
విశ్రాంత ఇండియన్ ఆర్మీ జనరల్ మనోజ్ నరవణే
కామెంట్
ఒక సైనిక ప్రధానాధికారి నవల రాయటం అన్నది ప్రతిరోజూ జరిగేది కాదు. నిజానికి, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ 77 ఏళ్లలో ఇలా ఒకసారి మాత్రమే సంభవించింది. జనరల్ ముకుంద్ మనోజ్ నరవణే రాసిన పుస్తకాన్ని అరుదైన వాటిలో ఒకటిగా, ప్రత్యేకమైనదిగా చేస్తున్నది ఇదే. నేను ఈ పుస్తకం గురించి రాస్తున్నది కూడా దానికున్న ఈ ప్రత్యేకత కారణంగానే!
నరవణే రాసిన ఈ నవల పేరు ‘ద కంటోన్మెంట్ కాన్‌స్పిరసీ’. టైటిల్ కింద ఉన్న ఉపశీర్షికను బట్టి ఇదొక మిలిటరీ థ్రిల్లర్. ఇది ‘లూ కరే’ (గూఢచారి నవలలకు ప్రసిద్ధి చెందిన స్వర్గీయ బ్రిటిష్ రచయిత డేవిడ్ జాన్ కార్న్‌వెల్ కలం పేరు) ఒరవడిని కలిగి ఉన్నటువంటిది కాకున్నా... వేగంగా చదివిస్తూ, ముందుకు నడిపించేలా ఉంటుంది. నేనైతే, తెరిచిన పుస్తకం ముగిసే వరకు కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. పేజీలు వాటంతటవే తిరిగిపోతున్నట్లుగా అనిపించింది.
ఈ కథ, కొత్తగా ఆర్మీలో చేరిన ఇద్దరు యువ అధికారుల చుట్టూ తిరుగుతుంది. ఒకరు లెఫ్ట్‌నెంట్ రోహిత్ వర్మ. ఇంకొకరు లెఫ్ట్‌నెంట్ రేణుకా ఖత్రీ. రోహిత్ మూడో తరం అధికారి. రేణుక పదాతిదళం రెజిమెంట్‌లో నియామకం పొందిన తొలి మహిళ. రోహిత్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తాయి. చాలామంది అతడు దోషి అని భావిస్తుంటారు.
రోహిత్, రేణుకలలో రేణుకే అత్యంత శక్తిమంతమైన వ్యక్తిత్వం కల ఆఫీసర్. ఒక్క దుముకుతో రోహిత్ వెనుక అండగా నిలబడి ఈ కథను ముందుకు నడిపిస్తుంది రేణుక పాత్ర. కథాంశంలో ఒక్కో ముడీ విడివడుతున్నప్పుడు రెండు హత్యలు జరుగుతాయి. ఆ హత్యలు చేసిన వ్యక్తి మొదట మీరు అనుమానించిన వ్యక్తి కాదు. ఇంతకుమించి నేను మీకు చెప్పను. అలా చెప్తే కథ తెలిసి పోతుంది.
కథా నేపథ్యం భవిష్యత్ కాలం. ఇదంతా కూడా 2026 జూన్ తర్వాత జరుగుతుంది. ఫతేపురిలోని సిఖ్ రైఫిల్స్ రెజిమెంటల్ సెంటర్‌లో కథ మొదలవుతుంది. రోహిత్, రేణుక ఓరియెంటేషన్ ట్రైనింగ్ కోసం అక్కడ ఉంటారు. కొత్తను పోగొట్టి, దిశా నిర్దేశం చేసే శిక్షణ కార్యక్రమం అది. జనరల్ నరవణే సొంత రెజిమెంట్ కూడా ‘7వ సిఖ్ లైట్ ఇన్‌ఫాంట్రీ’ కనుక ఆయన స్వీయానుభవాలు, ప్రత్యక్ష పరిశీలన ద్వారా గ్రహించిన విషయాలు ఈ నవల రాసేందుకు తోడ్ప డ్డాయని స్పష్టంగా తెలుస్తోంది.
ఏమైనా, థ్రిల్లర్ కథలు రాయటం అంత తేలికేమీ కాదు. మొదట కథాంశం అన్నది ఉండాలి. అది ఆసక్తికరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా – చదువుతున్న కొద్దీ అది మనల్ని లోలోతుల్లోకి లాక్కెళు తుండాలి. తర్వాత ప్రధానమైనది కథన వేగం. అది మనల్ని ముగింపు వైపు పరుగులెత్తించాలి. మహోగ్రమైనదిగా కూడా ఆ ముగింపు ఉండాలి. చివరిగా భాష. అది కుదింపుగా, ఉద్వేగభరి తంగా ఉండాలి.
సుదీర్ఘమైన తాత్విక ప్రసంగాల్లా కాకుండా, వాక్యాలు చిన్న చిన్నవిగా ఉండాలి. వీటి ద్వారా ప్రధాన పాత్రలు ఎటువంటి స్వభావం కలిగినవో మనకొక స్పష్టమైన అవగాహనను కలిగించటం అవసరం. ఇక రచయిత ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని సూటిగా, పదునుగా శిల్పీకరించాలి. అంతేనా, ఏది తప్పో ఏది ఒప్పో చెప్ప గలిగేలా ఉండాలి. థ్రిల్లర్ పుస్తకాలు సాధారణంగా నీతి కథలుగా ముగుస్తాయి.
ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. నిజానికైతే, ఇది మనం ఆర్మీ జనరల్స్ నుంచి ఆశించేది కాదు. ఈ పుస్తకంలోని వివిధ వర్ణాల ఛాయలు, వివరాల్లోని సూక్ష్మత్వం ఆహ్లాదకరమైన అబ్బురపాటును కలిగించేలా ఉన్నాయని నేను చెప్పగలను. నేను ఎంతో మంది ఆర్మీ చీఫ్‌లను కలిశాను కానీ – మీరు నమ్మండి – ఈ విధమైన సాహితీ నైపుణ్యాలను కలిగి ఉన్న ఆర్మీ చీఫ్‌ను నేనెప్పుడూ కలవలేదు.
కథలో బ్రిగేడియర్ అశోక్ మీనన్‌ది కేవలం పైపైన పాత్రే అయినప్పటికీ, ఆ రెజిమెంటల్ సెంటర్ కమాండెంట్ ఇంగ్లిషు నన్ను పడేసింది. మీనన్ మాట్లాడేటప్పుడు ‘బ్లింప్’ అనే ఒక ఇంగ్లిష్ కల్నల్ (కార్టూన్ క్యారక్టర్) గుర్తొచ్చారు నాకు. ‘What the deuce?' (ఆశ్చర్యాన్ని, గందరగోళాన్ని లేదా చికాకును వ్యక్తపరిచే యాస), ‘darn’ (డామిట్) వంటి పదాలు ఆయన నోటి నుండి వచ్చేవి. ఆయన ప్రసంగమంతా కూడా ruddy, blighter, bugger అనే పదాల చిలకరింపుతో ఉంటుంది. అవన్నీ తిట్లు.
జనరల్ నరవణే ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన తన పాత్ర మాట్లాడే భాషతో ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించారు. కొన్నిసార్లు ఇది నాకు ఆర్థర్ కానన్ డోయల్ (రచయిత), షెర్లాక్ హోమ్స్(కానన్ డోయల్ సృష్టించిన పాత్ర)ను కూడా గుర్తుకు తెచ్చేది. అయితే ఆర్మీ బ్రిగేడియర్‌లు నిజంగా అలా ఉంటారా? లేదా, అలా ఉండాలని పాఠకులు ఆశిస్తా రని ఈ రచయిత నమ్ముతున్నారా? ఏదైనా సరే, అది పని చేస్తుంది.
అయితే, సునిశితమైన శ్రద్ధతో సాగిన పాత్రల చిత్రీకరణ, సైనిక జీవిత స్ఫూర్తి, స్వభావాల సంగ్రహణలతో ఈ థ్రిల్లర్ పుస్తకం దోష రహితంగా ఉన్నప్పటికీ, ఇందులో నాకొక వింత లోపం మార్మికంగా అనిపించింది. బ్రిగేడియర్ మీనన్, రోహిత్‌తో మాట్లాడే సందర్భంలో రచయిత ఇలా రాశారు: ‘‘గోడవైపు చూపిస్తూ ఆయన అంటారు, ‘గురునానక్ చెప్పిన ఆ మాట నీకు తెలుసా? చెడు విజయం సాధించటానికి కావలసిన ఒకే ఒకటి, మంచి మనుషులు ఏమీ చేయకపోవ టమే’’ అని.
నాకు తెలిసినంత వరకు ఈ మాటను 18వ శతాబ్దం నాటి బ్రిటిష్ కన్జర్వేటివ్ నాయకుడు ఎడ్మండ్ బర్క్ అన్నారని చెబు తుంటారు. అయితే ఈ మాటను అన్నది బర్క్ కాదు అని ఇటీవలి కాలంలో కొన్ని పండిత వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గురు నానక్ నిజంగా అలా చెప్పారా? చెబితే ఎప్పుడు చెప్పారు? ఎక్కడ చెప్పారు?
ఈ చిన్న విషయాన్ని పక్కన పెడితే జనరల్ నరవణే తర్వాతి థ్రిల్లర్ కోసం నేను కుతూహలంతో వేచి చూస్తున్నాను. ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తే, హత్యల గురించి లెఫ్ట్‌నెంట్ రేణుకా ఖత్రి చెప్పే రహస్యాలు వరుసగా వెలువడతాయని ఆయన నాతో అన్నారు. ఎవరికి తెలుసు? ఆమె మన సొంత ‘మిస్ మార్పుల్’ (ఆంగ్ల రచ యిత్రి అగాథా క్రిస్టీ డిటెక్టివ్ నవలల్లోని కల్పిత పాత్ర) కావచ్చు. అలా జరిగితే కనుక జనరల్ నరవణే కొత్త అగాథా క్రిస్టీ అవుతారు!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment