
వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష కార్యాలయం (ఓవల్ ఆఫీస్)లో డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్‌స్కీ
కామెంట్
నా చిన్నతనంలో డోనాల్డ్ అనగానే డక్ గుర్తొచ్చేది. ఇప్పుడు ట్రంప్ ఆ స్థానం ఆక్రమించారు. వాల్ట్ డిస్నీ కంపెనీ రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత కార్టూన్ క్యారెక్టర్ డోనాల్డ్ డక్ లేదా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... శక్తిమంతమైన అగ్రరాజ్యం అమెరికాకు ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రాతి నిధ్యం వహిస్తారు?
మొదటి ప్రపంచ యుద్ధానికీ ముందూ, ఆ తర్వాతా ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా వ్వవహరించిన జార్జెస్ క్లెమెన్సో అమెరికా గురించి చేసిన ప్రఖ్యాత వ్యాఖ్యను ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఆయన అభిప్రాయం ప్రకారం, నాగరికత అనే మధ్య దశను అనుభవించకుండానే, అనాగరికత నుంచి అధోగతికి నేరుగా పురోగమించిన దేశం ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉంది... అది అమె రికా! ఆయన ఇప్పుడు జీవించి ఉంటే ట్రంప్ గురించి ఏమనేవారో?
డోనాల్డ్ ట్రంప్, వ్లాదిమీర్ జెలెన్‌స్కీ మధ్య ఇటీవల తలెత్తిన కలహం అబ్బురపరిచేది, లేదంటే నమ్మశక్యం కానిది. ఈ పనికి మాలిన కలహం అమెరికా అధ్యక్షుడి నిజస్వరూపం ఎలాంటిదో తేట తెల్లం చేసింది. కానీ మొన్న శుక్రవారం ఏం జరిగిందో తెలియాలంటే, జనవరి నుంచి జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవాలి.
జెలెన్‌స్కీ ఓ ‘నియంత’ అంటూ ట్రంప్ అభివర్ణించారు.ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. జెలెన్‌స్కీకి ఆ దేశ ప్రజల్లో 4 శాతం మాత్రమే మద్దతు ఉందని చెప్పారు. ఉక్రెయిన్ ఎన్నికల్లో ఆయనకు 57 శాతం మద్దతు లభించిన వాస్తవాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఆ ‘4 శాతం’ అనేది రష్యా ప్రాపగాండా అని జెలెన్‌స్కీ కొట్టిపారేశారు.
ట్రంప్ అక్కడితో ఆగలేదు. ఉక్రెయిన్ అధినేతను ‘ఒక మోస్త రుగా సక్సెస్ అయిన కమెడియన్’ (అధ్యక్షుడు కాకమునుపు జెలెన్‌స్కీ ఒక నటుడు) అని కొట్టిపారేశారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఆయనే తెరతీశారనీ ఆరోపించారు. సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోనట్లయితే తన దేశాన్ని కోల్పోతారు అని ఒక అడుగు ముందుకువేసి మరీ హెచ్చరించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా ప్రభుత్వం జరుపుతున్న చర్చల నుంచి జెలెన్‌స్కీనీ, ఇతర యూరప్ దేశాల నేతలనూ ట్రంప్ దూరం పెట్టారు. రష్యా అధ్యక్షుడు శాంతి కోరుకుంటున్నారని పలు ఇంటర్వ్యూలలో ఆయన పుతిన్‌ను ప్రశంసించారు. తాను పుతిన్‌ను విశ్వసిస్తున్నానని విస్పష్టంగా ప్రకటించారు. రష్యాదే పై చేయి అని నమ్ముతున్నట్లు తేల్చి చెప్పారు. చర్చల్లో భాగస్వామిగా చేయాల్సినంత ముఖ్యుడు కాదని వ్యాఖ్యానించి జెలెన్‌స్కీని కించపరిచారు.
ఎంత రెచ్చగొట్టినా సరే మౌనం పాటించాలని ఉక్రెయిన్ అధినేతకు సలహాలు అందివుంటాయి. అయినా జెలెన్‌స్కీ ఊరు కోలేదు. రష్యా ‘తప్పుడు ప్రచారపు బుడగ’లో ట్రంప్ జీవిస్తున్నారని దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌కు 500 బిలియన్ డాలర్ల సాయం అందించామన్న ట్రంప్ మాటలతో కూడా ఆయన విభేదించారు. అది ‘సీరియస్’గా చెబుతున్నమాట కాదని కొట్టేశారు.
అమెరికా ఉపాధ్యక్షడు జె.డి.వాన్స్, జాతీయ భద్రతా సలహా దారు మైఖెల్ వాల్ట్స్‌ను రెచ్చగొట్టడానికి ఇంతకంటే ఇంకేం కావాలి! వారు వెంటనే స్పందించారు. ట్రంప్ మీద నోరు పారేసుకోవద్దని జెలెన్‌స్కీని ప్రసార మాధ్యమాల ద్వారా హెచ్చరించారు. నిజానికి నోరు పారేసుకున్నది ట్రంపే!
ఇదంతా గమనిస్తుంటే, ఏమనిపిస్తోంది? సున్నిత హాస్యంతో సత్ప్రవర్తనకు మారుపేరుగా నిలిచిన ‘డోనాల్డ్ డక్’ ఈ వ్యవహారాన్ని సుతరామూ అంగీకరించలేదు. ఈసడించుకుని గగ్గోలు పెట్టేది. క్లెమెన్సో తన అభిప్రాయానికి తాజా పరిణామాలు రుజువు అనే వారు. దిగజారినవారు మాత్రమే ఇలా ప్రవరిస్తారు.
నేను ఇప్పుడొక భిన్నమైన ప్రశ్న వేస్తాను. సాటి ప్రభుత్వ అధినేతను, అదీ తమ మిత్రపక్ష ప్రభుత్వ అధినాయకుడిని... శత్రు దేశం కొమ్ము కాస్తూ ఒక అమెరికా అధ్యక్షుడు ఇలా బహిరంగంగా చులకన చేసి మాట్లాడిన దృష్టాంతం మీరెప్పుడైనా విన్నారా? మీ ఊహకు అందని విరుద్ధ భావన కదా ఇది!
ఈ చర్చ మరొక ప్రశ్నకు దారి తీస్తుంది. తాను అమెరికా అధ్యక్షుడు, శక్తిమంతుడు, విలక్షణ స్వభావి కనుక తానొక్కడికే ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుందా? లేదా ఇతర ప్రభుత్వాల అధి నేతలు సైతం ఆయన్ని అనుసరించే ప్రమాదం ఉందా? మరో విధంగా చెప్పాలంటే, ట్రంప్ ప్రవర్తన కొత్త తరహా రాజకీయాలకు ముందస్తు సూచనేమో! ఇతరులూ అలా మాట్లాడితే అదో కొత్త ఆన వాయితీ అవుతుంది.
నా ఉద్దేశంలో కేవలం చిన్న దేశాల అధ్యక్షుల గురించి మాత్రమే శక్తిమంతమైన దేశాల అధినేతలు ఇలా లెక్క లేనట్లు మాట్లాడగలరు. స్కూల్లో అయితే దీన్ని బుల్లీయింగ్ అంటాం. ఇవ్వాళా రేపూ ఇదే వాస్తవ రాజకీయం. ఇంకా చెప్పాలంటే, నడుస్తున్న రాజనీతి!
చివరకు ట్రంప్ ప్రవర్తన సమకాలీన అమెరికా గురించి ఆందో ళనకరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. జాత్యహంకారం, సామాజిక వివక్ష, అన్యాయాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న భావన వది లేసిన తర్వాత... ఇక ఏదైనా సరే ఎలా నిషిద్ధం అవుతుంది? అందుకే ఏం మాట్లాడినా, ఎలా విరుచుకుపడినా ఇప్పుడు సమ్మతమే అవుతుందా? అది అసత్యమైనా, అన్యాయమైనా, పూర్తిగా పక్షపాతమైనా సరే ఆమోదయోగ్యమేనా? ఈ తీరుతోనే అమెరికా మళ్లీ గొప్ప దేశం అవుతుందా? లేదా తనంతట తానే క్రమేణా క్షీణించి పోతుందా? తన ఔన్నత్యాన్ని మరీ మరీ దిగజార్చుకుంటుందా? తన నైతిక స్థితిని ఇంకా ఇంకా బలహీనపరుచుకుంటుందా?
శుక్రవారం జరిగిన కలహం వల్ల ఉక్రెయిన్, యూరప్, ఆఖరికి అమెరికా కూడా తీవ్రమైన చిక్కులు ఎదుర్కోవచ్చు. దీన్నంతటినీ చూస్తూ నవ్వుకుంటున్నది ఒకే ఒక్కరు... రష్యా అధ్యక్షుడు! అయితే, తన దురుసుతనానికి త్వరలోనే ట్రంప్ పశ్చాత్తాపపడ్డా నేను ఆశ్చర్య పోను. కానీ అప్పటికే ఆలస్యమవుతుందా?
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment