హాలీవుడ్‌లో చార్లీ చాప్లిన్..టాలీవుడ్‌లో
‘‘నవ్వించడం అంత సులువైన పని కాదు. తను నవ్వకుండా సమయం చూసి చలోక్తులు విసిరి ఎదుటి వ్యక్తిని నవ్వించడానికి చాలా నేర్పు కావాలి. అంత క్లిష్టమైన హాస్యరసంలో నేను మంచి పేరు తెచ్చుకోగలగడం నా అదృష్టం’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. కామెడీ హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ, దూసుకెళుతున్న నరేశ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ‘జంప్ జిలానీ’ ఒకటి. ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, హాస్యం గురించి పలు విశేషాలు చెప్పడంతో పాటు తన సినిమాల గురించి కూడా నరేశ్ ఈ విధంగా చెప్పారు.
నవ్వు నాలుగు విధాల చేటు అనేది పాత మాట. నవ్వు ఆరోగ్యానికి మేలు అనేది నేటి మాట. రోజుకో పది సార్లు హాయిగా నవ్వుకుంటే ఆరోగ్యం బాగుంటుందని అనుభవజ్ఞులు కూడా అంటారు. మనిషి జీవితంలో అంత ప్రాధాన్యం ఉన్న హాస్యాన్ని నా సినిమాల్లో పండించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కామెడీపరంగా నాకు హాలీవుడ్‌లో చార్లీ చాప్లిన్, టాలీవుడ్‌లో రాజేంద్రప్రసాద్ అంటే ఇష్టం. డైలాగ్స్ చెప్పకుండా చాప్లిన్ నవ్విస్తే, తనదైన శైలిలో డైలాగ్స్ చెప్పి నవ్విస్తూ, తిరుగు లేని హాస్య చిత్రాల హీరో అనిపించుకున్నారు రాజేంద్రప్రసాద్.
అందుకే వాళ్లిద్దరూ నాకు ఆదర్శం. ఆ అభిమానంతోనే నవ్వుల దినోత్సవాన్ని ఆ ఇద్దరికీ అంకితమిస్తున్నా. నేను కామెడీ చేస్తేనే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అయితే, నటుడిగా నా ఆత్మసంతృప్తి కోసం ‘నేను’ అనే సీరియస్ మూవీ చేశాను. నా నుంచి వినోదాన్ని ఎదురు చూసే ప్రేక్షకులు ఆ సినిమాని ఇష్టపడలేదు. తాజాగా, ‘లడ్డూబాబు’లో కూడా హాస్యం తక్కువ ఉండటంతో నిరాశపడ్డారు. కానీ, ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించాననే తృప్తి నాకు ఉంది. వెండితెరపై ఈ ‘లడ్డూబాబు’ సక్సెస్ కాలేదు కానీ.. బుల్లితెరపై వచ్చినప్పుడు మాత్రం ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటాడనే నమ్మకం ఉంది.
ప్రస్తుతం ‘జంప్ జిలానీ’లో నటిస్తున్నా. సత్తిబాబు దర్శకుడు. అంబికా కృష్ణ సమర్పణలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అంబికా నా సొంత సంస్థ లాంటిది. తమిళ సినిమా ‘కలగలప్పు’ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాం. అందులో విమల్, శివ హీరోలుగా నటించారు.ఒకరు క్లాస్.. మరొకరు మాస్ అన్నమాట. మాస్‌గా సాగే రాంబాబు పాత్రను నేను చేయాలనుకున్నాను. క్లాస్‌గా సాగే సత్తిబాబు పాత్రకు వేరే హీరోని తీసుకోవాలనుకున్నాం. చివరకు ఈ రెండు పాత్రలనూ నేనే చేస్తున్నాను.
పూర్తి స్థాయి ద్విపాత్రల్లో నేను కనిపించనున్న సినిమా ఇదే. రాంబాబు, సత్తిబాబు పాత్రలకు వ్యత్యాసం చూపించడానికి కృషి చేస్తున్నాను. రెండు పాత్రలకు శారీరక భాష వేరుగా ఉండేలా చూసుకుంటున్నా. ఇటీవల ఈ సినిమా కోసం ఒక సన్నివేశం తీశాం. నేను చేస్తున్న రెండు పాత్రలకు సంబంధించిన ఆ సీన్‌కి రెండు పేజీల డైలాగ్స్ ఉన్నాయి. ఈ సన్నివేశానికి మూడు గంటల సమయం పట్టింది.
నాన్న దర్శకత్వంలో తొమ్మిది సినిమాలు చేశాను. నాన్నగారి కామెడీ సినిమాలు ఎంత బాగుంటాయో తెలిసిందే. మా నాన్నగారిలా నేను కూడా ఇలా వినోద ప్రధానంగా సాగే సినిమాలు చేసి నవ్వించడం చాలా ఆనందంగా ఉంది. త్వరలో మా సొంత సంస్థలో మా అన్నయ్య రాజేష్ ఆధ్వర్యంలో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో నేనే కథానాయకునిగా నటించబోతున్నా. నాన్నగారి జయంతి రోజైన జూన్ 10న ఈ సినిమా ప్రారంభమవుతుంది.