
హాలీవుడ్ దిగ్గజ నటుడు చార్లీ చాప్లిన్ తనను కలవాలని అనుకున్నప్పుడు మహాత్మా గాంధీ అడిగిన ప్రశ్న ఇదే.. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు గడించిన చార్లీ చాప్లిన్ గురించి నిజంగానే గాంధీజీకి తెలియదట. దాంతో అతని సహచరులు.. చాప్లిన్ ప్రఖ్యాత నటుడని.. పీడిత ప్రజల బాధలను తన చిత్రాల ద్వారా తెలియజెప్పుతుంటారని చెప్పినప్పుడు ఆయన్ను కలవడానికి అంగీకరించారు. 1931, సెప్టెంబర్ 22న లండన్‌లో వారిరువురూ కలిశారు. దానికి సంబంధించిన చిత్రమే ఇదీ. అయితే.. వారి సమావేశం ఫొటోలో కనిపిస్తున్నంత ఆహ్లాదంగా ఏమీ జరగలేదు.
ఓ విషయంపై వాగ్వాదంతో వారి మీటింగ్ ముగిసింది. యాంత్రీకరణ సమస్త మానవాళి మనుగడకు, అభివృద్ధికి ఎంతో ఉపయోగకరమని చాప్లిన్ వాదిస్తే.. మెషినరీకి బదులు మానవ వనరుల వినియోగమే కరెక్టని.. ఉపాధి కల్పించినట్టూ అవుతుందని గాంధీజీ వాదించారు. ఇద్దరూ దిగ్గజాలే.. ఇద్దరూ వారివారి వాదనకు కట్టుబడ్డారు. దీంతో వారి సమావేశం అలా వాదోపవాదాల మధ్య ముగిసిందట.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర వివరాలు, ఫొటోలను ‘రోలీ బుక్స్’పబ్లిషర్ ప్రమోద్ కపూర్ తన పుస్తకంnn ‘గాంధీ–యాన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ’లో పొందుపరిచారు. వీటిల్లో సలాడ్లు తినాలంటూ గాంధీజీ సుభాష్ చంద్రబోస్‌కు పంపించిన శాకాహార డైట్ ప్లాన్ కూడా ఉంది. ఇందులో ఏ కాయగూరను ఎలా తినాలి.. ఉల్లి, వెల్లుల్లి ఉపయోగాలను మహాత్ముడు విపులంగా వివరించారు.
– సాక్షి, తెలంగాణ డెస్క్