సోషల్ మీడియాలో వ్యాఖ్యలు:దక్షిణాఫ్రికాలో దుమారం..
ఆమె వ్యాఖ్యలు జాత్యాహంకారాన్ని, జాతి వివక్షను ప్రతిబింబించాయి. జాతి వాదాన్ని రెచ్చగొట్టాయి. 'బ్లాక్ పీపుల్ యాజ్ మంకీస్' అంటూ సామాజిక మాధ్యమంలో తీవ్ర పదజాలాన్ని వాడి.. దక్షిణాఫ్రికా ఎస్టేట్ ఏజెంట్.. ఇప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటోంది. డర్బన్ బీచ్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆమె నల్లజాతీయులను విమర్శిస్తూ ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీ డెమొక్రెటిక్ అలయెన్స్ 'పెన్నీ స్పారో' సభ్యత్వాన్ని రద్దుచేయడమే కాక, ఆమెపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
జాతి వివక్షను రేపిన స్పారో వ్యాఖ్యలపై డెమొక్రెటిక్ అలయెన్స్ పార్టీ ప్రతినిధి రిఫైలియో నెట్ సేఖే స్పందించారు. స్పారో ప్రవర్తనపై ఫెడరల్ లీగల్ కమిషన్ కు సూచిస్తామని... ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నారు. డెమొక్రెటిక్ పార్టీలోనూ, ప్రజాస్వామ్య దక్షిణాఫ్రికా సమాజంలోనూ జాత్యాహంకారులకు ప్రవేశం లేదని ఆమె చెప్పారు. సౌతాఫ్రికాలో ఇటువంటి వైఖరి కలిగిన వారికి చోటు ఉండదని, దక్షిణాఫ్రికా నల్లజాతీయుల గౌరవాన్ని కించపరచినవారికి శిక్ష తప్పదన్నారు. సౌతాఫ్రికా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడ అభియోగాలపై విచారణ చేపడుతున్నామని, అనంతరం ఆమెపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
డర్బన్ ప్రజలపై సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే స్పారో ప్రజాద్వేషిగా మారిపోయింది. ''కొత్త సంవత్సరం వేడుకల సమయంలో బీచ్ లోకి ఈ కోతులను, చదువుకోని వారిని అనుమతించడంతో చెత్త పేరుకోవడమే కాక, ఇతరులకు సమస్యలు కూడా ఎదురౌతాయి'' అంటూ స్పారో పోస్ట్ చేయడం దక్షిణాఫ్రికాలో కొనసాగుతున్న జాతి వివక్షను ఎత్తి చూపింది.
అయితే పెన్నీస్పారో వ్యాఖ్యలపై దుమారం లేవడంతో ఆమె స్పందించింది. తాను నల్ల జాతీయులను విమర్శించ లేదని, తనకు వారంటే ఎంతో గౌరవమని సర్ది చెప్పింది. వారు అద్భుతమైన తెలివితేటలు గలవారని, తన వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దంటూ క్షమాపణలు కోరింది. కాగా స్పారో వ్యాఖల నేరంతో 22 ఏళ్ళ తర్వాత మళ్ళీ దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష దుమారం చెలరేగింది. 'హ్యాష్ ట్యాగ్' లో వేలమంది స్పారోపై దూషణల పర్వం కొనసాగించారు. ఆమె ఓ హేట్ ఫిగర్ అంటూ అభివర్ణించారు. డిసెంబర్ లో జాతిసంబంధాల సయోధ్యపై నిర్వహించిన ఓ సర్వే కూడా.. వర్ణ విచక్షణలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం వైఫల్యం చెందినట్లు తేల్చి చెప్పింది. అయితే స్పారో వ్యాఖ్యలతో దక్షిణాఫ్రికాలో చెలరేగిన ఈ జాతి వివక్ష రగడ.. ఎటువంటి పర్యవసానాలకు దారి తీస్తుందోనని అంతా ఆందోళనలో ఉన్నారు.