దక్షిణం: ప్రకటనలకు ఎక్కిన మగబుద్ధి !
స్త్రీలపై జోకులకు వయసెక్కువ. మగాళ్లపై సెటైర్లకు ప్రచారమెక్కువ. స్త్రీలైపై జోకులే ముందుగా పుట్టాయి. ముందుగా ప్రచారం పొందాయి. ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ మధ్యనే మగాళ్లపై కూడా బాగా ఎక్కువగా సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు ముందొచ్చిన చెవుల కొంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు పురుషుల మీద వస్తున్నవి (ముఖ్యంగా మగబుద్ధికి సంబంధించినవి) ఈ మధ్య ప్రముఖ కంపెనీల ప్రచారానికి ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఆ ప్రకటనలకు - వాటికి సంబంధం లేకపోయినా క్రేజు కోసం వాడేస్తున్నారు. నిజానికి అవి మగజాతి సహజ లక్షణాలు !
ఎంత బిజీగా ఉన్నా అందాన్ని ఆస్వాదిస్తాడు:
మగాడికి సౌందర్యారాధన ఎక్కువ. దానిని ఎంత శ్రద్ధగా చేస్తాడంటే ఎంత టెన్షన్లో, బిజీగా ఉన్నా మానడు. దీని ఆధారంగా ఓ మందు కంపెనీ ఈ ప్రకటన తయారుచేసింది. ఓ వృద్ధ జంట ఆపమని పరుగెత్తుకు వస్తున్నా బాగా బిజీగా ఉండటం వల్లే లిఫ్టును ఆపకుండా పద్దెనిమిదో ఫ్లోరుకు అర్జెంటు పనిమీద వెళ్లిపోతాడు. అక్కడో అందమైన యువతిని చూడగానే పనంతా మరిచిపోయి మళ్లీ ఆమెతోపాటు పద్దెనిమిది ఫ్లోర్లు దిగుతాడు.
సెలక్టెవ్ మెమొరీ సిండ్రోమ్:
సాధారణంగా చాలామంది భర్తలకు పెళ్లి రోజు, భార్య పుట్టిన రోజు గుర్తుండవు. పాపం ఇందులో వాళ్ల తప్పేం లేదట. అదొక వ్యాధి అట. దానికి సెలక్టెవ్ మొమరీ సిండ్రోమ్ అని పేరుపెట్టారు. కాకపోతే చికిత్సే కాస్త ఖరీదు. పెళ్లయిన మూడు-నాలుగేళ్లకు ఇది సోకే అవకాశం ఉంటుంది. ఏడాదికి రెండు మూడు సార్లు డిప్రెషన్ కలిగించే ఈ వ్యాధికి చీరలు, బంగారం, వజ్రాలతో చికిత్స చేయించొచ్చు. దీనిపై ఓ ప్రకటన వచ్చింది. ‘ఆఫీసు పార్టీ హడావుడిలో పెళ్లిరోజును మరిచిన ఓ మగాడు వజ్రాల దుకాణానికి వెళ్తాడు. పెళ్లిరోజు డైమండ్ రింగ్ అడిగితే 1 క్యారెట్, 2 క్యారెట్ డైమండ్ చూపించినా మెప్పడు. పెళ్లిరోజు నిన్న అని తెలియడంతో షాపువాడు ఏకంగా ఐదు క్యారెట్ల డైమండ్ చూపిస్తాడు. అపుడు కానీ ఆ మొహం వెలగదు’. ఇది ఓ మద్యం ప్రకటన.
అందమైన అమ్మాయి అడిగితే కాదంటారా?
పడవ నిండా కుర్చీలు రవాణా చేస్తుంటాడొకతను. ఓ గట్టు మీద చక్కటి యువతి. నేను రానా అని సైగ చేయగానే కొన్ని కుర్చీలు పడేస్తాడు. ఆమె మేకపిల్ల కోసం మరికొన్ని, దాని మేత కోసం ఇంకొన్ని... కుర్చీలు నీళ్లలో. ఆ యువతి, ఆమె సంత పడవలో. ఇది ఫెవికాల్ యాడ్. అబ్బాయిల హృదయం సున్నితం, అందమైన అమ్మాయి అడిగినపుడు మంచులా కరుగుతుంది నష్టమైనా, కష్టమైనా అని చెప్తోందీ ప్రకటన!
టీవీల్లో రోజుకు పదుల సార్లు వస్తున్న ఈ ప్రకటనలు ఆయా కంపెనీలకు ప్రచారాన్ని, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. కాకపోతే మన గురించి మరీ అలా బహిరంగంగా తెలిస్తే ప్లస్‌లూ ఉన్నాయి. మైనస్‌లూ ఉన్నాయి.
కొన్ని ఘాటు నిజాలు
అన్నిసార్లు రాజ్యం మనదే కాదండోయ్. ఓడలు బళ్లు, బళ్లు ఓడలు అవడం అంటే ఏంటో మగాళ్ల విషయంలోనూ అపుడపుడు అర్థమవుతోంది. మచ్చుకు కొన్ని.
- 1950 కి ముందు అమెరికాలో 80 శాతం మంది మగాళ్లకు ఉద్యోగాలుంటే ఇపుడు 60 శాతం మందికే ఉన్నాయట.
- ఉద్యోగాలున్న మగాళ్లకంటే నిరుద్యోగంతో బాధపడే మగాళ్లకి డైవర్స్ అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట.
- ఆధునిక సేవా రంగాల్లో మగాళ్లు మిడిల్ మేనేజ్‌మెంట్‌లో ఎక్కువ ఉద్యోగాలు కోల్పోతున్నారట. వాటిని స్త్రీలు చేజిక్కించుకుంటున్నారు.
- ఇపుడు మనదేశంలోని ఐదుకు పైగా రాష్ట్రాల్లో వధువుల కొరత పెరిగింది.
- శృంగారం విషయంలో స్త్రీల అభిప్రాయానికి భారతీయులు తక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
- ప్రకాష్ చిమ్మల