సినీ జీవిత నిష్ఠూరాలపై ఫోకస్ లైట్ | Focus Light cine Career says Tanikella Bharani | Sakshi
Sakshi News home page

సినీ జీవిత నిష్ఠూరాలపై ఫోకస్ లైట్

Published Sun, Feb 1 2015 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

సినీ జీవిత నిష్ఠూరాలపై ఫోకస్ లైట్

సినీ జీవిత నిష్ఠూరాలపై ఫోకస్ లైట్

 అందుకే... అంత బాగుంది!
 లెమ్ లైట్ (1952)

 
 తారాగణం: చార్లీ చాప్లిన్, క్లెయిర్ బ్లూమ్, నిగెల్ బ్రూస్, బిస్టర్ కీటన్, సిడ్నీ ఎర్ల్ చాప్లిన్, వీలర్ డ్రైడెన్, నార్మన్ లాయిడ్, సంగీతం: చార్లీ చాప్లిన్,  రచన-నిర్మాత-దర్శకుడు: చార్లీ చాప్లిన్,  విడుదల: 1952,  ఛాయాగ్రహణం: కార్ల్ స్ట్రస్, సినిమా నిడివి: 137 నిమిషాలు,  
 నిర్మాణ వ్యయం: 9 లక్షల డాలర్లు (ఇప్పటి లెక్కలో దాదాపు 5 కోట్ల 40 లక్షల రూపాయలు), వసూళ్లు: 80 లక్షల డాలర్లు (48 కోట్ల రూపాయలు)
 

 చార్లీ చాప్లిన్! కామెడీ కింగ్... కాదు విషాద కథానాయకుడు...
 
 మానవాళికి ఓ దివ్య వరం!
 
 ఒక సినిమా... ఒక కళాకారుడూ మానవ జీవితం మీద, ఆ మాటకొస్తే యావత్ భూగోళంలో ఉన్న మానవజాతి మీద ఇంత ప్రభావం చూపించడం సాధ్యమా... అనిపిస్తుంది!
 
 అరవై ఏళ్ల క్రితం... అంటే ఇంచుమించు నేను పుట్టక ముందు తీసిన సినిమా... ఇంకా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటే... ఆ కళారూపానికి సాష్టాంగ పడడం తప్ప మరేం చేయగలం...
 
 లైమ్‌లైట్!... 1952లో వచ్చిన చిత్రం...
 అప్పటి దాకా మూకీ యుగాన్ని శాసించిన చాప్లిన్, సినిమాకి మాట వచ్చాక చేసిన మహోన్నత చిత్రం - ఓ కళాకారుడి జీవిత కథ... ఓ రకంగా ఇది చాప్లిన్ కథే కావచ్చు గూడా.
 
 టూకీగా ‘కాల్వెరో’ అనే కమెడియన్ అవసానదశలో ఓ అపార్ట్‌మెంట్లో అద్దెకుంటూ... నానా రకాలుగా మానసికంగా కుంగిపోయి... ఒకసారి హార్ట్ అటాక్‌కి కూడా గురై ఏదో జీవితం లాగిస్తున్న వాడల్లా.. ఆత్మహత్యకు పాల్పడబోయిన ‘టెర్రీ’ అనే కళాకారిణిని కాపాడడం ... తర్వాత ఆమెకు ధైర్యం నూరిపోసి... మళ్లీ ఆమె చేత అర్థవంతంగా డాన్స్ చేయించడం... కృతజ్ఞతగా... ఆ పిల్ల వయస్సులో తనకన్నా పెద్దవాడైన కాల్వెరోని గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్తే... వయస్సులో ఉన్న ఆ పిల్లను సముదాయించలేక మరో గత్యంతరం లేక... ఆ పిల్ల జీవితంలో నుంచి తానే పారిపోవడం... చివరికి మళ్లీ కలిసి... జాయింట్‌గా ప్రదర్శనలిచ్చి... ఏ ప్రేక్షకులైతే తనను నిరాదరించారో, వాళ్లతో నీరాజనాలు పట్టించుకుని... తృప్తిగా వెళ్లిపోవడం... జీవితం కొనసాగించడం...
 
 స్థూలంగా ఇదే కథైనా... జనరల్‌గా చాప్లిన్ మూకీ చిత్రాల్లో ఉండే.. బాడీ లాంగ్వేజ్ ఇందులో ఉండదు. అసలు చాలాసేపటి వరకూ మనం చాప్లిన్‌ని గుర్తుపట్టం! తెల్లటి జుట్టుతో... క్లీన్ షేవ్‌తో చాలా డిగ్నిఫైడ్‌గా... కొన్నిచోట్ల చాలా సీరియస్‌గా కనిపిస్తాడు. జీవితంలో నుంచి బలవంతంగా పారిపోదామనుకుంటున్న టెర్రీకి... జీవిత ధర్మాన్ని చెబుతున్నప్పుడు కౌరవ సేన మధ్య గాండీవం, గుండె రెండూ జారిపోయిన అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసిన కృష్ణుడిలా అనిపించాడు చాప్లిన్. ఓ వైపు జీవితంలో అన్ని రకాలుగా చితికి పోయినా, జీవిత మాధుర్యాన్ని బొట్టుబొట్టుగా గ్రోలుతూ ‘లైఫ్ ఈజ్ నో మీనింగ్, ఇట్స్ ఓన్లీ డిజైర్’ (ఔజీజ్ఛ జీట ౌ ఝ్ఛ్చజీజ, ఐ్ట’ట ౌడ ఈ్ఛటజీట్ఛ) అని చెప్పే చాప్లిన్ని చూస్తే... జీవితం మీద ఆశ పుడుతుంది.
 
 ఎంతటి మహానటుడైనా... ‘లైమ్‌లైట్’లో ఉన్నంత కాలమే!... తర్వాత పట్టించుకునే నాథుడుండడు అనే కర్కశమైన సత్యానికి బొమ్మకట్టాడు చాప్లిన్. అవును ‘లైమ్‌లైట్లో’ ఉంటే నీకు నీరాజనాలు... నీ నెత్తి మీద నుంచి లైట్ వెళ్లిపోతే నిన్ను గుర్తించలేదని నువ్వు ఏడవడం ఎందుకు? అసలు నువ్వు కనపడితే కదా!
 
 సిన్మా చూస్తున్నంతసేపూ... మన కళ్ల ముందు సావిత్రులూ... నాగయ్యలూ... రాజనాలలూ... కాంతారావులూ... శివరామ్‌లూ... కదలాడుతూనే ఉంటారు.
 
 దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అని కదూ... దీపం ఉండగా గుండె నిండా వెలుగులు నింపుకో... ఆ వెలుగులు పదిమందికీ పంచు... ఇదీ లైమ్‌లైట్ సారాంశం!
 
 సినిమా చూస్తున్నప్పుడు చాప్లిన్... నట విశ్వరూపా నికి మనం హారతులు పట్టాల్సిందే! నవరసాల్నీ క్షణాల మీద కురిపించిన ఆ నటరాజు అభినయానికి మనం అవాక్కయిపోతాం.
 
 అలాగే... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకున్న లిల్లీ లాంటి పిల్ల మీద కాల్వెరో కరుణ చిలకరించేటప్పటికి లిల్లీలా విరిసిన తీరు... టెర్రీ పాత్రలో క్లెయిర్ బ్లూమ్ నవ్వినప్పుడల్లా... ప్రేక్షకుడి గుండె గిలక్కాయలా కొట్టుకుంటుంది...
 
 ఎంత అందమైన నవ్వు...
 అలాగే బ్లాక్ అండ్ వైట్‌లో... లైట్ అండ్ షేడ్స్‌లో చిత్రీకరించిన విధానం... ప్రతీ షాటూ కథ చెబుతుంది! చాలాసార్లు చాప్లిన్ బాధను తనలో దిగమింగుకుంటాడు. ఆ సీన్లలో గుక్కెట్టి ఏడుస్తాం. సినిమాలు నాటకాలైపోతున్న ఈ రోజుల్లో కళ్ల ముందు, ఓ కళాకారుడి జీవితాన్ని కిటికీ తెరిచి చూస్తున్నట్టనిపించే ‘లైమ్‌లైట్’ చిరస్మరణీయ చిత్రం.
 ఇంకోళ్లకి సాయపడ్డానికి కాల్వరో పడుతున్న తాపత్రయం చూస్తే మనలోంచి మనిషి... మంచి మనిషి మళ్లీ పుట్టుకొచ్చి, తోటివాణ్ణి పట్టించుకోని ప్రస్తుత పరిస్థితికి సిగ్గుపడతాం. మన మీద మనం జాలి పడతాం. మూడో కంటికి తెలియకుండా మనల్ని మనం అసహ్యించుకుంటాం.
 
 అలాగే... తనకు సాయం చేసి... తనకి కొత్త బతుకిచ్చిన కాల్వెరో పట్ల టెర్రీ కృతజ్ఞతాభావంతో లొంగిపోవడం... ఆమె కళ్లల్లో అతని పట్ల ఆరాధన చూస్తే మనకు సిగ్గేసి, కృతఘు్నలకి ఓ నమస్కారం చేస్తాం.
 
 మనసు కరిగించే కథ.. వజ్రాలు పొదిగినట్లు డైలాగులు... నటనంటే ఇదిరా అనిపించే అభినయం... ఓ కమ్మటి కల కని... కన్నీళ్లు తుడుచుకున్నట్లనిపించే ‘లైమ్‌లైట్’ చూడకపోతే వెంటనే చూడండి! కుదిరితే డీవీడీ కొని ఇంట్లో అపురూప నిధిగా దాచుకోండి!
 
 మీకు సంతోషం కలిగినప్పుడూ... కోపం వచ్చినప్పుడూ... హృదయం ద్రవించినప్పుడూ... గుండె రాయైనప్పుడూ... చూడండి! మళ్లీ... మన జీవితాల మీద కొత్త కాంతి ప్రసరించి తమాషాగా మళ్లీ మనుషులమవుతాం...
 
 ప్రపంచ సినిమాలో చిరంజీవి
 జగత్ప్రసిద్ధ ఇంగ్లీషు హాస్య నటుడు, చలనచిత్ర రూపకర్త చార్లీ చాప్లిన్ (1889 - 1977). మూకీ సినిమా యుగంలో ప్రేక్షకులను ఊపేసి, తన సినిమాలతో ప్రపంచాన్ని జయించిన కళాకారుడు. చిన్నవయసులోనే నటించడం మొదలుపెట్టి  88 ఏళ్ళ వయసులో మరణించడానికి ఏడాది ముందు దాకా విస్తరించిన 75 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్ ఆయనది. కష్టాలు, కన్నీళ్ళు, దుర్భర దారిద్య్రం నుంచి కష్టపడి పైకొచ్చి తన ట్రేడ్ మార్క్ టోపీ, టూత్‌బ్రష్ లాంటి మీసం, చిత్రమైన వేషధారణతో అందరినీ ఆకట్టుకున్న చాప్లిన్ మొదట్లో తన లఘు చిత్రాల దర్శకులకు సలహాలు చెప్పి, వారి కోపానికి గురవుతుండేవారు. అయితే, ఆ లఘుచిత్రాలకు లభించిన ఆదరణ కారణంగా మరిన్ని చిత్రాలు కావాలంటూ డిస్ట్రిబ్యూటర్లు దర్శకులను కోరడంతో చాప్లిన్ దర్శకుడయ్యారు.

 

‘కాట్ ఇన్ ది రెయిన్’ (1914) అనే 16 నిమిషాల లఘుచిత్రంతో ఆయన దర్శకుడి అవతారమెత్తారు. ‘ది ట్రామ్ప్’ (1915) చిత్రం దర్శకుడిగా ఆయన తీసిన పూర్తి నిడివి సినిమా. అది బ్రహ్మాండమైన విజయం సాధించడంతో ఇటు నటుడిగా, అటు దర్శకుడిగా ఆయన హవా మొదలైంది. అక్కడ నుంచి ఆయన రూపుదిద్దిన కళాఖండాలెన్నో! ఫెల్లినీ దగ్గర నుంచి ట్రూఫాట్ దాకా పలువురు ప్రముఖ దర్శకులను తనదైన ‘చాప్లిన్ తరహా’ చిత్రీకరణతో ప్రభావితం చేసిన ఘనత ఆయనది.
 

తనికెళ్ల భరణి
ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement