ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఆధారిత బోధన
వచ్చే ఏడాది నుంచి 5 వేల స్కూళ్లలో షురూ!
5వ తరగతి నుంచి టెన్త్ వరకు వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు
త్వరలో పాఠశాల విద్యాశాఖ నివేదిక
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త తరహాలో బోధనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో వర్చువల్ రియాలిటీ విధానంలో పాఠాలు చెప్పేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎక్‌స్టెప్ ఫౌండేషన్ సహకారం తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఫౌండేషన్‌కు వెళ్లి అక్కడ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఏ తరహా మౌలిక వసతులు, ఏఐ ఆధారిత టూల్స్ కావాలో తెలుసుకున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో కొన్ని స్కూళ్ళను ఎంపిక చేసి..వచ్చే విద్యా సంంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రూపొందించిన ఓ నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి త్వరలో ప్రభుత్వానికి సమరి్పంచనున్నారు.
సరి చేసుకునే వరకు సూచనలు!
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్ళున్నాయి. ఇందులో తొలి విడతగా 5 వేల స్కూళ్ళను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కంప్యూటర్లు, ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న స్కూళ్ళ జాబితాను పరిశీలిస్తున్నారు. 5వ తరగతి మొదలు కొని 10వ తరగతి వరకూ ఏఐ ఆధారిత బోధన ఉంటుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రోగ్రామ్స్ రూపొందిస్తారు. ప్రధాన సర్వర్ల నుంచి ఆయా స్కూళ్ళకు వీటిని అనుసంధానం చేస్తారు. టీచర్ ఒక పాఠం చెప్పిన తర్వాత ఏఐ ఆధారిత ప్రశ్నలు గూగుల్ క్రోం ద్వారా విద్యార్థులకు పంపుతారు. వీటికి ఆన్‌లైన్‌లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తప్పులుంటే సరి చేసుకునే వరకూ ఏఐ టెక్నాలజీ విద్యారి్థకి సూచనలు చేస్తుంది.
వర్చువల్ రియాలిటీ విధానంలో..
ఏఐ సాంకేతికత అందుబాటులోకి వస్తే విద్యార్థి స్వయం అనుభవం మాదిరి పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు విత్తనం మొలకెత్తడం, వృద్ధి చెందడానికి సంబంధించి థియరీ మాత్రమే పుస్తకాల్లో ఉంటుంది. వర్చువల్ విధానంలో విద్యారి్థకి కెమెరా లెన్స్ పరికరం ఇస్తారు. దీన్ని ధరించిన తర్వాత విత్తనం తానే నాటి, అది దశల వారీగా ఎలా ఎదుగుతుందో పరిశీలిస్తున్న అనుభూతి పొందుతాడు. అదే విధంగా ఎర్రకోట గురించి పాఠం చెప్పేప్పుడు, టిప్పు సుల్తాన్ యుద్ధంపై బోధన చేసేప్పుడు అక్కడే ఉండి చూస్తున్నట్టుగా చేయడం ఏఐ టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో పఠనాసక్తి పెరగడంతో పాటు, జ్ఞాపక శక్తి మెరుగయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
మౌలిక సదుపాయాలే కీలకం
డిజిటల్ బోధన కోసం గతంలో 3 వేల పాఠశాలల్లో లే»ొరేటరీలు ఏర్పాటు చేశారు. 10 వేల స్కూళ్ళకు కంప్యూటర్లు ఇచ్చారు. 8 వేల స్కూళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. కానీ ఏఐ ఆధారిత బోధనకు మరింత అత్యాధునిక మౌలిక వసతులు అవసరం. ఇప్పుడున్న నెట్ స్పీడ్ పది రెట్లు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. సర్వర్ల నుంచి వేగంగా ప్రోగ్రామింగ్ అందుకోగల మాడ్యూల్స్‌ను రూపొందించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లకు ఏఐపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. గతంలో ఇచ్చిన కంప్యూటర్లు చాలా స్కూళ్లలో వాడకుండా పక్కన పడేశారు. తాజాగా ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామాల్లో ఉండే యువతను ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు.
ఏఐతో మెరుగైన బోధన
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు స్కూళ్ల కంటే మెరుగైన విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రయతి్నస్తున్నాం. ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీతో విద్యా బోధన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనిపై త్వరలోనే కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నాం.
– ఈవీ నర్సింహారెడ్డి (పాఠశాల విద్య డైరెక్టర్)
మంచి ఫలితాలకు అవకాశం ఉంది
అమెరికాలో గూగుల్ క్రోం ద్వారానే అసైన్‌మెంట్స్ ఇస్తున్నారు. మూల్యాంకనం చేపడుతున్నారు. ఏఐ వాడకంలో అక్కడి స్కూళ్ళు ముందంజలో ఉన్నాయి. మన విద్యార్థులు గణితంలో అక్కడివారి కంటే మెరుగ్గా ఉంటారు. కాబట్టి ఏఐ టెక్నాలజీతో మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది.
– సంక్రాంతి రవికుమార్ (అమెరికాలో ఏఐ బోధన పరిశీలించిన టీచర్)
అడ్మిషన్లు పెరుగుతాయి
ఏఐ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వ స్కూళ్ళల్లో అడ్మిషన్లు పెరుగుతాయి. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇది మంచి మార్గం. దీనిపై టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి.
– పింగిలి శ్రీపాల్‌రెడ్డి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు)
Comments
Please login to add a commentAdd a comment