న్యూఢిల్లీ: సాయుధ దళాలకు సంబంధించి నూతన ఆర్మీ జనరల్ ఎమ్ ఎమ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అనుసరించి సాయుధ దళాలు సేవలందిస్తాయని అన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి అంశాలకు సాయుధ దళాలు ప్రాధాన్యతనిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో యుద్ధాలను ఎదుర్కొనేందుకు పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నామని పేర్కొన్నారు.
యుద్ధాలను ఎదుర్కొనేందుకు సైన్యానికి కఠినమైన, నాణ్యతతో కూడిన శిక్షణను అందిస్తున్నామని నరవణే అన్నారు. దేశానికి సేవ చేయడమనే సైనికుల లక్ష్యమని, వారి ఆశలను నెరవేర్చే బాధ్యత తమపై ఉందని తెలిపారు. మూడు దళాలను పటిష్టపరిచే నూతన డిఫెన్స్ చీఫ్ పదవిని సృష్టించడం పెద్ద సవాలుతో కూడుకున్నదని, కేంద్ర ప్రభుత్వం దానిని సమర్థవంతంగా నిర్వర్తించిందని అభిప్రాయపడ్డారు. దేశ సమైక్యతను కాపాడే బాధ్యత కేవలం సాయుధ దళాలకే కాకుండా ప్రజలందరికీ ఉందని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment