అగ్నిపథ్‌: ఆర్మీ రిటైర్డ్‌ జనరల్స్‌ సూచనలు ఇవే.. | Hints From Army Retired Generals On Agnipath Scheme | Sakshi
Sakshi News home page

అగ్నిపథ్‌: ఆర్మీ రిటైర్డ్‌ జనరల్స్‌ సూచనలు ఇవే..

Published Sat, Jun 18 2022 7:50 AM | Last Updated on Sat, Jun 18 2022 8:26 AM

Hints From Army Retired Generals On Agnipath Scheme - Sakshi

అగ్నిపథ్‌ పథకంపై రాజుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. మిలటరీ ఉద్యోగాల కోసం రెండేళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్న వారికి నాలుగేళ్ల సర్వీసుతోనే రిటైరవ్వా లన్న నిబంధన మింగుడు పడలేదు. ఉద్యోగం లేక, పెన్షనూ రాక రోడ్డున పడతామన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కేంద్రం ఏం చెప్పినా నిరాశలో ఉన్న యువత వినే పరిస్థితి లేదు. వారి అసంతృప్తిన చల్లార్చేలా పథకానికి చేయాల్సిన మార్పుచేర్పులను రిటైర్డ్‌ ఆర్మీ నిపుణులు ఇలా సూచిస్తున్నారు.

కాలపరిమితి 12 ఏళ్లకు పెంచాలి 
అగ్నివీరులకు ప్రస్తుతం పేర్కొన్న నాలుగేళ్ల కాలపరిమితిని కనీసం 10 నుంచి 12 ఏళ్లకు పెంచాలని రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ ప్రఫుల్‌ భక్షి సూచించారు. ‘‘అప్పుడే సైన్యంలో చేరి సేవ చేసేందుకు యువత ముందుకొస్తుంది. పైగా కార్గిల్‌ వంటి యుద్ధాల్లో సత్తా చాటాలంటే 10–12 ఏళ్లయినా సైన్యంలో చేసి ఉండాలి. అదీగాక కేవలం ఆరు నెలల శిక్షణ కాలం అస్సలు చాలదు. నాలుగేళ్ల సర్వీసంటే గణతంత్ర పెరేడ్లలో పాల్గొనడానికే పనికొస్తారు’’ అన్నారు.

సగం మందినైనా పర్మినెంట్‌ చేయాలి 
25 శాతం మందినే పరి్మనెంట్‌ చేయడం సబబు కాదని మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌) బిఎస్‌ ధనోవా అభిప్రాయపడ్డారు. ‘‘50 శాతానికైనా పెంచితే మేలు. మిగతా వారికి సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పారా మిలటరీ ఫోర్సెస్, రాష్ట్ర పోలీసు యంత్రాంగాల్లో ఉద్యోగ హామీ ఇవ్వాలి. భవిష్యత్తుకు భరోసా ఉండేలా పెన్షన్‌ స్కీమ్‌ ప్రవేశపెట్టాలి’’ అని సూచించారు.

పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలి 
అగ్నిపథ్‌పై భయాందోళనలు నెలకొనడంతో తొలుత కొన్ని రెజిమెంట్లలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని, సాదక బాధకాలన్నీ తెలిసొచ్చాక అవసరమైన మార్పుచేర్పులతో పూర్తి స్థాయిలో అమలు చేయొచ్చని లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) వినోద్‌ భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘కేవలం నాలుగేళ్ల ఉద్యోగానికి ఎవరైనా ఎందుకు ముందుకొస్తారు? ఎందుకంత రిస్క్‌ తీసుకుంటారు?’’ అని ఆయనన్నారు. పథకాన్ని సమగ్రంగా ఆలోచించి రూపొందించినట్టు కనిపించడం లేదు. కనుక పైలెట్‌ ప్రాజెక్టుగా తెచ్చే ముందు కూడా మరిన్ని చర్చలు తప్పనిసరి’’ అన్నారు. 

మరింత చర్చ తప్పనిసరి 
పథకంపై మరింతగా చర్చ తప్పనిసరని బీఎస్‌ఎఫ్‌ మాజీ ఏడీజీ సంజీవ్‌ సూద్‌ అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల సరీ్వసు తర్వాత 75 శాతం మందిని ఇంటికి పంపేయడం పథకంలో ప్రధాన లోపమన్నారు. ఇలా ఏటా లక్షల్లో యువకులు సాయుధ బలగాలను వీడితే వారి భవిష్యత్తుతో పాటు దేశ రక్షణా ప్రమాదంలో పడుతుంది. ‘‘ఇంతమందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ఇతరత్రా ఉద్యోగాలెలా కల్పిస్తారు? పైగా కేవలం 6 నెలల శిక్షణతో మూడున్నరేళ్లకు సరీ్వసుకు తీసుకుంటే ఏ జవానూ పూర్తి సామర్థ్యంతో పని చేయలేడు’’ అన్నారు. పథకాన్ని పూర్తిగా వెనక్కు తీసుకోవడమో, కొన్ని బెటాలియన్లలో పైలెట్‌గా చేపట్టడమో చేయాలని సూచించారు.     

సైనిక నియామకాలు.. ఏ దేశాల్లో ఎలా? 
అమెరికా 
అగ్రరాజ్యంలో సైన్యంలో చేరడం స్వచ్ఛందమే. సైనికులు నాలుగేళ్లు విధుల్లో ఉంటారు. తర్వాత మరో నాలుగేళ్లు వారిని రిజర్వ్‌లో ఉంచి అవసరమైనప్పుడు పిలుస్తారు. నాలుగేళ్లలో ప్రతిభ కనబరిచి మిలటరీనే వృత్తిగా తీసుకొని 20 ఏళ్లు సేవలందించిన వారికి మాత్రమే పింఛను, ఇతర భత్యాలుంటాయి. 

చైనా 
డ్రాగన్‌ దేశంలో నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిందే. 18 ఏళ్లు పైబడిన మగవాళ్లంతా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో చేరి రెండేళ్లు విధిగా పని చేయాలి. పూర్తికాలం సైనికులుగా చేసి రిటైరైన వారికి సొంత వ్యాపారాలు చేసుకోవడానికి డిస్కౌంట్‌తో రుణాలు, పన్ను రాయితీలు ఇస్తారు. 

ఫ్రాన్స్‌ 
సైనికుల్ని కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమిస్తారు. ముందు ఏడాది కాంట్రాక్ట్‌ ఇచ్చి క్రమంగా ఐదేళ్ల దాకా పొడిగిస్తారు. 19 ఏళ్లు సరీ్వసులో ఉంటే పెన్షన్‌ ఇస్తారు. 

రష్యా 
సైన్యంలో నియామకాలు హైబ్రిడ్‌ విధానంలో జరుగుతాయి. నిర్బంధ, కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియామకాలుంటాయి. నిర్బంధంగా చేరిన వారికి ఏడాది శిక్షణ, ఏడాది సరీ్వసు ఉంటుంది. తర్వాత వారు రిజర్వ్‌లో ఉంటారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకున్న సైనికులకు కాంట్రాక్ట్‌ ముగిశాక  సైనిక విద్యా సంస్థల్లో ఉపాధి అవకాశాలు కలి్పస్తారు. 

ఇజ్రాయెల్‌ 
పురుషులతో పాటు మహిళలు కూడా నిర్బంధంగా సైన్యంలో చేరాల్సిం దే. మగవారు 32 నెలలు, మహిళలు 24 నెలలు పని చేయాలి. వీరిలో 10% మందిని పూర్తి స్థాయి సైనికులుగా నియమిస్తారు. ఏడేళ్ల కాంట్రాక్ట్‌ ఉంటుంది. ప్రతిభ కనబరిచిన వారు 12 ఏళ్లు పదవిలో ఉంటారు. వారికే పెన్షన్‌ అందుతుంది.

 

పాకిస్తాన్‌ 
నియామకాలు స్వచ్ఛందమే. 17–25 ఏళ్ల వారిని పోటీ పరీక్షల ద్వారా తీసుకుంటారు. పూర్తికాలం పని చేసిన వారికే పెన్షన్, ఇతర భత్యాలు. కొందరిని రిజర్వ్‌లో ఉంచుతారు. వారికి బెనిఫిట్సేమీ ఉండవు.  

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement