విజయం: వన్ అండ్ ఓన్లీ అలీషా
అలీషాకు చిన్నప్పటి నుంచే బైకులపై మక్కువ కలిగింది. ఆమె ఆసక్తిని చూసి సరదాగా డ్రైవింగ్ నేర్పించాడు అబ్దుల్లా. కానీ ఆమె సరదా కోసం డ్రైవింగ్ నేర్చుకోలేదని కొన్నాళ్ల తర్వాత అర్థమైంది అబ్దుల్లాకు.
డాక్టర్ కూతురు డాక్టర్ కావచ్చు.. యాక్టర్ కూతురు యాక్టర్ కావచ్చు.. ఇంజినీర్ కూతురు ఇంజినీర్ కావచ్చు.. వ్యాపారవేత్త కూతురు వ్యాపార వేత్త కావచ్చు.. కానీ ఓ బైక్ రేసర్ కూతురు బైక్ రేసర్ కావచ్చా..? ఊహూ.. సమాజం ఒప్పుకోదు! అందునా భారతీయ సమాజం అస్సలు ఒప్పుకోదు! కానీ అలీషా అబ్దుల్లా.. మగ రేసర్ల మీదే కాదు, సమాజం మీద కూడా గెలిచింది. అందుకే దేశంలో ‘తొలి, ఏకైక మహిళా సూపర్ బైక్ రేసర్’గా ఆమె చరిత్రకెక్కింది.
ఆడా మగా సమానమంటారు.. ఆడవాళ్లకు తిరుగులేదంటారు.. వాళ్లకేం తక్కువంటారు.. ఇలాంటి కబుర్లకు లోటేం ఉండదు. అయినా.. కొన్ని రంగాల్లో ఆడాళ్లకు అవకాశముండదు.. అలాంటి రంగాల్ని ఆడవాళ్లు ఎదుర్కొంటే అదోలా చూస్తారు.. మగరాయుడంటారు.. నీకిది అవసరమా అంటారు.. ఇలాంటి అనుమానాల్ని, అవమానాల్ని చాలానే ఎదుర్కొంది అలీషా. అయినా వెనక్కి తగ్గలేదు. చెన్నైకి చెందిన ఈ అమ్మాయి రక్తంలోనే ‘రేసింగ్’ ఉంది. అలీషా తండ్రి ఆర్‌ఏ అబ్దుల్లా ప్రముఖ బైక్ రేసర్, ఏడుసార్లు జాతీయ ఛాంపియన్. తండ్రి రేసుల్ని చూడటానికి వెళ్లే అలీషాకు చిన్నప్పటి నుంచే బైకులపై మక్కువ కలిగింది. ఆమె ఆసక్తిని చూసి సరదాగా డ్రైవింగ్ నేర్పించాడు అబ్దుల్లా. కానీ ఆమె సరదా కోసం డ్రైవింగ్ నేర్చుకోలేదని కొన్నాళ్ల తర్వాత అర్థమైంది అబ్దుల్లాకు. తానూ రేసర్ అవుతానని అలీషా అన్నపుడు నవ్వి ఊరుకున్న ఆయన.. ఆమె మొండి పట్టు పట్టడంతో పచ్చ జెండా ఊపారు.
అప్పటిదాకా ఇండియాలో ఎక్కడా మహిళా రేసర్లను చూసిన అనుభవం అబ్దుల్లాకు కూడా లేకపోవడంతో అందరిలాగే ఆయనకూ అలీషాపై లోలోన అనుమానమే. ఐతే తొమ్మిదేళ్ల వయసులోనే గోకార్టింగ్‌లోకి అడుగుపెట్టింది అలీషా. రెండేళ్లకే అబ్బాయిలందరినీ వెనక్కి నెడుతూ రేసులు గెలవడం మొదలుపెట్టింది. 13 ఏళ్ల వయసులో ఎంఆర్‌ఎఫ్ జాతీయ గోకార్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో ఆమె పేరు మార్మోగిపోయింది. తర్వాత తన రంగంలో తానే ప్రమోషన్ ఇచ్చుకుని ఫార్ములా కార్ రేసింగ్‌లోకి అడుగుపెట్టింది అలీషా.
అక్కడా సంచలనాలే. తన ప్రతిభకు అనేక విజయాలు, పురస్కారాలు దక్కాయి. 2004లో జాతీయ ఫార్ములా కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో 25 మంది అగ్రశ్రేణి పురుష రేసర్లతో పోటీపడి ఐదో స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఏడాది ఆమెకు బెస్ట్ నొవైస్ పురస్కారం కూడా దక్కింది. ఐతే ఫార్ములా కార్ రేసింగ్ బాగా ఖర్చుతో కూడుకున్నది కావడంతో అలీషాను అందులోంచి తప్పించి.. సూపర్ బైక్ రేసింగ్‌లోకి మార్పించారు తండ్రి అబ్దుల్లా.
ఉన్నట్లుండి కార్లు వదిలి బైకులకు మారినా.. త్వరగానే సర్దుకుందామె. ఏడాదిలోనే పురుష రేసర్లకు గట్టి పోటీనిచ్చే స్థాయికి చేరింది. 2007లో ఓ రేసు మధ్యలో యాక్సిడెంట్ అయినా.. రేసు ఆపకుండా మూడో స్థానంలో నిలవడం ఆమె పట్టుదలకు నిదర్శనం. అలీషా ఎవరూ నడవని దారిని ఎంచుకుని అందులో విజయాలు సాధించినా.. మరో అమ్మాయి ఎవరూ ఆవైపు చూడట్లేదంటే.. ఆమె ఎంచుకున్న మార్గం ఎంత కఠినమైందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆమె దేశంలో తొలి సూపర్‌బైక్ రేసరే కాదు. ఏకైక మహిళా రేసర్ కూడా.
200 కిలోలకు పైగా బరువుండే బైకును 150 కిలోమీటర్లకు పైగా వేగంతో ఓ అమ్మాయి నడపడమంటే మామూలు విషయం కాదు. అందుకు ఎంత ఫిట్‌నెస్ కావాలి? అందుకే రోజుకు ఆరేడు గంటల పాటు ఫిట్‌నెస్ కసరత్తులు చేస్తుందామె. క్రీడాకారులు సాధారణంగా ఓ స్థాయికి రాగానే చదువును వదిలేస్తారు. అందునా గంటల తరబడి సాధన చేస్తూ, రేసుల కోసం నగరాలు తిరుగుతూ ఉండే రేసర్లకు అసలే తీరిక ఉండదు. కానీ అలీషా చదువును నిర్లక్ష్యం చేయలేదు. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాదు.. హ్యూమన్ రిసోర్స్‌లో పీజీ చదివింది.
రేసింగ్‌లో తనకు ఎదురైన అతి పెద్ద సవాల్.. పురుషాహంకారమే అంటుంది అలీషా. ‘‘ఓ ఆడది మమ్మల్ని దాటి వెళ్లడమేంటనే అహం మగాళ్లకుంటుంది. ఏ రేసుకు వెళ్లినా పురుషులంతా ఒకవైపు. నేనో వైపు. వాళ్లంతా ఒక్కటై నన్ను వెనక్కి నెట్టాలనుకుంటారు. నీకెందుకీ రేసులని తోటి రేసర్లే నాపై కామెంట్లు చేస్తుంటారు. కానీ నేనే వేటికీ లొంగలేదు. అంతర్జాతీయ స్థాయిలో రేసులు గెలవాలని.. గొప్ప రేసర్‌గా పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం’’ అని చెప్పిందామె.
- ప్రకాష్ చిమ్మల