
పాతబస్తీ మెట్రో విస్తరణలో..
ఇప్పటి వరకు 500కుపైగా చెక్కులు
రూ.200 కోట్ల పరిహారం పంపిణీ
రోడ్డు విస్తరణలో 980 నిర్మాణాల గుర్తింపు
400 ఆస్తులకు ప్రాథమిక నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీ మెట్రో విస్తరణలో మరో ముందడుగు పడింది. ఇప్పటివరకు సుమారు 500కు పైగా చెక్కులను పంపిణీ చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయిన బాధితులకు రూ.200 కోట్లకు పైగా పరిహారం
అందజేశారు. చదరపు గజానికి రూ.81 వేల నుంచి రూ.లక్ష చొప్పున స్థలానికి ఖరీదు చెల్లించడంతో పాటు పునరావాసం కోసం పరిహారం కూడా చెల్లించినట్లు అధికారులు తెలిపారు. రంజాన్ మాసం దృష్ట్యా కూలి్చవేత పనులను నెమ్మదిగా కొనసాగిస్తున్నప్పటికీ.. విస్తరణ కోసం గుర్తించిన ఆస్తులకు నోటీసులు ఇవ్వడంతో పాటు పరిహారం చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. 8 నెలల్లో మొత్తం పనులను పూర్తి చేసి మెట్రో నిర్మాణాన్ని ప్రారంభించాలని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) లక్ష్యంగా పెట్టుకొంది.
అతిపెద్ద కారిడార్..
మెట్రో రెండో దశలోని మొదటి ఐదు లైన్‌లను నాలుగేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రెండో దశలో భాగంగానే ప్రస్తుతం పాతబస్తీ మెట్రో పనులు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే ప్రధానమైన పనులను చేపట్టేందుకు అనుగుణంగా ఆస్తుల సేకరణ, రోడ్డు విస్తరణపై దృష్టి సారించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సంగతి తెలిసిందే. దీంతో జేబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు అతి పెద్ద గ్రీన్ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్– చాంద్రాయణగుట్ట వరకు 11,00 ఆస్తులను అధికారులు గుర్తించారు. వీటిలో 980 నిర్మాణాలను మాత్రం తొలగించాల్సి ఉంది. ఆస్తుల సేకరణకు సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా.
కూలి్చవేత పనులు వివిధ దశల్లో..
భూ సేకరణ చట్టానికి అనుగుణంగా సేకరించనున్న ఆస్తులకు పరిహారం చెల్లించేందుకు హెచ్‌ఏఎంఎల్ చర్యలు చేపట్టింది. మెట్రో నిర్మాణంలో మతపరమైన, ఆధ్యాతి్మక కట్టడాలకు ఎలాంటి విఘాతం కలగకుండా నివాసాలు, దుకాణాలు వంటివి మాత్రమే తొలగించనున్నారు. ఈ మేరకు గుర్తించిన 980 నిర్మాణాల్లో 400 నిర్మాణాలకు ప్రాథమిక నోటీసులు అందజేశారు. 325 మంది నుంచి ఆమోదం లభించింది. వాటిలో 216 ఆస్తులకు అవార్డు డిక్లేర్ చేశారు. ఇప్పటి వరకు 80 ఆస్తులను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. వీటిలో 39 నిర్మాణాల కూలి్చవేత పూర్తయిందని, మరో 41 నిర్మాణాల కూల్చివేతల పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు చెప్పారు. మరోవైపు ఇప్పటి వరకు చెల్లించిన పరిహారంలో కొంత భూమి ఖరీదు కోసం కాగా, సుమారు 215 మందికి పునరావాసం కోసం పరిహారం అందజేశారు.
7.5 కిలోమీటర్లు.. రూ.2,714 కోట్లు..
మెట్రో రెండో దశలో మొదటి 5 కారిడార్‌లకు రూ.24,269 కోట్లతో సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను రూపొందించారు. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలో మీటర్ల మెట్రో నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోయినవారికి చెల్లించే పరిహారం కాకుండా దాదాపు రూ.2,714 కోట్లు ప్రాజెక్టు ఖర్చు కానున్నట్లు అంచనా. మెట్రో రాకతో పాత నగరం మరింత ఆకర్షణను సంతరించుకోనుందని, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు చెబుతుండగా.. ప్రస్తుతం వాణిజ్య ప్రాంతాల్లోని దుకాణాలు, భవనాలు కోల్పోవడంతో ఉపాధి కోల్పోతామని పలువురు పాతబస్తీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, టీస్టాళ్లు, వివిధ రకాల వస్త్ర, కిరాణా దుకాణాలు, ఫ్యాన్సీ స్టోర్లు వంటివి కూల్చివేతలకు గురి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment