ప్రతి స్త్రీ తన భర్త తనంటే పడి చచ్చిపోవాలని, తన కొంగు పట్టుకు తిరగాలని కోరుకుంటుంది! నిజానికి స్త్రీలు ఇలాంటి వారితో సంతోషంగా ఉంటారా? ఇలాంటి వారినే ఇష్టపడతారా? అంటే...అదేం కాదు. అలా అనిపిస్తుంది గాని... అలా ఉంటే ఏ స్త్రీకీ నచ్చదు. మగాడు ఎప్పుడూ మగాడిగా ఉండాలి. మ్యాన్లీగా నడుచుకోవాలి. పెళ్లాం తను చెబితే వినాలని కోరుకుంటుందే గాని... అప్పుడప్పుడు తనను ఆదేశించడాన్నీ ఇష్టపడుతుంది. కాకపోతే... కొన్ని విషయాల్లో ఆమె కోరుకున్నది జరగాలనుకుంటుంది. ఆమెకు భయపడుతూ బతకడమూ ఇష్టపడదు, ఆమెను భయపెడుతూ బతకడం మంచిది కాదు. ప్రతి విషయం భార్యకు చెప్పడం కాదు నమ్మకమంటే... ఆమె ఉన్నప్పుడు, లేనపుడు భర్త ప్రవర్తన తీరులో మార్పు లేకపోవడం. అందరూ బాస్‌లను ఎపుడూ ఎందుకు ఇష్టపడరు?... ఎల్లప్పుడూ అజమాయిషీ వారిదే కాబట్టి!
మరి ఇంట్లో అలాగే ఉంటే ఇల్లూ ఆఫీసు ఒకటే అవుతుంది. ఒక్కోసారి పెళ్లాంకు బాస్‌లాగా ఉండాలి, మరోసారి బానిసలాగానూ ఉండటం తెలియాలి. అప్పుడే బ్యాలెన్స్ బాగుంటుంది. జీవితాంతం ఒకరిదే పైచేయిగా ఉంటే అది అవాంఛనీయం. ఈ పరిస్థితి జీవితంలో చాలా క్లిష్టమైన సందర్భాల్లో మనల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఒకరికి ఒకరు... రాజు రాణి! ఆమెకు బాగా తెలిసిన విషయాల్లో తనను గౌరవించాలనుకుంటుంది. భర్త కూడా తాను సిద్ధహస్తుడైన విషయాల్లో తన మాటే చెల్లాలనుకుంటాడు. నిజానికి మెజారిటీ స్త్రీలు... భర్త సరసానికి కొంగుపట్టుకుతిరిగేవాడుగా, సంసారానికి రథసారథిగా, సౌభాగ్యంలో స్నేహితుడిగా.. ఓదార్పులో తండ్రిగా, పనిలో సైనికుడిగా, సమర్థతలో రాజుగా ఉండాలని కోరుకుంటారు. అంటే... కార్యేషు దాసి, కరణేషు మంత్రి వంటి సూక్తులు స్త్రీకే కాదు, మగాడికీ ఉన్నాయి.
అమ్మాయిల మనసు నొప్పించే విషయాలు!
- చనువు ఉందని ‘డర్టీ’ విషయాలు మాట్లాడటం.
- సమస్యలో ఉన్నపుడు మీకు పని కారణంగా ఆమెకు తోడు లేకపోవడం.
- వారి కొత్త డ్రెస్‌ను ఏమాత్రం పట్టించుకోకపోవడం.. అది బాలేకున్నా!
- ఆమెకు సంబంధించిన దేనిపైనైనా వ్యతిరేకతను నేరుగా వ్యక్తంచేయడం.
- ఆమె అందం గురించి ప్రతికూల అంశాలను నేరుగా చెప్పడం
- ఇతర అమ్మాయి అందచందాలను మరో అమ్మాయి ముందు పొగడటం.
- మీరు ఊహించని కొన్ని విషయాలకు కూడా వారు హర్ట్ అవుతుంటారు.
అమ్మాయిల మనసు మెప్పించే విషయాలు!
- వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడాన్ని కోరుకుంటారు.
- అమ్మాయిలే గ్రహించగలిగిన బహుమతులు వారికి నచ్చేలా ఇవ్వగలగడం(గాజులు, లిప్‌స్టిక్, పర్‌ఫ్యూమ్) ఆమె తప్పులను కూడా పొరపాట్లు అని చిత్రీకరించి చెప్పగలిగే మీ స్కిల్!
- కాంప్లిమెంట్స్... అది కూడా అందంగా ఎక్స్‌ప్రెస్ చేయాలి.
- ఆమె ప్రైవేట్ టైం, ప్రైవేట్ విషయాలు ఎప్పుడూ అడగకపోవడం (పూర్తిగా చనువు రాకముందు).
- ఇతరుల గురించి ఆమె వద్ద ఎప్పుడూ తిట్టకపోవడం.
- మీరిచ్చే బహుమతుల కన్నా, వాటిలో మీ సృజన, టైమింగ్!
- ప్రకాష్ చిమ్మల
దక్షిణం: కొంగుపట్టుకు తిరుగుతారా... మ్యాన్లీగా ఉంటారా?
Published Sun, Aug 11 2013 2:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement