‘తరగతి గది ప్రపంచానికి అద్దం వంటిది. విద్యార్థి అభివృద్ధి అక్కడ నుంచే మొదలవుతుంది. నిజమైన ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని తన తరగతి గదిలోకి తీసుకురాగలడు’ అంటాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఉపాధ్యాయుని ‘గురు’తర బాధ్యతనూ, వృత్తి గౌరవాన్నీ వ్యక్తం చేసేందుకు ఈ ఒక్కమాట చాలు. అయితే చదువుకు కేంద్ర బిందువు అయిన ‘గురువు’ మాత్రం ‘లఘువు’గా మారాడన్న అపవాదు మోస్తున్నాడు.
గురు భావన వేద కాలం నుంచి ప్రస్తావనలో ఉంది. తమ గురించి తాము బాగా తెలిసిన గురువులు మంచి శిష్యుల కోసం చూసేవారట. శిష్యులు కూడా అటువంటి గురువునే ఆశ్రయించి శుశ్రూష చేస్తూ జ్ఞానార్జన చేసేవారట. ‘నిజమైన గురువు జ్ఞాన రంగంలో నిష్ణాతుడు కావాలి. వేదాలు అభ్యసించిన వాడ వ్వాలి. అసూయ లేనివాడు, యోగం తెలిసినవాడు, సరళమైన జీవితాన్ని గడిపేవాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అయివుండాలి’ అంటూ నాటి సమాజం గురు వుకు అత్యున్నత స్థానం కట్టబెట్టి గౌరవించింది. గురువు నైపుణ్యాల బోధకుడు. మానసిక విశ్లేషకుడు. విలువలు అలవర్చడం, అనుభవా లను వివరించడం అతని బాధ్యత.
అన్ని విషయాలపై అవగాహనకల్పించి శిష్యుడిని సర్వసమగ్రంగా తీర్చేదిద్దే శిక్షకుడు గురువు. అక్షర జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక అంశాల వరకు, యుద్ధ కళల నుంచి సంగీత, సాహిత్య, చిత్రకళల వరకు గురుకులాల్లో బోధన జరిగేది. ఊహ తెలిసిన తర్వాత గురు కులంలోకి ప్రవేశించిన విద్యార్థి యుక్తవయసు నాటికి అన్ని కళల్లో ఆరితేరి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరేవాడు. సూర్యు నిలా ప్రకాశించే గురువు అంతే ప్రకాశవంతంగా శిష్యుని తీర్చి దిద్దేవాడని వేదాలు చెప్పాయి.నేటి కాలానికి వస్తే – ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులు తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడం, లక్ష్యం మేరకు విధులు నిర్వహించడంలో పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి రావడం వాస్తవమే అయినా... ఉన్నంతలో తమ విధులు నిర్వ హించడంలో చాలామంది ఉపాధ్యాయులు విఫలమవుతూ చిన్న చూపుకు గురవుతున్నారు.
చదువుకోవడం ఒకప్పుడు గౌరవ ప్రదమైన కార్యక్రమం. ఇప్పుడు ప్రాథమిక హక్కు. ఉచిత నిర్బంధ విద్యతో మొదలైన ప్రభుత్వాల కృషి నేడు ‘హక్కు’ అమలుకు పటిష్టంగా కొనసాగుతోంది. కనీస సదుపాయాలు లేవనో, ఉపకరణాలు అందుబాటులో ఉండడం లేదనో, సరిపడే సిబ్బందిని నియ మించడం లేదనో చెప్పి ఉపాధ్యాయులు నిందను ప్రభుత్వం మీదకు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమ స్యలు లేవని చెప్పలేకున్నా గతకాలంతో పోల్చితే ఇప్పుడు విద్యపై ప్రభుత్వాల శ్రద్ధ పెరిగింది. నిధుల కేటాయింపు అధిక మయ్యింది. సదుపాయాలు, ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకుకృషి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. మొక్కుబడి ఫలితాలపై కాకుండా వాస్తవ అభివృద్ధి సాధించాలని కోరుతోంది.
ఆధునిక విద్య అందరికీ అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ పెట్టుబడి పెట్టడం వరకే ప్రభుత్వం చేయగలదు. క్షేత్ర స్థాయిలో అమలు బాధ్యత ఉపాధ్యా యులదే. ఉన్న వనరులను సద్విని యోగం చేసుకుంటూ విద్యార్థులను తీర్చి దిద్దినప్పుడు వారికి ఆత్మసంతృప్తితోపాటు ప్రజల నుంచి హర్షామో దాలు వ్యక్తమవుతాయి. ఇందుకు ఆధునిక బోధనా విధానాలు, మూల్యాంకనా విధానాలతో పాటు జాతి నిర్మాణానికి ఉపయుక్తమయ్యే తాజా కరికులంపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పర్చుకుని లక్ష్య సాధనకు ఉపాధ్యా యులు సిద్ధపడాలి. ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడు, పరిశోధకుడు అయినప్పుడు మాత్రమే మంచిఫలితాలు సాధ్యమవుతాయి. ఆధునిక అవసరాలు, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని తమను తాము అందుకు సన్నద్ధం చేసుకుంటూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు సిద్ధం కావాలి. క్షేత్ర స్థాయిలో ఇది కనిపించినప్పుడే ఉపాధ్యాయులకు గౌరవం.
– బి.వి. రమణమూర్తి, టీచర్, విశాఖపట్నం
(నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి; ఉపాధ్యాయ దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment