
ఆమె ఆరేళ్ల చిరుప్రాయంలోనే కవితలు రాసేది . 12 ఏళ్ల వయసులో రచించిన నాటకం ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. లండన్‌లో విద్యాభ్యాసానికి స్కాలర్‌షిప్ పొందిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు కల్పించాలని పోరాడిన ఆమె.. మరెవరో కాదు..స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు(Sarojini Naidu). చిన్నవయసులోనే ఆమె చూపిన తెగువ, పోరాట పటిమను మెచ్చుకున్న మహాత్మాగాంధీ ఆమెను ప్రేమగా ‘మిక్కీమౌస్’ అని పిలిచేవారు.
సరోజినీ నాయుడు 1979, ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఆమెను శాస్త్రవేత్తగా చూడాలనుకున్నారు. కానీ ఆమె ఆమెకు కథలు, కవితలు రాయడమంటే అమితమైన ఆసక్తి. తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. సరోజినీ తన 12 ఏళ్ల వయసులో రాసిన ‘మహేర్ మునీర్’ నాటకం ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది.
చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే సరోజినీకి 16 ఏళ్ల వయసులో హైదరాబాద్ నిజాం నుంచి స్కాలర్‌షిప్ లభించింది. ఈ స్కాలర్‌షిప్‌తో ఆమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదువుకునేందుకు వెళ్లింది. అక్కడ ఆమె పెద్దిపాటి గోవిందరాజులు నాయుడును కలుసుకుంది. ఇది తరువాతి కాలంలో వారి మధ్య ప్రేమగా పరిణమించి, వివాహానికి దారి తీసింది. పెళ్లి చేసుకునే సమయానికి సరోజినీ వయసు కేవలం 19 ఏళ్లు. నాడు జరిగిన వీరి కులాంతర వివాహం పలు చర్చలకు దారితీసింది. అయితే వారి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సాగింది. వారికి ఐదుగురు సంతానం. వారి కుమార్తె పద్మజ కూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు.
సరోజినీ నాయుడు రాజకీయ జీవితం 1905లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్(Women's Indian Association) (డబ్ల్యూఏఐ) స్థాపనతో ప్రారంభమైంది. ఆమె సాగించిన రచనలు దేశ స్వాతంత్య్రాన్ని, మహిళా స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రతిబింబించేవి. ఆమె 1906లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగించారు. సరోజనీ నాయుడు సామాజిక న్యాయం, మహిళా సాధికారత కోసం ఎనలేని కృషి చేశారు. 1925లో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొని జైలుకు వెళ్లారు.
సరోజినీ నాయుడు తొలి కవితా సంకలనం 1905లో ప్రచురితమైంది. దాని పేరు - 'ది గోల్డెన్ థ్రెషోల్డ్.' సరోజినీ నాయుడు భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్. 1947 నుండి 1949 వరకు యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔద్(United Provinces of Agra and Oudh)కు గవర్నర్‌గా పనిచేశారు. సరోజినీ నాయుడు జ్ఞాపకార్థం దేశంలోని పలు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులకు ఆమె పేరు పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన రెండేళ్ల తర్వాత అంటే 1949 మార్చి 2న సరోజినీ నాయుడు తన 70వ ఏట ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గుండెపోటుతో కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: నేడు తొలి విశ్వశాంతి కేంద్రం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment