‘నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే’ (నాస్) 2017 నవం బర్–2021 ఫలితాలు విద్యార్థులలో కనీస సామర్థ్యాలు కొరవడినట్టు తేల్చింది. భాషలో విద్యార్థులు సుమారు 70 శాతం మంది కనీస స్థాయి లేదా అంత కంటే తక్కువస్థాయి సామ ర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు 2021 నాస్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
2020 మార్చి నుండి రెండేళ్ల పాటు కరోనా కారణంగా విద్యారంగం అతలాకుతలం అయింది. దీనివలన తలెత్తిన అభ్యసనా సంక్షోభం విద్యాశాఖ ముందు అనేక సవాళ్లను మిగిల్చింది. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యసన సంక్షోభాన్ని నివారించి, తరగతి వారీగా భాష, గణితాల సామర్థ్యాలను సాధించడానికి ‘జాతీయ విద్యావిధానం–2020’ అమలులో భాగంగా దేశవ్యాప్తంగా ‘ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీని ద్వారా ప్రాథమిక స్థాయిలో 11 ఏళ్ల లోపు ఉన్న 5 కోట్ల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అంచనా.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ‘తొలి మెట్టు’ అనేపేరుతో 2022 ఆగస్టు 15 నుండి అమలు చేస్తున్నారు. ‘సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తెలంగాణ విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్రంలోని 52 వేల మంది ఉపాధ్యాయులకు 3 విడతలలో శిక్షణ అందించారు. అందుకే ఈ కార్యక్రమాన్ని 2025 వరకు అమలు అయ్యే విధంగా రూపకల్పన చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 11.24 లక్షల విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
ఈ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి తరగతి గదిలో మూడు ముఖ్యమైన విషయాలు చోటు చేసుకోవాలి. 1. తగిన పాఠ్య బోధన సోపానాలు వినియోగించుకుంటూ పీరియడ్ ప్రణాళికను అమలు చేయాలి. 2. అవసరమైన బోధనాభ్యసన సామగ్రితో అభ్యసన ప్రక్రియ కొనసాగాలి. 3. పాఠ్యపుస్తకాన్ని సమర్థంగా వినియోగించాలి.
‘తొలిమెట్టు’ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి తరగతి గదిలో విద్యార్థితో మాట్లాడించడం, కీలక పదాలను గుర్తింపచేయడం, పఠన కృత్యాలు నిర్వహించడం వంటివి నిర్వహించి అభ్యాసం కల్పించాలి. ఇందుకోసం రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణాసంస్థ కృత్యపత్రాలను కూడా తయారు చేసి ఉపాధ్యాయులకు అందచేస్తుంది. వీటి సహకారంతో పాఠశాల విద్య పూర్తయ్యేసరికి విద్యార్థులంతా ఆయా సబ్జెక్టులలో నిర్దేశించిన సామర్థ్యాలలో అభ్య సన ఫలితాలను సాధించాలి. అప్పుడే గుణాత్మక విద్యను సాధించినట్లుగా భావిస్తారు.
‘తొలిమెట్టు’ కార్యక్రమాల అమలు పర్య వేక్షణ కోసం మండల స్థాయిలోనూ, పాఠశాల సముదాయ స్థాయిలోనూ... నోడల్ అధికారులనూ, విషయ నిపుణులనూ నియమించారు. వీరు పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో బోధనను పరిశీలించి ఎక్కడికక్కడ అనుమాన నివృత్తి చేసి, సమీక్షలు నిర్వహిస్తూ ‘తొలిమెట్టు’ విజయవంతం కావడానికి ప్రయత్నం చేస్తారు.
ఇంతవరకు బాగానే ఉన్నా తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నచోట కూడా 5 తరగతులకు ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణతో పాటు విద్యాశాఖకు ఎప్పటికప్పుడు పంపించవలసిన నివేదికలను నింపడంతోనే ఒకరికి బాధ్యతలు సరిపోతే మిగిలిన ఒక్కరితో బోధన సాధ్యమేనా? ఏలికలే ఆలోచించాలి. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!)
మొత్తం మీద జాతీయ విద్యావిధానం–2020 అమలుకు తొలిమెట్టు కార్యక్రమ ఉత్తమ ఫలితాలు అవసరం. తెలంగాణలో తొలిమెట్టు కార్యక్రమం ద్వారా తరగతి గదిలో మార్పు ఎంతవరకు సాధ్యం అనేది వేచి చూడాల్సిందే. (క్లిక్ చేయండి: ప్రాథమిక స్థాయిలో శిక్షణేదీ?)
- డాక్టర్ సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు
సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment