చీలి చీలి చివరికిలా.. | More cracks to being continued in congress party | Sakshi
Sakshi News home page

చీలి చీలి చివరికిలా..

Published Thu, Apr 3 2014 1:45 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

చీలి చీలి చివరికిలా.. - Sakshi

చీలి చీలి చివరికిలా..

కాంగ్రెస్ చరిత్ర సమస్తం పీలికల పరాయణత్వం
దేశంలో శతాబ్దికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరే పార్టీలోనూ లేనన్ని చీలికలకు గురైంది. స్వాతంత్య్రానికి ముందే రెండుసార్లు చీలిన కాంగ్రెస్.. స్వాతంత్య్రం వచ్చాక పదుల సంఖ్యలో చీలికల పాలైంది. చీలికలు పీలికలై, అంతర్గత కీచులాటలతో సతమతమవుతున్నా, సంకీర్ణయుగంలోనూ ఉనికి నిలుపుకొని అధికారాన్ని చేజిక్కించుకోగలగడమే కాంగ్రెస్ ప్రత్యేకత. ఏఓ హ్యూమ్ 1885లో ప్రారంభించిన కాంగ్రెస్ స్వాతంత్య్రోద్యమంలో కీలక పాత్ర పోషించింది. మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్ర బోస్ వంటివారు పార్టీ అధ్యక్షులుగా కొనసాగారు. కాంగ్రెస్ నుంచి చీలిపోయి ఏర్పడిన కొన్ని పార్టీలు కొంతకాలం మనుగడ సాగించినా, తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనమయ్యాయి. మరికొన్ని ఉనికిలోనే లేకుండా పోయాయి. కొన్ని తమ ప్రాంతాల్లో బలమైన శక్తులుగా ఎదిగాయి. కాంగ్రెస్ చీలికలపై విహంగ వీక్షణం...
 
 పన్యాల జగన్నాథదాసు
 స్వరాజ్ పార్టీ (1923): బెంగాల్ నాయకుడు చిత్తరంజన్ దాస్, తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి వేరుపడిన వర్గం స్వరాజ్ పార్టీగా తెరపైకి వచ్చింది. ప్రధానంగా బెంగాల్‌కే పరిమితమైన ఈ పార్టీ పుష్కరకాలం అతికష్టంపై మనుగడ సాగించింది. ఇందులోని నేతలంతా 1935లో తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు.
ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (1939): సుభాష్‌చంద్ర బోస్, శీల్‌భద్ర యాగీ, శార్దూల్‌సింగ్ కవీశ్వర్‌ల నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ ప్రస్తుతం ఈ పార్టీ వామపక్ష కూటమిలో కొనసాగుతోంది.
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ (1951): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు జీవత్‌రామ్ కృపలానీ నాయకత్వంలో ఏర్పడిన ఈ పార్టీ అప్పటి మైసూరు, మద్రాసు, వింధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో పనిచేసేది. మరుసటి ఏడాదే ఇది సోషలిస్టు పార్టీతో విలీనమై, ప్రజా సోషలిస్టు పార్టీగా తెరపైకి వచ్చింది. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు శివకుమార్ శర్మ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీని గత ఏడాది ఫిబ్రవరి 21న పునఃప్రారంభించారు.
 హైదరాబాద్ స్టేట్ ప్రజా పార్టీ (1951): టంగుటూరి ప్రకాశం, ఎన్‌జీ రంగాల నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ ఎక్కువకాలం మనుగడ కొనసాగించకుండానే కృపలానీ నేతృత్వంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలో విలీనమైపోయింది.
 
 ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ (1956): సి.రాజగోపాలాచారి నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ అప్పటి మద్రాసు రాష్ట్రంలో బలంగానే ప్రభావం చూపినా, 1959లో స్వతంత్ర పార్టీలో విలీనమైపోయింది.
 కేరళ కాంగ్రెస్ (1964): కేరళ నాయకుడు కె.ఎం.జార్జి నేతృత్వంలో చీలిపోయిన కాంగ్రెస్ నేతలు కేరళ కాంగ్రెస్‌ను స్థాపించారు. తర్వాతి కాలంలో ఇందులోనూ చీలికలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ (బి), కేరళ కాంగ్రెస్ (జాకబ్), కేరళ కాంగ్రెస్ (థామస్) ఉనికిలో ఉన్నాయి.
 ఒరిస్సా జన కాంగ్రెస్ (1966): ఒరిస్సా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మహతాబ్ నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ స్వతంత్ర పార్టీతో కలసి 1967లో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1977లో జనతా పార్టీలో విలీనమై ఉనికి కోల్పోయింది.
 
 భారతీయ క్రాంతిదళ్ (1967): అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ ఈ పార్టీని స్థాపించారు. దీనిని 1977లో జనతా పార్టీలో విలీనం చేశారు.
 బంగ్లా కాంగ్రెస్ (1967): బెంగాలీ నేత అజయ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పడిన బంగ్లా కాంగ్రెస్ రెండుసార్లు సీపీఎంతో కలసి రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంది. అజయ్ ముఖర్జీనే రెండుసార్లూ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం కారణంగా పార్టీ బలం క్షీణించడంతో తిరిగి కాంగ్రెస్‌లోనే పార్టీని విలీనం చేశారు.
మణిపూర్ పీపుల్స్ పార్టీ (1969): మహమ్మద్ అలీముద్దీన్ నేతృత్వంలో విడిపోయిన వర్గం స్థాపించిన ఈ పార్టీ నేటికీ మనుగడ సాగిస్తోంది.
 
 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) (1969): కాంగ్రెస్‌లో ‘సిండికేట్’గా పేరుమోసిన కామరాజ్, మొరార్జీ దేశాయ్ తదితరులు ఈ పార్టీని ప్రారంభించారు. అనతి కాలంలోనే ఇది జనతా పార్టీలో విలీనమైపోయింది.
 ఉత్కళ్ కాంగ్రెస్ (1969): ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు బిజూ పట్నాయక్ ఈ పార్టీని స్థాపించారు. 1969 ఎన్నికల్లో ఉత్కళ్ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
 
 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రస్థానం తెలంగాణ ప్రజా సమితి (1969): తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఈ పార్టీ, 1971లో తిరిగి కాంగ్రెస్‌లో విలీనమైంది.
 కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ (1977): మాజీ ఉపప్రధాని జగ్జీవన్‌రామ్ 1977 సాధారణ ఎన్నికల ముందు ప్రారంభించిన ఈ పార్టీ, ఎన్నికల తర్వాత జనతా పార్టీలో విలీనమైపోయింది.
 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (రెడ్డి) (1978): కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆమె కాంగ్రెస్ (ఐ) ప్రారంభించగా, బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో మిగిలిన పార్టీని ఎన్నికల కమిషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (రెడ్డి)గా గుర్తించింది.
 
 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (అర్స్) (1979): కర్ణాటక మాజీ సీఎం దేవరాజ్ అర్స్ నాయకత్వంలో కర్ణాటక, కేరళ, మహారాష్ట్రకు చెందిన నేతలు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. తర్వాత అర్స్ జనతా పార్టీలో చేరిపోగా, యశ్వంత్‌రావు చవాన్, బ్రహ్మానందరెడ్డి తదితరులు కాంగ్రెస్ (ఐ)లో చేరిపోయారు. ఏకే ఆంటోనీ నేతృత్వంలో అర్స్ పార్టీ నుంచి చీలిపోయిన వర్గం కేరళలో కాంగ్రెస్ (ఏ) పేరిట వేరు కుంపటి పెట్టుకుంది.
 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్ట్) (1981): మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి శరద్ పవార్ అప్పట్లో అర్స్ వర్గంలో పలువురు నేతలు చెదిరిపోగా మిగిలిన పార్టీ పగ్గాలు చేపట్టారు. పార్టీ పేరును ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్ట్)గా మార్చారు. కేరళలో ఈ పార్టీ కొన ఊపిరితో మనుగడ సాగిస్తోంది.  కె.రామచంద్రన్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పార్టీ 2007లో ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగింది.
 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (జగ్జీవన్) (1981): అర్స్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జగ్జీవన్‌రామ్ మరోసారి చీలిక పార్టీని ఏర్పాటు చేశారు. బీహార్‌కు మాత్రమే పరిమితమైన ఈ పార్టీ 1986లో జగ్జీవన్ మరణించేంత వరకు కొనసాగింది.
 
 వేరుకుంపట్ల పరంపర...
 మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీ హత్య సంఘటనల అనంతరం కాంగ్రెస్‌లో లెక్కకు మిక్కిలిగా చీలికలు ఏర్పడ్డాయి. అస్సాం మాజీ సీఎం శరత్‌చంద్ర సిన్హా నాయకత్వంలో 1984లో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్టు), 1986లో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్, 1988లో శివాజీ గణేశన్ నేతృత్వంలో తమిళ మున్నేట్ర మున్నని పార్టీలు ఏర్పడ్డాయి. ఎన్డీ తివారీ, అర్జున్ సింగ్, నట్వర్‌సింగ్‌ల నాయకత్వంలో 1994లో ఆలిండియా ఇందిరా కాంగ్రెస్(తివారీ), బంగారప్ప నేతృత్వంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాయి. కర్ణాటక కాంగ్రెస్‌ను అనతికాలంలోనే కాంగ్రెస్‌లో విలీనం చేసిన బంగారప్ప, 1996లో కర్ణాటక వికాస్ పార్టీని ఏర్పాటు చేసి, దాన్ని కూడా కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1996లో గెగాంగ్ అపాంగ్ నేతృత్వంలో అరుణాచల్ కాంగ్రెస్, జీకే మూపనార్ నేతృత్వంలో తమిళ మానిల కాంగ్రెస్, మాధవరావు సింధియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ వికాస్ కాంగ్రెస్ ఏర్పడ్డాయి. ఇవన్నీ తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనమయ్యాయి. మమతా బెనర్జీ నాయకత్వంలో 1997లో ఏర్పడిన తృణమూల్ కాంగ్రెస్, ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉంది. 1998లో ఫ్రాన్సిస్ డిసౌజా నేతృత్వంలో గోవా రాజీవ్ కాంగ్రెస్ పార్టీ, ముకుట్ మిఠి నేతృత్వంలో అరుణాచల్ కాంగ్రెస్ (మిఠి), శీష్‌రామ్ ఓలా నేతృత్వంలో ఆలిండియా ఇందిరా కాంగ్రెస్ (సెక్యులర్), సురేశ్ కల్మాడీ నాయకత్వంలో మహారాష్ట్ర వికాస్ అఘాడి ఏర్పడ్డాయి. 1999లో బీహార్ మాజీ సీఎం జగన్నాథ మిశ్రా ఆధ్వర్యంలో భారతీయ జన కాంగ్రెస్, శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌ల నేతృత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రారంభమయ్యాయి.
 
  వీటిలో ప్రస్తుతం ఎన్సీపీ మాత్రమే ఉంది. 2000లో ఫ్రాన్సిస్కో సర్దిన్హా నేతృత్వంలో గోవా పీపుల్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది. 2001లో ప్రస్తుత కేంద్ర మంత్రి చిదంబరం నాయకత్వంలో కాంగ్రెస్ జననాయక పెరవై, కుమారి అనంతన్ నేతృత్వంలో తొండర్ కాంగ్రెస్, పి.కణ్ణన్ నేతృత్వంలో పాండిచ్చేరి మక్కల్ కాంగ్రెస్ ఏర్పడ్డాయి. 2002లో జాంబవంతరావు ధోలే నాయకత్వంలో ఏర్పడిన విదర్భ జనతా కాంగ్రెస్ ఇప్పటికీ పనిచేస్తోంది. 2003లో అరుణాచల్ నేత కమెంగ్ డోలో నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ (డోలో) బీజేపీలో విలీనమైంది. 2005లో పుదుచ్చేరి మున్నేట్ర కాంగ్రెస్ పేరిట పి.కణ్ణన్ మరోసారి చీలిక పార్టీ పెట్టి, దానిని తిరిగి కాంగ్రెస్‌లోనే విలీనం చేశారు. 2005లో కేరళ నాయకుడు కె.కరుణాకరన్ డెమోక్రటిక్ ఇందిరా కాంగ్రెస్ ప్రారంభించారు. దీనిని ఎన్సీపీలో విలీనం చేయగా, కరుణాకరన్, ఆయన కుమారుడు మురళీధరన్ మాత్రం కాంగ్రెస్‌లో చేరారు.
 
 2007లో అత్యధికంగా చీలిక పార్టీలు ఏర్పడ్డాయి. భజన్‌లాల్ నేతృత్వంలో హర్యానా జనహిత కాంగ్రెస్ (బీఎల్), ఏకే ఆంటోనీ నేతృత్వంలో కాంగ్రెస్ (ఏ), సుఖ్‌రామ్ నేతృత్వంలో హిమాచల్ వికాస్ కాంగ్రెస్, బన్సీలాల్ నేతృత్వంలో హర్యానా వికాస్ పార్టీ, వాహెంగ్‌బామ్ నిపాంచా సింగ్ నేతృత్వంలో మణిపూర్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ, వి.రామమూర్తి నేతృత్వంలో తమిళగ రాజీవ్ కాంగ్రెస్ ఏర్పడ్డాయి.  బెంగాలీ నేత సోమేంద్రనాథ్ మిత్రా నేతృత్వంలో 2009లో ఏర్పడిన ప్రగతిశీల ఇందిరా కాంగ్రెస్ అనతికాలంలోనే తృణమూల్ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పార్టీ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగింది. పుదుచ్చేరిలో ఎన్.రంగస్వామి 2011లో ఆలిండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement