విజయం: వి ఫర్ విక్టరీ, వినీత! | Vinitha Bali Victory of Britannia company | Sakshi
Sakshi News home page

విజయం: వి ఫర్ విక్టరీ, వినీత!

Published Sun, Nov 10 2013 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

విజయం: వి ఫర్ విక్టరీ, వినీత!

విజయం: వి ఫర్ విక్టరీ, వినీత!

రస్నా, క్యాడ్బరీ, కోకాకోలా, బ్రిటానియా.. వీటిల్లో ఒకదానితో మరొకదానికి సంబంధం లేకపోవచ్చు! కానీ ‘వినీత బాలి’ అనే పేరుకు మాత్రం వీటన్నింటితోనూ సంబంధముంది! వినీత ఓ ఉద్యోగిగా చేరి రస్నాలో కెరీర్‌కు శ్రీకారం చుట్టారు. క్యాడ్బరీ అధినేత క్యాడ్బరీనీ మెప్పించారు. కోకాకోలాకు ప్రపంచవ్యాప్త మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. కష్టాల్లో ఉన్న బ్రిటానియాను పట్టాలపైకి తెచ్చి ఆదాయంలో అనూహ్య వృద్ధి సాధించేలా చేశారు. సాధారణ కుటుంబంలో పుట్టి అసామాన్యంగా ఎదిగిన ఈ ధీర వనిత జీవితం.. ఓ స్ఫూర్తి పాఠం!
 
 ‘‘ఆడా, మగా అన్న తేడాల గురించి మాట్లాడితే నాకు నచ్చదు. ఇక్కడ సామర్థ్యమే ముఖ్యం. ఆడవాళ్లకు అవకాశాలు రాకపోవడమే సమస్య. వస్తే ఏమైనా సాధించగలరు.’’
 - వినీత
 
 బ్రిటానియా సంస్థ కష్టాల్లో ఉన్న కాలమది. ఆ సంస్థకు దీర్ఘకాలం మేనేజింగ్ డెరైక్టర్‌గా పనిచేసిన సునీల్ అలగ్‌ను పదవి నుంచి తప్పించాక బ్రిటానియా గాడి తప్పింది. ఆ స్థితిలో వినీత బాలి బ్రిటానియా ఎండీగా బాధ్యతలందుకున్నారు. ఎనిమిదేళ్లు గడిచాయి. సమస్యలన్నీ సర్దుకున్నాయి. బ్రిటానియా అనేక కొత్త ఉత్పత్తుల్ని ప్రవేశపెట్టింది. సంస్థ ఆదాయం మూడింతలు పెరిగింది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద ఫుడ్ కంపెనీల్లో బ్రిటానియా ఒకటి. ఏమంత గొప్ప నేపథ్యం లేని ఓ సామాన్య కుటుంబంలో పుట్టిన వినీత.. కార్పొరేట్ సంస్థల్ని విజయవంతంగా నడిపించడం, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మామూలు విషయం కాదు.
 
 బెంగళూరుకు చెందిన వినీత ఢిల్లీలోని శ్రీరాం కళాశాలలో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ముంబయిలో ఎంబీఏ చేసి ఫారిన్ సర్వీస్‌లో చేరాలన్నది ఆమె లక్ష్యం. కానీ ఎంబీఏ చేస్తుండగానే వోల్టాస్ సంస్థ పిలిచి మరీ ఉద్యోగమిచ్చింది. అక్కడికెళ్లి అందరిలా ఉద్యోగం చేసుకోకుండా ‘రస్నా’ను మార్కెట్లోకి తెచ్చారు వినీత. అంతే. దెబ్బకు జీవితం మారిపోయింది. వెంటనే దిగ్గజ చాక్లెట్ సంస్థ ‘క్యాడ్బరీ’ నుంచి ఆహ్వానం! అక్కడ పనితీరుకు సంస్థ అధినేత అడ్రియన్ క్యాడ్బరీ నుంచి ప్రశంసలు. ఉద్యోగ జీవితం సాగుతుండగానే రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి విదేశాల్లో చదివేందుకు వినీతకు స్కాలర్‌షిప్ వచ్చింది. అవకాశాన్ని వదులుకోకుండా వెళ్లి యుఎస్‌లో చదువుకుని మరింత రాటుదేలారామె. ఆ తర్వాత ఆమె మరో కంపెనీ వైపు చూడలేదు. యూకేలో సీనియర్ బ్రాండ్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చింది క్యాడ్బరీ. అక్కడ వినీత ప్రవేశపెట్టిన ‘విస్పా’ చాక్లెట్ మార్కెట్లో ఓ సంచలనం!
 
 క్యాడ్బరీ నుంచి వినీత తదుపరి ప్రయాణం శీతలపానీయాల దిగ్గజ సంస్థ కోకాకోలాలోకి. ఆ సంస్థకు ఆమె వరల్డ్‌వైడ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఈ బాధ్యతల్లో ఆమె ఎన్నో దేశాలు తిరిగారు. ఈ క్రమంలో ఆమె 45 దేశాలు చూశారు. ఆరు దేశాల్లో నివాసమున్నారు. తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో 2005లో తప్పనిసరి పరిస్థితుల్లో బెంగుళూరుకి వచ్చేశారు వినీత. ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో అప్పటికే నష్టాలలో ఉన్న బ్రిటానియాలో చేరారు.
 
 ఓవైపు తల్లి అనారోగ్యం, మరోవైపు సంస్థ కష్టాలు. సాధారణంగా స్త్రీలు చాలా బంధాల్లో చాలా ఎమోషనల్ అంటారు. నిజమే.. ఆమెకు తల్లితో ఉన్న బంధమే సంస్థతో కూడా ఉంది. అంత ఎమోషన్ ఉంది కాబట్టే తల్లినీ చూసుకున్నారు, సంస్థనూ నిలబెట్టారు. బ్రిటానియా తరఫున ఆమె నెలకొల్పిన న్యూట్రిషన్ ఫౌండేషన్ చిన్నపిల్లల్లో పోషకాహార లోపాల్ని నివారించేందుకు కృషి చేస్తోంది. అంతేకాకుండా ఫౌండేషన్ ద్వారా సమాజానికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇండియాలోని బిస్కెట్ కంపెనీల్లో అతి సామాన్యులకు-సంపన్నులకు ఇరువురికి నచ్చే ఉత్పత్తులను తేగలిగిన సత్తాకి సంస్థను వృద్ధి చేశారు. అందుకే 2011లో ఫోర్బ్స్.. వినీతను ఆసియాలోని 50 మంది అత్యుత్తమ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా గుర్తించింది. అంతేనా.. మరెన్నో పురస్కారాలు వినీత సొంతమయ్యాయి.
 - ప్రకాష్ చిమ్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement