- గడువు ముగిసినా ప్రచారం చేయడంపై ఫిర్యాదు
- తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : గడువు ముగిసిన తరువాత కూడా కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు ఈ నెల ఆరున ప్రచారం చేయడాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా వన్ టౌన్ పోలీసులకు ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న పళ్లంరాజు ఈ నెల ఆరున కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో తెలిసినవారిని పలుకరించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా రోగులు, వారి సహాయకులను అభ్యర్థించారు. దీనిపై మీడియాలో వార్తలు రావడమే కాకుండా, విషయం ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాంబాబును ఆదేశించారు.
ఆయన బుధవారం కాకినాడ జీజీహెచ్‌లో విచారణ నిర్వహించారు. పళ్లంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు విచారణలో రుజువవడంతో ఆయనపై కేసు నమోదు చేయాల్సిందిగా వన్‌టౌన్ పోలీసులకు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల నిబంధనలు అతిక్రమించారంటూ పళ్లంరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి ఆవరణలో పళ్లంరాజు ప్రచారం చేసినా, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.వెంకటబుద్ధ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంలో విఫలమయ్యారని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని రాంబాబు ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.