teachers day
-
జనవరి 3న మహిళా టీచర్ల దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం జనవరి 3న అధికారికంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్సవాలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను విద్యాశాఖ బడ్జెట్ నుంచి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా అణగారిన మహిళలకు అక్షర జ్ఞానం అందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆ మహనీయురాలి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మహిళలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
World Teachers Day : టీచర్ల హక్కుల సాధనకు గుర్తుగా..
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినమైన సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించడం, విద్యా రంగంలో వారి సేవలను అభినందించడం కోసం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.ఉపాధ్యాయులు వృత్తిపరమైన ఉద్యోగం మాత్రమే చేయరని, వారు చిన్నారులను చక్కని భావిపౌరులుగా తీర్చిదిద్దుతారని ఈరోజు గుర్తుచేస్తుంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 1994లో ప్రారంభమైంది. ఉపాధ్యాయ విద్య- వారి కార్యాలయంలో ప్రమాణాలపై రూపొందించిన సిఫార్సులను యునెస్కోతో పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) ఆమోదించినందుకు గుర్తుగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల హక్కులు, వారి పని పరిస్థితులు, వారి వృత్తిపరమైన బాధ్యతలను ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం గుర్తు చేస్తుంది.ప్రతి సంవత్సరం యునెస్కోతో పాటు విద్యా రంగానికి సంబంధించిన సంస్థలు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం కోసం ఒక ప్రత్యేక థీమ్‌ను ఎంచుకుంటాయి. 2024 థీమ్ ‘ఉపాధ్యాయుల గొంతుకకు విలువనివ్వడం: విద్య కోసం నూతన సామాజిక ఒప్పందం వైపు పయనం’. ఉపాధ్యాయుల సమస్యలు, వాటి పరిష్కారాలపై దృష్టి పెట్టేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక థీమ్‌ను ఎంచుకుంటారు. అలాగే ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, విద్యా నాణ్యత మెరుగుదల, నూతన విద్యా విధానాలపై చర్చిస్తారు. ఇది కూడా చదవండి: ఇంటి భోజనం.. భారం! -
మంచి గురువును ఎంచుకోవడం ఎలా?
-
మనల్ని నడిపించే మార్గదర్శి గురువు: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విద్య, వివేకం, జ్ఞానం, దీక్ష, దక్షత అన్నీ నేర్పేది గురువు. జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు. అనునిత్యం మనలో స్ఫూర్తి నింపే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఘన నివాళిమాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పెనమలూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి పాల్గొన్నారు.విద్య, వివేకం, జ్ఞానం, దీక్ష, దక్షత అన్నీ నేర్పేది గురువు. జీవిత లక్ష్యాన్ని సాధించే దిశగా నడిపించే మార్గదర్శి గురువు. అనునిత్యం మనలో స్ఫూర్తి నింపే గురువులందరికీ ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు.#TeacherDay pic.twitter.com/M7LwkkTawA— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2024 -
వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్
విశాల విశ్వంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. ఇదే తరహాలో ఒక వ్యక్తి జీవితంలో కూడా తప్పకుండా మార్పులు జరుగుతాయి, పరిస్థితులు తారుమారవుతాయి. పేదవాడు కుబేరుడిగా మారవచ్చు, కుబేరుడు దీన స్థితికి రావచ్చు. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో రెండు సార్లు ఫెయిల్ అయిన ఒక వ్యక్తి.. ఉపాధ్యాయుడుగా పనిచేశారు. చైనాలో అత్యంత ధనవంతుడిగా కూడా నిలిచారు. ఇంతకీ అయన ఎవరు? ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా ఉన్న 'జాక్ మా' (Jack Ma) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేత కూడా. 1964 సెప్టెంబర్ 15న జన్మించిన జాక్ మధ్య తరగతికి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తితో విదేశీ పర్యాటకులతో సంభాషించడానికి ప్రతిరోజూ ఉదయం సమీపంలో ఉన్న హోటల్‌కు సైకిల్ మీద వెళ్లేవాడు.ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో గైడ్‌గా కూడా పనిచేశాడు. తన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడాని ఇదొక అద్భుత అవకాశంగా భావించారు. అలా సుమారు తొమ్మిది సంవత్సరాలు గైడ్‌గా పనిచేసి ఎంతో నేర్చుకున్నాడు. గురువుల దగ్గర, పుస్తకాల్లోనూ నేర్చుకున్న వాటికంటే.. భిన్నమైన అంశాలను విదేశీ పర్యటకుల నుంచి గ్రహించగలిగాడు.విద్య & ఉద్యోగంఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో జాక్ 'హాంగ్జౌ డియాంజీ యూనివర్సిటీ' (Hangzhou Dianzi University) ప్రవేశ పరీక్ష రాసారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. అయినా పట్టు వదలకుండా మూడోసారి పరీక్ష రాసి విజయం సాధించారు. అదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు.చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పేవాడు. యూనివర్సిటీలో జీతం సరిపోకపోవడంతో ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనీ లక్ష్యంగా ముందడు వేసాడు. ఇందులో భాగంగానే అనేక ఉద్యోగాలకు అప్లై చేసుకున్నాడు. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్క ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేదు.ఏ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో 1994లో ఆంగ్ల అనువాదం, వివరణను అందించడానికి 'హైబో ట్రాన్స్లేషన్ ఏజెన్సీ' స్థాపించారు. ఆ తరువాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్కు వెళ్లే అవకాశాన్ని వచ్చింది. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. ఇక్కడే మొదటి సారి ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు.అంతర్జాలం (ఇంటర్నెట్) అతనికి ఒక పెద్ద మాయగా అనిపించింది. ఆ సమయంలోనే రూ.1.2 లక్షల పెట్టుబడితో 'చైనా పేజెస్' పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. అప్పటి వరకు జాక్ కీ బోర్డు తాకనేలేదు. జాక్ జీవితం ఆ తరువాత ఇంటర్నెట్తో ముడిపడిపోయింది. కీబోర్డ్ కూడా తాకని వ్యక్తి ఏకంగా 'చైనా టెలికామ్' సంస్థకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు.దీంతో ఆ కంపెనీ అప్పట్లోనే రూ. కోటి పెట్టుబడితో సంస్థ పెట్టి కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్.. జాక్‌కు చెప్పారు. అదే అదనుగా చూస్తున్న జాక్ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ భాగస్వామ్యం నచ్చకుండా బయటకు వచ్చేసిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలనుకున్నారు.ఇదీ చదవండి: నేను మీలా అవ్వాలంటే?: ఇన్ఫీ నారాయణ మూర్తి సమాధానంఆఫ్ అలీబాబా ఈ-కామర్స్ కంపెనీ1999లో 18 మంది వ్యక్తులతో కలిసి ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించారు. దానికి అందరికి బాగా పరిచయమున్న పేరును పెట్టాలనే ఉద్దేశ్యంతో 'అలీబాబా' (Alibaba) పేరుని ఖరారు చేసాడు. ఈ సంస్థ కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే గొప్ప వృద్ధిని సాధించింది.ఎంట్రన్స్ పరీక్షల్లోనే కస్టపడి సక్సెస్ సాధించిన జాక్ మా.. ఈ రోజు ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తగా టాప్ 100 ధనవంతుల జాబితాలో ఒక వ్యక్తిగా నిలిచాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇతడు ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తూ చైనాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. జాక్ తన స్నేహితురాలైన 'జాంగ్ యింగ్' (Zhang Ying)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనేదానికి జాక్ నిలువెత్తు నిదర్శనం, ఈయన జీవితం నేటీకి ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
ఆయనే రుషి..అక్షర కార్మికుడు..మార్గదర్శి..!
ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. శిష్యుల భవిష్యత్‌కు నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అంటూ గురువుకి స్థానం ఇచ్చాం. గురువు బ్రహ్మ.. గురువు విష్ణువు.. గురువు శివుడు అంటూ కీరిస్తాం.. దేశాన్ని ఏలే రాజైనా సరే ఒక గురువుకి శిష్యుడే.. ప్రపంచాన్ని శాసించే పరమాత్ముడైనా ఒక గురువుకి శిష్యుడిగా మారి విద్యను అభ్యసించాల్సిందే.. గురుభక్తి ఉన్న శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. గురువు ఆశీస్సులతో మనం ఏదైనా సాధించగలం. ఈ రోజు (సెప్టెంబర్ 5న) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే ఉత్తమ గురు-శిష్య జంటల గురించి తెలుసుకుందాం.మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో..!గురువులకే గురువు..యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు హోవెల్. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు సోవియట్ అధినేత స్టాలిన్. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయ్యింది.తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.గురువు గొప్పదనం..మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.మన సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్న ఆ గురుదేవులందర్నీ స్మరించుకుంటూ.. ఈ ఉత్తమ గురు-శిష్య ద్వయం నుంచి నేటి తరం అపారమైన జీవిత పాఠాన్ని నేర్చుకుని స్ఫూర్తి పొందొచ్చు.(చదవండి: గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?) -
టాలీవుడ్లో గురుశిష్యులు.. వీరిబంధం చాలా ప్రత్యేకం!
శిష్యుల ప్రతిభను, అర్హతలను కచ్చితంగా అంచనావేసి, ఎప్పుడు, ఎవరికి, వేటిని ప్రసాదించాలో తెలిసినవారే నిజమైన గురువులు. అలా జీవిత పాఠాలతో పాటు తమ శిష్యులకు సినిమా పాఠాలు కూడా నేర్పించి సక్సెస్ఫుల్ హీరోలు,డైరెక్టర్లు, సంగీత దర్శకులను అందించిన గురువులు ఎందరో ఉన్నారు.. నేడు గురువుల దినోత్సవం సందర్భంగా అలా సక్సెస్ సాధించిన కొందరిని గుర్తు చేసుకుందాం.సుకుమార్ మార్క్తన దర్శకత్వంతో పాటు రైటింగ్స్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేశారు దర్శకుడు సుకుమార్. 'ఆర్య' చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ లెక్కల మాస్టర్.. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. సుకుమార్ లాగే ఆయన శిష్యులు కూడా తమ సినిమాలతో మెప్పిస్తున్నారు. తొలి సినిమాలతోనే సూపర్ హిట్స్‌ను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు.తన వద్ద పని చేసిన ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటూ తన శిష్యగణాన్ని టాలీవుడ్లో పాపులరయ్యేలా చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. సుక్కు స్కూల్ నుంచి వచ్చినవారందరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు.► 'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన బుచ్చిబాబు సన.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్ ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్లో డైరెక్టర్‌గా లాంఛ్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్‌తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారు.► టాలీవుడ్లో మరో సెన్సేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు.► 'కరెంట్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F'తో మంచి సక్సెస్ అందుకున్నాడు.► జక్కా హరి ప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు► యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే.► డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా 'ఆర్య' సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. ► 'భమ్ భోలేనాథ్' ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడే. సుకుమార్ బ్యానర్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.► ఇండస్ట్రీలో స్టార్ రైటర్‌గా రాణిస్తున్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 పేజీస్ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుకుమార్‌కు సపోర్ట్‌గా శ్రీకాంత్ నిలిచారు. డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఆయన రైటర్‌గా పనిచేశారు.చిరంజీవి- విశ్వనాథ్‌ల బంధంతెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్‌కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్లో మైలురాయిగా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్‌గా నిలుస్తాయనడంలో సందేహం ఉండదు.ఆర్జీవీకి ఆయనే ప్రత్యేకం..ఒకప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఎందరో డైరెక్టర్లు బయటకు వచ్చి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను తెచ్చుకున్నారు. వర్మ శిష్యుల్లో ఆయన తర్వాత అంత పేరు తెచ్చుకున్న వాళ్లలో కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, గుణశేఖర్, శివనాగేశ్వరరావు, నివాస్, అజయ్ భూపతి, జీవన్ రెడ్డి, హరీశ్ శంకర్, జేడీ చక్రవర్తి, బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ అగ్రదర్శకుడు మధుర్ బండార్కర్ ఉన్నారు. వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్జీవీకి చాలా మంది శిష్యులున్నప్పటికీ.. వారిలో ప్రియశిష్యుడు మాత్రం పూరి జగన్నాధ్ మాత్రమే.సంగీతంలో మణిశర్మ..సంగీతంలో స్వరబ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఒక దశాబ్దం పాటు ఆయన తెలుగు సినిమాను ఏలారు. టాప్ హీరో మూవీ అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. ఆయనకు చాలా మంది శిష్యులే ఉన్నారు వారిలో దేవిశ్రీ, హారీష్ జైరాజ్, థమన్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వారు కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి కూడా ఎందరో శిష్యులు ఉన్నారు. వారిలో ఏఆర్ రెహమాన్, మణిశర్మ ముందు వరుసలో ఉంటారు. దేవీశ్రీ ప్రసాద్, తమన్, హారీశ్జైరాజ్ కూడా ఆయన వద్ద శిక్షణ పొందారు.దాసరి నారాయణరావు- మోహన్ బాబుటాలీవుడ్లో దాసరినారాయణరావు- మోహన్ బాబుల అనుబంధం మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలసి కొన్ని సినిమాలలో నటించారు. మోహన్ బాబు ఎప్పుడూ తన గురువును గుర్తు చేసుకుంటారు. వీరిద్దరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో గురు, శిష్యులుగా పేరుపొందారు.రాఘవేంద్రరావు- రాజమౌళితెలుగు సినిమాలో ప్రతి విషయాన్ని వీరిద్దరూ చేసుకుంటుంటారు. రాజమౌళి గొప్ప డైరెక్టర్ అయినా కూడా.. తన స్క్రిప్టును మొదట రాఘవేంద్రరావుకు వినిపించాల్సిందేనట. టాలీవుడ్ మరో క్రేజీ గురుశిష్యుల బంధం రాఘవేంద్రరావు- రాజమౌళిదే.త్రివిక్రమ్- పోసాని కృష్ణమురళిగురు, శిష్యుల బంధానికొస్తే తెలుగులో త్రివిక్రమ్- పోసానిది విడదీయరానిబంధం. అందుకే తన గురువైన పోసానికి త్రివిక్రమ్ సినిమాల్లో ప్రత్యేకమైన రోల్స్ ఇస్తున్నారు. అంతకుముందు పోసాని దగ్గర చాలా ఏళ్ల పాటు త్రివిక్రమ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అందుకే త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత ప్రతీ సినిమాలోనూ తన గురువైన పోసానికి పాత్ర ఇస్తాడు. -
47 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: విద్యా బోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించనుంది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు కలిపి మొత్తం 113 మందికి ప్రభుత్వం పురస్కారాలు ఇవ్వనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 12 మంది హెచ్ఎంలు, 23 మంది స్కూల్ అసిస్టెంట్లు, 12 మంది ఎస్జీటీలు, ఉన్నత విద్యలో పనిచేస్తున్న 55 మందిఅధ్యాపకులు, ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 11 మంది లెక్చరర్లు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. పురస్కారాలకు ఎంపికైన వారు వీరే..ప్రధానోపాధ్యాయులు: టి భాస్కర్ (పాఠశాల/జిల్లా: తెల్లాపూర్, సంగారెడ్డి), మెస నరేందర్ (ఆలూరు, నిజామాబాద్), ఏవీ సత్యవతి–రిటైర్డ్ (నయాబజార్, హైదరాబాద్), ఎస్.కె. తాజ్‌బాబు (రాయదుర్గ్, రంగారెడ్డి), టి సునీత (కోటకొండ, నారాయణ్‌పేట్), బి. బాపూరెడ్డి (కుషాయిగూడ, మల్కాజ్గిరి), పి.శంకర్‌గౌడ్ (యాప్రాల, వనపర్తి), పి. పద్మజ (కసనగోడ, నల్లగొండ), కె.నర్సయ్య (అంకోలి, ఆదిలాబాద్), కె.ఇందుమతి(హసన్‌పర్తి, హనుమకొండ), డాక్టర్ ప్రభు దయాల్ (రామాపురం, కొత్తగూడెం), జి. రాజన్న (హనుమకొండ).స్కూల్ అసిస్టెంట్లు: కె. నర్సింహులు (ఇబ్రహీంనగర్, మహబూబ్‌నగర్), కొంక అనురాధ (కొత్తూరు, వరంగల్), కూన రమేశ్ (చిచోలి–బి, నిర్మల్), ముద్దుకృష్ణ (దుబ్బ, నిజామాబాద్), జె. రాజశేఖర్‌రావు (చిన్నముద్దునూర్, నాగర్‌కర్నూల్), ఎస్.సురేందర్ (అన్నారం, మంచిర్యాల), సీహెచ్ షర్మిల (అలుబాక, ములుగు), ఎం.రమేశ్ (బ్రాహ్మణపల్లి, పెద్దపల్లి), జి.రాజయ్య (మొగుళ్ళపల్లి, భూపాలపల్లి), జి.అంజన్‌కుమార్ (ఎనీ్టపీసీ జ్యోతినగర్, పెద్దపల్లి), కృష్ణకాంత్ నాయక్ (మిర్యాలగూడ, నల్లగొండ), సీహెచ్ గిరిప్రసాద్ (తిమ్మాపురం, సూర్యాపేట), ఎన్.అమరేందర్ రెడ్డి (కొంపల్లి, భూపాలపల్లి), పి.శంకర్‌గౌడ్ (శివనగర్, సిరిసిల్ల), జి.వెంకటేశ్వర్లు (పెద్దగోపతి, ఖమ్మం), కె.సత్యం(కందానెల్లి, వికారాబాద్), టి.స్వర్ణలత (పాల్వంచ, కామారెడ్డి), వి.రామకృష్ణ(చిన్నమల్లారెడ్డి, కామారెడ్డి), పి.రూపారాణి (సిరిసినగండ్ల, సిద్దిపేట), ఆర్.కృష్ణప్రసాద్ (నాగ్‌పూర్, మెదక్), హెచ్.విజయకుమార్ (ముడిమనిక్, సంగారెడ్డి), కె.కృష్ణయ్య(కుత్బుల్లాపూర్, రంగారెడ్డి). ఎస్జీటీలు: జె. శ్రీనివాస్ (అక్కపల్లిగూడ, మంచిర్యాల), వై.వెంకటసురేశ్ కుమార్ (రామంచ, సిద్దిపేట), పి.రఘురామరావు (జీడీపల్లి, నాగర్‌కర్నూల్), దాసరి శంకర్ (పీచర్ల, నిర్మల్), పల్సి శ్రీనివాస్ (భైంసా, నిర్మల్), కె సుధాకర్ (తిడుగు, జనగాం), డి.కవిత(పెద్ద రాజమూర్, మహబూబ్‌నగర్), ఎం. క్రాంతికుమార్ (సింగన్నగూడ, సిద్దిపేట), కె. నాగేశ్వరి (పటేల్‌గూడ, సంగారెడ్డి), దల్లి ఉమాదేవి (ఆర్ఎన్ గుట్ట, భద్రాద్రి కొత్తగూడెం), జి. శ్రీనివాస్ (కీసరగుట్ట, మల్కాజ్గిరి), ఎంఎ అలీమ్ (గద్వాల్, నిజామాబాద్) -
డయానా, గ్రాహం బెల్, సిల్వెస్టర్ స్టాలోన్, వీళ్లంతా ఒకపుడు..!
మన జీవితాల్లో తొలి గురువు అమ్మ. మలిగురువు మన స్కూలు ఉపాధ్యాయుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాఠశాల ఉపాధ్యాయులుగా వారి ప్రేరణ, స్ఫూర్తి జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తుల్లో ప్రముఖంగా నిలుస్తారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులదే. వారి అంకితభావం, విజ్ఞానంతో మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అంతేకాదు చిన్నపుడు దాదాపు అందరూ ఆడే తొలి ఆట టీచర్ ఆట. అంతగా మన జీవితాల్లో గురువు పాత్ర లీనమై ఉంటుంది. కానీ టీచర్లుగా పిల్లల్ని అదుపు చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడం అంత ఆషామాషీకాదు. కత్తి మీద సామే. అయినా అంతులేని నిబద్ధతతో, క్రమశిక్షణతో మెలిగి, తన విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే గురువులెందరో...మన దేశంలో సెప్టెంబరు 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తాం. భారతరత్న స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువుగా ఆయన చేసిన అపారమైన కృషిని, విజయాలను గుర్తించి, ఆయన జయంతిని (1888, సెప్టెంబరు 5) పురస్కరించుకుని, ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా తొలి నాళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసిన కొంతమంది అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.జాన్ ఆడమ్స్: అమెరికా రెండో ప్రెసిడెంట్ కావడానికి ముందు, జాన్ ఆడమ్స్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వోర్సెస్టర్లో ఉపాధ్యాయుడు. కానీ ఆయన ఈ ఉద్యోగం విసుగ్గా ఉండేదిట. అందుకే ఒక్క ఏడాదికే 1756లో న్యాయవాదిగా కొనసాగించడానికి ఈ పదవిని విడిచిపెట్టారట.లిండన్ బి. జాన్సన్: అమెరికా మాజీ అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ 1928లో మెక్సికో ,యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉన్న టెక్సాస్‌లోని కోటుల్లాలోని వెల్హౌసెన్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. భాషా సమస్య ఉన్నప్పటికీ (అతని విద్యార్థులు స్పానిష్ మాత్రమే మాట్లాడేవారు ,లిండన్కు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవారు), జాన్సన్ తన విద్యార్థుల ఆంగ్ల భాషను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశాడు. అలా 1965లో ఎలిమెంటరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ యాక్ట్‌ను ఆమోదించడానికి దారి తీసింది.జిమ్మీ కార్టర్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లోని మరనాథ బాప్టిస్ట్ చర్చిలో సండే స్కూల్లో బోధించేవాడు. ఈ సందర్బంగా ఆయన బోధనలు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ ఉపన్యాసాలు వినడానికి ప్రజలు కూడా వేల మైళ్లు ప్రయాణించి వచ్చేవారట.హిల్లరీ క్లింటన్: హిల్లరీ క్లింటన్ కూడా కొంతకాలం ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. 1960వ దశకంలో, క్లింటన్ 1974లో అర్కాన్సాస్‌కు వెళ్లడానికి ముందు వెల్లెస్లీ కాలేజీలో చదువు కున్నారు. అపుడు అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర బోధకులుగా ఉద్యోగం చేశారు. అలాగే హిల్లరీ, బిల్ క్లింటన్ ఇద్దరూ రాజకీయ నాయకులు కాకముందు ఒకే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులుగా పనిచేయడం విశేషం. హిల్లరీ తన ఉద్యోగాన్ని ఇష్టపడేవారట. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోమని విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. 2023లో, క్లింటన్ కొలంబియా యూనివర్సిటీ ఫ్యాకల్టీలో ప్రొఫెసర్‌గా , గ్లోబల్ అఫైర్స్‌లో ప్రెసిడెన్షియల్ ఫెలోగా చేరారు.బరాక్ ఒబామా: అమెరికా మాజీ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చికాగో యూనివర్సిటీ లా స్కూల్లో బోధించేవాడు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో బీఏ, 1991లో హార్వర్డ్ లా స్కూల్ నుండి పీజీ పట్టా పుచ్చుకున్న తరువాత బోధన ప్రారంభించి, సీనియర్ లెక్చరర్ అయ్యారు దాదాపు పదేళ్లకుపైగా ఒబామా రాజ్యాంగ చట్టం మరియు జాతి సిద్ధాంతాన్ని బోధించారు.ప్రిన్సెస్ డయానా: వేల్స్ యువరాణి కాకముందు డయానా లండన్ నర్సరీ పాఠశాలలో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.అలెగ్జాండర్ గ్రాహం బెల్: టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ కూడా టీచర్‌గా పనిచేశారు. బోస్టన్ , కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లో చెవిటివారి కోస ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలోనే టెలిఫోన్‌ను రూపొందించడానికి ప్రేరణ లభించిందట. 1876లో అధికారికంగా టెలిఫోన్‌ను కని పెట్టారు. ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేశాడు. 1960లలో అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లో చదువు తున్నప్పుడు, అదనపు ఆదాయంకోసం జిమ్ టీచర్‌గా పనిచేశాడట. -
కాలు జారిన సీఎం
-
విద్యపై ఖర్చు రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడి
సాక్షి, విశాఖపట్నం: విద్యపై చేస్తున్న ఖర్చు మన రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడి అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ కుటుంబ సభ్యులేననీ, ప్రతి ఉద్యోగి ప్రభుత్వంలో అంతర్భాగమేనని వారిపై పనిఒత్తిడి తగ్గించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడూ ఆలోచిస్తుంటారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి మంత్రులు బొత్స, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యాలయాల్లో ఉత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే.. విశ్వవిద్యాలయాల్లో 3,200 పోస్టుల భర్తీ రాష్ట్రంలో టీచర్లకు జీతాలు ఇంకా వేయలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వమైనా ఉంటుందా? కేవలం సాంకేతిక కారణాలతోనే జీతాలు ఆలస్యమయ్యాయి. 7 లేదా 8 తేదీల్లో జీతాలు జమచేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ‘నో అడ్మిషన్’ బోర్డులు పెడుతున్నాం. అదేవిధంగా.. ఇటీవల టెన్త్ ఫలితాల్లో ఎక్కువ స్టేట్ ర్యాంకులు గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే విద్యార్థులే దక్కించుకున్నారు. వీటన్నింటికీ కారణం ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇక విద్య మీద ఖర్చుచేసే ప్రతి రూపాయి రాష్ట్రం మీద పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది. గత 15 ఏళ్లుగా యూనివర్సిటీల్లో నియామకాల్లేవు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం 3,200 పోస్టులు భర్తీని డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేస్తాం. ఉపాధ్యాయులందరికీ న్యాయం జరుగుతుంది.. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు విశాఖకు విడదీయలేని అనుబంధం ఉంది. సీఎం జగన్ న్యాయం చేయలేకపోతే ఉపాధ్యాయులకు మరెవ్వరూ మేలు చేయలేరు. ఒక రోజు అటు ఇటుగా అందరికీ న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ‘విద్యావ్యవస్థలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చి పాఠశాలలను మెరుగుపరచేందుకు అనేక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది’ అన్నారు. ‘ప్రపంచ జ్ఞానం నేర్పే గురువులకు కృతజ్ఞతాభివందనాలు’ ‘బిడ్డ గొప్పగా ఎదిగితే.. ఆ బిడ్డ తల్లిదండ్రుల ఆనందం.. ఆకాశాన్నంటుతుంది. వందలు.. వేల పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే ప్రతి టీచర్‌కు లభించే సంతోషం, సంతృప్తి ఇంకెంత గొప్పదో మాటల్లో చెప్పలేం. శిక్షణ, క్రమశిక్షణ.. పాఠాలు, జీవిత పాఠాలు.. అక్షరజ్ఞానం, ఆలోచనలు.. ప్రపంచ జ్ఞానం అన్నీ నేర్పే గురుబ్రహ్మలకు, మేథోశక్తులకు ఆదర్శప్రాయులైన మంచి టీచర్లకు, రాష్ట్రం తరఫున కృతజ్ఞతాభివందనాలు. (విదేశీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ సందేశాన్ని సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు చదివి వినిపించారు.) రాష్ట్రపతి, ప్రధాని సందేశాలు ఇక గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతిముర్ము సందేశాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి... ప్రధాని మోదీ సందేశాన్ని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ చదివి వినిపించారు. అనంతరంరాష్ట్రవ్యాప్తంగా 11 కేటగిరీల్లో 196 మందికి ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు అవార్డులందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ డా.భీశెట్టి వెంకట సత్యవతి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, విశాఖ మేయర్ జీహెచ్‌వీ కుమారి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నాగరాణి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రాష్ట్రం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులకు రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులకు మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2023కుగాను ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించారు. ప్రాథమిక విద్యాశాఖ విభాగం కేటగిరీలో తెలంగాణ నుంచి మంచిర్యాల జిల్లాకు చెందిన అర్చన నూగురి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ భేడోద్కర్‌లు అవార్డులు అందుకోగా కేంద్ర స్కిల్ డెవలప్మెంట్–ఆంట్రప్రెన్యూర్షిప్ శాఖ అందించే ఉత్తమ ఉపాధ్యాయ కేటగిరీలో హైదరాబాద్ ఎన్‌ఐఎంఎస్‌ఎంఈ ఫ్యాకల్టీ డాక్టర్ దిబ్యేందు చౌదరి కూడా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. అలాగే ఏపీ నుంచి ప్రాథమిక విద్యాశాఖ విభాగం కేటగిరీలో నెల్లూరుకు చెందిన మేకల భాస్కర్‌రావు, విశాఖపట్నం శివాజీ పాలెంకు చెందిన మురహరరావు ఉమా గాంధీ, రాయచోటికి చెందిన సెట్టెం ఆంజనేయులు అవార్డులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం పాల్గొన్నారు. -
సానపెడితే పిల్లలు జాతిరత్నాలే!
సాక్షి, హైదరాబాద్: సరైన రీతిలో సానబడితే ప్రతీ విద్యార్థి జాతిరత్నమేనని.. అది కేవలం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గురుపూజా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబిత మాట్లాడారు. లక్షల మంది విద్యార్థులు, లక్షకుపైగా టీచర్లున్న విద్యా శాఖ ఓ పెద్ద కుటుంబమని.. గురుపూజోత్సవం తమకు ఓ పెద్ద పండుగ అని పేర్కొన్నారు. ఎవరు, ఎంత ఎత్తుకు ఎదిగినా వారికి చదువు నేర్పిన మాస్టార్లు గుండెల్లో శాశ్వతంగా ముద్ర పడిపోతార న్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతి టీచర్ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాం: కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మనఊరు మనబడి ఓ విప్లవాత్మక పథకమని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. కాగా సాంకేతికపరంగా విద్యా రంగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే దిశగా అధ్యాపకులు అడు గులు వేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 128 మంది టీచర్లను సత్కరించారు.ఎమ్మెల్సీలు కూర రఘో త్తమరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, సురభివాణి, వర్సిటీల వీసీలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సుద్ధాల అశోక్ తేజ రాసిన ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ సాంగ్ విన్నారా?
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా.. మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘నీతోనే నేను’. అంజిరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా ఈ మూవీ నుంచి ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గొప్ప సమాజం రూప కల్పనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. అందుకనే వారిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తుంటారు. అలాంటి టీచర్స్‌కు అంకితమిచ్చేలా ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాటను రూపొందించారు.ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ ఈ పాటకు లిరిక్స్ అందించగా, ప్రముఖ సింగర్ మనో అద్బుతంగా ఆలపించారు. చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మంచి సమాజం కావాలంటే మనకు గొప్ప ఉపాధ్యాయులు కావాలి. టీచర్స్ వల్లే అది సాధ్యమవుతుంది. అలాంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా మా సినిమాలో ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాట ఉంది. మంచి టీమ్ సపోర్ట్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే ఈ సినిమా’అని అన్నారు. ‘టీచర్స్ డే సందర్బంగా మా సినిమా నుంచి ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాటను విడుదల చేయటం ఆనందంగా ఉంది’అని డైరెక్టర్ అంజిరామ్ అన్నారు. -
విశాఖలో ఘనంగా గురుపూజోత్సవం, పాల్గొన్న మంత్రులు
-
ఈ ఐదుగురు.. స్కూలు టీచర్లు కాదు.. కానీ ఉత్తమ ఉపాధ్యాయులు!
నిరుపేదలకు ఆర్ధిక సహాయం చేయడం, వారికి ఆహారం ఇవ్వడం లాంటివి చాలామంది చేస్తుంటారు. కానీ వీటన్నింకంటే గొప్ప దానం విద్యాదానం. చదువుకునేందుకు తాపత్రయ పడేవారికే విద్యకున్న నిజమైన ప్రాముఖ్యత బాగా తెలుస్తుంది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ జ్ఞానాన్ని తమ వద్దే ఉంచుకోవడమే కాకుండా ఇతరులకు పంచే బాధ్యతను కూడా తీసుకున్న కొంతమంది ఉపాధ్యాయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖేష్ పిథోరా: విద్య విలువ తెలుసుకుని.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన ముఖేష్ పిథోరా పేద, నిస్సహాయస్థితిలో ఉన్న పిల్లల కోసం తన సమయాన్ని, జీవితాన్ని అంకితం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు ముఖేష్. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ముఖేష్ అనేక సమస్యలను ఎదుర్కొంటూనే విద్యను అభ్యసించారు. పలువురు పేద పిల్లలు విద్యను అభ్యసించడానికి తగిన వనరులు లేని కారణంగా విద్యారంగంలో ముందుకు సాగలేకపోతున్న విషయాన్ని ఆయన గమనించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉచిత విద్యను అందించాలని ముఖేష్ నిర్ణయించుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తన వద్దకు వచ్చే పేద, నిస్సహాయ పిల్లలకు విద్యా తరగతులు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం వారినుంచి ఎటువంటి రుసుము వసూలు చేయరు. అరుప్ ముఖర్జీ: సొంత సొమ్ముతో పాఠశాల ట్రాఫిక్ కానిస్టేబుల్ అరూప్ ముఖర్జీ 1999లో కోల్‌కతా పోలీస్ ఫోర్స్‌లో చేరారు. తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు పొదుపు చేయడం మొదలుపెట్టారు. తన 6 సంవత్సరాల వయస్సులోనే పాఠశాల ప్రారంభించాలని కలలు కన్నారు. 43 ఏళ్ల అరూప్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన డ్యూటీ చేయడమే కాకుండా, పేద గిరిజన పిల్లలకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. ముఖర్జీ ఏర్పాటు చేసిన పుంచ నబాదిశ మోడల్ స్కూల్ 126 మంది సబర్ పిల్లలకు వసతి, ఆహారం, ప్రాథమిక విద్యను ఉచితంగా అందిస్తుంది. ముఖర్జీ ఈ పాఠశాలను 2011లో నిర్మించారు. కోల్‌కతాకు 280 కి.మీ దూరంలో ఉన్న పుంచ గ్రామంలోని ఈ పాఠశాలకు రూ.2.5 లక్షల ప్రాథమిక నిధి తన సొంత పొదుపు నుంచి ముఖర్జీ వెచ్చించారు. దాతలు విరాళంగా ఇచ్చిన స్థలంలో ఈ పాఠశాలను నిర్మించారు. అరూప్ తన జీతంలో ప్రతీనెల రూ.20 వేలు స్కూల్ కోసం వెచ్చిస్తున్నారు. వ్యవసాయంతో వచ్చే ఆదాయంతో అతని కుటుంబం బతుకుతోంది. డాక్టర్ భరత్ శరణ్: వైద్యులను తీర్చిదిద్దుతూ.. రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ భరత్ శరణ్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లో 11వ తరగతికి చెందిన వెనుకబడిన 25 మంది విద్యార్థులకు, 12వ తరగతి చదువుతున్న 25 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. డాక్టర్ శరణ్ మీడియాతో మాట్లాడుతూ తాను గత 7 సంవత్సరాలుగా ఈ కోచింగ్‌సెంటర్ నడుపుతున్నానని తెలిపారు. అతని ఇన్స్టిట్యూట్లో చదివిన 30 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు. ఐదుగురు ఎయిమ్స్‌లో పనిచేస్తున్నారు. కొందరు వెటర్నరీ మెడిసిన్‌లో ఉన్నారు. మరికొందరు ఆయుర్వేద రంగంలో కొనసాగుతున్నారు. కానిస్టేబుల్ వికాస్ కుమార్: గ్రామంలోని పేద పిల్లలకు.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ వికాస్ కుమార్ దేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తన డ్యూటీకి సమయం కేటాయిస్తూనే, పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. 2014 నుంచి తన గ్రామంలోని పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. తనకు 18 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఆయన ఈ మహోత్కార్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల పేదరికం కారణంగా పిల్లలు చదువుకోలేకపోతున్నారని, ఇలాంటి పిల్లలకు చదుపు చెప్పించే బాధ్యతను తీసుకున్నానని వికాస్ కుమార్ తెలిపారు. కానిస్టేబుల్ మహ్మద్ జాఫర్: తన కలను స్టూడెంట్స్ నెరవేరుస్తారని.. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన కానిస్టేబుల్ మహ్మద్ జాఫర్ తన డ్యూటీ ముగియగానే రోజూ పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతుంటారు. జాఫర్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న చెట్టుకింద పాఠశాల నడుపుతున్నారు. ఈ పోలీస్ స్కూల్‌కు ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలు ట్యూషన్ కోసం వస్తుంటారు. నవోదయ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న పిల్లలు కూడా ఈ స్కూల్లో కోచింగ్ తీసుకుంటారు. జాఫర్ సైన్స్ గ్రాడ్యుయేట్, సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది అతని కల. కానీ అతని కల నెరవేరలేదు. తాను చదువు నేర్పుతున్న పిల్లల్లో ఎవరో ఒకరు తన కలను నెరవేర్చుకుంటారని జాఫర్ చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ‘డూమ్స్‌డే క్లాక్’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా? -
గురువు ‘లఘువు’ కాకూడదు!
‘తరగతి గది ప్రపంచానికి అద్దం వంటిది. విద్యార్థి అభివృద్ధి అక్కడ నుంచే మొదలవుతుంది. నిజమైన ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని తన తరగతి గదిలోకి తీసుకురాగలడు’ అంటాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఉపాధ్యాయుని ‘గురు’తర బాధ్యతనూ, వృత్తి గౌరవాన్నీ వ్యక్తం చేసేందుకు ఈ ఒక్కమాట చాలు. అయితే చదువుకు కేంద్ర బిందువు అయిన ‘గురువు’ మాత్రం ‘లఘువు’గా మారాడన్న అపవాదు మోస్తున్నాడు. గురు భావన వేద కాలం నుంచి ప్రస్తావనలో ఉంది. తమ గురించి తాము బాగా తెలిసిన గురువులు మంచి శిష్యుల కోసం చూసేవారట. శిష్యులు కూడా అటువంటి గురువునే ఆశ్రయించి శుశ్రూష చేస్తూ జ్ఞానార్జన చేసేవారట. ‘నిజమైన గురువు జ్ఞాన రంగంలో నిష్ణాతుడు కావాలి. వేదాలు అభ్యసించిన వాడ వ్వాలి. అసూయ లేనివాడు, యోగం తెలిసినవాడు, సరళమైన జీవితాన్ని గడిపేవాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అయివుండాలి’ అంటూ నాటి సమాజం గురు వుకు అత్యున్నత స్థానం కట్టబెట్టి గౌరవించింది. గురువు నైపుణ్యాల బోధకుడు. మానసిక విశ్లేషకుడు. విలువలు అలవర్చడం, అనుభవా లను వివరించడం అతని బాధ్యత. అన్ని విషయాలపై అవగాహనకల్పించి శిష్యుడిని సర్వసమగ్రంగా తీర్చేదిద్దే శిక్షకుడు గురువు. అక్షర జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక అంశాల వరకు, యుద్ధ కళల నుంచి సంగీత, సాహిత్య, చిత్రకళల వరకు గురుకులాల్లో బోధన జరిగేది. ఊహ తెలిసిన తర్వాత గురు కులంలోకి ప్రవేశించిన విద్యార్థి యుక్తవయసు నాటికి అన్ని కళల్లో ఆరితేరి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరేవాడు. సూర్యు నిలా ప్రకాశించే గురువు అంతే ప్రకాశవంతంగా శిష్యుని తీర్చి దిద్దేవాడని వేదాలు చెప్పాయి.నేటి కాలానికి వస్తే – ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులు తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడం, లక్ష్యం మేరకు విధులు నిర్వహించడంలో పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి రావడం వాస్తవమే అయినా... ఉన్నంతలో తమ విధులు నిర్వ హించడంలో చాలామంది ఉపాధ్యాయులు విఫలమవుతూ చిన్న చూపుకు గురవుతున్నారు. చదువుకోవడం ఒకప్పుడు గౌరవ ప్రదమైన కార్యక్రమం. ఇప్పుడు ప్రాథమిక హక్కు. ఉచిత నిర్బంధ విద్యతో మొదలైన ప్రభుత్వాల కృషి నేడు ‘హక్కు’ అమలుకు పటిష్టంగా కొనసాగుతోంది. కనీస సదుపాయాలు లేవనో, ఉపకరణాలు అందుబాటులో ఉండడం లేదనో, సరిపడే సిబ్బందిని నియ మించడం లేదనో చెప్పి ఉపాధ్యాయులు నిందను ప్రభుత్వం మీదకు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమ స్యలు లేవని చెప్పలేకున్నా గతకాలంతో పోల్చితే ఇప్పుడు విద్యపై ప్రభుత్వాల శ్రద్ధ పెరిగింది. నిధుల కేటాయింపు అధిక మయ్యింది. సదుపాయాలు, ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకుకృషి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. మొక్కుబడి ఫలితాలపై కాకుండా వాస్తవ అభివృద్ధి సాధించాలని కోరుతోంది. ఆధునిక విద్య అందరికీ అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ పెట్టుబడి పెట్టడం వరకే ప్రభుత్వం చేయగలదు. క్షేత్ర స్థాయిలో అమలు బాధ్యత ఉపాధ్యా యులదే. ఉన్న వనరులను సద్విని యోగం చేసుకుంటూ విద్యార్థులను తీర్చి దిద్దినప్పుడు వారికి ఆత్మసంతృప్తితోపాటు ప్రజల నుంచి హర్షామో దాలు వ్యక్తమవుతాయి. ఇందుకు ఆధునిక బోధనా విధానాలు, మూల్యాంకనా విధానాలతో పాటు జాతి నిర్మాణానికి ఉపయుక్తమయ్యే తాజా కరికులంపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పర్చుకుని లక్ష్య సాధనకు ఉపాధ్యా యులు సిద్ధపడాలి. ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడు, పరిశోధకుడు అయినప్పుడు మాత్రమే మంచిఫలితాలు సాధ్యమవుతాయి. ఆధునిక అవసరాలు, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని తమను తాము అందుకు సన్నద్ధం చేసుకుంటూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు సిద్ధం కావాలి. క్షేత్ర స్థాయిలో ఇది కనిపించినప్పుడే ఉపాధ్యాయులకు గౌరవం. – బి.వి. రమణమూర్తి, టీచర్, విశాఖపట్నం (నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి; ఉపాధ్యాయ దినోత్సవం) -
పేదరికపు కష్టాల మధ్య.. విద్యార్థి నుంచి రాష్ట్రపతిగా.. సర్వేపల్లి ప్రస్థానం
పేదరికపు కష్టాల మధ్య,అవమానాల సుడిగుండాల నడుమ చదువుకోడానికి ఆయన ఎంత కష్టపడ్డారో ఆయనకే తెలుసు.ఉత్తమ విద్యార్థి దశ నుంచి ఉన్నత విద్యావంతుడుగా ఎదిగాడు,ఉన్నత విద్యావంతుడి స్థాయి నుంచి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడిగా నిలిచారు.ఆ అజేయప్రస్థానం అంతటితో ఆగలేదు.అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి చేర్చింది. మహోన్నతమైన 'భారతరత్న' పురస్కారాన్ని అందించింది. సర్వోత్తమమైన 'భారతరత్న' సత్కారాన్ని ప్రకటించిన తొలినాళ్ళల్లోనే (1954) సాధించేలా చేసింది.సర్వేపల్లి రాధాకృష్ణ మన తెలుగువాడు,మన భారతీయుడు.ఆయన జన్మదినం 'జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం'. దేశంలో ఎందరో ఉన్నత విద్యావంతులు,ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. వారెవ్వరికీ దక్కని విశిష్ట గౌరవాన్ని పొందిన భాగ్యశాలి. జ్ఞానమే తన ఐశ్వర్యం, ధైర్యమే తన దీపం, క్రమశిక్షణే తన మార్గం,పట్టుదలే తన సోపానం.రాధాకృష్ణ విజయగాథ సర్వ మానవాళికి సర్వజ్ఞాన ప్రబోధ.ప్రపంచంలోని అగ్రశ్రేణి తత్త్వశాస్త్ర ఆచార్యులలో ఆయన తొలివరుసలోని వారు. చదువు,అనుభవం రెండూ తన తోడునీడలు.జీవిత తత్త్వాన్ని, జీవన సారాన్ని,సారాంశాన్ని మధించుకుంటూ వెళ్లారు. పసిడికి తావి అబ్బినట్లు, తనను వరించి వచ్చిన ప్రతి పదవిలో,తనను తాను మరింతగా తీర్చిదిద్దుకున్నారు. జీవన సమరం బాగా ఎరిగినవాడు కనుక,తను గడించిన అనుభవాన్ని,పొందిన తాత్త్విక సారాన్ని దేశానికి అన్వయం చేసుకుంటూ అంకితమయ్యారు.అందుకే,ప్రతి క్లిష్ట సమయంలో దేశానికి అండగా నిలిచారు. క్లిష్ట సమయంలో దేశానికి అండగా.. చైనా,పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేయాల్సిన అత్యంత క్లిష్టమైన సమయాల్లో,ప్రధాన మంత్రులకు అత్యద్భుతంగా మార్గనిర్దేశం చేశారు.ప్రపంచ తత్వశాస్త్ర సిద్ధాంతాలన్నింటినీ ఆపోసన పట్టారు.భారతీయతను ఆణువణువునా నిలుపుకొన్నారు.బోధనలో,పరిపాలనలో ఆ అమృతకలశాలను పంచిపెట్టారు.ఎంత గొప్పగా మాట్లాడుతారో,అంత శ్రద్ధగా వింటారు. ఎంత బాగా రాస్తారో, అంత బాగా చదువుతారు.అందుకే ఆయనకు పాఠకుడి హృదయం,ప్రేక్షకుడి నాడి రెండూ తెలుసు. సర్వేపల్లివారి రచనలు,ఉపన్యాసాలు పరమ ఆకర్షణా శోభితాలు. యూనివర్సిటీలో క్లాస్‌లో 24నిముషాలసేపు మాత్రమే గంభీరంగా పాఠం చెప్పేవారు. అది ముగిసిన వెంటనే,సరదా కబుర్లు,ఛలోక్తులు విసిరి, విద్యార్థులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేవారు.24 నిముషాలకు మించి,ఏ విషయాన్నీమెదడు ఆసక్తిగా లోపలికి తీసుకోలేదని ఆయన సిద్ధాంతం. కేవలం 21 ఏళ్లకే... మానవ జీవ రసాయన చర్యలు,విద్యా మనస్తత్వశాస్త్రం (ఎడ్యుకేషనల్ సైకాలజీ) కూడా మధించినవాడు కాబట్టే,సర్వోన్నత ఉపాధ్యాయుడుగా ఖ్యాతి గడించారు.సర్వజన రంజిక ఉపన్యాసకుడిగా గొప్ప కీర్తినిఐశ్వర్యంగా పొందారు.ఆయన రాసిన'భారతీయ తత్త్వశాస్త్రం'ప్రపంచ పండితులకునిత్య పఠనీయ గ్రంథమైంది. ఈ సహజ ప్రతిభా భాస్వంతుడికి సాధన మరింత ప్రభను, ప్రభుత్వాన్ని చేకూర్చింది. కేవలం 21సంవత్సరాల వయస్సులోనే ఆచార్య పదవిని దక్కించుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్,అశుతోష్ ముఖర్జీ వంటి దిగ్దంతులు కలకత్తా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పమని స్వాగతించారు. మన ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ద్వితీయ వైస్ ఛాన్సలర్‌గా అలంకరించిన అద్వితీయుడు సర్వేపల్లి .హిరేన్ ముఖర్జీ,హుమయూన్ కబీర్ వంటి మేధాగ్రణులను ఆహ్వానించి, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పించారు. Rare Footage of our former President of India and World's renowned #philosopher Sarvepalli Radhakrishnan, when he visited Britain in 1963 ! A must watch ! Courtesy BFI & via Social Media #SarvepalliRadhakrishnan #TeachersDay pic.twitter.com/ZdB6GvZmjr — Sonmoni Borah IAS (@sonmonib5) September 6, 2020 ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే.. మేధావుల విలువ తెలిసిన మేధాగ్రణి.దేశ,విదేశాలలోని అన్ని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో ఆయన అసంఖ్యాకంగా ప్రసంగాలు చేసి అందరినీ అలరించారు. భారతీయ విద్యా విధానంలో ఉన్నతమైన సంస్కరణలు జరగాలని కలలుకన్న తొలితరం మేధావి.జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం నియమించిన ఆ కమిటీకి తొలి అధ్యక్షుడు కూడా ఆయనే. ఆయన చదువంతా స్కాలర్ షిప్స్ మీదే సాగింది. విద్యార్థి దశలో కటిక పేదరికాన్ని అనుభవించారు. భోజనం చేయడానికి అరిటాకు కూడా కొనలేక,నేలను శుభ్రం చేసుకొని,భోజనం చేసిన సందర్భాలు ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఉదంతం వింటే?హృదయం ద్రవించినా,జీవితాన్ని ఆయన పండించుకున్న తీరు ఆనందభాష్పాలు కురిపిస్తుంది,మెదడును కదిలిస్తుంది,గుండెను మరింత దృఢంగా మారుస్తుంది,కర్తవ్యం వైపు నడిపిస్తుంది.పేదవాడికికొండంత స్ఫూర్తిని అందిస్తుంది.డబ్బు విలువ,దేశం విలువ తెలిసినవాడు కనుక,రాష్ట్రపతి హోదాలో తనకు వచ్చే వేతనంలో కేవలం 25శాతం మాత్రమే తీసుకొని,మిగిలినది ప్రధానమంత్రి సహాయనిధికి తిరిగి ఇచ్చేవారు. "చదువది ఎంత కలిగిన..రసజ్ఞత ఇంచుక చాలకున్న..ఆ చదువు నిరర్ధకంబు...'' అన్నట్లు,జీవితాన్ని తెలుసుకోడానికి ఉపయోగపడని ఏ శాస్త్రమైనా నిరర్ధకమని ఆయన అభిప్రాయం.జీవితాన్ని అర్ధం చేసుకోడానికి తత్త్వం ఒక మార్గమన్నది ఆయన బోధన.వివేకం,తర్కం ఇమిడివున్న భారతీయ తాత్త్విక చింతనప్రపంచ తత్త్వశాస్త్రాలకే తలమానికమని చాటిచెప్పిన సర్వోన్నత ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణ. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఇవాళ(సెప్టెంబర్ 5న) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. ఉపాధ్యాయులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లండన్ పర్యటనలో ఉన్న ఆయన తన ట్విటర్(ఎక్స్) ద్వారా టీచర్స్ డే సందేశం ఉంచారు. ‘‘భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ.. ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా మన పేదింటి పిల్లలను సుశిక్షితులుగా తయారు చేయడంలో.. ధృడసంకల్పంతో కృషి చేస్తున్న టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు. ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా నివాళులు అని ట్వీట్ చేశారాయన. భవిష్యత్ తరాలను సమున్నతంగా తీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వర్తిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనది. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను అమలు చేస్తూ, ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా మన పేదింటి పిల్లలను సుశిక్షితులుగా తయారు చేయడంలో ధృడసంక… — YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2023 -
థ్యాంక్యూ టీచర్
‘మా టీచర్ ఇలా చెప్పలేదు’ ‘మా టీచర్ ఇలాగే చెప్పింది’ ‘మా టీచర్ కోప్పడుతుంది’ ‘మా టీచర్ మెచ్చుకుంటుంది’ పిల్లలకు ప్రతి సంవత్సరం ఒక ఫేవరెట్ టీచర్ దొరకాలి. ఇంట్లో తల్లి తర్వాత పిల్లలు తమ ఫేవరెట్ టీచర్ మీదే ఆధారపడతారు. వారి సాయంతో చదువు బరువును సులువుగా మోసేస్తారు. వారు ట్రాన్స్ఫర్ అయి వెళితే వెక్కివెక్కి ఏడుస్తారు. ‘టీచర్స్ డే’ సందర్భంగా పిల్లలు అభిమానించే టీచర్ల స్వభావాలూ... లక్షణాలు... అవి కలిగి ఉన్నందుకు వారికి ప్రకటించాల్సిన కృతజ్ఞతలు. పిల్లలు స్కూల్‌కు రాగానే తమ ఫేవరెట్ టీచర్ వచ్చిందా రాలేదా చూసుకుంటారు. ఒకవైపు ప్రేయర్ జరుగుతుంటే మరోవైపు ఒక కంటితో ఫేవరెట్ టీచర్‌ను వెతుక్కుంటారు. క్లాసులు జరుగుతుంటాయి. వింటుంటారు. కాని ఆ రోజు టైమ్‌టేబుల్‌లో ఫేవరెట్ టీచర్ క్లాస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. స్కూల్లో ఎందరో టీచర్లు. కాని ఒక్కో స్టూడెంట్‌కు ఒక్కో ఫేవరెట్ టీచర్. ఆ టీచర్ మాటను వేదవాక్కుగా భావించేవారు గతంలో ఉన్నారు.. రేపూ ఉంటారు. ‘పాప... నువ్వు డాక్టర్ కావాలి’ అనంటే డాక్టరైన వారున్నారు. ‘బాబూ.. నీకు సైన్స్ బాగా వస్తోంది సైంటిస్ట్ కావాలి’ అనంటే ఆ మాటలు మరువక సైంటిస్ట్ అయినవారున్నారు. ఫేవరెట్ టీచర్లు పిల్లలను గొప్పగా ఇన్‌స్పయిర్ చేస్తారు. బలం ఇస్తారు. ప్రేమను పంచుతారు. వారే లేకపోతే చదువులు భారంగా మారి ఎందరో విద్యార్థులు కుదేలయి ఉండేవారు. ► సబ్జెక్ట్ బాగా వచ్చినవారు ఫేవరెట్ టీచర్లు ఎవరు అవుతారు? సబ్జెక్ట్ ఎవరికి బాగా వస్తుందో వారు చాలామందికి ఫేవరెట్ టీచర్ అవుతారు. సబ్జెక్ట్ బాగా వచ్చినవారు అది ఎలా చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుందో తెలుసుకుని చెప్తారు. పిల్లలకు అర్థం కావాల్సింది పాఠం సులభంగా అర్థం కావడం. అర్థమైతే పాఠం పట్ల భయం పోతుంది. భయం పోతే ఆ సబ్జెక్ట్ మరింతగా చదవాలనిపిస్తుంది. అందుకు కారణమైన టీచర్‌ను అభిమానించబుద్ధవుతుంది. సబ్జెక్ట్‌ను అందరికీ అర్థమయ్యేలా చెప్తూ, క్లాసయ్యాక కూడా వచ్చి అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్తారనే నమ్మకం కలిగిస్తూ, చెప్తూ, పాఠం అర్థం కాని స్టూడెంట్ను చిన్నబుచ్చకుండా గట్టున ఎలా పడేయాలో ఆలోచించే టీచర్ ఎవరికైనా సరే ఫేవరెట్ టీచర్. ► మనలాంటి వారు పిల్లలు తమలాంటి టీచర్లను, తమను తెలుసుకున్న టీచర్లను ఇష్టపడతారు. క్లాస్‌లో రకరకాల పిల్లలు ఉంటారు. రకరకాల నేపథ్యాల పిల్లలు ఉంటారు. వారి మాతృభాషను, ప్రాంతాన్ని, నేపథ్యాన్ని గుర్తెరిగి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడే టీచర్లను పిల్లలు ఇష్టపడతారు. ‘మీది గుంటూరా? ఓ అక్కడ భలే ఎండలు. భలే కారం మిరపకాయలు దొరుకుతాయిరోయ్’ అని ఒక స్టూడెంట్‌తో ఒక టీచర్ అంటే ఆ స్టూడెంట్ కనెక్ట్ కాకుండా ఎలా ఉంటాడు. ‘రేపు మీరు ఫలానా పండగ జరుపుకుంటున్నారా? వెరీగుడ్. ఆ పండగ గురించి నాకు తెలిసింది చెప్తానుండు’ అని ఏ టీచరైనా అంటే పిల్లలు వారిని తమవారనుకుంటారు. భాషాపరంగా, సంస్కృతి పరంగా పిల్లలు కలిగి ఉన్నదంతా తమది కూడా అని భావించిన ప్రతి టీచర్ ప్రతి విద్యార్థికీ ఫేవరెట్ టీచరే. ► అందరూ సమానమే ఒక టీచర్‌ను పిల్లలు ఎప్పుడు అభిమానిస్తారంటే వారు అందరినీ సమానంగా చూస్తారనే భావన కలిగినప్పుడు. టీచర్లు ఫేవరిటిజమ్ చూపిస్తే ఆ పిల్లల్ని మాత్రమే వారు ఇష్టపడతారని, తమను ఇష్టపడరని మిగతా పిల్లలు అనుకుంటారు. మంచి టీచర్లు అందరు పిల్లల్నీ ఇష్టపడతారు. ‘టీచర్ నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంటుంది’ అని పిల్లలు అనుకునేలా టీచర్ ఉండాలి. కొంతమంది స్టూడెంట్లు మంచి మార్కులు తెచ్చుకుంటే వారిని ఎక్కువ పొగిడి కొంతమంది స్టూడెంట్లు ఎంత బాగా చదువుతున్నా మెచ్చుకోకుండా ఉండే టీచర్లు పిల్లలను భావోద్వేగాలకు గురిచేస్తారు. టీచర్ మెచ్చుకోలు, టీచర్‌తో సంభాషణ పిల్లల హక్కు. అది పిల్లలకు ఇవ్వగలిగిన టీచర్ ఫేవరెట్ టీచర్. ► క్రమశిక్షణ పిల్లలు తమ ఫేవరెట్ టీచర్లో క్రమశిక్షణ ఆశిస్తారు. టైమ్‌కు సిలబస్ పూర్తి చేయడం, టైమ్‌కి స్కూల్‌కు రావడం, క్లాసులు ఎగ్గొట్టకపోవడం, సరిగ్గా నోట్స్ చెప్పడం, సరిగ్గా పరీక్షలకు ప్రోత్సహించడం, ఎంత సరదాగా ఉన్నా క్లాస్ జరుగుతున్నప్పుడు సీరియస్‌గా ఉండటం... ఇవీ పిల్లలు ఆశిస్తారు. తాము గౌరవించదగ్గ లక్షణాలు లేని టీచర్లను పిల్లలు ఫేవరెట్ టీచర్లు అనుకోరు. టీచర్ వృత్తి ఎంతో గొప్ప వృత్తి. టీచర్లు కూడా మనుషులే. వారిలోనూ కోపతాపాలు ఉంటాయి. కాని ఎంతోమంది టీచర్లు పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేసి వారి జీవితాలను తీర్చిదిద్దుతారు. ‘మీరు పెద్దవాళ్లయి పెద్ద పొజిషన్‌కు వెళితే అంతే చాలు’ అంటూ ఉంటారు. మంచి టీచర్లు, గొప్ప టీచర్లు పిల్లల శ్రేయస్సును ఆకాంక్షించి తద్వారా వారి గుండెల్లో మిగిలిపోతారు. పిల్లల హృదయాల్లో ప్రేమ, గౌరవం పొందిన టీచర్లందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు. ► మంచి ఫ్రెండ్ కొందరు టీచర్లు క్లాస్‌లో ఫ్రెండ్‌లా ఉంటారు. 45 నిమిషాల క్లాస్‌లో 40 నిమిషాలు పాఠం చెప్పి ఒక ఐదు నిమిషాలు వేరే కబుర్లు, విశేషాలు మాట్లాడతారు. పిల్లల కష్టసుఖాలు వింటారు. వారి తగాదాలు తీరుస్తారు. ఎవరైనా చిన్నబుచ్చుకుని ఉంటే కారణం తెలుసుకుంటారు. ముఖ్యంగా దిగువ ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలు ఇలాంటి టీచర్లను చాలా తీవ్రంగా అభిమానిస్తారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నట్టుగా భావిస్తారు. అదే మంచి ఆర్థికస్థితి ఉన్న పిల్లలైతే తమకు ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తారు. పాఠాల అలజడుల నుంచి ధైర్యం చెప్పే టీచర్‌ను అభిమానిస్తారు. -
అభిమాన సంపన్నులు
విద్యావంతులైన వాళ్లు ఎవరైనా జీవితాంతం తమ గురువులను స్మరించుకుంటారు. మన దేశంలో గురుశిష్య పరంపర వేదకాలం నుంచి ఉంది. పాశ్చాత్య నాగరికతల్లో కూడా క్రీస్తుపూర్వం నుంచే గురుశిష్య పరంపర కొనసాగేది. విద్య నేర్పించే గురువులే లేకుంటే, ఈ ప్రపంచం ఇంకా అజ్ఞానాంధకార యుగంలోనే మిగిలి ఉండేదేమో! గురువులు లేని లోకాన్ని ఊహించుకోలేం. గురువులు ఊరకే పాఠాలను వల్లెవేయించడమే కాదు, భావితరాలను జ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దుతారు. పరోక్షంగా సమాజాన్ని మెరుగుపరుస్తారు. బడిలో చేరిన పిల్లల మీద తల్లిదండ్రుల కంటే గురువుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురువుల మీద అమితమైన గురి ఉంటుంది. ‘ఎలా ఆలోచించాలో తెలిసిన వాళ్లకు అధ్యాపకుల అవసరం లేదు’ అని మహాత్మాగాంధీ అన్నారు. అయితే, అమాయకపు బాల్యావస్థలో ఆలోచనను పదునెక్కించే గురువులు అత్యవసరం. జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంబంధాల్లో గురుశిష్య సంబంధం ప్రత్యేకమైనది. లోకంలో ఎందరో ఉత్తమ గురువులు, వారు తీర్చిదిద్దిన ఉత్తమ శిష్యులు ఉన్నారు. వారందరూ గతించిపోయినా, వారి చరిత్రను జనాలు చర్వితచర్వణంగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. మన పురాణాల్లోనూ గురుశిష్యుల కథలు కొల్లలుగా కనిపిస్తాయి. పురాణాల్లో దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువులుగా వాసికెక్కారు. అవతార పురుషులైన రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపని మహర్షి గురువులుగా ఉండేవారు. పురాణ గురువుల్లో మిగిలినవారిదంతా ఒక ఎత్తు అయితే, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పిన చండా మార్కుల వారిది మరో ఎత్తు. దండోపాయాన్ని సాధనంగా ఎంచుకున్న తొలిగురువు బహుశా ఆయనే! చండామార్క వారసులైన గురువులు అక్కడక్కడా తారసపడుతుంటారు. మనుషుల్లో ఉండే వైవిధ్య వైరుద్ధ్యాలు గురుశిష్యుల్లోనూ కనిపిస్తాయి. గురువులందరూ ఉత్తములేనని, శిష్యులందరూ ఆణిముత్యాలేనని చెప్పలేం. గురువుల్లో ఔదార్యమూ, ఉదాత్తతలతో పాటే స్వార్థ సంకుచిత లక్షణాలూ కనిపిస్తాయి. గురువులు కూడా మానవ మాత్రులే! ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా కోరిన ద్రోణుడు మనకు తెలుసు. గురువుకే పంగనామాలు పెట్టిన ఆషాఢభూతి కూడా మనకు తెలుసు. గురజాడవారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఆషాఢభూతికి ఏమీ తీసిపోయే రకం కాదు. కాకుంటే, అతగాడు గురుత్వం వెలగబెట్టాడు. గిరీశం శిష్యరికంలో వెంక టేశానికి చుట్ట కాల్చడం పట్టుబడిందే గాని, చదువు ఒంటబట్టలేదు. అయితే, మన దేశంలో వివిధ రంగాల్లో రాణించిన గురువులు, గురువులకు గర్వకారణంగా నిలిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. సాహితీరంగంలో తమదైన ముద్రవేసిన గురుశిష్యులు కొందరు ఇప్పటికీ ప్రస్తావనల్లోకి వస్తుంటారు. అటువంటి గురుశిష్యుల్లో మొదటగా చెప్పుకోవల సిన వారు – తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ. వారిద్దరూ అరుదైన గురుశిష్యులు. పాండితీ ప్రాభవంలోను, కవన శైలిలోనూ ఇద్దరూ ఇద్దరే! చెళ్లపిళ్లవారి గురించి విశ్వనాథ ఒక చమత్కార పద్యం చెప్పారు. అది: ‘అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు... బ్రాహ్మీమయమూర్తి శిష్యు డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళవంశస్వామి కున్నట్లుగన్’. నన్నయకు, తిక్కనకు తన వంటి శిష్యులెవరూ లేరని, తన గురువైన చెళ్లపిళ్ల వారికే ఆ వైభోగం, కీర్తి దక్కాయని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వనాథ. అధ్యాపక వృత్తిలో కొనసాగిన విశ్వనాథకు ఎందరో ప్రత్యక్ష శిష్యులే కాకుండా, మరెందరో పరోక్ష శిష్యులూ ఉన్నారు. విశ్వనాథను శ్రీశ్రీ ‘కవికుల గురువు’గా ప్రస్తుతించడమే కాదు, ‘తెలుగువాళ్ల గోల్డు నిబ్బు’గా అభివర్ణించారు. ఒకానొక సందర్భంలో ‘నా వంటి కవి మరో వెయ్యేళ్ల వరకు పుట్టడు’ అని విశ్వనాథ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా శ్రీశ్రీ ‘నిజమే! వారు పుట్టి వెయ్యేళ్లయింది’ అని వ్యాఖ్యానించడం ఒక వైచిత్రి. తొలినాళ్లలో శ్రీశ్రీపై విశ్వనాథ ప్రభావం ఉండేది. తర్వాతికాలంలో అబ్బూరి రామకృష్ణారావు శ్రీశ్రీపై ఎనలేని ప్రభావం చూపారు. అబ్బూరి వద్ద శ్రీశ్రీ నేరుగా తరగతిలో పాఠాలు నేర్చుకోకపోయినా, వారిద్దరిదీ గురుశిష్య సంబంధమే! సాహితీ లోకంలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేసిన మరో గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నరాల రామారెడ్డి వంటి ఉద్దండులు ఆయన శిష్యులే! ఇక భద్రిరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర ఆచార్యులుగా సుప్రసిద్ధులు. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, తూమాటి దొణప్ప వంటి శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. ఎందరో గురువులు ఉన్నా, శిష్యుల మనసుల్లో చెరగని ముద్రవేసే వారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఉత్తమ గురువులుగా చరిత్రలో గుర్తుండిపోతారు. మన దేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా ఎందరో శిష్యులను తయారు చేశారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్లేటప్పుడు ఆయనను గుర్రపు బండిలో కూర్చోబెట్టి శిష్యులే స్వయంగా బండిని లాక్కుంటూ వెళ్లి మరీ మైసూరు రైల్వేస్టేషన్లో సాగనంపారు. అదీ రాధాకృష్ణన్ ఘనత! రేపు రాధాకృష్ణన్ పుట్టినరోజు. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. గురువుల ఘనతకు శిష్యుల అభిమానమే గీటురాయి! జీతంరాళ్ల కంటే శిష్యుల అభిమాన ధనమే అసలైన సిరిసంపదలుగా తలచే గురువులు ఉంటారు. అలాంటి వాళ్లే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తారు. -
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
Rameshwar Goud: గురుబోధకుడు
తరగతి గది దేశ భవితను నిర్ణయిస్తుంది. ఇంగ్లిష్ భాష అభివృద్ధిని నిర్ణయిస్తోంది. ఇంగ్లిష్ రాకపోతే పురోభివృద్ధి దరి చేరనంటోంది. గ్రామాల్లో పిల్లలు ఇంగ్లిష్‌లో మెరికలు కావాలంటే... వాళ్లకు చదువు చెప్పే గురువులకు మెళకువలు నేర్పాలి. ‘చక్కటి ఇంగ్లిష్ వచి్చన తెలంగాణ సాధనే నా లక్ష్యం’... అంటున్నారు టీచర్లకు పాఠాలు చెప్తున్న ఈ ఇంగ్లిష్ టీచర్. ‘మంచి ఇంగ్లిష్ రావాలంటే పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదవాలి. నిజమా! నిజమే కావచ్చు. పెద్ద స్కూల్లో చదివిన పిల్లలు నోరు తెరిస్తే ఇంగ్లిషే వినిపిస్తుంది’. సమాజంలో స్థిరపడిపోయి ఉన్న ఒక అభిప్రాయం అది.‘నాకు రెండేళ్లు టైమివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి చేత చక్కటి ఉచ్చారణ, వ్యాకరణ సహితంగా మంచి బ్రిటిష్ ఇంగ్లిష్ మాట్లాడిస్తాను’ అంటున్నారు రామేశ్వర్ గౌడ్. ‘లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరి దగ్గరకు నేను వెళ్లలేను, కాబట్టి ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధించడంలో మెళకువలు నేర్పిస్తాను అవకాశం ఇవ్వండి’ అన్నాడు. ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధించారు. ‘నేను నిర్దేశించుకున్న సమయం మరో ఒకటిన్నర ఏడాది ఉంది. కానీ ఈ లోపే లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం కలుగుతోంది’ అన్నారు రామేశ్వర్ గౌడ్ టీచర్స్ డే సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ. శ్రద్ధగా నటించాను! రామేశ్వర్ గౌడ్ సొంతూరు షాద్‌నగర్ సమీపంలో నందిగామ. పాఠశాల విద్య తర్వాత హైదరాబాద్‌కి వచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్ తర్వాత ఉన్నత చదువులకు ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నారు. ఐల్ట్స్ పూర్తి చేసి విదేశాల్లో చదవగలిగిన అర్హత సంపాదించిన తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలియచేశారాయన. ‘‘చిన్నప్పటి నుంచి నేను మంచి మాటకారిని. నాకు తెలిసిన విషయాన్ని వివరంగా చెప్పగలిగిన కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండేవి. ఐల్ట్స్ (ఐఈఎల్టీఎస్, ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) క్లాసులకు ఏడుగురం ఫ్రెండ్స్ కలిసి వెళ్లాం. క్లాసులో విన్న తర్వాత డౌట్స్ అడిగేవాళ్లు నా ఫ్రెండ్స్. వాళ్లకు వివరిస్తూ ఉన్న క్రమంలో చదువు చెప్పడంలో గొప్ప థ్రిల్ ఉందనిపించింది. అలాగే నన్ను వెంటాడుతూ ఉన్న మరికొన్ని అంశాలు కూడా నా నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. అవి ఏమిటంటే... కాలేజ్‌లో చేరినప్పటి నుంచి ఒక నరకంలోనే జీవించాను. లెక్చరర్లు ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్తుంటే సరిగా అర్థమయ్యేవి కావు. దిక్కులు చూస్తే ...లేపి ప్రశ్న అడుగుతారేమోననే భయంతో శ్రద్ధగా పాఠం వింటున్నట్లు నటించేవాడిని. నా కాలేజ్ చదువంతా బొటాబొటి మార్కులతోనే సాగింది. నేను ఇంటర్వ్యూలకు వెళ్లి, నా వంతు కోసం ఎదురు చూస్తున్న సమయంలో నా లాగ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లు మాట్లాడుతున్న ఇంగ్లిష్‌కి భయపడి ‘ఈ ఉద్యోగం నాకేం వస్తుంది’... అని ఇంటర్వ్యూకి హాజరు కాకుండానే వెనక్కి వచ్చిన సందర్భాలున్నాయి. భాష రాకపోవడం వల్ల ఒక జాతి మొత్తం మూల్యం చెల్లించుకుంటోందా అని ఆవేదన కలిగింది. అప్పటికే వీసా కోసం పాస్‌పోర్టును డ్రాప్ బాక్స్‌లో వేసి ఉన్నాను. అలాంటి సమయంలో మా ఐల్ట్స్ సర్ సురేందర్ రెడ్డితో ‘నేను ఆస్ట్రేలియాకి వెళ్లను. ఇక్కడే ఉండి ఇంగ్లిష్ పాఠాలు చెబుతాను’ అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. నా ఆలోచన తెలిసిన తర్వాత అభినందించారు. ఇక 2007లో తార్నాకలో చిన్న గదిలో ఆరువేల అద్దెతో నా ఇన్స్టిట్యూట్ ‘విల్ టూ కెన్, ద స్ట్రైడ్’ మొదలైంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పించడం మొదలుపెట్టాను. తర్వాత నా ఇన్‌స్టిట్యూట్‌ని అమీర్‌పేటకు మార్చాను. అదంతా నేను ఆర్థికంగా స్థిరపడడానికి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఉచితంగా పాఠం చెప్పడానికి అనుమతులు సంపాదించగలిగాను. వాళ్లకు ఇంగ్లిష్ వచ్చు... కానీ! నా పాఠాలు వినే ఉపాధ్యాయులందరూ ఇంగ్లిష్ వచ్చిన వాళ్లే. కానీ ఇంగ్లిష్‌లో పాఠం చెప్పడంలో శిక్షణ పొందిన వాళ్లు కాదు. మనకు ఇంగ్లిష్ భాషను నేర్పించే మెథడాలజీ రూపొందలేదు. దాంతో ఉపాధ్యాయులకు– విద్యార్థులకు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతోంది. ఆ ఖాళీని నేను భర్తీ చేశాను. తెలుగు అర్థమై, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉంటే చాలు. అనర్గళంగా మాట్లాడించగలిగిన టీచింగ్ మెథడాలజీ రూపొందించాను. టీచర్లకు నేను చెప్తున్న పాఠాలు ఆ మెథడాలజీనే. ఎనభైమూడు వేలమంది టీచర్లున్న రాష్ట్రంలో ఆరు నెలల్లో ముప్ఫైవేల మంది పూర్తయ్యారు. ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. కరోనా కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అప్పుడు సమాజం వర్చువల్ విధానంలోకి మారిపోయింది. నేనిప్పుడు బాచుపల్లిలో నా ఇంట్లో కూర్చుని జూమ్ ద్వారా ఏకకాలంలో వేలాదిమందికి పాఠం చెప్పగలుగుతున్నాను. నలభై ఐదు రోజుల సెషన్లో ఒకసారి మాత్రం ఆయా జిల్లాలకు వెళ్లి స్వయంగా ఇంటరాక్ట్ అవుతున్నాను. ‘రియల్ లైఫ్ ఇంగ్లిష్, స్పోకెన్ ఇంగ్లిష్’ అని రెండు పుస్తకాలు రాశాను. గురువు జ్ఞానాన్ని దాచుకోకూడదు! ఈ సందర్భంగా నేను చెప్పేదొక్కటే... ‘నేను నూటికి నూరుపాళ్లూ పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు, నాకు తెలిసిన జ్ఞానాన్ని నూరుశాతం పంచుతున్నాను. టీచర్‌కి ఉండాల్సిన ప్రథమ లక్షణం అదే’’ అన్నారు రామేశ్వర్ గౌడ్. నిజమే... గురువు జ్ఞానాన్ని తనలో దాచుకోకూడదు, విస్తరింపచేయాలి. మా వాళ్లది ధర్మాగ్రహమే! ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇక్కడ పాఠాలు చెప్పడం వల్ల నేను కోల్పోయిందేమీ లేదు. డబ్బు పరంగా కొంత తగ్గి ఉండవచ్చు. డాక్టర్లు, డిఫెన్స్ రంగాలకు మినహా సినిమా, రాజకీయరంగం, న్యాయరంగం... అనేక రంగాల్లో నిష్ణాతులకు పాఠాలు చెప్పడంతో సెలబ్రిటీ టీచర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు ఉచిత పాఠాల ద్వారా వచ్చిన గౌరవం నాకు సంతృప్తినిస్తోంది. అలాగని నా జర్నీ అలవోకగా సాగలేదు. సక్సెస్ శిఖరానికి చేరేలోపు నేను పొందిన అవమానాలు కూడా చిన్నవేమీ కావు. నా నిర్ణయం తెలిసిన వెంటనే నా ఫ్రెండ్స్ ‘వీడు లైఫ్‌ని కరాబు చేసుకుంటుండు... ఆంటీ’ అని మా అమ్మతో అన్నారు. మా అమ్మ చాలా బాధపడింది. ఎంత చెప్పినా వినలేదని బాధపడి నాతో మాట్లాడడం మానేసింది. ఐదుగురం అన్నదమ్ములం. నలుగురూ నన్ను కోపంగా చూసేవారు. చాలా రోజులు మౌనయుద్ధం చేశారు. ఇంట్లో ఉండలేక వేరే గదిలోకి మారిపోయాను. వాళ్ల కోపం ధర్మాగ్రహమే. నా సంకల్పం అర్థమైన తర్వాత అందరూ సపోర్ట్‌గా నిలిచారు. నా భార్య రచన, పిల్లలు కూడా నా క్లాసుల నిర్వహణలో వాళ్లు చేయగలిగిన సహాయం చేస్తున్నారు. ఆ రకంగా నేను అదృష్టవంతుడిని. – ఎ. రామేశ్వర్ గౌడ్, ఫౌండర్, విల్ టూ కెన్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు
తాంసి/దండేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ప్రదా నం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారానికి ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ఆ ఇద్దరూ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాకు చెందినవారే. ఆది లాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బెదోడ్కర్ సంతోష్‌కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నుగూరి అర్చన.. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. పాఠశాల పేరు మీద యూట్యూబ్ చానల్లో పాఠాలు 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతోష్‌కుమార్ కరోనా ఉధృతి సమయంలో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా గూగుల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పాఠా లను బోధించారు. పాఠశాల పేరు మీద ప్రత్యేక యూ ట్యూబ్ చానల్లో సైతం నిత్యం రోజు వారీ పాఠాలను అప్ లోడ్ చేయడం వంటివి చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా 100 వరకు ఉన్న విద్యార్థులను ప్రస్తుతం 220 వరకు చేర్చారు. సొంత డబ్బులతో స్కూల్‌ను తీర్చిదిద్ది.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నుగూరి అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతోపాటు ఆమె సొంత ఖర్చులతో నాణ్యమైన విద్యాభోధన చేస్తూ, రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటేనే అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. అర్చన సేవలకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందగా, ఈసారి ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది. -
గురువులకు గౌరవం
సాక్షి, అమరావతి: విద్యా శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం గురుపూజోత్సవాలను ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర, జిల్లా, పాఠశాలల స్థాయిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులకు గౌరవ పురస్కారాలు అందించింది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు గురుపూజోత్సవాల బహిష్కరణకు పిలుపునిచ్చినా టీచర్లు ఎక్కడా దానిని పట్టించుకోలేదు. గతంలో కన్నా ఎక్కువ ఉత్సాహంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరై గురువులను సన్మానించారు. గతంలో గురుపూజోత్సవాలకు భిన్నమైన వాతావరణంలో ఈసారి వేడుకలు జరిగాయి. గతంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గురువులకు సరైన గౌరవం దక్కేది కాదు. నేతలు, ఇతరుల ప్రసంగాలకే ఎక్కువ సమయం వెచ్చించే వారు. సీఎం చేతుల మీదుగా నలుగురైదుగురికి అవార్డులు పంపిణీ చేయించి మమ అనిపించేవారు. దీంతో మిగతా వారు నిరాశ, నిస్పృహలకు గురయ్యేవారు. అయితే ఈసారి ఉత్తమ ఉపాధ్యాయులుగా 180 మందిని ఎంపిక చేయగా.. ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ స్వయంగా మెమెంటో, బెస్ట్ టీచర్ ధ్రువపత్రాన్ని అందజేశారు. అవార్డు అందుకున్న వారిలో కొంత మంది వీల్ చైర్లో రాగా, సీఎం ఎంతో గౌరవంగా కిందకు వంగి కూర్చొని మరీ వారికి అవార్డులు అందించారు. గురువుల పట్ల సీఎం వినయ విధేయతలు చూపడం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన ప్రభుత్వ టీచర్ బలగా సుమనకు పురస్కారం అందజేస్తున్న సీఎం జగన్ స్నేహ పూర్వక ప్రభుత్వమిది: మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల స్నేహ పూర్వకంగా ఉండే ప్రభుత్వం ఇది. వారి ప్రయోజనాల పరిరక్షణలో సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారు. మన పిల్లలను గ్లోబల్ సిటిజెన్‌గా తీర్చిదిద్దాలనే తపనతో సీఎం విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నాడు–నేడు కింద సుమారు రూ.3 వేల కోట్లకు పైగా నిధులతో మొదటి విడత దాదాపు 16 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, పిల్లలకు బైజూస్ కంటెంట్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తదితర ఎన్నో పథకాలు చేపట్టాం. పాఠశాలలన్నీ దశల వారీగా సీబీఎస్ఈకి అనుసంధానిస్తున్నాం. ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యాపక వృత్తిలో ఉన్న వారందరికీ పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాం. పదోన్నతులు కల్పిస్తున్నాం.