విద్యావంతులైన వాళ్లు ఎవరైనా జీవితాంతం తమ గురువులను స్మరించుకుంటారు. మన దేశంలో గురుశిష్య పరంపర వేదకాలం నుంచి ఉంది. పాశ్చాత్య నాగరికతల్లో కూడా క్రీస్తుపూర్వం నుంచే గురుశిష్య పరంపర కొనసాగేది. విద్య నేర్పించే గురువులే లేకుంటే, ఈ ప్రపంచం ఇంకా అజ్ఞానాంధకార యుగంలోనే మిగిలి ఉండేదేమో! గురువులు లేని లోకాన్ని ఊహించుకోలేం.
గురువులు ఊరకే పాఠాలను వల్లెవేయించడమే కాదు, భావితరాలను జ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దుతారు. పరోక్షంగా సమాజాన్ని మెరుగుపరుస్తారు. బడిలో చేరిన పిల్లల మీద తల్లిదండ్రుల కంటే గురువుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురువుల మీద అమితమైన గురి ఉంటుంది. ‘ఎలా ఆలోచించాలో తెలిసిన వాళ్లకు అధ్యాపకుల అవసరం లేదు’ అని మహాత్మాగాంధీ అన్నారు. అయితే, అమాయకపు బాల్యావస్థలో ఆలోచనను పదునెక్కించే గురువులు అత్యవసరం.
జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంబంధాల్లో గురుశిష్య సంబంధం ప్రత్యేకమైనది. లోకంలో ఎందరో ఉత్తమ గురువులు, వారు తీర్చిదిద్దిన ఉత్తమ శిష్యులు ఉన్నారు. వారందరూ గతించిపోయినా, వారి చరిత్రను జనాలు చర్వితచర్వణంగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. మన పురాణాల్లోనూ గురుశిష్యుల కథలు కొల్లలుగా కనిపిస్తాయి. పురాణాల్లో దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువులుగా వాసికెక్కారు.
అవతార పురుషులైన రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపని మహర్షి గురువులుగా ఉండేవారు. పురాణ గురువుల్లో మిగిలినవారిదంతా ఒక ఎత్తు అయితే, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పిన చండా మార్కుల వారిది మరో ఎత్తు. దండోపాయాన్ని సాధనంగా ఎంచుకున్న తొలిగురువు బహుశా ఆయనే! చండామార్క వారసులైన గురువులు అక్కడక్కడా తారసపడుతుంటారు.
మనుషుల్లో ఉండే వైవిధ్య వైరుద్ధ్యాలు గురుశిష్యుల్లోనూ కనిపిస్తాయి. గురువులందరూ ఉత్తములేనని, శిష్యులందరూ ఆణిముత్యాలేనని చెప్పలేం. గురువుల్లో ఔదార్యమూ, ఉదాత్తతలతో పాటే స్వార్థ సంకుచిత లక్షణాలూ కనిపిస్తాయి. గురువులు కూడా మానవ మాత్రులే! ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా కోరిన ద్రోణుడు మనకు తెలుసు.
గురువుకే పంగనామాలు పెట్టిన ఆషాఢభూతి కూడా మనకు తెలుసు. గురజాడవారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఆషాఢభూతికి ఏమీ తీసిపోయే రకం కాదు. కాకుంటే, అతగాడు గురుత్వం వెలగబెట్టాడు. గిరీశం శిష్యరికంలో వెంక టేశానికి చుట్ట కాల్చడం పట్టుబడిందే గాని, చదువు ఒంటబట్టలేదు.
అయితే, మన దేశంలో వివిధ రంగాల్లో రాణించిన గురువులు, గురువులకు గర్వకారణంగా నిలిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. సాహితీరంగంలో తమదైన ముద్రవేసిన గురుశిష్యులు కొందరు ఇప్పటికీ ప్రస్తావనల్లోకి వస్తుంటారు. అటువంటి గురుశిష్యుల్లో మొదటగా చెప్పుకోవల సిన వారు – తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ.
వారిద్దరూ అరుదైన గురుశిష్యులు. పాండితీ ప్రాభవంలోను, కవన శైలిలోనూ ఇద్దరూ ఇద్దరే! చెళ్లపిళ్లవారి గురించి విశ్వనాథ ఒక చమత్కార పద్యం చెప్పారు. అది: ‘అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు... బ్రాహ్మీమయమూర్తి శిష్యు డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళవంశస్వామి కున్నట్లుగన్’. నన్నయకు, తిక్కనకు తన వంటి శిష్యులెవరూ లేరని, తన గురువైన చెళ్లపిళ్ల వారికే ఆ వైభోగం, కీర్తి దక్కాయని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వనాథ. అధ్యాపక వృత్తిలో కొనసాగిన విశ్వనాథకు ఎందరో ప్రత్యక్ష శిష్యులే కాకుండా, మరెందరో పరోక్ష శిష్యులూ ఉన్నారు.
విశ్వనాథను శ్రీశ్రీ ‘కవికుల గురువు’గా ప్రస్తుతించడమే కాదు, ‘తెలుగువాళ్ల గోల్డు నిబ్బు’గా అభివర్ణించారు. ఒకానొక సందర్భంలో ‘నా వంటి కవి మరో వెయ్యేళ్ల వరకు పుట్టడు’ అని విశ్వనాథ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా శ్రీశ్రీ ‘నిజమే! వారు పుట్టి వెయ్యేళ్లయింది’ అని వ్యాఖ్యానించడం ఒక వైచిత్రి. తొలినాళ్లలో శ్రీశ్రీపై విశ్వనాథ ప్రభావం ఉండేది. తర్వాతికాలంలో అబ్బూరి రామకృష్ణారావు శ్రీశ్రీపై ఎనలేని ప్రభావం చూపారు.
అబ్బూరి వద్ద శ్రీశ్రీ నేరుగా తరగతిలో పాఠాలు నేర్చుకోకపోయినా, వారిద్దరిదీ గురుశిష్య సంబంధమే! సాహితీ లోకంలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేసిన మరో గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నరాల రామారెడ్డి వంటి ఉద్దండులు ఆయన శిష్యులే! ఇక భద్రిరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర ఆచార్యులుగా సుప్రసిద్ధులు. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, తూమాటి దొణప్ప వంటి శిష్యులను ఆయన తీర్చిదిద్దారు.
ఎందరో గురువులు ఉన్నా, శిష్యుల మనసుల్లో చెరగని ముద్రవేసే వారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఉత్తమ గురువులుగా చరిత్రలో గుర్తుండిపోతారు. మన దేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా ఎందరో శిష్యులను తయారు చేశారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్లేటప్పుడు ఆయనను గుర్రపు బండిలో కూర్చోబెట్టి శిష్యులే స్వయంగా బండిని లాక్కుంటూ వెళ్లి మరీ మైసూరు రైల్వేస్టేషన్‌లో సాగనంపారు.
అదీ రాధాకృష్ణన్ ఘనత! రేపు రాధాకృష్ణన్ పుట్టినరోజు. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. గురువుల ఘనతకు శిష్యుల అభిమానమే గీటురాయి! జీతంరాళ్ల కంటే శిష్యుల అభిమాన ధనమే అసలైన సిరిసంపదలుగా తలచే గురువులు ఉంటారు. అలాంటి వాళ్లే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తారు.
అభిమాన సంపన్నులు
Published Mon, Sep 4 2023 12:21 AM | Last Updated on Mon, Sep 4 2023 4:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment