అబ్బురపడేలా.. జేబీఎస్‌ మెట్రో హబ్‌ | Hyd metro draws up first plans for JBS transit hub | Sakshi
Sakshi News home page

అబ్బురపడేలా.. జేబీఎస్‌ మెట్రో హబ్‌

Published Wed, Feb 5 2025 7:04 AM | Last Updated on Wed, Feb 5 2025 7:05 AM

Hyd metro draws up first plans for JBS transit hub

పీపీపీ పద్ధతిలో మెట్రో టెర్మినల్

అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి  

షాపింగ్‌ మాల్స్‌ , రెస్టారెంట్లు, కార్యాలయాలు

మోడల్‌ మెట్రో స్టేషన్‌గా విస్తరణ 

ప్రణాళికలు రూపొందిస్తున్న హెచ్‌ఎంఆర్‌ఎల్‌

సాక్షి,  హైదరాబాద్‌: జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ ప్రపంచస్థాయి మెట్రో హబ్‌గా అవతరించనుంది. సింగపూర్, టోక్యో వంటి అంతర్జాతీయ నగరాల్లోని మెట్రో హబ్‌లకు దీటుగా జేబీఎస్‌ మెట్రో హబ్‌కు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైల్‌ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక్కడ బస్‌ స్టేషన్‌లు, పార్కింగ్‌ సదుపాయం, రెస్టారెంట్‌లు, మల్టీప్లెక్స్ థియేటర్‌లు, మాల్స్, కార్యాలయాలు వంటి అన్ని సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కేవలం మెట్రో రైళ్ల రాకపోకలకే పరిమితం కాకుండా చక్కటి షాపింగ్, డైనింగ్‌ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జేబీఎస్‌ హబ్‌పై దిశానిర్దేశం చేసినట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో జేబీఎస్‌ మెట్రో హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. మెట్రో రెండో దశలో భాగంగానే సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్, శామీర్‌పేట్‌ వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నారు. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఈ రెండు కారిడార్‌లపైనా సీఎం తాజాగా సమీక్షించారు. 

అతిపెద్ద ప్రాంగణంగా విస్తరణ..  
సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో జేబీఎస్‌ మెట్రో హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం మెట్రోకు జేబీఎస్‌ వద్ద అందుబాటులో ఉన్న స్థలంతో పాటు రక్షణ శాఖకు చెందిన భూములను కూడా సేకరించనున్నారు. ప్రస్తుతం నగరంలోని మెట్రోస్టేషన్‌ల పార్కింగ్‌ సదుపాయాలు అరకొరగా ఉన్నాయి. దీంతో మెట్రోల్లో ప్రయాణం చేయాలని భావించినప్పటికీ.. పార్కింగ్‌ వసతులు లేకపోవడంతో చాలామంది సొంత వాహనాలనే వినియోగిస్తున్నారు.

 దీనిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో నిర్మించనున్న మెట్రో స్టేషన్‌లను పార్కింగ్‌ సదుపాయాలతో  ప్రత్యేకంగా డిజైన్‌ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జేబీఎస్‌ మెట్రో హబ్‌ వద్ద సెల్లార్‌లో అతిపెద్ద పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాల కోసం రెండంతస్తుల్లో నిర్మించే అవకాశం ఉంది.  గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బస్‌స్టేషన్‌ ఉంటుంది. ప్రయాణికులు బస్సు దిగి నేరుగా మెట్రో స్టేషన్‌కు వెళ్లవచ్చు. దీంతో సీమ్‌లెస్‌ జర్నీ సదుపాయం లభించనుంది. వివిధ ప్రాంతాల మధ్య లాస్ట్‌మైల్, ఫస్ట్‌మైల్‌ కనెక్టివిటీకి కూడా పార్కింగ్, బస్‌స్టేషన్‌ సదుపాయాలు దోహదం చేయనున్నట్లు అధికారులు  తెలిపారు.  

లక్షలాది మందికి ప్రయాణ సదుపాయం..  
⇒ ప్రతిపాదిత జేబీఎస్‌ నుంచి మేడ్చల్‌ (23కి.మీ.), జేబీఎస్‌ – శామీర్‌ పేట్‌ (22 కి.మీ) కారిడార్‌లలో లక్షలాది మంది రాకపోకలు సాగించనున్నారు. ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీలో జేబీఎస్‌ కీలకం కానుంది.  
⇒ రెండు రూట్లలో హెచ్‌ఎండీఏ ప్రతిపాదించిన ఎలివేటెడ్‌ కారిడార్లపై మెట్రో కారిడార్‌లు రానున్నాయి. కానీ.. బేగంపేట్‌ విమానాశ్రయ సరిహద్దు వెంట ప్యారడైజ్‌ నుంచి బోయినపల్లి మధ్య 600 మీటర్ల వరకు భూగర్భ మార్గం రానుంది. దీంతో డబుల్‌ ఎలివేటెడ్‌ సాధ్యం కాదు. దీంతో బోయిన్‌పల్లి వద్ద  ఎలివేటెడ్‌ మెట్రో రానుంది.  
⇒ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వారితోపాటు, సికింద్రాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఈ కారిడార్‌లు కీలకం కానున్నాయి.    

స్కైవాక్‌ కనెక్టివిటీ... 
జేబీఎస్‌ మెట్రో హబ్‌ విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్యారడైజ్, జేబీఎస్‌ స్టేషన్‌లతో పాటు కొత్తగా మేడ్చల్‌ కారిడార్‌ కోసం నిర్మించనున్న స్టేషన్‌ల మధ్య స్కైవాక్‌ ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రయాణికులు అన్ని వైపులా  రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. మేడ్చల్, శామీర్‌పేట్‌ల నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 60 కిలోమీటర్ల ప్రయాణ సదుపాయం లభించనుంది. ఈ హబ్‌ వల్ల నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం లభించనుంది. 

అన్ని సదుపాయాలతో కూడిన ‘అర్బన్‌ యాక్టివిటీ సెంటర్‌’గా జేబీఎస్‌ హబ్‌ను ఏర్పాటు చేయాలని  నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు. హైదరాబాద్‌ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని పేర్కొన్నారు. రెస్టారెంట్‌లు, మలీ్టప్లెక్స్‌లతో పాటు కో– వర్కింగ్‌ ప్లేస్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కొన్ని ఐటీ సంస్థలు మెట్రో స్టేషన్‌లలో ఇలాంటి సదుపాయాలను వినియోగించుకుంటున్నాయి. కార్యాలయాల నిర్వహణ భారం దృష్ట్యా కో–వర్కింగ్‌ ప్లేస్‌లకు ప్రాధాన్యం ఏర్పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement