దక్షిణం: అప్పుడప్పుడు మౌనవ్రతమే ఆయుధం | some times Silent is main weapon | Sakshi
Sakshi News home page

దక్షిణం: అప్పుడప్పుడు మౌనవ్రతమే ఆయుధం

Published Sun, Sep 15 2013 2:42 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

దక్షిణం: అప్పుడప్పుడు మౌనవ్రతమే ఆయుధం - Sakshi

దక్షిణం: అప్పుడప్పుడు మౌనవ్రతమే ఆయుధం

మగాడి కోపం వెనుక కారణం ఉంటుంది, భార్య కోపం వెనుక భావోద్వేగం ఉంటుంది. భార్య ముందు ఏ సాక్ష్యాలు పనిచేయవు. అది ప్రజాకోర్టు వంటిది. పూర్వాపరాలతో  సంబంధం లేకుండా వర్తమాన సాక్ష్యాధారాలపైనే న్యాయాన్యాయాల విచారణ, శిక్ష విధింపు జరుగుతుంటుంది. కాబట్టి... భార్యను మేనేజ్ చేయడం వచ్చిందంటే మీలో ఐఐఎంలో ఎంబీఏ చేసేంతటి పరిజ్ఞానం, తెలివితేటలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అవును, బంధాల మధ్య మేనేజ్ చేయడం ఉంటుందా అని మీరడిగారనుకోండి ‘మేనేజ్ చేయడం’ అనే విషయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు. మేనేజ్ అంటే గారడీలు చేసి వాస్తవాలను తారుమారుచేయడం కాదు... పరిస్థితిని చాణక్యంతో అదుపులో ఉంచడం. సంబంధాలు బలహీన పడకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం.
 
 మీరు తప్పు చేసినపుడు ఆమెకు కోపం రావచ్చు, ఏడుపు రావచ్చు... లేదా మీరు దురదృష్టవంతులైతే రెండూ కలిసి రావచ్చు. ఒక వేళ మీరు నిజంగా తప్పు చేసిఉంటే, దానికి ఆమె వద్ద ప్రత్యక్ష సాక్ష్యం ఉంటే అపుడు మీ ముందున్న అత్యుత్తమ మార్గం మౌనవృతం చేస్తూ ఆమె ఆరోపణలు, తిట్లు, విమర్శలు అన్నీ భరించడం. మీరు పెద్ద తప్పేం చేయలేదనుకోండి.. కేవలం ఆమె అపార్థం చేసుకుని మిమ్మల్ని నిందిస్తుంటే వాస్తవాల్ని వివరించి సర్దిచెప్పే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత నీ ఇష్టం అని మూడీగా మారిపోవాలి. ఆమె అర్థం చేసుకోకపోతే (సాధారణంగా జరగదు) రేపు మరోసారి మళ్లీ నెమ్మదిగా ఆ పనిచేయాలి గాని ఇరిటేషన్ తెచ్చుకుని, విసుక్కుని వాదులాటకు దిగకూడదు. మీరు చేసిన తప్పుకన్నా ఆ విసుగే పెద్ద తప్పుగా పరిగణిస్తారు.
 
 ఎందుకంటే కొందరికి కోపంలో నోరు, మనసు తప్ప ఇంకేం (మెదడు లాంటివి) పనిచేయవు. ఇంకో అత్యంత ముఖ్యమైన సూత్రం ఏంటంటే... మీ తప్పు గురించి గొడవ జరుగుతున్నపుడు ఆమె పాత తప్పులు వెతికి చూపే ప్రయత్నం చేస్తే గొడవకు ఆజ్యం పోయడం తప్ప మరోటి కాదు. ఫైనల్‌గా ఓ మాట... తెగేదాకా లాగొద్దు, విడిపోవాలనుకుంటే తప్ప! బంధాలు ఫెవిక్విక్‌తో అతుక్కోవు.
 
 ప్రియురాలు వర్సెస్ భార్య
  ప్రియురాలు తన కోసం ఖర్చుపెట్టమంటుంది. భార్య మనకోసం దాచిపెట్టమంటుంది.
  ప్రియురాలి కోసం మనం అన్నీ సర్దాలి.  భార్య సర్దితే భర్త ఆస్వాదిస్తాడు.
  బాగుంటే ప్రియురాలు చూస్తుంది, బాగోకపోయినా భార్య చూస్తుంది.
  ప్రియురాలు ప్రెజెంట్ టెన్స్, భార్య కంటిన్యూయస్ టెన్స్.
  మనం ఆమెకు నచ్చేవి చేస్తుంటే ఆమె ప్రియురాలని అర్థం. మనకు నచ్చేవి ఆమె చేస్తుంటే ఆమె భార్య అని అర్థం.
  ప్రియురాలిని మనం తరచుగా నవ్వించాలి.. భార్య మనల్ని అపుడపుడు  ఏడిపిస్తుంటుంది!
  భార్య కోసం పని చేస్తాం. ప్రియురాలి కోసం చేస్తున్న పనీ ఆపేస్తాం!
 కొసమెరుపు: రెండు విషయాల్లో మాత్రం ఇద్దరికీ పోలికలు ఉంటాయి... అది జెండర్ అండ్ డేంజర్. చూశారా రెండు పదాలకు కాస్త అటుఇటుగా అక్షరాలు సేమ్!
 - ప్రకాష్ చిమ్మల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement