
పాఠశాల విద్యకు ఏటా అరకొరగానే కేటాయింపులు
రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం ఉండాలంటున్న నిపుణులు
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంపునకు డబ్బుల కొరత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో పాఠశాల విద్యకు కేటాయింపులు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ రూ.3లక్షల కోట్లు దాటుతోంది. ఇందులో విద్యారంగానికి కనీసం 15 శాతం కేటాయింపులు ఉండాలన్నది ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, విద్యారంగ నిపుణుల డిమాండ్. రాష్ట్ర అవతరణ నుంచి కేటాయింపులు గరిష్టంగా 7 శాతం దాటడం లేదు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, కొత్త టీచర్ల నియామకా లు చేపట్టాలన్నా, నిధుల కొరత అడ్డంకిగా మారుతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. విద్యారంగానికి నిధులు పెంచాలని రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫా ర్సు చేసింది. నిధులు పెంచి విద్యారంగ సంస్కరణలు చేప ట్టాలని మంత్రివర్గ ఉపసంఘం కూడా అభిప్రాయపడింది.
ఎక్కువ భాగం వేతనాలకే చెల్లు
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే కేటాయింపుల్లో సింహభాగం టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలకే ఖర్చవుతోంది. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం వెనుకబడి ఉందని కేంద్ర విద్యాశాఖ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఇప్పటికే పేద విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు సకాలంలో పంపిణీ చేయడానికి ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లనూ తీర్చిదిద్దుతామని చెప్పి మన ఊరు–మనబడి కార్యక్రమం చేపట్టినా తొలి దశలోనే నిధుల కొరత ఎదురైంది.
తగ్గుతున్న ప్రవేశాలు
కోవిడ్ కాలంలో మినహా ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రవేశాలు ఏటా పడిపోతున్నాయి. రాష్ట్రంలో 11,067 గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూళ్లున్నాయి. చిన్న స్కూళ్లలో ఫీజులు రూ.30 నుంచి రూ.40 వేల మధ్య ఉంటున్నాయి. కార్పొరేట్ స్కూళ్లల్లో రూ.లక్షల్లో ఉంటున్నాయి.
అయినా మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించడానికి కారణం.. ప్రభుత్వ స్కూళ్లల్లో నాణ్యత కొరవడటమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి సర్కారీ స్కూళ్లల్లో నాణ్యమైన బోధకులే ఉన్నారు. కానీ బోధన విధానం సరైన రీతిలో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే విద్యారంగానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరముంది.
టీచర్లు ఏరి.. సదుపాయాలెక్కడ ?
ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ 18 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్లే లేరు. 602 మండలాల్లో కేవలం 17 చోట్ల మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. 6 వేల పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. విద్యావలంటీర్ల నియామకంపైనా పాఠశాల విద్యా శాఖ దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా బోధన అరకొరగా ఉంటోందన్న ప్రచారం.. విద్యార్థులను ప్రైవేట్ బాట పట్టిస్తోంది.
నిధులు పెంచాలి
పాఠశాల విద్యకు నిధులు పెంచాలి. మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీపడే శక్తి సామర్థ్యాలున్నా, అవసరమైన వసతులు లేకపోవడమే సమస్యగా మారింది. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
15 శాతం నిధులైనా ఇవ్వాలి
విద్యకు కేవలం 7 శాతం నిధులే ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 13 శాతం నిధులిస్తున్నారు. 90 శాతం బడుగు,బలహీన వర్గాల విద్యార్థులున్న తెలంగాణలో విద్యారంగానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తోంది. – మాచర్ల రాంబాబు,ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి
కేటాయింపులతో సంస్కరణలు
పాఠశాల విద్యలో సంస్కరణలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని స్వాగతిస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో అవసరాలు ఏంటి? ఏమేం సమకూర్చాలనే దానిపై ఫోకస్ పెట్టాలి. ఇది జరగాలంటే నిధులు పెంచాలి. – రాజగంగారెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment