ఉప సంఘం ఆదేశాలతో పాఠశాల విద్య డైరెక్టరేట్ కసరత్తు
ఏటా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్న పలు ప్రైవేటు స్కూళ్లు.. కొన్నేళ్లుగా వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
ఫీజుల నియంత్రణకు అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో సర్కారు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించిన నేపథ్యంలో, పాఠశాల విద్య డైరెక్టరేట్ దీనిపై కసరత్తుకు సిద్ధమవుతోంది. ఫీజుల నియంత్రణకు 2017లో ఆచార్య తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తోంది. అవసరమైతే ప్రత్యేక చట్టం తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.
సర్కారీ స్కూళ్లలో మౌలికవసతుల లేమి, ఉపాధ్యాయుల కొరత విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్ళు ప్రతి ఏటా ఏకంగా 25 శాతం వరకూ ఫీజులు పెంచుతున్నాయి. దీనిపై కొన్నేళ్లుగా ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై దృష్టి సారించింది.
మౌలిక వసతుల ఆధారంగానే ఫీజులు!
ఫీజుల నియంత్రణకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. 35 లక్షల మందికిపైగా చదివే 11 వేల ప్రైవేటు స్కూళ్లను దీని పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఇష్టానుసారం కాకుండా స్కూళ్లలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజుల పెంపునకు అనుమతించేలా నిబంధనలు రూపొందించే యోచనలో ఉంది.
అవసరం లేని ఖర్చును అభివృద్ధిలా..!
ఫీజుల నియంత్రణకు సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు అమలు కాకపోవడంతో చట్టపరమైన అడ్డంకులు లేకుండా చేయాలని పాఠశాల విద్య అధికారులకు ఉప సంఘం సూచించింది. స్కూల్ డెవలప్‌మెంట్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా 15 శాతం ఫీజులు పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో జీవోలిచ్చారు. వాటిని ఆధారంగా చేసుకుని పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును చేస్తూ ఆ పనులను అభివృద్ధిగా చూపిస్తున్నాయి.
ఓ ఉదాహరణను పరిశీలిస్తే.. ఒక స్కూలు ప్రతి గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేసింది. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టుగా లెక్కల్లో చూపింది. ఫీజులు 25 శాతం పెంచేసింది. ఇలా స్కూళ్లు ఫీజులు అడ్డగోలుగా పెంచేస్తున్నాయి. వీటిని క్రమబధ్ధికరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఖర్చు 10 శాతం దాటితే పక్కా లెక్క ఉండాలి
స్కూళ్ల మూడేళ్ల ఖర్చును బట్టి వార్షిక ఫీజుల పెంపునకు అనుమతించవచ్చని తిరుపతిరావు కమిటీ సూచించింది. ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటి ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా ఉండాలని ప్రతిపాదించారు. వేతనాలు, స్కూలు కోసం కొనుగోలు చేసే మౌలిక వసతులు, ఇతరత్రా ఖర్చులకు బ్యాంకు ద్వారానే చెల్లింపులు ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి.
వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని కసరత్తు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. 11 వేల స్కూళ్ళ ఆదాయ, వ్యయ లెక్కలు చూడాలంటే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. ఈ దిశగానూ కొన్ని సిఫారసులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 శాతం పైగా ఫీజు పెంచే స్కూళ్లు విధిగా లెక్కలు చూపేలా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment