విజయం: ఆమె ఆలోచనే ఒక బ్రాండ్! | Meena Bindra creates a pan-India of BIBA brand | Sakshi
Sakshi News home page

విజయం: ఆమె ఆలోచనే ఒక బ్రాండ్!

Published Sun, Dec 8 2013 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM

విజయం: ఆమె ఆలోచనే ఒక బ్రాండ్!

విజయం: ఆమె ఆలోచనే ఒక బ్రాండ్!

వ్యాపారంలో విజయవంతం అయిన ప్రతి ఒక్కరి వెనుక ఒక వైవిధ్యభరితమైన మార్కెటింగ్ ఐడియా ఉంటుంది. రొటీన్‌గా పడే కష్టాలుంటాయి. ఈ రెండు మిళితమైతే అద్భుతమైన సక్సెస్‌ను సాధించి పెడతాయి. అలా ఎనిమిది వేల రూపాయలతో మొదలు పెట్టిన వ్యాపారాన్ని పాతికేళ్లలో ఆరు వందల కోట్ల రూపాయల స్థాయికి చేర్చిన మహిళ మీనా బింద్రా. బ్యాంక్‌లోన్‌తో మొదలుపెట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన సాధారణ గృహిణి ఈమె.
 
 ‘బిబా’ బ్రాండ్ గురించి తెలియని అర్బన్ ఆడపిల్లలు దాదాపుగా ఉండరు. టాప్స్, కుర్తా, లెగ్గింగ్స్‌లలో బిబా బ్రాండ్ చాలా మంది అమ్మాయిల ఫేవరెట్. ఈ డిజైనర్ వేర్ సృష్టికర్త మీనా బింద్రా. ఆమె ఆలోచన, కష్టం, అదృష్టం బిబా కు ప్రాణం పోశాయి. ఒక బ్రాండ్‌గా ఎదిగేలా చేశాయి. ‘కష్టాలు, కడగండ్లు ఎదురైనప్పుడు సహనం, పట్టుదలలు మంత్రాల్లాంటివి. వీటిని ఆయుధంగా చేసుకుంటే ఎటువంటి పరిస్థితులతోనైనా పోరాడవచ్చు...’ అంటారు మీనా బింద్రా.
 
 ఎనిమిది వేలతో మొదలైంది...
 బ్యాంక్ వాళ్లు లోన్‌గా ఇచ్చిన ఎనిమిది వేల రూపాయలతో ముంబై లోని ఒక ఏరియాలో 1986లో మీనా బింద్రా ఫ్యాబ్రిక్ వేర్ మొదలైంది. చిన్నపిల్లలకు, అమ్మాయిలకు డ్రస్‌ల అమ్మకం జరిగేదక్కడ. సరుకును తెచ్చుకోవడం, అమ్మడం.. లాభాలు మొదటి వారం నుంచే కళ్ల ముందు కనిపించేవి. ఆ ఉత్సాహంతో మీనాలోని డిజైనర్ నిద్రలేచింది. అమ్మాయిలను ఆకట్టుకొనేలా చుడీదార్‌లను డిజైన్‌చేయడం మొదలైంది. అనతి కాలంలోనే ఆ ఏరియాలో మీనా వాళ్ల షాప్ ఫేమస్ అయ్యింది. షాప్‌లోకి సేల్స్‌గర్ల్స్ వచ్చారు. మీనా తన డిజైన్లతో డీలర్ స్థాయికి ఎదిగారు. మొత్తంగా ఎనిమిది సంవత్సరాల్లో ముంబైలోని చాలా షాప్‌లలో మీనా డిజైనర్ వేర్ లభించడం మొదలయ్యింది.
 
 ప్రతిబంధకాలూ... ఉన్నాయి
 80వ దశకం దాటి 90 వ దశకం వచ్చింది అంతలోనే ఒక కుదుపు. డిజైనింగ్ వచ్చింది మీనాకు మాత్రమే కాదు. అనేక షాప్‌ల వారు సొంతంగా డిజైనర్‌లను పెట్టుకొని డ్రస్సులను డిజైన్ చేయించుకోవడం మొదలుపెట్టారు. మీనాకు భయం మొదలైంది. తను కొత్త ప్రయోగాలు చేస్తున్నా డిమాండ్ తగ్గిపోయింది. ఈ సమయంలోనే మీనా ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో షాప్‌ల వారి దగ్గరకు వెళ్లారు. ఆ వైవిధ్యమైన ఆలోచనే ‘ఎథికల్ వేర్’. అమ్మాయిల ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతున్న ఆ సమయంలో, ఆడపిల్లల డ్రస్సుల్లో అసభ్యత తొంగి చూస్తున్న సమయంలో...  భారతీయతను ప్రతిబింబించే నిండైన డిజైన్లతో మీనా ‘బిబా’ను మొదలుపెట్టింది. పంజాబీలో చిన్న పిల్లను బిబా అని పిలుస్తారు. ఆ విధంగా బిబా అనే పేరు ను తన బ్రాండ్‌కు పెట్టుకున్నారు మీనా.
 
 టైమ్ కలిసొచ్చింది...
 28 యేళ్ల క్రితం మన దేశంలో రెడీ మేడ్ దుస్తులు అప్పుడప్పుడే వినియోగంలోకి వస్తున్న రోజుల్లో నా ప్రయత్నం మొదలుపెట్టాను. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి అది వందశాతం కచ్చితమైన సమయం. దాంతో నాకు బాగా కలిసొచ్చింది. ఇక తమ పిల్లలు చూడచక్కని బట్టలు వేసుకోవాలని అందరు తల్లిదండ్రులూ అనుకొంటారు. అయితే ఫ్యాషన్ పేరుతో అసభ్యకరమైన డ్రస్సింగ్‌ను మాత్రం ఒప్పుకోరు. అలాంటి వారికి సౌలభ్యంగా ఉండేందుకు ఎథికల్ వేర్‌ను మొదలుపెట్టాను. ఇది బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా స్టోర్స్ ఉన్నాయి. కొత్తగా నెలకు నాలుగైదు కొత్త స్టోర్‌లు ప్రారంభిస్తున్నాం. ప్రత్యేకమైన డిజైనింగ్ టీమ్ ఉంది. మొదట బట్టలషాప్ పెట్టిన రోజు ఈ స్థాయికి ఎదుగుతామని ఊహించలేదు. ఇపుడు అంతర్జాతీయ స్థాయికి కూడా ఎదగగలమనే నమ్మకం ఉంది. వందల కోట్ల టర్నోవర్ సాధించాం. వేల కోట్లకు సులభంగానే చేరుకొంటామనే విశ్వసిస్తున్నాను. ఈ విషయంలో నా భర్త, నా పిల్లలు, నా టీమ్ సహకారం మాత్రం అద్వితీయమైనది...’ అని మీనా బింద్రా అంటారు.
 - ప్రకాష్ చిమ్మల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement