
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారత టెకీలదే పైచేయి
ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో నంబర్‌వన్ స్థానం
పని పద్ధతుల్లోకి ఏఐని ప్రవేశపెట్టడం ద్వారా కెరీర్ జూమ్
2025 గ్లోబల్ వర్క్‌ప్లేస్ స్కిల్స్ స్టడీలో ఆసక్తికర అంశాలు
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీని సృష్టించటంలో కాస్త వెనుకబడి ఉండవచ్చు.. కానీ టెక్నాలజీని అందిపుచ్చుకుని దానిని శిఖర స్థాయికి తీసుకెళ్లటంలో భారతీయ నిపుణులకు ఎవరూ సాటి రారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌రంగం(Software sector)లో భారతీయ టెకీలతో అగ్రరాజ్యాల నిపుణులు కూడా పోటీ పడలేరని ఇప్పటికే నిరూపణ అయ్యింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన కృత్రిమ మేథ (ఏఐ)(AI)లో కూడా భారతీయ నిపుణులదే అగ్రస్థానమని తాజా సర్వేలో తేలింది.
పని ప్రదేశాల్లో ఏఐ, జెనరేటివ్ ఏఐ టూల్స్ వినియోగం ద్వారా ప్రపంచ సగటు కంటే మెరుగైన ఉత్పాదకతను సాధించి భారతీయులు ప్రత్యేకతను చాటుతున్నారు. వృత్తి నైపుణ్యం, వృత్తిగతంగా అత్యాధునిక సాంకేతికతల వినియోగం, ఏఐతో కూడిన ‘వర్క్‌ప్లేస్ ట్రాన్స్‌ఫార్మేషన్’ను భారతీయ వృత్తి నిపుణులు వేగంగా అందిపుచ్చుకుంటున్నారని ‘2025 గ్లోబల్ వర్క్‌ప్లేస్ స్కిల్స్ స్టడీ(Global Workplace Skills Study)’పేరిట ఎడ్‌టెక్ యూనికార్న్ ఎమెరిటస్ నిర్వహించిన సర్వేలో తేలింది.
సర్వేలోని కీలక అంశాలు..
⇒ 18 దేశాల్లోని ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మాన్యుఫాక్చరింగ్, సాఫ్ట్‌వేర్, ఐటీ సర్విసెస్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో పనిచేస్తున్న 6 వేల మంది (21–65 ఏళ్ల లోపువారు) ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 1,700 మంది భారతీయ వృత్తి నిపుణులు ఉన్నారు.
⇒ ఏఐ మెళకువలను అందిపుచ్చుకోవడం (ఏఐ అడాప్షన్)లో 96 శాతంతో ప్రపంచంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. 84 శాతంతో ద్వితీయ స్థానంలో ఇంగ్లాండ్, 81 శాతంతో తృతీయ స్థానంలో అమెరికా నిలిచాయి.
⇒ ఏఐ ద్వారా భిన్నమైన రంగాల్లో పరిశ్రమల స్థాపన (ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్)కు అవకాశం లభిస్తుందని 94 శాతం మంది భారతీయులు భావిస్తున్నారు.
⇒ ఏఐకి అనుగుణంగా పని విధానాన్ని మలుచుకున్నందువల్ల ఉత్పాదక పెరిగిందని 95 శాతం మంది భారతీయ నిపుణులు తెలిపారు.
⇒ ఏఐ నైపుణ్యాలు దీర్ఘకాలిక కెరీర్‌కు, ప్రాధాన్యత కోల్పోకుండా ఉద్యోగాలు, వృత్తుల్లో కొనసాగింపునకు దోహ దపడుతుందని 94 శాతం మన టెకీలు భావిస్తున్నారు.
⇒ కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరచడానికి ఏఐ, జనరేటివ్ ఏఐ కీలకమని 90 శాతం భారత వృత్తి నిపుణులు విశ్వసిస్తున్నారు.
⇒ 71 శాతం సంస్థల అధిపతులు, యాజమాన్యాలు ఏఐ శిక్షణలో పెట్టుబడులను పెంచాయి.
భారత్‌లో కోరుకుంటున్న టాప్–5 నైపుణ్యాలు ఏఐ డెవలప్‌మెంట్, అప్లికేషన్ మాస్టరింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెషీన్ లర్నింగ్ (ఎంఎల్) స్ట్రాటజిక్ లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్
మన టెకీల కృషి అభినందనీయం
మారుతున్న కాలాన్ని బట్టి అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతను వర్క్‌ఫోర్స్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తగ్గట్టుగా నూతన నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలి. ఇండియాలోని వర్క్‌ఫోర్స్ ఏఐ మెళకువలను అందిపుచ్చుకుని, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దే దిశలో కృషి సాగించడం అభినందనీయం. – అశ్విన్ దామెర, ఎమెరిటస్ కో ఫౌండర్, సీఈవో
Comments
Please login to add a commentAdd a comment