత్తిడికి లోబడి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బత్తిని మొగిలయ్య గౌడ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర మరుగున పడేలా చేశాయని డాక్టర్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నెహ్రూ, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబాలవే చరిత్ర అన్నట్లు ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూ షన్ క్లబ్‌లో బీజేపీ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన బత్తిని మొగిలయ్యగౌడ్ వర్ధంతి సభలో కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్, ఎంపీ లక్ష్మణ్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి యోధుల విగ్రహాలు పెట్టడమేకాకుండా, వారి త్యాగాలను స్మరిస్తూ కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. రజాకార్ల పోకడలను కళ్లకు కట్టేలా సినిమా తీస్తున్న రజాకర్ సినిమా బృందాన్ని ఎంపీ లక్ష్మణ్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment