హిట్లర్‌ను మానవుడన్న మహాత్ముడు! | Sakshi Guest Column On Hitler | Sakshi
Sakshi News home page

హిట్లర్‌ను మానవుడన్న మహాత్ముడు!

Published Mon, Feb 10 2025 6:08 AM | Last Updated on Mon, Feb 10 2025 6:08 AM

Sakshi Guest Column On Hitler

జర్మన్‌ నియంత హిట్లర్‌

కామెంట్‌

ఇప్పుడు రాస్తున్న దానిని గతవారమే నేను ఈ కాల మ్‌లో రాసి ఉంటే, అప్పు డది మహాత్మాగాంధీ వర్ధంతి రోజుకు మరింత సంద ర్భోచితంగా ఉండి ఉండే దని అనిపించవచ్చు. అదే కారణంతో అలా నేను రాసి ఉంటే సమయం,సందర్భం చూసి, రెచ్చకొట్టడానికి నేను రాసిన ట్లుగా ఉండేది. లేదంటే, మనోభావాలను దెబ్బ తీసినట్లయ్యేది. కాబట్టి, ఈరోజు నేను లేవనెత్తు తున్న విషయాలపై మీ ప్రతిస్పందన భావావేశా లకు లోను కాని విధంగా ఉంటుందని ఆశిస్తాను. 

గాంధీ మరణించిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడైనా – ఆయనకున్నటువంటి కొన్ని వివాదాస్పద, లేదా విరుద్ధమైన, అదీ కాకుంటే ఆమోదయోగ్యం కానివైన అభిప్రాయాలను మనం ఎలా పరిగణించాలన్న దానిని పరిశీలించవలసిన అవసరం ఉంది. 2024లో అవి మనకు దిగ్భ్రాంతిని గొల్పవచ్చు. 1940ల లోనైనా వాటికి ఇప్పటి కన్నా ఎక్కువగానే సమ్మతి లభించి ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. 

భారత స్వాతంత్య్రం, దేశ విభజనలపై అలెక్స్‌ వాన్‌ తంజల్‌మాన్‌ (బ్రిటిష్‌ చరిత్రకారిణి) పుస్తకం ‘ఇండియన్‌ సమ్మర్‌’ (2007)ను జాగ్ర త్తగా చదివినప్పుడు–రెండో ప్రపంచ యుద్ధం, హిట్లర్, ఆనాటి మారణహోమం పైన గాంధీజీ దృష్టికోణం ఏమిటో తెలిసి నిర్ఘాంతపోయాను. 

గాంధీ శాంతి కాముకులని, అహింస పట్ల ఆయన నిబద్ధత తిరుగులేనిది, కొదవలేనిదని మనకు తెలిసిందే. ఆ నిబద్ధతే ఆయనను... హిట్లర్, ముస్సోలినీల దురాక్రమణ ప్రయత్నాలను అడ్డుకోవద్దని బ్రిటన్‌కు సలహా ఇచ్చేంతవరకు తీసుకెళ్లిందా! ‘‘వారిని మీ అందమైన దీవిని జయించనివ్వండి. పురుషుల్ని, స్త్రీలను, పిల్లల్ని చంపేయటానికి మీకై మీరు వారిని అనుమతించండి. అయితే వారికి విధేయంగా ఉండటానికి మాత్రం నిరాకరించండి’’ అని చెప్పారాయన. 
1962లో ఇండియాపై చైనా దాడి, లేదా ఇండి యాపై పాకిస్తాన్‌ పదే పదే చేస్తుండే దాడుల విషయంలో కూడా గాంధీ అలాగే స్పందించే వారా? ఏమైనా మహాత్ముడు భీతికొల్పేంత స్థిర చిత్తుడు అయుండాలి కానీ కపటి మాత్రం కాదు. 

మరీ అధ్వాన్నం... హిట్లర్‌ దుష్టుడు అంటే గాంధీకి నమ్మబుద్ధి కాకపోవటం! ‘‘గౌరవనీయు లైన హిట్లర్‌ను – ఆయన్ని చిత్రీకరించినంత – చెడ్డ వారిగా నేను పరిగణించను’’ అని 1940లో గాంధీ రాశారు. ‘‘ఎక్కువ రక్తపాతం లేకుండా విజయాలు సాధించే అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న ట్లుగా ఆయన నాకు కనిపిస్తారు’’ అన్నారు. ‘‘భవి ష్యత్‌ జర్మన్లు శ్రీ హిట్లర్‌ను మేధావిగా, ధీశాలిగా, సాటిలేని కార్యాచరణశీలిగా, మరెన్నో విధాలుగా గౌరవిస్తారు’’ అని గాంధీ భావించారు.  

దీనికన్నా కూడా, మాటల్లో వివరించలేనిది ఏమిటంటే – యూదుల పట్ల నాజీల అమానవీయ ప్రవర్తనపై గాంధీ ప్రతిస్పందన. లూయీ ఫిషర్‌ (అమెరికన్‌ జర్నలిస్ట్‌) రాసిన మహాత్ముడి జీవిత కథను ఉటంకిస్తూ, వాన్‌ తంజల్‌ మాన్‌... యూదులు సానుకూలమైన ప్రతిఘటనను మాత్రమే నాజీలకు అందించాలనీ, అవసరం అయితే తమ జీవితాలను సైతం త్యాగం చేయాలనీ గాంధీ సలహా ఇచ్చారని వెల్లడించారు. 

అడాల్ఫ్‌ హిట్లర్‌ కోసం ప్రార్థించమని కూడా ఆయన వారిని కోరారట. ‘‘కనీసం ఒక యూదుడు ఇలా చేసినా అతడు తన ఆత్మగౌరవాన్ని కాపాడు కున్నట్లేనని, అందువల్ల ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాడని, ఆ మంచితనం అంటువ్యాధిలా విస్త రించి మొత్తం యూదు జాతినే కాపాడుతుందని, మానవాళికి సుసంపన్నమైన ఒక గొప్ప వారస త్వాన్ని వదిలివెళుతుందని గాంధీ అన్నారు’’ అని లూయీ ఫిషర్‌ రాసినట్లు వాన్‌ పేర్కొన్నారు.   

యూదుల నిర్బంధ శిబిరాలను కనుగొన్నాక కూడా, వాటిల్లో జరుగుతున్న అతి భయానక దారుణాలు ప్రపంచం దృష్టికి వచ్చాక కూడా లూయీ ఫిషర్‌తో గాంధీ ఇలా అన్నారు: ‘‘హిట్లర్‌ 50 లక్షల మంది యూదులను చంపాడు. ఇది మనకాలపు అతి పెద్ద నేరం. కానీ యూదులు తమకై తాము కసాయి కత్తికి తమను సమర్పించుకుని ఉండాల్సింది. తమను తాము శిఖరం అంచులపై నుండి సముద్రంలోకి తోసుకుని ఉండాల్సింది...’’

హింసపై పూర్తి వ్యతిరేకత, అహింస పట్ల అచంచలమైన నిబద్ధత కలిగి ఉన్న కారణంగానే గాంధీ అలా అని ఉంటారనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే అంతవరకే అది ఏకైక ఆమోదయోగ్యమైన ప్రతిస్పందన. హిట్లర్‌ను ఎది రించవద్దని, హిట్లర్‌ కోసం ప్రార్థించమని, తమకు తాము ఆత్మార్పణం చేసుకోవాలని ఆయన యూదులకు చెప్పటం మాత్రం విడ్డూరం. కనికరం లేకపోవటం, కించపరచటం, క్రూరత్వం.1984లో సిక్కులకు, 2002లో ముస్లింలకు, నేటి ఆదివాసీలకు గాంధీ ఇచ్చే సలహా కూడా అదే విధంగా ఉండేదా? బహుశా... ఉండేది! మళ్లీ అడి గినా ఇదే సమాధానం. 

బ్రహ్మచర్యంతో గాంధీ చేసిన ప్రయోగాల మాదిరిగా కాకుండా... యుద్ధం మీద, హిట్లర్‌ మీద, మారణహోమం మీద ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు వ్యక్తిగత వ్యామోహాలు, బలహీనతల స్థాయికి మించినవి. ఆయన ఒకవేళ దేశాన్ని పరిపాలించి ఉంటే అవి విధానాలుగా మారిఉండేవి. అందుకే వాటిని చర్చించి, పరిష్కరించాల్సి ఉంది. అంతిమంగా, వాటికి ఆమోదయోగ్యమైన వివరణ లభించకపోతే వాటిని విమర్శించాలి. తిప్పికొట్టాలి. ఇలా అంటున్నందుకు నేను చిక్కుల్లో పడతాననే మాటనైతే నేను కాదనను.

కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement