ఎత్తు తక్కువని దిగులేలనోయి! | womens are want tall husband | Sakshi
Sakshi News home page

ఎత్తు తక్కువని దిగులేలనోయి!

Published Tue, Sep 2 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

ఎత్తు తక్కువని దిగులేలనోయి!

ఎత్తు తక్కువని దిగులేలనోయి!

ఎత్తయిన మగాడికి ఒనగూరుతున్న ప్రయోజనాలు, పొడుగు తక్కువున్న పురుషులు పొందుతున్న లాభాలను పోల్చి చూస్తే పొట్టి వారికి ప్రయోజనాలు ఎక్కువున్నట్లూ, వారి కాపురాలు బాగున్నట్లూ ఓ తాజా సర్వేను బట్టి తెలుస్తోంది.
 
మగాడిని మొగుడిగా చేసుకోవడానికి ఆడవారు ఎక్కువగా చూస్తున్న ప్రధాన లక్షణాల్లో ఎత్తు ఒకటి. ఎత్తుగా ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇదమిత్థంగా ఆడవారు చెప్పలేకపోయినా కూడా దాన్ని నమ్ముతూ వచ్చారు. కానీ, వారి నమ్మకాన్ని ఇప్పుడు పరిశోధకులు పటాపంచలు చేశారు. పొట్టివాడు గట్టివాడు మాత్రమే కాదు, మంచివాడని కూడా తేల్చారు!

పొడుగాటి మొగుడి వల్ల స్త్రీలు ఆశిస్తున్న ప్రయోజనాలు అనేకం. పొడుగాటి భర్త వల్ల సామాజిక గుర్తింపు మాత్రమే కాక, వారి వల్ల భద్రత పరంగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతూ వచ్చారు. కానీ, నిజానికి అలాంటి భద్రతాపరమైన ఉపయోగాలు వందమందిలో ఆరేడు మంది స్త్రీలకు కూడా కలగడం లేదట. అంటే, పొడుగాటి భర్త వల్ల భార్యలు ఆశిస్తున్న ప్రధాన ప్రయోజనం నిజంగా నెరవేరడం లేదని తేలిపోయింది.
 
చాప్‌మాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ ఫ్రెడరిక్, న్యూయార్క్ విశ్వవిద్యాలయం సోషియాలజిస్ట్ డాల్టన్ కోన్లీ, పరిశోధక విద్యార్థి వెయిజ్ మెన్ వేర్వేరుగా జరిపిన పరిశోధనలు, అధ్యయనాల ఫలితాలు మరో సంగతి కూడా తెలిపాయి. ఈ ఫలితాల క్రోడీకరణ అనంతరం ఎత్తయిన మగాడికి జరుగుతున్న ఒనగూరుతున్న ప్రయోజనాలు, పొడుగు తక్కువున్న పురుషులు పొందుతున్న లాభాలను పోల్చిచూస్తే పొట్టివారికి ప్రయోజనాలు ఎక్కువున్నట్లూ వారి కాపురాలు బాగున్నట్లూ తెలుస్తోంది.ఎత్తయిన వారికి త్వరగా పెళ్లి సంబంధాలు కుదరడం, బాగా చదువుకున్నవారి సంబంధాలు రావడం, మెరుగైన సంబంధాలు రావడం జరుగుతుంటుంది.
 
అయితే వీరికి రిస్కులు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కాస్త చైతన్యం ఉన్నవారు, దూకుడుగా ఉన్నవారు వీరికి భార్యలుగా వస్తున్నారట. దీనివల్ల ఈ పొడుగాటి మగాళ్ళలో విడాకుల రేటు కూడా ఎక్కువగా ఉంటోందట. ఎక్కువగా చదువుకున్న వారు సాధారణంగా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ భర్తతో  హోదా పోలికలు పెట్టుకోవడం కూడా ఈ విడాకుల రేటు పెరగడానికి కారణమట. అంతమాత్రాన పొడుగ్గా ఉన్న వారి కాపురాలన్నీ కూలుతున్నాయని ఈ సర్వే చెప్పడం లేదు. ఇతరులతో పోలిస్తే ఈ వర్గంలో విడాకుల రేటు ఎక్కువ అన్నది వారు ప్రస్తావిస్తున్న విషయం.
 
ఇక తక్కువ ఎత్తున్న పురుషులకు పరోక్షంగా కొన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి. చాలామంది ఎత్తును లోపంగా చూడడం వల్ల వీరికి పైపై ఆర్భాటాలకు ప్రాధాన్యమిచ్చే సంబంధాలు తప్పిపోయి ఒక రకంగా వీరికి మేలు చేస్తున్నాయి. ఎత్తు తక్కువున్నవాళ్ళు నిజంగా తమ బలహీనత అనుకుంటున్న విషయమే, వారికి ఎక్కువ మేలు చేస్తోంది. ఎత్తు కన్నా ముఖ్యమైన లక్షణాలను తమలో పెంపొందించుకోవడంలో భాగంగా వీరు ఆదాయం, ఇతర విషయాల్లో తమ జీవితాలను మెరుగుపరుచుకుంటున్నారు. దీంతో పెళ్లిళ్లు కొంత ఆలస్యం అయినప్పటికీ, కాబోయే భార్యాభర్తలిద్దరూ తమ వివరాలను చెప్పుకోవడం వల్ల చాలా విషయాల్లో పెళ్లికి ముందే స్పష్టత వస్తోంది.
 
దీంతో వీరి కాపురాలు నిలబడటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఎత్తును తమ బలహీనతగా భావించే పురుషులు భార్య ప్రేమను పొందడానికి ఇంటిపనులోనూ బాగా సాయమందుకుంటారు. దీనివల్ల కూడా దంపతుల మధ్య బంధాలు మరింత బలపడుతూ దాంపత్యాలు ఎక్కువ కాలం నిలుస్తున్నాయట.  23-45 ఏళ్ళ మధ్య వారిపైనే జరిగిన ఈ సర్వేలో 5 వేల మందికి పైగా మగాళ్లు పాల్గొన్నారు. దాన్నిబట్టి ఐదున్నర అడుగుల కంటే తక్కువ ఎత్తున్న వారి కాపురాలు మరింత సంతృప్తిగా ఉన్న విషయం తేలింది!
 
అన్నట్లు... ఈ సమాచారం మిమ్మల్ని ఆలోచనలో పడేస్తే వెంటనే న్యూయార్క్ యూనివర్సిటీని సంప్రదించండి గానీ మాకు మాత్రం ఏం సంబంధం లేదండోయ్!
- ప్రకాష్ చిమ్మల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement