విజయం: ఆమె పుస్తకం ఖరీదే లక్ష! | One lakh for ritu beri's book cost | Sakshi
Sakshi News home page

విజయం: ఆమె పుస్తకం ఖరీదే లక్ష!

Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

విజయం: ఆమె పుస్తకం ఖరీదే లక్ష!

విజయం: ఆమె పుస్తకం ఖరీదే లక్ష!

కాన్‌‌స ఫెస్టివల్‌లో రీతూ డిజైన్ చేసిన  దుస్తుల్లో విద్యాబాలన్
 మీ దగ్గర బోలెడంత డబ్బుంది. చక్కటి క్రికెట్ కిట్ ఉంది. శిక్షణ ఇచ్చే కోచ్‌లున్నారు. అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు సచిన్ టెండూల్కర్ అయిపోగలరా? కష్టం కదా! అంటే డబ్బు అన్నది ఓ సౌలభ్యం మాత్రమే. ఏ రంగంలోకి వెళ్లాలన్నా అది ‘ఎంట్రీ ఫీజు’గా ఉపయోగపడుతుందంతే. ఆ తర్వాత మనల్ని నిలబెట్టేది మన సామర్థ్యమే!
 
 రీతూ బేరి... ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫేమస్ పేరు! ఈమెకు కూడా డబ్బుంది. ఆ డబ్బు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో కోర్సు ఫీజు కట్టడానికి మాత్రమే ఉపయోగపడింది. కానీ రీతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ డిజైనర్‌గా పేరు తెచ్చుకోవడానికి ఉపయోగపడింది మాత్రం అసాధారణమైన ఆమె సామర్థ్యమే!
 
 రీతూ గొప్పదనమేంటో తెలియాలంటే ఆమె క్లయింట్లు ఎవరో చూస్తే సరిపోతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్, ప్రముఖ హాలీవుడ్ నటి నికోల్ కిడ్‌మన్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డిజైనర్ దుస్తుల తయారీ సంస్థ మౌలిన్ రౌష్. అసలీ స్థాయికి రీతూ ఎలా చేరగలిగింది!
 ఢిల్లీలో పుట్టిన రీతూ తండ్రి బల్బీర్‌సింగ్ బేరి సైన్యంలో అధికారి. రీతూకి చిన్నప్పట్నుంచీ ఫ్యాషన్ డిజైనింగ్ మీదే ఆసక్తి. అందుకే ఢిల్లీలో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆమె అడుగులు నిఫ్ట్ వైపు పడ్డాయి. ఐతే ఇప్పట్లా నిఫ్ట్ అప్పుడు పేరు మోసిన ఇన్‌స్టిట్యూట్ కాదు. రీతూ తొలి బ్యాచ్ లోని 25 మంది విద్యార్థుల్లో ఒకరు. స్వతహాగా ఉన్న ఆసక్తికి శిక్షణ తోడవడంతో నిఫ్ట్‌లో ఉండగానే డిజైనర్‌గా మంచి పేరుతెచ్చుకుంది.
 
  కోర్సు చివర్లో ‘లావణ్య’ పేరుతో రూపొందించిన డ్రెస్ కలెక్షన్ పాపులర్ అయ్యింది. ఇన్‌స్టిట్యూట్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫ్యాషన్ ప్రపంచం ఆమెకు రెడ్ కార్పెట్ పరిచిందనే చెప్పాలి. 1990లో ఆమె తన తొలి డిజైనర్ దుస్తుల్ని మార్కెట్లోకి తెచ్చారు. ఆపైన అంచెలంచెలుగా ఎదుగుతూ ఎనిమిదేళ్ల తర్వాత ప్యారిస్‌లో షో నిర్వహించి, తన తొలి ‘ల్యూక్స్‌‘ కలెక్షన్‌ను విడుదల చేశారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ డిజైనర్ ఆమే. దీంతో ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘ప్రోమోస్టైల్’లో చోటు సంపాదించిన ఏకైక భారత డిజైనర్‌గానూ రీతు ఖ్యాతి సంపాదించారు. టైమ్ మ్యాగజైన్ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జ్జాతీయ వ్యాపారంలో టాప్-100 చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో ఒకరిగా రీతును గుర్తించింది.
 
 అంతర్జాతీయంగా పేరు సంపాదించిన తర్వాత రీతూ రాసిన ’101 వేస్ టు లుక్ గుడ్’ పుస్తకం మంచి ఆదరణ పొందింది. తర్వాత ‘ఫైర్‌ఫ్లై-ఎ ఫెయిరీ టేల్’ పుస్తకం రాశారు. దీని ధర అక్షరాలా లక్ష రూపాయలు. ఆర్కిటెక్చర్, చరిత్ర, మహిళలు-వారి సౌందర్యం వంటి అంశాలను స్పృశిస్తూ సాగే ఈ పుస్తకాన్ని భారత్‌తో పాటు ప్యారిస్‌లోనూ తఅమ్మకానికి పెట్టారు.
 
 మొదట చెప్పుకున్న ప్రముఖులతో పాటు హాలీవుడ్ నటి ఆండీ మెక్‌డోవెల్, సూపర్ మోడల్ లేటిటియా కాస్టాలకు దుస్తులు డిజైన్ చేస్తున్నారు. ఇండియాలో మాధురి దీక్షిత్, రాణీ ముఖర్జీ, ప్రీతి జింతా, శోభా డే వంటి సెలబ్రిటీలకు డిజైనర్‌గా పనిచేసింది రీతూ. జర్మనీ, ఫ్రాన్స్, ఢిల్లీలలో ఆమె బొటీక్‌లు నడుపుతున్నారు. వాటిలో దుస్తులు కొనడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు ఫ్యాషన్ ప్రియులు.
 
 ‘నిఫ్ట్’లో ప్రస్తుతం రీతు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో ఒకరు. భారతీయ మహిళల ఉన్నతి కోసం ఆమె ‘సవేరా’ అని స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. 2000లో రీతు రాష్ట్రీయ శిరోమణి అవార్డుల్లో భాగంగా ‘మిలీనియం అచీవర్’ పురస్కారం అందుకున్నారు. 2004లో గ్లోబల్ ఎక్స్‌లెన్స్, 2007లో కల్పనా చావ్లా ఎక్స్‌లెన్స్ అవార్డులు ఆమెను వరించాయి.
 -  ప్రకాష్ చిమ్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement