Rameshwar Goud: గురుబోధకుడు | Will 2 Can institute: Teachers for learning new ways of teaching | Sakshi
Sakshi News home page

Rameshwar Goud: గురుబోధకుడు

Published Sat, Sep 2 2023 12:39 AM | Last Updated on Sat, Sep 2 2023 12:39 AM

Will 2 Can institute: Teachers for learning new ways of teaching - Sakshi

తరగతి గది దేశ భవితను నిర్ణయిస్తుంది. ఇంగ్లిష్‌ భాష అభివృద్ధిని నిర్ణయిస్తోంది. ఇంగ్లిష్‌ రాకపోతే పురోభివృద్ధి దరి చేరనంటోంది. గ్రామాల్లో పిల్లలు ఇంగ్లిష్‌లో మెరికలు కావాలంటే...
వాళ్లకు చదువు చెప్పే గురువులకు మెళకువలు నేర్పాలి. ‘చక్కటి ఇంగ్లిష్‌ వచి్చన తెలంగాణ సాధనే నా లక్ష్యం’... అంటున్నారు టీచర్లకు పాఠాలు చెప్తున్న ఈ ఇంగ్లిష్‌ టీచర్‌.


‘మంచి ఇంగ్లిష్‌ రావాలంటే పెద్ద కార్పొరేట్‌ స్కూల్‌లో చదవాలి. నిజమా! నిజమే కావచ్చు. పెద్ద స్కూల్లో చదివిన పిల్లలు నోరు తెరిస్తే ఇంగ్లిషే వినిపిస్తుంది’. సమాజంలో స్థిరపడిపోయి ఉన్న ఒక అభిప్రాయం అది.‘నాకు రెండేళ్లు టైమివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి చేత చక్కటి ఉచ్చారణ, వ్యాకరణ సహితంగా మంచి బ్రిటిష్‌ ఇంగ్లిష్‌ మాట్లాడిస్తాను’ అంటున్నారు రామేశ్వర్‌ గౌడ్‌.

‘లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులందరి దగ్గరకు నేను వెళ్లలేను, కాబట్టి ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధించడంలో మెళకువలు నేర్పిస్తాను అవకాశం ఇవ్వండి’ అన్నాడు. ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధించారు. ‘నేను నిర్దేశించుకున్న సమయం మరో ఒకటిన్నర ఏడాది ఉంది. కానీ ఈ లోపే లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం కలుగుతోంది’ అన్నారు రామేశ్వర్‌ గౌడ్‌ టీచర్స్‌ డే సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ.

శ్రద్ధగా నటించాను!
రామేశ్వర్‌ గౌడ్‌ సొంతూరు షాద్‌నగర్‌ సమీపంలో నందిగామ. పాఠశాల విద్య తర్వాత హైదరాబాద్‌కి వచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్‌ తర్వాత ఉన్నత చదువులకు ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నారు. ఐల్ట్స్‌ పూర్తి చేసి విదేశాల్లో చదవగలిగిన అర్హత సంపాదించిన తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలియచేశారాయన. ‘‘చిన్నప్పటి నుంచి నేను మంచి మాటకారిని. నాకు తెలిసిన విషయాన్ని వివరంగా చెప్పగలిగిన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ బాగా ఉండేవి.

ఐల్ట్స్‌ (ఐఈఎల్‌టీఎస్, ఇంటర్నేషనల్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌) క్లాసులకు ఏడుగురం ఫ్రెండ్స్‌ కలిసి వెళ్లాం. క్లాసులో విన్న తర్వాత డౌట్స్‌ అడిగేవాళ్లు నా ఫ్రెండ్స్‌. వాళ్లకు వివరిస్తూ ఉన్న క్రమంలో చదువు చెప్పడంలో గొప్ప థ్రిల్‌ ఉందనిపించింది. అలాగే నన్ను వెంటాడుతూ ఉన్న మరికొన్ని అంశాలు కూడా నా నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. అవి ఏమిటంటే... కాలేజ్‌లో చేరినప్పటి నుంచి ఒక నరకంలోనే జీవించాను.

లెక్చరర్‌లు ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్తుంటే సరిగా అర్థమయ్యేవి కావు. దిక్కులు చూస్తే ...లేపి ప్రశ్న అడుగుతారేమోననే భయంతో శ్రద్ధగా పాఠం వింటున్నట్లు నటించేవాడిని. నా కాలేజ్‌ చదువంతా బొటాబొటి మార్కులతోనే సాగింది. నేను ఇంటర్వ్యూలకు వెళ్లి, నా వంతు కోసం ఎదురు చూస్తున్న సమయంలో నా లాగ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లు మాట్లాడుతున్న ఇంగ్లిష్‌కి భయపడి ‘ఈ ఉద్యోగం నాకేం వస్తుంది’... అని ఇంటర్వ్యూకి హాజరు కాకుండానే వెనక్కి వచ్చిన సందర్భాలున్నాయి.

భాష రాకపోవడం వల్ల ఒక జాతి మొత్తం మూల్యం చెల్లించుకుంటోందా అని ఆవేదన కలిగింది. అప్పటికే వీసా కోసం పాస్‌పోర్టును డ్రాప్‌ బాక్స్‌లో వేసి ఉన్నాను. అలాంటి సమయంలో మా ఐల్ట్స్‌ సర్‌ సురేందర్‌ రెడ్డితో ‘నేను ఆస్ట్రేలియాకి వెళ్లను. ఇక్కడే ఉండి ఇంగ్లిష్‌ పాఠాలు చెబుతాను’ అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. నా ఆలోచన తెలిసిన తర్వాత అభినందించారు.

ఇక 2007లో తార్నాకలో చిన్న గదిలో ఆరువేల అద్దెతో నా ఇన్‌స్టిట్యూట్‌ ‘విల్‌ టూ కెన్, ద స్ట్రైడ్‌’ మొదలైంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇంగ్లిష్‌ నేర్పించడం మొదలుపెట్టాను. తర్వాత నా ఇన్‌స్టిట్యూట్‌ని అమీర్‌పేటకు మార్చాను. అదంతా నేను ఆర్థికంగా స్థిరపడడానికి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఉచితంగా పాఠం చెప్పడానికి అనుమతులు సంపాదించగలిగాను.

వాళ్లకు ఇంగ్లిష్‌ వచ్చు... కానీ!
నా పాఠాలు వినే ఉపాధ్యాయులందరూ ఇంగ్లిష్‌ వచ్చిన వాళ్లే. కానీ ఇంగ్లిష్‌లో పాఠం చెప్పడంలో శిక్షణ పొందిన వాళ్లు కాదు. మనకు ఇంగ్లిష్‌ భాషను నేర్పించే మెథడాలజీ రూపొందలేదు. దాంతో ఉపాధ్యాయులకు– విద్యార్థులకు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతోంది. ఆ ఖాళీని నేను భర్తీ చేశాను. తెలుగు అర్థమై, ఇంగ్లిష్‌ చదవడం, రాయడం వచ్చి ఉంటే చాలు. అనర్గళంగా మాట్లాడించగలిగిన టీచింగ్‌ మెథడాలజీ రూపొందించాను. టీచర్లకు నేను చెప్తున్న పాఠాలు ఆ మెథడాలజీనే.

ఎనభైమూడు వేలమంది టీచర్లున్న రాష్ట్రంలో ఆరు నెలల్లో ముప్ఫైవేల మంది పూర్తయ్యారు. ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. కరోనా కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అప్పుడు సమాజం వర్చువల్‌ విధానంలోకి మారిపోయింది. నేనిప్పుడు బాచుపల్లిలో నా ఇంట్లో కూర్చుని జూమ్‌ ద్వారా ఏకకాలంలో వేలాదిమందికి పాఠం చెప్పగలుగుతున్నాను. నలభై ఐదు రోజుల సెషన్‌లో ఒకసారి మాత్రం ఆయా జిల్లాలకు వెళ్లి స్వయంగా ఇంటరాక్ట్‌ అవుతున్నాను. ‘రియల్‌ లైఫ్‌ ఇంగ్లిష్, స్పోకెన్‌ ఇంగ్లిష్‌’ అని రెండు పుస్తకాలు రాశాను.

గురువు జ్ఞానాన్ని దాచుకోకూడదు!
ఈ సందర్భంగా నేను చెప్పేదొక్కటే... ‘నేను నూటికి నూరుపాళ్లూ పర్‌ఫెక్ట్‌ అని చెప్పడం లేదు, నాకు తెలిసిన జ్ఞానాన్ని నూరుశాతం పంచుతున్నాను. టీచర్‌కి ఉండాల్సిన ప్రథమ లక్షణం అదే’’ అన్నారు రామేశ్వర్‌ గౌడ్‌. నిజమే... గురువు జ్ఞానాన్ని తనలో దాచుకోకూడదు, విస్తరింపచేయాలి.

మా వాళ్లది ధర్మాగ్రహమే!
ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇక్కడ పాఠాలు చెప్పడం వల్ల నేను కోల్పోయిందేమీ లేదు. డబ్బు పరంగా కొంత తగ్గి ఉండవచ్చు. డాక్టర్‌లు, డిఫెన్స్‌ రంగాలకు మినహా సినిమా, రాజకీయరంగం, న్యాయరంగం...  అనేక రంగాల్లో నిష్ణాతులకు పాఠాలు చెప్పడంతో సెలబ్రిటీ టీచర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు ఉచిత పాఠాల ద్వారా వచ్చిన గౌరవం నాకు సంతృప్తినిస్తోంది. అలాగని నా జర్నీ అలవోకగా సాగలేదు. సక్సెస్‌ శిఖరానికి చేరేలోపు నేను పొందిన అవమానాలు కూడా చిన్నవేమీ కావు.

నా నిర్ణయం తెలిసిన వెంటనే నా ఫ్రెండ్స్‌ ‘వీడు లైఫ్‌ని కరాబు చేసుకుంటుండు... ఆంటీ’ అని మా అమ్మతో అన్నారు. మా అమ్మ చాలా బాధపడింది. ఎంత చెప్పినా వినలేదని బాధపడి నాతో మాట్లాడడం మానేసింది. ఐదుగురం అన్నదమ్ములం. నలుగురూ నన్ను కోపంగా చూసేవారు. చాలా రోజులు మౌనయుద్ధం చేశారు. ఇంట్లో ఉండలేక వేరే గదిలోకి మారిపోయాను. వాళ్ల కోపం ధర్మాగ్రహమే. నా సంకల్పం అర్థమైన తర్వాత అందరూ సపోర్ట్‌గా నిలిచారు. నా భార్య రచన, పిల్లలు కూడా నా క్లాసుల నిర్వహణలో వాళ్లు చేయగలిగిన సహాయం చేస్తున్నారు. ఆ రకంగా నేను అదృష్టవంతుడిని.
– ఎ. రామేశ్వర్‌ గౌడ్, ఫౌండర్, విల్‌ టూ కెన్, హైదరాబాద్‌

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు : నోముల రాజేశ్‌ రెడ్డి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement