Software sector
-
ఒక షేర్ ఉంటే మరో షేర్ ఉచితం
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతంపైగా ఎగసి రూ. 3,209 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,646 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 22,302 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,516 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి వాటాదారులవద్దగల ప్రతీ షేరుకి మరో షేరుని డిసెంబర్ 15కల్లా ఉచితంగా కేటాయించే వీలుంది. గైడెన్స్ వీక్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో పనిదినాలు తగ్గడం, సీజనల్ బలహీనతలు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. దీంతో క్యూ3 ఆదాయంలో వృద్ధి అంచనా(గైడెన్స్)లను –2 నుంచి 0 శాతానికి సవరించారు. ఇంతక్రితం –1 నుంచి +1% గైడె న్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన క్లయింట్లను పెంచుకోవడంతోపాటు.. మరోసారి భారీ డీల్స్ బుకింగ్స్ బిలియన్ డాలర్లను దాటినట్లు పల్లియా వెల్లడించారు. ఆన్‌బోర్డింగ్ పూర్తిచేస్తాం ఈ డిసెంబర్‌కల్లా మొత్తం రిక్రూట్మెంట్ బ్యాక్‌లాగ్స్‌ను పూర్తి చేయనున్నట్లు విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు 6 నెలల నుంచి 2ఏళ్లవరకూ ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేస్తున్నట్లు వెలువడుతున్న విమర్శలకు చెక్ పెడుతూ గోవిల్ క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో అన్ని ఆఫర్లను క్లియర్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రతీ త్రైమాసికంలోనూ 2,500–3,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం విప్రో మొత్తం సిబ్బంది సంఖ్య 2,33,889ను తాకింది. 44,000 మందికి శిక్షణ క్యాప్కో పురోగతి కొనసాగుతున్నట్లు పల్లియా పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ, కన్జూమర్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగాలలో వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. ఏఐ ఆధారిత విప్రోను పటిష్టపరచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐలో 44,000మంది ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసినట్లు వెల్లడించారు. సెపె్టంబర్లో ప్రతిభ ఆధారిత వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు. షేరు బీఎస్ఈలో 0.7% నీరసించి రూ. 529 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్ 20 వేలమంది ఫ్రెషర్స్‌కు ఛాన్స్
ముంబై: సాఫ్ట్వేర్ సేవల ఎగుమతుల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 6,506 కోట్లను తాకింది. 4.4 శాతం అధికంగా రూ. 8,649 కోట్ల నిర్వహణ లాభం(ఇబిట్) ఆర్జించింది. 21.1 శాతం ఇబిట్ మార్జిన్లు సాధించింది. మొత్తం ఆదాయం సైతం 5 శాతం ఎగసి రూ. 40,986 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాల(గైడెన్స్)ను తాజాగా మెరుగుపరచింది. 3.75–4.5 శాతం మధ్య వృద్ధి సాధించగలమని ప్రకటించింది. ఇంతక్రితం క్యూ1 ఫలితాల సమయంలోనూ ఆదాయ వృద్ధి అంచనాలను 1–3 శాతం నుంచి 3–4 శాతానికి పెంచిన విషయం విదితమే. వాటాదారులకు షేరుకి రూ. 21 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డ్ డేట్ ఈ నెల 29కాగా.. నవంబర్ 8కల్లా చెల్లించనుంది. డాలర్లలో ఆదాయం త్రైమాసికవారీగా 4 శాతం ఎగసి 4.89 బిలియన్లను అధిగమించింది. ఇతర విశేషాలు.. → మొత్తం 2.4 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. → ఆరు త్రైమాసికాలుగా ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వస్తున్న ట్రెండ్‌కు క్యూ2లో చెక్ పడింది. నికరంగా 2,500 మందిని జత చేసుకుంది. → సెప్టెంబర్‌కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 3,17,788 కు చేరుకుంది. → ఉద్యోగ వలసల రేటు 14.6% నుంచి 12.9 శాతానికి తగ్గింది. → ఈ ఏడాది 15,000–20,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనుంది. ఇప్పటికే తొలి అర్ధభాగంలో కొంత మందికి చోటిచి్చంది. డిమాండ్ జూమ్ అన్నివైపుల నుంచి సాఫ్ట్వేర్ సేవలకు డిమాండ్ బలపడటం మెరుగైన గైడెన్స్‌కు సహకరించింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమలో కీలకమైన ఫైనాన్షియల్ రంగ క్లయింట్ల నుంచి భారీ డీల్స్ పెరుగుతుండటం ప్రభావం చూపింది. కోబాల్ట్‌తో క్లౌడ్, టోపజ్తో జెన్ఏఐ ద్వారా కంపెనీ సామర్థ్యాలు మరింత బలపడ్డాయి. దీంతో క్లయింట్లు ఇన్ఫోసిస్‌తో జత కట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీషేరు బీఎస్ఈలో 3% బలపడి రూ. 1,975 వద్ద ముగిసింది. -
సాఫ్ట్వేర్ చిన్నారి! ఏకంగా వీడియో గేమ్‌లనే రూపొందిస్తోంది!
సాఫ్ట్వేర్ చిన్నారిప్రపంచమంతా టెక్నాలజీతోపాటు పరుగులు పెడుతోంది. అందుకే చిన్నా..పెద్దా తేడా లేకుండా అంతా స్మార్ట్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల దాకా అన్నీ అవలీలగా వాడేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కోడింగ్ ద్వారా వివిధ రకాల అప్లికేషన్లు, గేమ్‌లు తయారు చేస్తుంటారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో కొంతమంది మాత్రమే వీటిని తయారు చేయగలరు. మిగతావారికి కోడింగ్ అంటే అర్థం కాని పెద్ద సబ్జెక్ట్‌గా చూస్తారు. అటువంటిది భారత సంతతికి చెందిన సీమర్ ఖురానా కోడింగ్‌ను మునివేళ్లతో పట్టి చకచక వీడియోగేమ్‌ను రూపొందించింది. అతిపిన్నవయసులో వీడియోగేమ్ రూపొందించి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన వీడియోగేమ్ డెవలపర్‌గా గిన్నిస్ రికార్డుల్లో నిలిచింది. కెనడాలోని ఆంటారియోలో నివసిస్తోన్న భారత సంతతికి చెందిన పరాస్ ఖురానా కూతురే సీమర్. చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండే సీమర్ తన వయసు పిల్లలంతా వీడియోగేమ్‌లు ఆడుకుంటుంటే సీమర్ మాత్రం... తన సీనియర్లు చదివే పాఠాలు నేర్చుకోవడానికి ఆరాటపడేది. మ్యాథ్స్ అంటే మక్కువ ఎక్కువ ఉన్న సీమర్.. తన తరగతి కాకుండా పైతరగతి విద్యార్థులు చదివే లెక్కల పాఠాలు నేర్చుకోవాలనుకునేది. కానీ ఎవరూ నేర్పించేవాళ్లు కాదు. దీంతో యూట్యూబ్‌లో చూసి లెక్కలు నేర్చుకునేది. కిండర్ గార్డెన్ చదివే సీమర్ మూడోతరగతి లెక్కలు సులభంగా చేసేది. ఒకపక్క లెక్కలు చెబుతూనే కాగితాలతో క్రాఫ్ట్ తయారు చేసి ఆడుకుంటూ ఉండేది. ఇది గమనించిన సీమర్ తండ్రి కోడింగ్ క్లాసులను చూపించారు. కోడింగ్ నచ్చడంతో సీమర్ కోడింగ్ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది. క్రమంగా కోడింగ్‌పై పట్టుసాధించేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది. డాక్టర్ మాటలు విని... సీమర్ అక్క ఆరోగ్యం పాడవడంతో ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కను పరీక్షించిన డాక్టర్ జంక్ఫుడ్ని మానేయాలని చెప్పడంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే హెల్దీ, జంక్‌ఫుడ్‌ల గురించి వీడియో గేమ్ తయారు చేయాలనుకుంది. దీనికోసం వారానికి మూడు క్లాసులకు హాజరవుతూ ఏడాదిలోపే కోడింగ్‌ను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఆ తరువాత ‘హెల్దీఫుడ్ ఛాలెంజ్’ పేరిట వీడియో గేమ్‌ను తయారు చేసింది. జంక్ ఫుడ్ వల్ల ఏర్పడే ముప్పు, ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం ఎలా తీసుకోవాలో ఈ వీడియోగేమ్ వివరంగా చెబుతుంది. ఈ యాప్‌ను తయారు చేయడానికి స్కూలు అయిపోయిన తరువాత రోజుకి రెండు గంటలపాటు సమయాన్ని కేటాయించేది సీమర్. ఇలా తన పేరుని గిన్నిస్‌బుక్‌లో ఎక్కించుకుంది. వీడియో గేమ్‌లే కాదు... లెక్కలు, కోడింగ్‌తోపాటు డ్యాన్స్, జిమ్నాస్టిక్స్, కరాటేలు కూడా నేర్చుకుంటోంది.‘సీమర్స్ వరల్డ్’ పేరుమీద యూ ట్యూబ్ ఛానల్ నడుపుతూ తనకొచ్చే వివిధ రకాల ఆటల ఐడియాలను షేర్ చేస్తోంది. టాలెంట్‌కు వయసుతో సంబంధంలేదనడానికి సిసలైన ఉదాహరణగా నిలుస్తోంది సీమర్. చిచ్చర పిడుగుల్లాంటి పిల్లలు వయసు కంటే పెద్ద చదువులు చకచకా చదివేసి, డిగ్రీ పట్టాలు పొందేస్తుంటారు. అయితే అంతకన్నా చకచకా అడుగులు వేసింది సీమర్. డిగ్రీలు చదవడం కాదు... ఏకంగా వీడియో గేమ్నే రూపొందించింది ఈ ఆరేళ్ల సిసింద్రీ సీమర్ ఖురానా. (చదవండి: ఏడు నిమిషాలపాటు గుండె ఆగిపోయింది..వైద్యపరంగా 'డెడ్'! కానీ ఆ వ్యక్తి..) -
లోన్ యాప్‌లకు కళ్లెం..వేధింపుల కట్టడికి గూగుల్ చర్యలు
సాక్షి, అమరావతి : లోన్ యాప్ సంస్థల వేధింపులకు ఎట్టకేలకు కళ్లెం పడనుంది. భారీ వడ్డీలతో బెంబేలెత్తిస్తూ, రుణ గ్రహీతల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ వేధించే లోన్ యాప్ సంస్థల కట్టడికి గూగుల్ సిద్ధమవుతోంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లోన్ యాప్ సంస్థలకు అందుబాటులో లేకుండా మార్గదర్శకాలు రూపొందించింది. కొత్త విధానం మే 31 నుంచి అమలులోకి రానుంది. ఫొటోలు, వీడియోల మార్ఫింగులతో వేధింపులు చైనా కేంద్రంగా పనిచేస్తున్న లోన్ యాప్ సంస్థలు అత్యధిక వడ్డీలు, పారదర్శకతలేని విధానాలతో రుణ గ్రహీతలను వేధిస్తున్నాయి. ఎంతగా వాయిదాలు చెల్లిస్తున్నా వడ్డీ, అసలు కలిపి అప్పు కొండలా పెరుగుతుందే తప్ప తగ్గదు. వాయిదాల చెల్లింపులో జాప్యం చేస్తే రుణ గ్రహీతల మొబైల్ ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని తీసుకొని దుర్వినియోగం చేస్తున్నాయి. రుణం తీసుకున్న వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బంధువులు, మిత్రులకు వాట్సాప్ చేస్తూ వేధిస్తున్నాయి. ఈ అవమాన భారంతో దేశంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే వ్యక్తుల ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం అంతా ఆ యాప్ నిర్వాహకులకు అందుబాటులోకి తేవాలి. ఈమేరకు యాక్సెస్‌కు అనుమతిస్తేనే లోన్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. రుణం కావాలన్న ఆతృతలో వ్యక్తులు యాక్సెస్‌కు అనుమతిస్తున్నారు. దీన్నే ఆ సంస్థలు దుర్వినియోగం చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాయి. దాంతో రంగంలోకి దిగిన కేంద్ర హోం, ఆర్థిక శాఖలు లోన్‌యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించాయి. మనీలాండరింగ్‌కు, ఆర్థి క మోసాలకు పాల్పడుతున్న పలు లోన్ యాప్ కంపెనీలపై కేసులు పెట్టాయి. 2022లో 2 వేల కంపెనీలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వ్యక్తిగత సమాచారానికి యాక్సెస్ ఇవ్వొద్దని గూగుల్‌కు ఆదేశం వ్యక్తుల వ్యక్తిగత సమాచారం లోన్ యాప్ సంస్థలకు అందుబాటులో లేకుండా చేయడమే దీనికి పరిష్కారమని కేంద్ర హోం శాఖ భావించింది. వ్యక్తిగత సమాచారం కోరే లోన్ యాప్‌లకు ప్లే స్టోర్‌లో అవకాశం ఇవ్వద్దని గూగుల్‌కు కొన్ని నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆ యాప్ సంస్థలతో పాటు గూగుల్‌పైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తేలి్చచెప్పింది. దాంతో గూగుల్ దిగి వచ్చింది. వ్యక్తిగత సమాచారం లోన్‌యాప్‌లకు అందుబాటులో లేకుండా చేసేందుకు చర్యలు చేపడుతోంది. లోన్ యాప్ కంపెనీలకు గూగుల్ మార్గదర్శకాలు భారత్‌లో వ్యాపారం చేసే లోన్ యాప్ సంస్థలకు గూగుల్ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ యాప్‌లను డౌన్లోడ్ చేసుకునే వారి వ్యక్తిగత సమాచారాన్ని కోరకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు యాప్‌ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని చెప్పింది. భారత్‌లో నాన్ బ్యాంకింగ్ వ్యవహారాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలను పాటించాలని, ఈమేరకు డిక్లరేషన్ ఇచ్చే యాప్ సంస్థలనే గూగుల్ ఇండియా ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. కొత్త విధానం ప్రకారం లోన్ యాప్‌లను మాడిఫై చేసి ఈ ఏడాది మే 31లోగా అప్లోడ్ చేయాలని చెప్పింది. వాటినే ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీంతో దేశంలో లోన్ యాప్‌ల వేధింపులకు కళ్లెం పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
ఐటీకి బ్యాంకింగ్ షాక్!
రెండు వారాలుగా అమెరికా, యూరప్ ప్రాంతాల బ్యాంకింగ్ రంగంలో ఒకేసారి సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. పలు బ్యాంకులు మూత పడుతున్నాయి. దీంతో దేశీ ఐటీ రంగానికి సమస్యలు ఎదురుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిశ్రమ ఆదాయంలో అత్యధిక వాటాకు ప్రాతినిధ్యం వహించే బీఎఫ్ఎస్ఐ విభాగం ఇందుకు కారణం కానున్నట్లు అంచనా. సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్దిరోజులుగా అటు అమెరికా, ఇటు యూరప్ బ్యాంకింగ్ రంగాలలో ప్రకంపనలు పుడుతున్నాయి. అమెరికాలో ఉన్నట్టుండి సిల్వర్‌గేట్ క్యాపిటల్ మూతపడగా.. వైఫల్యాల బాటలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్(ఎఫ్‌డీఐసీ) టేకోవర్ చేసింది. ఈ బాటలో సిగ్నేచర్ బ్యాంక్ సైతం దివాలాకు చేరగా.. న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ ఆదుకుంది. అనుబంధ సంస్థ ఫ్లాగ్‌స్టార్ బ్యాంక్ ద్వారా ఆస్తుల కొనుగోలుకి అంగీకరించింది. ఇక మరోపక్క యూరోపియన్ బ్లూచిప్ క్రెడిట్ సూసీ దివాలా స్థితికి చేరడంతో స్విస్ కేంద్ర బ్యాంకు కల్పించుకుని ఫైనాన్షియల్ రంగ దిగ్గజం యూబీఎస్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇక తాజాగా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును ఆదుకోవాలని జేపీ మోర్గాన్ ఇతర దిగ్గజాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 2008 తదుపరి మరోసారి ఫైనాన్షియల్ రంగంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ ప్రభావం దేశీ సాఫ్ట్వేర్ సేవల రంగాన్ని దెబ్బ తీసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కోలుకుంటున్న వేళ కోవిడ్–19 సవాళ్లలో ఊపందుకున్న సాఫ్ట్వేర్ రంగం ఇటీవల రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో కొంత అనిశ్చిత వాతావరణాన్ని చవిచూస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఉద్యోగ నియామకాలు మందగించగా.. వచ్చే ఏడాదిపై ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే ఇంతలోనే బ్యాంకింగ్ రంగ సంక్షోభం ద్వారా మరో షాక్ తగలనున్నట్లు పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో కుదుపుల కారణంగా దేశీ ఐటీ దిగ్గజాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నట్లు చెబుతున్నారు. బీఎఫ్ఎస్ఐ దెబ్బ దేశీ ఐటీ సేవల రంగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. సాఫ్ట్వేర్ రంగ సమాఖ్య నాస్కామ్ గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయంలో 20–40 శాతం వాటాను ఆక్రమిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈ వాటా 41 శాతాన్ని తాకనున్నట్లు అంచనా. ఇటీవల సవాళ్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు ప్రధానంగా దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎంఫసిస్ సేవలు అందిస్తున్నాయి. ఉదాహరణకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసీ, యూబీఎస్లకు టీసీఎస్ ఐటీసర్వీసులు సమకూర్చుతోంది. ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం సైతం సేవలు అందిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనే ఈ కంపెనీలు ప్రొవిజన్లు చేపట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే 2008లో లేమన్ బ్రదర్స్ దివాలా తదుపరి బ్యాంకులు వ్యయాల తగ్గింపు, బిజినెస్ పెంపు ప్రాజెక్టులపై దృష్టి సారించడంతో దీర్ఘకాలంలో ఐటీ రంగం బలపడిన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి డీల్స్ తగ్గనుండగా.. కాంట్రాక్ట్ ధరలపై సైతం ఒత్తిడి తలెత్తవచ్చని అంచనా. దేశీ ఐటీ దిగ్గజాల ఆదాయాల్లో ఉత్తర అమెరికా, యూరోపియన్ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషించే సంగతి తెలిసిందే. వెరసి ఈ ఏడాది క్యూ4పై పెద్దగా ప్రభావం పడనప్పటికీ వచ్చే ఏడాది ప్రతికూలతలు కనిపించవచ్చని నిపుణులు తెలియజేశారు. మందగమనం అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగం సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో కొత్త డీల్స్ మందగించవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆధునిక ఆటోమేషన్ ప్రాసెస్, ట్రాన్స్ఫార్మేషన్ ప్రణాళికలు తదితరాలకు తాత్కాలికంగా బ్రేక్ పడే వీలున్నట్లు తెలియజేశారు. ఇది ఐటీ కాంట్రాక్టులు ఆలస్యమయ్యేందుకు కారణంకావచ్చని విశ్లేషించారు. తాజా ఐటీ వ్యయ ప్రణాళికలు వాయిదా పడవచ్చని, కొత్త ఆర్డర్లకు విఘాతం కలగవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీఎఫ్ఎస్ఐ అతిపెద్ద విభాగమని దీంతో దేశీ సాఫ్ట్వేర్ సేవలకు దెబ్బ తగలవచ్చని పేర్కొన్నారు. -
ఐటీ దెబ్బ.. భారత్‌లో పరిస్థితి ఏంటి?
అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. పెద్ద ఐటీ, టెక్ కంపెనీల్లో వేలాదిమందికి అకస్మాత్తుగా ఉద్వాసన పలికారు. అదే భారతీయ కంపెనీల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇతరులతో పోలిస్తే మన కంపెనీలు కొంచెం మెరుగ్గా ఉండటం కారణం కావచ్చు. కానీ ఒక్క విషయమైతే స్పష్టం. అమెరికా కంపెనీల మాదిరిగా సోషల్ మీడియా సృష్టించిందనుకున్న కొత్త ప్రపంచాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడకుండా... భారతీయ కంపెనీలు చేస్తున్న పనుల్లోనే కొత్త మార్గాలను అన్వేషించాయి. ఒకరు సృజనాత్మక సృష్టి చేసేవారైతే, ఇంకొకరు వాటిని అమలు చేసేవారు. వ్యాపార పరిస్థితుల్లో వేగంగా వచ్చిన మార్పుల ప్రభావం అమలు చేసేవారిపై పెద్దగా పడలేదు. ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, మెటా (ఫేస్బుక్), మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు గడచిన కొన్ని నెలల్లో ఒక్కొక్కటీ పదివేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచం మొత్తమ్మీద ఈ లేఆఫ్‌లు పెద్ద ప్రకంపనలే సృష్టించాయి. మరోవైపు భారతీయ ఐటీ దిగ్గజాలు మాత్రం కొత్త ఉద్యోగులను తీసుకునే వేగాన్ని తగ్గించడం ద్వారా పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ఇదే సమయంలో అమెరికన్ టెక్ కంపెనీల లేఆఫ్‌ల కారణంగా భారతీయ కంపెనీల్లో ‘అట్రి షన్ ’ (ఉద్యోగులు బయటికి వెళ్లిపోవడం) కూడా తగ్గింది. కరోనా మొదలైన సమయంలో ఈ అట్రిషన్ ప్రమాదకర స్థాయికి చేరు కున్న విషయం తెలిసిందే. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి భారీ భారతీయ కంపెనీలు ఐటీ సర్వీసుల రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఉత్పత్తుల ఆధారిత కంపెనీలూ కొన్ని ఉన్నా వీటిల్లో అత్యధికం ఈమధ్య కాలంలో మొదలైనవనే చెప్పాలి. ఒక రకంగా స్టార్టప్‌ల లాంటివన్నమాట. కరోనా ఉధృతి దిగివస్తున్న క్రమంలో అటు స్టార్టప్‌లు, ఇటు పెద్ద టెక్ కంపెనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొ న్నాయి. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందన్న వార్తలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం ఈ రెండు వర్గాల వారికి గోరుచుట్టుపై రోకటి పోటు చందమైంది. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇవ్వడం మొదలైంది. వ్యాపారం తగ్గిపోవడం, పెట్టుబడులు వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో లాభా లను కాపాడుకునేందుకు ఈ చర్యలు అనివార్యమయ్యాయి. మారిన అంచనాలు.. పరిస్థితులు బాగున్న కాలంలో టెక్ కంపెనీల్లో వృద్ధి బాగా నమోదైంది. ఫలితంగా ఆయా కంపెనీలు క్లౌడ్ సర్వీసులు, కృత్రిమ మేధ వంటి రంగాల్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు అంచనాలు మారిపోవడంతో మళ్లీ గతంలో మాదిరిగా పనులు చేసే ప్రయత్నం జరుగుతోంది. సరుకుల రవా ణాకు డ్రోన్ల వాడకం మొదలుకొని, గాలి బుడగల ద్వారా మూల మూలకూ ఇంటర్నెట్ అందించడం వంటి పలు ప్రాజెక్టులు అప్పట్లో గొప్ప ఆవిష్కరణలుగా అనిపించాయి, కానీ ఇప్పుడు అవి పెద్దగా పట్టించుకోని స్థితికి చేరాయి. సిలికాన్ వ్యాలీ కేంద్రబిందువు అని చెప్పుకునే శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతంలోనే గత ఏడాది 80 వేల ఉద్యో గాలకు కోత పడిందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. పెద్ద కంపెనీల్లో ఆపిల్, అమెజాన్ ఇప్పటికీ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. కాకపోతే గతం కంటే తక్కువగా. ఈ కంపెనీలిప్పుడు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా ఇదే పనిలో ఉంది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 2023 ఏడాది తన సామర్థ్యం పెంచుకునే సంవత్సరమని ప్రకటించింది. నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు గానూ కంపెనీ నిర్మాణంలోని మధ్య పొరలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. భారత్‌లో పరిస్థితి ఏమిటి? భారత్‌లో సిలికాన్ వ్యాలీ కేంద్రంగా బెంగళూరును చెప్పుకోవచ్చు. గత మూడు నెలల్లో అతిపెద్ద ఐటీ కంపెనీలు ఏడింటిలో సుమారు ఐదు వేల మందికి ఉద్వాసన పలికారు. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్‌లో 2022 చివరినాటికి మునుపటి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు (నియామకాల నుంచి లేఆఫ్‌లు తీసేయగా) ఉండగా... టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ట్రీల్లో మాత్రం ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఈ ఏడు కంపెనీలు కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు సంపాదించుకుంటున్నాయి. కానీ నైపుణ్యానికి చెల్లిస్తున్న మొత్తాలను నియంత్రించుకుంటూ, లాభాలను గరిష్ఠ స్థాయిలో ఉంచే ప్రయత్నం జరుగుతోంది. కరోనా వచ్చిన తొలి నాళ్లతో పోలిస్తే ఈ వైఖరి పూర్తిగా భిన్నం. అట్రిషన్ నియంత్రణకు, వ్యాపారాన్ని కాపాడుకునేందుకు అప్పట్లో కొత్త ఉద్యోగుల నియామ కాలు ఎడాపెడా జరిగాయి. పోటీ కంపెనీలు ఉద్యోగులను ఎగరేసుకు పోతే కొండంత ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేమన్న ఆలోచనతో అప్పట్లో అలా జరిగింది. నైపుణ్యమున్న ఉద్యోగులకు, ఇండస్ట్రీ అవసరాలకు మధ్య అంతరం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ఈ తేడా ఈ ఏడాది పది శాతం వరకూ ఉంటుందని అంచనా. ఈ ఏడాది రెండో సగంలో ఉద్యో గుల నియామకాలూ పూర్వస్థితికి చేరుకుంటాయని కంపెనీలు ఆశా భావంతో ఉన్నాయి. తేడాకు కారణాలివీ... ఉద్యోగుల నియామకాలు, ఉద్వాసనల విషయంలో అమెరికా, భారతీయ కంపెనీల మధ్య కనిపిస్తున్న స్పష్టమైన తేడాకు కారణా లేమిటో చూద్దాం. కరోనా ప్రపంచాన్ని చుట్టేసిన సందర్భంలో కంపెనీలన్నీ డిజిటల్ మార్గం పట్టే ప్రయత్నం మొదలుపెట్టాయి. క్లౌడ్ సర్వీసులకు ప్రాధాన్యమేర్పడింది. అందివచ్చిన కొత్త అవ కాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రతి కంపెనీ ఆశిం చింది. కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితమైపోయి... అట్టడుగు వర్గాల నుంచి కూడా టెక్నాలజీ కోసం డిమాండ్ ఏర్పడటంతో కంపెనీలు కూడా తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీ సర్వీసులకు విపరీతమైన డిమాండ్ రావడంతో నియా మకాలు జోరందుకున్నాయి. దీని ఫలితంగా ఆట్రిషన్ సమస్య పుట్టుకురావడం, ఆ క్రమంలోనే ఉద్యోగుల వేతన ఖర్చులు పెర గడం జరిగిపోయింది. రెండేళ్ల తరువాత కోవిడ్ తగ్గుముఖం పట్టడం మొదలైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచేశాయి. దీంతో మాంద్యం వచ్చేస్తుందన్న ఆందోళన మొదలైంది. చేతిలో ఉన్న నగదును కాపాడు కునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీలు టెక్నాలజీ రంగానికి కేటాయించిన నిధులకు కోత పెట్టాయి. ఇదే సమయంలో డిజిటల్ టెక్నాల జీలకు డిమాండ్ కూడా తగ్గిపోవడంతో వీటిని అభివృద్ధి చేసే కంపె నీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిస్థితుల్లో ఒక్క విషయమైతే స్పష్టం. భారతీయ సాఫ్ట్వేర్ దిగ్గజాలు పాశ్చాత్య కంపెనీల మాదిరిగా పూర్తిగా సృజ నాత్మక ఆలోచనలకు బదులు ముందుగానే నిర్ణయించిన పనులు చేయడంలోనే నిమగ్నమయ్యాయి. అమెరికా కంపెనీల మాదిరిగా సోషల్ మీడియా సృష్టించిందనుకున్న కొత్త ప్రపంచాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడకుండా, భారతీయ కంపెనీలు చేసే పనుల్లోనే కొత్త కొత్త మార్గాలను అన్వేషించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే– ఒకరు సృజనాత్మక సృష్టి చేసే వారైతే, ఇంకొకరు వాటిని అమలు చేసేవారన్నమాట. వ్యాపార పరిస్థితుల్లో వేగంగా వచ్చిన మార్పుల ప్రభావం అమలు చేసేవారిపై పెద్దగా పడలేదు. ఈ తేడా కారణంగానే భారతీయ కంపెనీల్లో పెద్ద స్థాయిలో లేఆఫ్‌లు లేకుండా పోయాయి. మంచి హోదా, వేతనం కోసం యువత ఇప్పుడు పెద్ద టెక్ కంపెనీ స్టార్టప్‌ల వైపు చూడాలి. ఓ మోస్తరు వేతనంతో స్థిరంగా ఉండాలని అనుకుంటే మాత్రం అమలు చేసేవారి వద్ద పనిచేయడం మేలు. అదన్న మాట అమెరికా, భారత కంపెనీల మధ్య తేడా! వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సాఫ్ట్వేర్ సెక్టార్ రికార్డ్! రూ. 5 లక్షల కోట్ల ఎక్స్‌పోర్ట్స్
న్యూఢిల్లీ: ఓవైపు కోవిడ్–19 మహమ్మారి మూడో దశలో భాగంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్నప్పటికీ ఐటీ ఎగుమతులు మాత్రం జంకబోవంటూ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) పేర్కొంది. వెరసి ఈ ఏడాది(2021–22) ఎస్టీపీఐ పథకంకింద రిజిస్టరైన కంపెనీల నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ. 5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం(2020–21)తో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో ఈ ఏడాది నిలకడ లేదా కొంతమేర వృద్ధి నమోదయ్యే వీలున్నట్లు ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అర్వింద్ కుమార్ తెలియజేశారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ వర్క్‌ఫ్రమ్ హోమ్ తదితరాలు అమలవుతున్న నేపథ్యంలో ఎస్టీపీఐ యూనిట్ల సేవలకు అంతరాయం ఏర్పడబోదని వివరించారు. డిజిటల్ పద్ధతిలో జరిగే సాఫ్ట్వేర్ సర్వీసుల ఎగుమతులు కొనసాగనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్టీపీఐ పథకంలో 4,689 సాఫ్ట్వేర్ యూనిట్లవరకూ రిజిస్టరయ్యాయి. దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్స్, సాంకేతిక సమాచార శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర వ్యవస్థగా ఎస్టీపీఐ ఏర్పాటైంది. దేశీయంగా నూతన ఆవిష్కరణలతోపాటు, టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రెండ్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా వర్థమాన సాంకేతికతల పరిజ్ఞానంతో కూడిన 25కుపైగా కేంద్రాలను నెలకొల్పింది. చదవండి:సెన్సార్ దెబ్బ.. ఏకంగా రూ.40 వేల కోట్ల నష్టం!! ఆగిపోతే ఆగమేమో? -
ఇంట్లో శత్రువులు!
సాక్షి, సిటీబ్యూరో: హైటెక్ యుగంలో సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తున్న మహిళామణులకూ గృహహింస తప్పడంలేదు. ఐటీ రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన భాగ్యనగరంలో ఏటా సుమారు వెయ్యి మంది మహిళలు ఈ తరహా హింస బారిన పడుతున్నట్లు సొసైటీ ఆఫ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ) తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో ప్రధానంగా భర్త, అత్త, మామలు, ఆడపడుచులు ఐటీ, బీపీఓ రంగాల్లో పనిచేస్తున్న మహిళల వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకుంటూ వారిని మానసికంగా హింసిస్తున్నారని తేలింది. ఆర్థిక, సామాజిక అంశాల్లో మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కల్పించడం, వారి స్వేచ్ఛను కట్టడి చేయడం.. చివరకు సోషల్ మీడియా వినియోగం విషయంలోనూ వారి పట్ల వివక్ష చూపడం, తరచూ వారి ఫోన్లు, స్నేహితులు, బంధువులతో జరిపే ఫోన్ చాటింగ్‌ను వారికి తెలియకుండా పరిశీలించడం, సామాజిక సంబంధాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం, సూటిపోటి మాటలు, వ్యక్తిగత జీవితంపై అనుమానంతో తరచూ వేధింపులకు గురిచేయడం.. కొన్నిసార్లు వారిపై హింసకు పాల్పడడం వంటివి చోటుచేసుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు సుమారు 220 మంది మార్గదర్శకులను రంగంలోకి దించినట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. కౌన్సెలింగ్‌తో నష్టనివారణ చర్యలు.. గృహహింసపై తమకు అందిన ఫిర్యాదులపై కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు. తొలుత కౌన్సెలింగ్‌తో సరిపెడుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రాని పక్షంలో వారికి పోలీసుశాఖ నిర్వహిస్తున్న భరోసా కేంద్రాలకు ఇలాంటి కేసులను బదిలీ చేస్తున్నామన్నారు. మహానగరం పరిధిలో సుమారు వెయ్యి వరకు ఐటీ, బీపీఓ సంస్థలున్నాయి. వీటిలో పనిచేసేవారిలో సుమారు మూడు లక్షలమంది వరకు మహిళలున్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. గతేడాది సుమారు వెయ్యి మంది ఇలాంటి గృహహింసను తాళలేక తమను సంప్రదించినట్లు తెలిపారు. వారి వ్యక్తి గత జీవితానికి ఇబ్బంది కలగని రీతిలో తమను సంప్రదించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నామన్నారు. తమ కౌన్సెలింగ్‌తో సుమారు 30 శాతం మందిలో మార్పు కనిపించిందని తెలిపారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన షీ టీమ్స్, భరోసా కేంద్రాలు సమర్థంగా పనిచేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల సహకారమే కీలకం.. ఐటీ, బీపీఓ తదితర రంగాల్లో పనిచేస్తున్న మహిళలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గడువులోగా ప్రాజెక్టులను పూర్తిచేయాలన్న ఒత్తిడితో పనిచేస్తుంటారు. వీరి పనివేళల్లోనూ అనూహ్య మార్పులుంటాయి. ఒకవైపు ఇంటి పని.. మరోవైపు ఆఫీస్ ఒత్తిడితో చిత్తవుతున్న మహిళలకు కుటుంబ సభ్యుల సహకారమే కీలకమని సైకాలజిస్టులు స్పష్టంచేస్తున్నారు. వారికి మానసిక సాంత్వన కల్పించడం, వారి రోజువారీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను అధిగమించేందుకు వారికి భరోసా, నైతిక మద్దతునిచ్చేందుకు ఇతోధికంగా సహకరించాలని సూచిస్తున్నారు. -
బ్యాంకింగ్.. సాఫ్ట్వేర్ రంగాల్లో అపార అవకాశాలు
ఒంగోలు: స్థానిక నిట్ సెంటర్లో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ప్రారంభించడం శుభపరిణామమని వ్యక్తిత్వ వికాస నిపుణుడు నల్లూరి రాఘవరావు అన్నారు. ఇటీవల నిట్ నిర్వహించిన ఇంటర్వ్యూల్లో జిల్లానుంచి ఎన్నికైన అభ్యర్థులకు మంగళవారం ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల అధిపతులు ఆఫర్ లెటర్ అందించారు. ప్రస్తుతం బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నిట్ సెంటర్ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 29 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. పేస్ నుంచి 8 మంది, క్విస్ నుంచి 5, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ 4, రైజ్ 3, ఎస్ఎస్ఎన్ 3, సెయింట్ ఆన్స్ 2, కిట్స్ నుంచి ఒకరు , వీవీఎస్ఆర్ నుంచి ఒకరు, శ్రీహర్షిణి నుంచి ఇద్దరు, బీఏకేఆర్ నుంచి ఒకరు ఎంపికయ్యారన్నారు. క్విస్, పేస్, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీల అధినేతలు నిడమానూరి నాగేశ్వరరావు, మద్దిశెట్టి శ్రీధర్, కంచర్ల రామయ్య, నిట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఫేస్బుక్ : ‘డిస్’లైక్
ప్రపంచంలో ఎంత కొమ్ములు తిరిగిన సంస్థలైనా చేసిన పొరబాట్లను ప్రాప్త కాలజ్ఞతతో దిద్దుకోకుంటే పోటీగా మరొకరు ఎదుగుతారనడానికి చాలా ఉదాహరణలు కనబడతాయి. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్ ’ ఇటీవల తన 40 సంవత్సరాల కంపెనీ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించుకుని ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. సాఫ్ట్వేర్ రంగంలో తనకు ఎదురు లేదన్న భ్రమలో ఇంతకాలం కేవలం డెస్క్‌టాప్ కంప్యూటర్ల వరకే ఆలోచించి, అంతకుమించి సాఫ్ట్వేర్ రంగం ముందుకు వెళ్ళబోదని ఈ కంపెనీ గట్టిగా భావించింది. అయితే, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే సాఫ్ట్వేర్ అవసరాలు ల్యాప్‌టాప్‌ని దాటిపోయి, మొబైల్ ఫోన్లకు చేరి పోయాయి. ఈ పరిణామాన్ని తాము సకాలంలో గుర్తించలేకపోయినందుకు మూల్యం చెల్లించుకున్నామని, ఇది తమ చారిత్రక తప్పిదమని మైక్రోసాఫ్ట్ నిర్వాహకులు చింతించారు. ఇకపై దిద్దుబాటుకు ఉపక్రమించారు. ఖండాల సరిహద్దులను సైతం చెరిపివేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఈరోజుల్లో కాలంతోపాటు మారకుంటే సంస్థలకు మనుగడ కష్టం. విశ్వవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొంది, 140 కోట్లమంది యాక్టివ్ వినియోగదారులున్న సోషల్ మీడియా సంస్థ ‘ఫేస్బుక్’. రెండు రోజుల క్రితం ఈ సంస్థ తీసుకున్న ఒక కీలక నిర్ణయం కూడా ఇలాంటి దిద్దుబాటు చర్యే. ఈ నిర్ణయం అటు దాని విస్తృతిని పెంచడం తోపాటు, ఇటు భావ స్వేచ్ఛాప్రియులను చిరకాలంగా ఇబ్బందిపెడుతున్న సున్నితమైన సమస్యను పరిష్కరిస్తుంది. ఫేస్బుక్లో ప్రస్తుతం ఎవరైనా ఖాతాదారు తన అకౌంట్ వాల్‌పై ఒక చిత్రం లేదా కథనం, వ్యాఖ్య, దృశ్యం వంటివి పోస్టు చేస్తే, దానిని వీక్షించిన, చదివిన వారు తమ స్పందనను ‘లైక్, కామెంట్, లేదా షేర్’ ఆప్షన్లలో తప్పనిసరిగా ఏదో ఒకటి ఎంచుకుని తీరాలి. మరో గత్యంతరం లేదు. 2004లో ఫేస్బుక్ ఆవిర్భవించిన నాటి నుంచి ఏదైనా విషయం నచ్చితే వినియోగదారులు ‘లైక్’ బటన్‌ను నొక్కుతూనే ఉన్నారు. ప్రతిరోజూ ఫేస్బుక్లో నమోదవుతున్న లైక్‌ల సంఖ్య ప్రస్తుతం 450 కోట్లకు చేరుకుంది. నచ్చకపోతే మరో అభిప్రాయం వెల్లడించడానికి మరో ఆప్షన్ లేనేలేదు. భావవ్యక్తీకరణ ప్రక్రియలో ఇదో ఇరకాటమైనస్థితి. ఎందుకంటే, ఏదైనా ఒక అంశాన్ని ఒక వ్యక్తి ఇష్టపడటానికి, ఇష్టపడ క పోవడానికి (లైక్, డిస్ లైక్) మధ్య మరెన్నో సున్నితమైన ఉద్వేగాలు ఉంటాయి. అభినందన, ప్రశంస, ఆశ్చర్యం, దిగ్భ్రాంతి, చిరు మందహాసం, చిరునవ్వు, పగలబడి నవ్వడం, విచారం, దుఃఖం, సానుభూతి, అనునయం, మద్దతు, పాక్షికంగా ఏకీభవించడం లాంటివి ఇందులో కొన్ని. ఈ భావాలను వ్యక్తీకరించడానికి ఫేస్బుక్లో ఎలాంటి బటన్స్ లేవన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలో ‘డిస్లైక్’ బటన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇందులో ఇతర భావోద్వేగాలు పంచుకోవడానికి కూడా సబ్ బటన్లు ఉండబోతున్నాయని ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఇటీవల సిరియా నుంచి లక్షలమంది నిస్సహాయ శరణార్థులు పడవల్లో, ఇతర వాహనాల్లో ప్రాణం దక్కించుకునేందుకు పరుగులు తీసిన దృశ్యాలను, మరీ విశేషించి బీచ్‌లో ముద్దులొలికే చిన్నారి బాలుడి భౌతిక దేహం చిత్రాన్ని వీక్షించి ప్రపంచమంతటా కోట్లమంది ఫేస్బుక్ వినియోగదారులు చలించిపోయారు. ఒక మానవ మహా విషాదానికి సంకేతంగా ఆ చిత్రాలు నిలిచాయి. వీటిపై ఆయా దేశాల ప్రభుత్వాలనే కదిలించే రీతిలో నెటిజన్లు స్పందించారు. ఫలితంగా, ఇల్లూవాకిలీ కోల్పోయి నీడలేని పక్షులైన శరణార్థులకు ఎంతో కొంత ఆసరా లభించింది. అయితే, నెటిజన్లకు ఇటువంటి సన్నివేశాలలోనే ఆచరణాత్మకంగా సమస్య ఎదురయ్యింది. దయనీయమైన ఈ చిత్రాలను చూసి ‘లైక్’ కొడితే సదరు చిత్రాలు బాగున్నాయన్న సందేశం ఇచ్చినట్టవుతుంది గాని, అయ్యో పాపం! అనే సానుభూతి అర్థం మిస్సవుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఫేస్బుక్ నిర్వాహకులు ‘ప్రపంచంలో ప్రతిదాన్నీ మంచిదనో చెడ్డదనో రెండు ముక్కల్లో చెప్పలేం. మీరేదైనా మీ పోస్టు ద్వారా చెప్పదలిస్తే మీ మిత్రులు ఇందులో వాస్తవంగా మీరనుకున్నదాన్ని గుర్తించి, అర్థం చేసుకుని, మీకు వారి స్పందన తెలపాలంటే మరిన్ని ఆప్షన్స్ అవసరమని అనుకుంటున్నామ’ ని చెప్పారు. దేశ దేశాల్లో ఉదయం నిద్రలేవగానే ఫేస్బుక్ ద్వారా మిత్రులకు ‘శుభోదయం’ చెప్పిన తరవాతే దినచర్య ఆరంభించే నెటిజన్లకు కొదవలేదు. ఆకర్షణీయమైన రూపాలు, భంగిమలతో సెల్ఫీలు దిగి వాటిని ఫేస్బుక్లో పోస్టు చేయడం ఈ రోజుల్లో యువతీ యువకులకు సర్వసామాన్యం. అయితే, తాము పోస్టు చేసిన ఫొటోకు రోజు గడిచినా ఆశించిన ‘లైకులు’ రాలేదని బాధపడి నిద్ర పట్టని వారూ లేకపోలేదు. ఇకపై వీరి ఫొటోలను చూసిన మిత్రులు కేవలం ‘లైక్’తో సరిపెట్టకుండా వీరి మనోభావాలకు అనుగుణంగా స్పందిస్తారు. నిజానికి, మానవ భావోద్వేగాలకు భాషతో పనిలేదు. క్రమం తప్పకుండా ఫేస్‌బుక్‌ని ఉపయోగించే వారిని నిత్యం ప్రపంచంలో ఎక్కడెక్కడివో దృశ్యాలు, కథనాలు కొన్ని అలరిస్తుంటాయి, మరికొన్ని వెన్నాడుతుంటాయి. ఇలా ఎవరో పోస్టు చేసిన ఫొటోలను, వ్యాఖ్యలను ఒక్కోసారి అవి అభ్యంతరకరమైనవని తెలియక ఇతరులకు పంపి (షేర్) పోలీసుల నిఘా కళ్ళకు చిక్కి జైళ్ళ పాలైనవారు మన దేశంలోనే ఎందరో ఉన్నారు. ఇటువంటి వారు ఇకపై తమ స్పందనని ‘లైక్, కామెంట్, షేర్’ అని కాకుండా సురక్షితమైన రూపంలో మరో విధంగా వెల్లడించవచ్చు. అయితే, ఈ విషయంపై అవగాహనలేని వారు ఇష్టాను సారం ‘లైకులు’ కొట్టి నిందితులుగా మారుతున్నారు. తమ తప్పులేకున్నా సమాజం, చట్టం దృష్టిలో న్యాయస్థానం బోనెక్కిన వారిగా ముద్రపడే నెటిజన్లకు ఫేస్బుక్ తాజా ఆలోచన ఎంతో ఊరటనిస్తుంది. అమాయకుల పాలిట గుదిబండలుగా మారిన ప్రస్తుత సైబర్ క్రైం నిబంధనలలో సైతం మార్పు తేవడానికి నాంది పలుకుతుంది. -
సాఫ్ట్వేర్ రంగంలో భారత్ కీలక పాత్ర
ఎరిక్సన్ ప్రెసిడెంట్, సీఈఓ హాన్స్ వెస్ట్‌బర్గ్ హైదరాబాద్: సాఫ్ట్వేర్ రంగంలో భారత్ ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిందని స్వీడన్ టెలికాం దిగ్గజం ఎరిక్సన్ సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ హాన్స్ వెస్ట్‌బర్గ్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ట్రాన్స్ఫర్మేషన్, బిజినెస్ స్ట్రాటజీ అనే అంశంపై ఐఎస్బీ హైదరాబాద్, మొహాలి క్యాంపస్ విద్యార్థులతో ఆయన గురువారం రాత్రి మాట్లాడారు. టెక్నాలజీ రంగంలో గతంలో హార్డ్‌వేర్, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఎంతో ప్రగతిని సాధించాయని, ఇందులో భారత్ కృషి ఎంతో ఉందన్నారు. ప్రపంచ సాఫ్ట్వేర్ రంగంలో భారతీయులే ప్రధాన భూమిక పోషిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే ఎరిక్సన్ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం, పరికరాల ఉత్పత్తి కేంద్రాలను భారత్‌లో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లోని ఎరిక్సన్ సంస్థలో 21 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీలో భారతీయ యువత ప్రతిభను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను 40 వేలకు పెంచాలని నిర్ణయించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 108 దేశాలలో ఎరిక్సన్ సంస్థ సేవలను అందిస్తోందని, 2జీ, 3జీ, 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చిన ఎరిక్సన్, త్వరలో ఆవిష్కరించే 5జీ సేవలను కూడా త్వరితగతిన అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎరిక్సన్ సంస్థలో ఇప్పటివరకు 22 శాతం మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని వారి పనితీరును అం చనా వేసి 2020లోగా 30 శాతం మహిళలే పనిచేసే విధంగా ఉద్యోగుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించమన్నారు. నాయకత్వ లక్షనాలు సులువుగా రావని, సమయపాలన, ఏకాగ్రత, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యతను ఇచ్చే స్వభావం ఉన్నప్పుడే నాయకునిగా ఎదుగుతారని, ఇవన్నీ ఐఎస్బీ విద్యార్థులందరూ అలవరచుకోవాలన్నారు. అనంతంరం ఎస్ఎంఎస్ల ద్వారా మొహాలి క్యాంపస్ విద్యార్థులు, నేరుగా హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. -
మూడేళ్లలో 1,600 మంది నియామకం
టెక్నో బ్రెయిన్ గ్రూప్ సీఈవో మనోజ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న టెక్నో బ్రెయిన్ వచ్చే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యతోపాటు పెట్టుబడులను రెట్టింపు చేయనుంది. హైదరాబాద్, ఆఫ్రికాలోని నైరోబీలో ఆర్అండ్డీ కేంద్రాలున్న ఈ సంస్థ 25 దేశాల్లో సేవలందిస్తోంది. 1,600 మంది సిబ్బంది ఉన్నారు. 2018 నాటికి మరో 1,600 మందిని నియమించుకోనుంది. గత ఐదేళ్లలో సుమారు రూ.65 కోట్లు వెచ్చించింది. విస్తరణకు మూడేళ్లలో రూ.130 కోట్ల దాకా ఖర్చు చేస్తామని టెక్నో బ్రెయిన్ గ్రూప్ సీఈవో మనోజ్ శంకర్ తెలిపారు. కంపెనీ ఉత్తమ పనితీరుకుగాను సీఎంఎంఐ లెవెల్-5 ధ్రువీకరణ పొందిన సందర్భంగా సీవోవో ఆనంద్ మోహన్‌తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఇ-గవర్నెర్న్ ప్రాజెక్టులపై ఫోకస్ చేశామని మనోజ్ శంకర్ తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్‌తోపాటు పలు దేశాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు విజయవంతంగా చేపట్టామన్నారు. ట్రిప్స్ పేరుతో ట్యాక్సేషన్, కస్టమ్స్‌కు సింగిల్ విండో సొల్యూషన్‌ను అభివృద్ధి చేశామని వివరించారు. -
కొలువుల సీజన్..
ముందు చదువు పూర్తి చేయడం.. ఆనక పోటీ పరీక్షలకు దరఖాస్తు చేయడం, రాయడం, ఫలితాల కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడటం.. ఇదంతా గతం.. మారుతున్న కాలంతోపాటు నియామకాల ప్రక్రియ కొత్త పుంతలు తొక్కింది. విద్యాభ్యాస సమయంలోనే కొలువు సంపాదించే అద్భుత అవకాశాన్ని.. అదీ తరగతి గది వద్దే కల్పిస్తోంది. ఈ ప్రక్రియనే క్యాంపస్ డ్రైవ్ అంటున్నారు. ఇందులోనూ ఇటీవలి కాలం వరకు సాఫ్ట్వేర్, ఇతర వృత్తివిద్యా కోర్సులు చేసిన వారికే క్యాంపస్ ఎంపికలు పరిమతమయ్యాయి. ఇప్పుడా పరిమితులు తొలగిపోయాయి. ప్రొఫెషనల్ కోర్సులతో పాటు సంప్రదాయ డిగ్రీ, పీజీలు చేసిన వారికి బహుళజాతి, దేశీయ కార్పొరేట్ సంస్థలు క్యాంపస్ నియామకాల్లో మంచి అవకాశాలనే కల్పిస్తున్నాయి. వార్షిక పరీక్షలకు ముందు నవంబర్ నుంచి మార్చి నెలలను క్యాంపస్ డ్రైవ్‌ల నెలలుగా అభివర్ణించవచ్చు. ఇంతటి అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకోవడం.. భవిష్యత్తుకు బంగారుబాట వేసుకోవడం విద్యార్థుల చేతుల్లోనే ఉంది. మళ్లీ కొలువుల సీజన్ వచ్చిన నేపథ్యంలో గత విజేతలు, నిపుణుల సలహాలు.. ఎచ్చెర్ల: ఇప్పుడిప్పుడే సాఫ్ట్వేర్ రంగం పుంజుకుంటోంది. పలు కంపెనీలు ఉద్యోగాల నియూమకాలకు తలుపులు తెరుస్తున్నారుు. మరికొన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూల నిర్వహణలో బిజీ ఆయ్యూరుు. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు ఉద్యోగాల భర్తీ కాలం. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. అరుుతే, కష్టపడి చదివిన వారికే కొలువులు దక్కుతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. అందుకు తగ్గ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. ఉపాధి అవకాశాలు ఇలా... జిల్లాలో సీఏస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్ బ్రాంచిలు ఉన్నాయి. సీఏస్ఈ విద్యార్థులకు సాప్టువేర్ రంగంలో, ఈసీఈ విద్యార్థులకు నెట్వర్క్, కమ్యూనికేషన్ రంగంలో, త్రిపుల్ఈకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, విద్యుత్ రంగంలో, మెకానికల్ విద్యార్థులకు రవాణా, మోటార్ ఫీల్డులోను, సివిల్ బ్రాంచ్ విద్యార్థులకు కనస్ట్రక్షన్ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తారుు. ఎంసీఏ విద్యార్థులు సాఫ్ట్వేర్ కంపెనీలకు, ఎంబీఏ విద్యార్థులకు వ్యాపార రంగంలోను, బి-ఫార్మసీ విద్యార్థులకు హాస్పటాలిటీ, మందుల కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తారుు. రాతపరీక్ష, బృందచర్చల్లో ప్రతిభ చూపిన వారికే... జిల్లాలో ఏటా టీసీఏస్, విప్రో, ఇన్ఫోసిస్, ఐబీఏం, ఐహేచ్సీ, మహేంద్రా సత్యం, హనీవెల్, కేబ్జిమిని తదితర కంపెనీలు ఇంజినీరింగ్ కళాశాలల్లో క్యాంపస్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారుు. తమకు కావాల్సిన సిబ్బందిని నియమిస్తున్నారుు. కంపెనీ ప్రతినిధులే నేరుగా కళాశాలకు వచ్చి రాత పరీక్ష, బృంద చర్చలు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఉద్యోగ హామీపత్రాలను అందజేస్తున్నారు. అరుుతే, ఈ కంపెనీలు విద్యార్థిని అన్ని కోణాల్లోనూ పరీక్షించి తమ అవసరాలకు ఉపయోగపడేవారినే ఎంపిక చేసుకుంటారుు. విద్యార్థులు ముందుగానే కంపెనీల అవసరాలు గుర్తించి సిద్ధంకావాలి. ఇప్పటికే ఆయూ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న సీనియర్ విద్యార్థుల సూచనలు, సలహాలు స్వీకరించాలి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఇవి తప్పనిసరి... క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విజేతగా నిలవాలంటే విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, విషయ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ, సాంకేతిక పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం, నైపుణ్యం, గణితంపై పట్టు, అనుకూల దృక్పథం ఉండాలి. అలాగే, ఆంగ్లభాషా పరిజ్ఞానం, సమస్యపై స్పందించే గుణం, తక్షణ పరిష్కారం చూపే నైపుణ్యం పెంపొందించుకోవాలి. తడబాటు ఇక్కడే... జిల్లా విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కేవలం 30 శాతం మందే అర్హత సాధిస్తున్నారు. అదీ నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల లోపు జీతం ఇచ్చే ఉద్యోగాలకే అర్హత సాధిస్తున్నారు. దీనికి ఆంగ్లభాషపై పట్టులేకపోవం, అనుకూల దృక్పథం లేకపోవడం, సబ్జెక్టుపై పరిజ్ఞానం ఉన్నా భావాన్ని వ్యక్తికరించలేకపోవడం, సాంకేతిక మార్పులు గమనించలేకపోవడమే ప్రధాన లోపాలుగా మారారుు. వీటిపై సాధన చేస్తే జిల్లా విద్యార్థులు సైతం నెలకు రూ.80వేల నుంచి రూ.లక్షా 50వేల జీతాలు ఇచ్చే కంపెనీలు, ఉద్యోగాలకు ఎంపికవుతారని విద్యానిపుణులు చెబుతున్నారు. ఇంటర్వ్యూల కాలంలో లోపాలను అధిగమించేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. అనుకూల దృక్పథంతో సాగాలి విద్యార్థిలో ముందుగా అనుకూల దృక్పథం ఉండాలి. ఇదే విజయంవైపు పయనించేలా చేస్తుంది. ఏ అంశం నేర్చుకోవాలన్నా ముందు విద్యార్థి తనలోని భయం విడనాడాలి. పట్టుదలే లక్ష్యసాధనన్న విషయం గుర్తించాలి. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించాలి. అవసరమైతే మహనీయుల ఆత్మ కథలు చదవాలి. వాటి నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ముందు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవడం అలవర్చుకోవాలి. -ప్రొఫెసర్ గుంట తులసీరావు, ప్రిన్సిపాల్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నైపుణ్యాలు కీలకం విద్యార్థి ఇంజినీరింగ్‌లో చేరిన వెంటనే రిలీవ్లోపు ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం నిర్దేశించుకోవాలి. లోపాలు గుర్తించి అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. విద్యాబోధన ఆంగ్లంలో సాగుతుంది. అందుకే తరగతి గదిలో ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. దీనివల్ల కమ్యునికేషన్ స్కిల్స్ వృద్ధి చెందుతారుు. తరగతులకు రోజూ హాజరైతే విషయ పరిజ్ఞానానికి డోకా ఉండదు. -డాక్టర్ బుడుమూరు శ్రీరాంమూర్తి, డెరైక్టర్, శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల -
ఎంబీఏ.. జోష్‌పుల్ రిక్రూట్మెంట్
టాప్ స్టోరీ: మన భాగ్యనగరం ఇప్పటికే సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో ప్రపంచ యవనికపై తనదైన గుర్తింపు తెచ్చుకుంది. వీటితోపాటు వివిధ కంపెనీలు, వస్తూత్పత్తి సంస్థలు నగరంలో కొలువుదీరాయి. కంపెనీలకు అవసరమైన నిష్ణాతులైన మానవ వనరులను అందించే ఉద్దేశంతో.. పేరొందిన బిజినెస్ స్కూల్స్ తమ క్యాంపస్‌లను సిటీలో ఏర్పాటు చేశాయి. ఇదే సమయంలో ఈ ఏడాది అధిక శాతం మేనేజ్మెంట్, బిజినెస్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోవాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని... జీమ్యాక్ 13వ వార్షిక సర్వే వెల్లడించింది. ఇది ఎంబీఏ, బిజినెస్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్లకు నిజంగా శుభవార్తే... వన్నె తగ్గని ఎంబీఏ అమెరికాకు చెందిన గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) ప్రకారం- 87 శాతం కంపెనీలు ఎంబీఏ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది ఎంబీఏ గ్రాడ్యుయేట్లను, బిజినెస్ స్కూల్ విద్యార్థులను ఎక్కువ మొత్తంలో రిక్రూట్ చేసుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. దాదాపు 87 శాతం కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికం. అదే 2009తో పోల్చితే ఇది 30 శాతం అధికం. అప్పటి ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో 40 శాతం కంపెనీలే ఎంబీఏలను నియమించుకున్నాయి. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు ఈ ఏడాది బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లను అధిక శాతంలో నియమించుకోనున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉండొచ్చు. రంగాల వారీగా చూస్తే..కన్సెల్టింగ్ రంగం ముందంజలో నిలుస్తుంది. అన్ని రంగాల్లో: ఆ రంగం.. ఈ రంగం అంటూ తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ ఎంబీఏ గ్రాడ్యుయేట్ల అవసరం ఉంది. ప్రతి రంగంలోనూ సంబంధిత కంపెనీ/వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్నా.. వ్యాపారాభివృద్ధికి అవసరమైన వ్యూహాలను రూపొందించాలన్నా.. సంస్థ మనుగడకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లపై ఆధారపడాల్సిందే. కాబట్టి కంపెనీలు, వ్యాపార నిర్వహణా సంస్థలూ సంబంధిత స్పెషలైజేషన్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ను అధ్యయనం చేసి నిష్ణాతులుగా రూపొందినవారి కోసం జల్లెడ పడుతున్నాయి. తమ సంస్థల్లో నియమించుకుని ఏ రంగానికీ తీసిపోని వేతనాలను అందిస్తున్నాయి. మేనేజ్మెంట్ కళాశాలల్లో మేటి.. సిటీ: హైదరాబాద్‌లో ఎన్నో ఎంబీఏ కళాశాలలున్నాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ - యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, నర్సీమొంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ వంటి దేశంలోనే పేరున్న ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ నగరంలో కొలువుదీరాయి. వీటితోపాటు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వంటివి కూడా మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. పాపులర్ స్పెషలైజేషన్లు ఎన్నో: సిటీ.. ప్రముఖ బీ స్కూల్స్‌కే కాదు.. జాబ్ మార్కెట్లో అపార అవకాశాలు ఉన్న స్పెషలైజేషన్లను అందించడంలోనూ అన్నిటికంటే ముందుంది. ఫార్మా సంబంధిత కోర్సులను అందించడంలో దేశంలోనే పేరున్న సంస్థ.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్). కేంద్ర ప్రభుత్వ ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ సంస్థ.. మన హైదరాబాద్‌లోనూ క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎంబీఏలో ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ కూడా భాగ్యనగరంలోనే ఉంది. ఈ సంస్థ అగ్రికల్చర్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) కోర్సును అందిస్తోంది. సిటీలో కొలువుదీరిన మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ). ఇది రూరల్ డెవలప్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) కోర్సును ఆఫర్ చేస్తోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో పీజీడీఎంలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఉంది. దేశంలోని బెస్ట్ బీ స్కూల్స్ సర్వేలో చోటు ద క్కించుకుంటున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజ్ (ఐపీఈ) కూడా జాబ్ మార్కెట్లో మంచి ఉద్యోగావకాశాలున్న పీజీడీఎం-రిటైల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్-ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి స్పెషలైజేషన్లను అందిస్తోంది. ఉస్మానియా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ - సెల్ఫ్ ఫైనాన్స్.. ఎంబీఏలో టెక్నాలజీ మేనేజ్మెంట్ను ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకంగా హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, టూరిజం సంబంధిత కోర్సులను అందించడానికి ఏర్పాటైన సంస్థ డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. గచ్చిబౌలిలో ఉన్న ఈ సంస్థ పీజీడీఎంలో భాగంగా టూరిజం మేనేజ్మెంట్ కోర్సును, ఎంబీఏలో భాగంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హాస్పిటాలిటీ కోర్సులను అందిస్తోంది. అర్హతలు.. ప్రవేశ విధానం: బీస్కూల్స్ను బట్టి అర్హతలు, ఎంపిక విధానం వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరొచ్చు. పీజీడీఎం - అగ్రికల్చర్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులకు మాత్రం అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ ఉండాలి. ప్రముఖ బీస్కూల్స్ అన్నీ క్యాట్/జీమ్యాట్/ఎక్స్‌ఏటీ వంటి స్కోర్లతోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. మన రాష్ట్ర యూనివర్సిటీల్లో ఐసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం ఉంటుంది. నైపర్, ఎన్ఐఆర్డీ వంటి సంస్థలు సొంత ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి. ఉద్యోగావకాశాలు : హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి స్పెషలైజేషన్లలో ఎంబీఏ పూర్తిచేసినవారికి కంపెనీల్లో పలు విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. అలాగే నైపర్ అందించే ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసినవారికి ఫార్మాస్యూటికల్స్ కంపెనీల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పీజీడీఎం-అగ్రికల్చర్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తిచేసినవారు వ్యవసాయ సంబంధిత కంపెనీల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చు. రిటైల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లకు మంచి వేతనాలు అందుతున్నాయి. టూరిజం మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు పూర్తిచేసినవారికి అవకాశాలు కోకొల్లలు. కావల్సిన స్కిల్స్: క్రిటికల్ థింకింగ్ డెసిషన్ మేకింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బృందాన్ని సమర్థవంతంగా నడిపించగలగడం మార్కెట్ రీసెర్చ్ కళాశాల ఎంపిక: హైదరాబాద్‌లో ఎంబీఏ, పీజీడీఎం కోర్సులను అందించే సంస్థలు వందల్లో ఉన్నాయి. అయితే నాణ్యతపరంగా, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అందిస్తున్న సంస్థలు పదుల్లోనే. కాబట్టి కళాశాల గత చరిత్ర, ప్లేస్‌మెంట్స్, నిపుణులైన ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉన్న కళాశాలలను ఎంచుకోవాలనేది నిపుణుల మాట. మంచి కళాశాల ఏదో తెలుసుకోవడానికి పూర్వ విద్యార్థులు సహాయపడతారు. లేదా వివిధ సంస్థలు, పత్రికలు, మ్యాగజైన్లు దేశంలో, రాష్ట్రాల్లో బెస్ట్ బీ స్కూల్స్ సర్వేలను వెలువరిస్తుంటాయి. వీటి ఆధారంగా కూడా ఒక నిర్ణయానికి రావొచ్చు.