Army general
-
అగ్నిపథ్: ఆర్మీ రిటైర్డ్ జనరల్స్ సూచనలు ఇవే..
అగ్నిపథ్ పథకంపై రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. మిలటరీ ఉద్యోగాల కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్న వారికి నాలుగేళ్ల సర్వీసుతోనే రిటైరవ్వా లన్న నిబంధన మింగుడు పడలేదు. ఉద్యోగం లేక, పెన్షనూ రాక రోడ్డున పడతామన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కేంద్రం ఏం చెప్పినా నిరాశలో ఉన్న యువత వినే పరిస్థితి లేదు. వారి అసంతృప్తిన చల్లార్చేలా పథకానికి చేయాల్సిన మార్పుచేర్పులను రిటైర్డ్ ఆర్మీ నిపుణులు ఇలా సూచిస్తున్నారు. కాలపరిమితి 12 ఏళ్లకు పెంచాలి అగ్నివీరులకు ప్రస్తుతం పేర్కొన్న నాలుగేళ్ల కాలపరిమితిని కనీసం 10 నుంచి 12 ఏళ్లకు పెంచాలని రిటైర్డ్ వింగ్ కమాండర్ ప్రఫుల్ భక్షి సూచించారు. ‘‘అప్పుడే సైన్యంలో చేరి సేవ చేసేందుకు యువత ముందుకొస్తుంది. పైగా కార్గిల్ వంటి యుద్ధాల్లో సత్తా చాటాలంటే 10–12 ఏళ్లయినా సైన్యంలో చేసి ఉండాలి. అదీగాక కేవలం ఆరు నెలల శిక్షణ కాలం అస్సలు చాలదు. నాలుగేళ్ల సర్వీసంటే గణతంత్ర పెరేడ్లలో పాల్గొనడానికే పనికొస్తారు’’ అన్నారు. సగం మందినైనా పర్మినెంట్ చేయాలి 25 శాతం మందినే పరి్మనెంట్ చేయడం సబబు కాదని మేజర్ జనరల్ (రిటైర్డ్) బిఎస్ ధనోవా అభిప్రాయపడ్డారు. ‘‘50 శాతానికైనా పెంచితే మేలు. మిగతా వారికి సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్సెస్, రాష్ట్ర పోలీసు యంత్రాంగాల్లో ఉద్యోగ హామీ ఇవ్వాలి. భవిష్యత్తుకు భరోసా ఉండేలా పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలి’’ అని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలి అగ్నిపథ్‌పై భయాందోళనలు నెలకొనడంతో తొలుత కొన్ని రెజిమెంట్లలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, సాదక బాధకాలన్నీ తెలిసొచ్చాక అవసరమైన మార్పుచేర్పులతో పూర్తి స్థాయిలో అమలు చేయొచ్చని లెఫ్ట్‌నెంట్ జనరల్ (రిటైర్డ్) వినోద్ భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘కేవలం నాలుగేళ్ల ఉద్యోగానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు? ఎందుకంత రిస్క్ తీసుకుంటారు?’’ అని ఆయనన్నారు. పథకాన్ని సమగ్రంగా ఆలోచించి రూపొందించినట్టు కనిపించడం లేదు. కనుక పైలెట్ ప్రాజెక్టుగా తెచ్చే ముందు కూడా మరిన్ని చర్చలు తప్పనిసరి’’ అన్నారు. మరింత చర్చ తప్పనిసరి పథకంపై మరింతగా చర్చ తప్పనిసరని బీఎస్ఎఫ్ మాజీ ఏడీజీ సంజీవ్ సూద్ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల సరీ్వసు తర్వాత 75 శాతం మందిని ఇంటికి పంపేయడం పథకంలో ప్రధాన లోపమన్నారు. ఇలా ఏటా లక్షల్లో యువకులు సాయుధ బలగాలను వీడితే వారి భవిష్యత్తుతో పాటు దేశ రక్షణా ప్రమాదంలో పడుతుంది. ‘‘ఇంతమందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ఇతరత్రా ఉద్యోగాలెలా కల్పిస్తారు? పైగా కేవలం 6 నెలల శిక్షణతో మూడున్నరేళ్లకు సరీ్వసుకు తీసుకుంటే ఏ జవానూ పూర్తి సామర్థ్యంతో పని చేయలేడు’’ అన్నారు. పథకాన్ని పూర్తిగా వెనక్కు తీసుకోవడమో, కొన్ని బెటాలియన్లలో పైలెట్‌గా చేపట్టడమో చేయాలని సూచించారు. సైనిక నియామకాలు.. ఏ దేశాల్లో ఎలా? అమెరికా అగ్రరాజ్యంలో సైన్యంలో చేరడం స్వచ్ఛందమే. సైనికులు నాలుగేళ్లు విధుల్లో ఉంటారు. తర్వాత మరో నాలుగేళ్లు వారిని రిజర్వ్‌లో ఉంచి అవసరమైనప్పుడు పిలుస్తారు. నాలుగేళ్లలో ప్రతిభ కనబరిచి మిలటరీనే వృత్తిగా తీసుకొని 20 ఏళ్లు సేవలందించిన వారికి మాత్రమే పింఛను, ఇతర భత్యాలుంటాయి. చైనా డ్రాగన్ దేశంలో నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిందే. 18 ఏళ్లు పైబడిన మగవాళ్లంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో చేరి రెండేళ్లు విధిగా పని చేయాలి. పూర్తికాలం సైనికులుగా చేసి రిటైరైన వారికి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి డిస్కౌంట్‌తో రుణాలు, పన్ను రాయితీలు ఇస్తారు. ఫ్రాన్స్ సైనికుల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. ముందు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చి క్రమంగా ఐదేళ్ల దాకా పొడిగిస్తారు. 19 ఏళ్లు సరీ్వసులో ఉంటే పెన్షన్ ఇస్తారు. రష్యా సైన్యంలో నియామకాలు హైబ్రిడ్ విధానంలో జరుగుతాయి. నిర్బంధ, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలుంటాయి. నిర్బంధంగా చేరిన వారికి ఏడాది శిక్షణ, ఏడాది సరీ్వసు ఉంటుంది. తర్వాత వారు రిజర్వ్‌లో ఉంటారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్న సైనికులకు కాంట్రాక్ట్ ముగిశాక సైనిక విద్యా సంస్థల్లో ఉపాధి అవకాశాలు కలి్పస్తారు. ఇజ్రాయెల్ పురుషులతో పాటు మహిళలు కూడా నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిం దే. మగవారు 32 నెలలు, మహిళలు 24 నెలలు పని చేయాలి. వీరిలో 10% మందిని పూర్తి స్థాయి సైనికులుగా నియమిస్తారు. ఏడేళ్ల కాంట్రాక్ట్ ఉంటుంది. ప్రతిభ కనబరిచిన వారు 12 ఏళ్లు పదవిలో ఉంటారు. వారికే పెన్షన్ అందుతుంది. పాకిస్తాన్ నియామకాలు స్వచ్ఛందమే. 17–25 ఏళ్ల వారిని పోటీ పరీక్షల ద్వారా తీసుకుంటారు. పూర్తికాలం పని చేసిన వారికే పెన్షన్, ఇతర భత్యాలు. కొందరిని రిజర్వ్‌లో ఉంచుతారు. వారికి బెనిఫిట్సేమీ ఉండవు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశానికి సేవ చేయడమే సైనికుల లక్ష్యం
-
‘వారి ఆశలను నెరవేర్చే బాధ్యత మాపైనే ఉంది’
న్యూఢిల్లీ: సాయుధ దళాలకు సంబంధించి నూతన ఆర్మీ జనరల్ ఎమ్ ఎమ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అనుసరించి సాయుధ దళాలు సేవలందిస్తాయని అన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి అంశాలకు సాయుధ దళాలు ప్రాధాన్యతనిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో యుద్ధాలను ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నామని పేర్కొన్నారు. యుద్ధాలను ఎదుర్కొనేందుకు సైన్యానికి కఠినమైన, నాణ్యతతో కూడిన శిక్షణను అందిస్తున్నామని నరవణే అన్నారు. దేశానికి సేవ చేయడమనే సైనికుల లక్ష్యమని, వారి ఆశలను నెరవేర్చే బాధ్యత తమపై ఉందని తెలిపారు. మూడు దళాలను పటిష్టపరిచే నూతన డిఫెన్స్ చీఫ్ పదవిని సృష్టించడం పెద్ద సవాలుతో కూడుకున్నదని, కేంద్ర ప్రభుత్వం దానిని సమర్థవంతంగా నిర్వర్తించిందని అభిప్రాయపడ్డారు. దేశ సమైక్యతను కాపాడే బాధ్యత కేవలం సాయుధ దళాలకే కాకుండా ప్రజలందరికీ ఉందని అభిప్రాయపడ్డారు. -
మహిళా అధికారిని వేధించిన మేజర్‌పై వేటు
న్యూఢిల్లీ : మహిళా అధికారిని లైంగిక వేధింపులకు గురిచేసిన మేజర్ జనరల్ ఎంఎస్ జస్వాల్‌ను ఆర్మీ జనరల్ కోర్టు మార్షల్ (జీసీఎం) సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్వాల్ రెండేళ్ల కిందట నాగాలాండ్‌లో పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్‌లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా కొహిమాలో పనిచేస్తున్న సమయంలో కెప్టెన్ ర్యాంక్ అధికారి అయిన మహిళను తన రూమ్‌కు పిలిపించుకుని అసభ్యంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపించారు. అయితే సైన్యంలో వర్గ పోరును తనను బలిపశువును చేశారని, తాను అమాయకుడినని నిందితుడు చెప్పుకొచ్చారు. మేజర్ జనరల్‌పై ఈ ఏడాది జూన్ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా జీసీఎం తీర్పుపై మేజర్ జనరల్ ఎగువ కోర్టులో అప్పీల్‌కు వెళతారని ఆయన తరపు న్యాయవాదులు వెల్లడించారు. -
ఆర్మీ చీఫ్‌పై కశ్మీర్లో ఆగ్రహం
శ్రీనగర్ : భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌పై జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కశ్మీర్ విద్యావ్యవస్థపై రావత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్ విద్యాశాఖా మంత్రి ఇమ్రాన్ రాజా అన్సారీ మండిపడ్డారు. ‘‘మీరేం విద్యావేత్త కాదు. విద్యావ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో మా ప్రభుత్వానికి బాగా తెలుసు. మాకు రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉన్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకోగలిగే పరిణితి ఇక్కడి విద్యార్థుల్లో ఉంది. మా రాష్ట్రంలో అవినీతి నెలకొందని మీకెవరు చెప్పారు? ప్రతీ స్కూళ్లలో రాష్ట్రానికి సంబంధించిన మ్యాపులు ఉంటాయన్న విషయం మీకు తెలీకపోవటం శోచనీయం’’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు. కాగా, ఆర్మీ డే సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన రావత్ మాట్లాడుతూ.. కశ్మీర్లో ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని.. యువత ఉగ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘జమ్ములో ప్రతీ పాఠశాలలో రాష్ట్రం మ్యాప్ ఉంటుంది. అది విద్యార్థులపై చాలా ప్రభావం చూపుతుంది. తాము ఈ దేశంలో భాగం కాదేమోనని విద్యార్థులు భావిస్తున్నారు. దీనికితోడు విద్యా వ్యవస్థ పూర్తి అవినీతిమయంగా మారిపోయింది. ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీమార్పులు తీసుకురావటంతోపాటు.. మసీదులు, మదర్సాలపై స్వల్ప నియంత్రణ అవసరం’ అని రావత్ అభిప్రాయపడ్డారు. -
ఈజిప్టు అధ్యక్షునిగా అబ్దెల్ ఫత్తా
కై రో: ఈజిప్టు మాజీ సైన్యాధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్- సిసీ దేశాధ్యక్షునిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షపదవికి గతవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు 96.6 శాతం ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 59 ఏళ్ల అబ్దెల్ ఫత్తా ఈజిప్టుకు ఏడవ అధ్యక్షుడు. సుప్రీంకోర్టు జనరల్ అసెంబ్లీ ఎదురుగా ఆయన పదవీస్వీకార ప్రమాణం చేశారు. ప్రజాస్వామిక పద్ధతిలో తొలిసారి ఎన్నికైన మహమ్మద్ మోర్సీని ఆయన గత ఏడాది పదవీచ్యుతుడిని చేశారు. సైన్యంపై పట్టుకలిగిన రిటైర్డు ఫీల్డ్‌మార్షల్ అయిన ఫత్తా దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలను సరిదిద్దుతానని ఈ సందర్భంగా ప్రతిన బూనారు. నాలుగేళ్ల పాటు ఆయన అధ్యక్షునిగా కొనసాగుతారు. దేశం ఇంటాబయటా తలెత్తుకుని తిరిగేలా ముఖ్యమైన మార్పులుంటాయని ఆయన చెప్పారు. ఉజ్వలమైన భవిష్యత్‌ను, సుస్థిరమైన ప్రగతిని సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోర్సీ ఉద్వాసనకు గురయ్యాక అప్పటివరకు సైన్యాధిపతిగా ఉన్న ఫత్తా తన పదవికి రాజీనామా చేశారు. గతనెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హందీన్ సబాహీతో పోటీపడ్డారు. అబ్దెల్ ఫత్తా ప్రమాణం సందర్భంగా కైరోలో కట్టుదిట్టమైన భద్రతాఏర్పాట్లు చేశారు.