
సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకూ మెట్రో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో నగర వాసులు మెట్రో వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ సుమారు 5.05 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తుండగా వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ప్రయాణికుల రద్దీ 5.50 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉదయం, సాయంత్రం వేళల్లో జనం కిక్కిరిసి ప్రయాణిస్తుండగా ఏప్రిల్ నాటికి పరిస్థితి మరింత ఇబ్బందిగా మారనుంది. మెట్రోల్లో కనీసం నిల్చుని ప్రయాణం చేసేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొంది, ప్రతి మెట్రోస్టేషన్‌లో ఇప్పటికే కనీసం రెండు రైళ్లకు సరిపడా ప్రయాణికులు ప్రతి ట్రిప్పు కోసం పడిగాపులు కాస్తున్నారు. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికిప్పుడు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసే అవకాశం లేకపోయినా అదనపు ట్రిప్పులను పెంచేందుకు హైదరాబాద్ మెట్రోరైల్ చర్యలు చేపడుతోంది.
కొత్త కోచ్‌లు లేనట్లేనా..
ప్రయాణికుల రద్దీ మేరకు మెట్రో సర్వీసులను ఇప్పుడున్న 3 కోచ్‌ల నుంచి 6 కోచ్‌లకు పెంచేందుకు ఏడాది క్రితమే ప్రణాళికలను రూపొందించారు. మహారాష్ట్రలోని నాగపూర్ మెట్రో నుంచి మెట్రో కోచ్‌లను తెప్పించనున్నట్లు ప్రతిపాదించారు. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ అధికారులు సైతం కొత్త కోచ్‌లను తెప్పించనున్నట్లు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉందనే విషయంలోనూ స్పష్టత లేకుండాపోయింది. మరోవైపు నగరంలో మెట్రోలను తీవ్రమైన నష్టాల్లో నడుపుతున్నట్లు చెబుతున్న ఎల్‌అండ్‌టీ కొత్త కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు సంసిద్ధంగా ఉందా? అనే అంశం కూడా సందేహాస్పదమే.
రాయదుర్గం– నాగోల్, ఎల్‌బీనగర్– మియాపూ ర్ రూట్‌లలో నడిచే రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ మేరకు మెట్రోలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఐటీ కారిడార్‌లలో పని చేసే ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వారు సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారు. విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సాధారణంగా రద్దీ కారణంగా ఒక రైలు ఎక్కలేకపోయిన వాళ్లు మరో ట్రైన్ కోసం ధీమాగా ఎదురు చూస్తారు. కానీ ఆ తర్వాత వచ్చే రెండు రైళ్లు కూడా కిక్కిరిసి ఉండడంతో మెట్రో ప్రయాణం ప్రయాసగా మారుతోంది. ఈ క్రమంలో కొత్త కోచ్‌లు అందుబాటులోకి రాకపోయినా కనీసం ట్రిప్పులను పెంచేందుకు చర్యలు తీసుకోవడం ప్రయాణికులకు కొంత మేరకు ఊరట కలిగించనుంది.
త్వరలో 1,500 ట్రిప్పులు..
ప్రస్తుతం ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున నడుస్తుండగా.. రద్దీ వేళల్లో ప్రతి 2 నిమిషాలకు ఒక మెట్రో చొప్పున అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 1,065 ట్రిప్పులు తిరుగుతుండగా త్వరలో రోజుకు 1,500 ట్రిప్పులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ట్రిప్పుల పెంపుపై కసరత్తు చేపట్టనున్నారు. నాగోల్– రాయదుర్గం, ఎల్‌బీనగర్– మియాపూర్ కారిడార్‌లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్, తార్నాక తదితర ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌లకు రాకపోకలు సాగించే ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని షటిల్స్‌ను నడిపేందుకు సైతం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment