రాహుల్‌కు ఈసీ క్లీన్‌చిట్
ఈసీలో విభేదాలు లేవు: సీఈసీ సంపత్
న్యూఢిల్లీ: పోలింగ్ కేంద్రంలో నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఎన్నికల సంఘం(ఈసీ) క్లీన్‌చిట్ ఇచ్చింది. రాహుల్‌పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) వీఎస్ సంపత్ శనివారం తెలిపారు. ఈ నెల 7న రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేధీ నియోజకవర్గం పరిధిలో ఓ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం మెషిన్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. దీనిపై తాము నివేదిక తెప్పించుకున్నామని, రాహుల్ వెళ్లిన సమయంలో పోలింగ్ జరగడం లేదని, ఈవీ ఎం మెషిన్ పనిచేయడం లేదని సంపత్ తెలిపారు. పోలింగ్ ఏజెంట్లు, పరిశీలకులు కూడా ఇదే విష యం చెప్పారని, కనుక రాహుల్‌పై ఎలాంటి కేసు లేదన్నారు.
అన్ని నిర్ణయాల్లో బ్రహ్మ కూడా భాగస్వాములే..
ఎన్నికల సంఘంలో ఎలాంటి విభేదాలు లేవని సీఈసీ సంపత్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్ల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నా, అవి బయటకు రావంటూ ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సంపత్ వివరణ ఇచ్చారు. బ్రహ్మకు కూడా అన్ని నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉందన్నారు. రాహుల్‌గాంధీ, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ల రోడ్‌షోలకు అనుమతించి... అదే సమయంలో వారణాసిలో మోడీ సభకు అనుమతివ్వకపోవడంలో ఎలాంటి పక్షపాతం లేదని చెప్పారు. వారణాసి నియోజకవర్గ ఎన్నికల అధికారి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.
ఎన్నికల ప్రక్రియకే ఇది పెద్ద కళంకం: బీజేపీ
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మోడీ సభకు అనుమతి నిరాకరించడం వెనుక రాజకీయ కారణాలున్నాయని బీజేపీ మండిపడింది. ప్రధాని అభ్యర్థి పోటీ చేస్తున్న చోట ఆయన సభకు అనుమతివ్వకపోవడాన్ని ఎన్నికల ప్రక్రియకే పెద్ద కళంకంగా ఆ పార్టీ సినియర్ నేత జైట్లీ అన్నారు. అదే ప్రాంతంలో రాహుల్ సభకు అనుమత్విడం అంటే... దీని వెనుక భద్రతా కారణాలేవీ లేవని, ఉన్నది రాజకీయ కారణాలేనన్నారు. వారణాసిలో రాహుల్‌కు వీడ్కోలు సభ జరుగుతోందని మరో నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వి ఎద్దేవా చేశారు.