పద్ధతిగా ఉండటం అంటే అందంగా ఉండటం కూడా. ప్రతి మనిషికి రెండు సర్కిల్స్ ఉంటాయి. ఒకటి రిలేషన్ సర్కిల్...రెండోది ఫ్రెండ్ సర్కిల్. రిలేషన్ సర్కిల్‌లో మనకు గుర్తింపు ఉంటుంది... ఫ్రెండ్ సర్కిల్‌లో మనతో పాటు మన ఆహార్యానికి, మన స్టైల్‌కు కూడా గుర్తింపు ఉంటుంది. మన తాపత్రయాలన్నీ నెరవేరేది ఆ సర్కిల్‌లోనే. అందుకే మీరు వస్తున్నారంటే గుంపులో గోవిందయ్యలా ‘రమేష్ అంటే ప్రెజెంట్ సార్’ అన్నట్టు ఉండకూడదు. నిరాడంబర జీవితం వేరు, సాదాసీదా జీవితం వేరు. రెండింటికీ తేడా ఉంది. అంతా సమకూర్చుకోగలిగిన అవకాశం, ఓపిక, శ్రద్ధ ఉండి... మామూలుగా ఉండటం నిరాడంబరత. సాదాసీదా అంటే అవకాశం లేకపోవచ్చు,
ఓపిక లేకపోవచ్చు, ఆసక్తి లేకపోవచ్చు... కాబట్టి అలాంటి ఎందుకూ పనికిరాని పద్ధతిని ట్రాష్‌లో పడేయండి. సందర్భాలు వాడుకోండి. మీకోసం జనం ఆరాతీసేలా ఉండండి. మీ రాకను కోరేలా ఉండండి. అందుకు కావల్సింది... మీకంటూ డ్రెస్ సెలెక్షన్‌లో ఓ టేస్ట్ ఉండాలి. పార్టీ డ్రెస్సింగ్, పిక్నిక్ డ్రెస్సింగ్, ఆఫీస్ డ్రెస్సింగ్ వేరుండాలి. డ్రెస్సే కాదు.. ఇతర అలంకరణలూ అంటే అవసరాన్ని బట్టి షూలు, పెర్‌ఫ్యూమ్‌లు వంటివి మారడం కూడా అవసరమే. కొనేది కొన్నే అయినా పురుషులు స్టైలింగ్ పై అవగాహన పెంచుకోవాలి. ఇవన్నీ ఎవరు చెబుతారు అని ఆందోళన అక్కర్లేదు. అన్నిటికీ సమాధానం గూగుల్ ఉంది. ఇంటర్‌నెట్‌లో సినిమాల తర్వాత అత్యధిక సమాచారం దొరికేది ఈ స్టైలింగ్ గురించే. శోధించండి, సాధించండి... మెరవండి. ఎప్పుడు, ఏమి, ఎలా వేయాలనే మీ అన్ని ప్రశ్నలకూ అక్కడే సమాధానాలున్నాయి.
అనుభవం నేర్పని పాఠమా ఇది?
అనుభవం అన్నీ నేర్పుతుందంటారు. మరి భార్యను మెప్పించడం నేర్పలేదా? ఈ ప్రశ్న అడిగారంటే మీరు బ్యాచిలరైనా కావాలి, కొత్తగా పెళ్లయినా అయి ఉండాలి. ఎందుకంటే అనుభవం భార్యను మెప్పించడం కూడా నేర్పుతుంది... సమస్యంతా దాన్ని ఫాలో అవడంలోనే ఉంది. ఇదిగో కొన్ని సాక్ష్యాలు చూడండి..
వండి వార్చితే ఏ శ్రీమతి అయినా శ్రీవారికి ‘ముద్దు’ ఇవ్వకుండా ఉండగలదా! మరెందుకు చేయట్లేదు? మనకేం వంట రాకనా. రెజ్యూమె కంటే రెసిపె తయారుచేయడం సులువు. కానీ చేయలేం. ఆ విద్య మనకు వచ్చనే విషయం పెళ్లాం ఊరెళితే గానీ గుర్తుకురాదు. ఒక వేళ గుర్తుకువచ్చినా... ‘మగ’ అనే అంతరాత్మ ఒప్పుకోదు.
అడిగినన్ని కొనిపెడితే... భార్య ఫ్లాటైపోదా! పోతుంది. కానీ కొనిపెట్టలేం... ఆ డబ్బులకోసం పడేకష్టం, భార్య మెప్పు తూచినపుడు మన కష్టమే ఎక్కువ తూగుతుంది. అయినా కొనిపెట్ట్టకపోతే కొత్తగా వచ్చిన నష్టమేంటి... ఓ నింద అంతేకదా. ఏదో టీనేజీలో అదో మోజు కాబట్టి...ఆదాయం లేకున్నా ఖరీదైనవి కొని నచ్చిన సుందరికి గిఫ్టులు ఇస్తాం కానీ తాళికట్టి తెచ్చుకున్న భార్యను మళ్లీ మళ్లీ ఫ్లాట్ చేయాలంటే కుదురుతుందా!!?
ఆదివారం ఆడవాళ్లకు సెలవు... అనే నియమం మీ ఇంట్లోనూ పాటిస్తే ‘నా భర్త..పూజ్యనీయుడు’ అనే బిరుదు సంపాదించుకోవచ్చు. కానీ బోడి బిరుదు కోసం బద్ధకాన్ని, దాని వల్ల వచ్చే సుఖాన్ని వదులుకుంటామా..!
అంటే... భార్య మెప్పు పొందడానికి ఇలాంటి చాలా మార్గాలున్నాయి. కానీ పెళ్లయ్యి ఏడాది గడిచాక భార్యను మెప్పించడం వల్లే ఎక్కువ నష్టాలున్నాయని గ్రహించడం వల్ల మనం వాటిని పట్టించుకోవట్లేదు. ఏతావాతా చెప్పొచ్చేదంటంటే... అన్నీ కన్వీనియెంట్‌గా మరిచిపోవాలని మగాళ్ల జేఏసీ తీర్మానించింది.
- ప్రకాష్ చిమ్మల
దక్షిణం: ఫ్రెండ్ సర్కిల్‌లో మెరవాల్సిందే!
Published Sun, Sep 8 2013 2:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement
Advertisement