ఎంబీఏ.. జోష్‌పుల్ రిక్రూట్‌మెంట్ | MBA joshful recuritments in Hyderabad to make IT hub | Sakshi
Sakshi News home page

ఎంబీఏ.. జోష్‌పుల్ రిక్రూట్‌మెంట్

Published Fri, Jul 4 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

ఎంబీఏ..  జోష్‌పుల్ రిక్రూట్‌మెంట్

ఎంబీఏ.. జోష్‌పుల్ రిక్రూట్‌మెంట్

టాప్ స్టోరీ:  మన భాగ్యనగరం ఇప్పటికే సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల్లో ప్రపంచ యవనికపై తనదైన గుర్తింపు తెచ్చుకుంది. వీటితోపాటు వివిధ కంపెనీలు, వస్తూత్పత్తి సంస్థలు నగరంలో కొలువుదీరాయి. కంపెనీలకు అవసరమైన నిష్ణాతులైన మానవ వనరులను అందించే ఉద్దేశంతో.. పేరొందిన బిజినెస్ స్కూల్స్ తమ క్యాంపస్‌లను సిటీలో ఏర్పాటు చేశాయి. ఇదే సమయంలో  ఈ ఏడాది అధిక శాతం మేనేజ్‌మెంట్, బిజినెస్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోవాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని... జీమ్యాక్ 13వ వార్షిక సర్వే వెల్లడించింది. ఇది ఎంబీఏ, బిజినెస్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్లకు నిజంగా శుభవార్తే...
 
 వన్నె తగ్గని ఎంబీఏ
 అమెరికాకు చెందిన గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ (జీమ్యాక్) ప్రకారం- 87 శాతం కంపెనీలు ఎంబీఏ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది ఎంబీఏ గ్రాడ్యుయేట్లను, బిజినెస్ స్కూల్ విద్యార్థులను ఎక్కువ మొత్తంలో రిక్రూట్ చేసుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. దాదాపు 87 శాతం కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికం. అదే 2009తో పోల్చితే ఇది 30 శాతం అధికం. అప్పటి ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో 40 శాతం కంపెనీలే ఎంబీఏలను నియమించుకున్నాయి. గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు ఈ ఏడాది బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్లను అధిక శాతంలో నియమించుకోనున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉండొచ్చు. రంగాల వారీగా చూస్తే..కన్సెల్టింగ్ రంగం ముందంజలో నిలుస్తుంది.
 
 అన్ని రంగాల్లో:
 ఆ రంగం.. ఈ రంగం అంటూ తేడా లేకుండా అన్ని రంగాల్లోనూ ఎంబీఏ గ్రాడ్యుయేట్ల అవసరం ఉంది. ప్రతి రంగంలోనూ సంబంధిత కంపెనీ/వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాలన్నా.. వ్యాపారాభివృద్ధికి అవసరమైన వ్యూహాలను రూపొందించాలన్నా.. సంస్థ మనుగడకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోవాలన్నా మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లపై ఆధారపడాల్సిందే. కాబట్టి కంపెనీలు, వ్యాపార నిర్వహణా సంస్థలూ సంబంధిత స్పెషలైజేషన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్‌ను అధ్యయనం చేసి నిష్ణాతులుగా రూపొందినవారి కోసం జల్లెడ పడుతున్నాయి. తమ సంస్థల్లో నియమించుకుని ఏ రంగానికీ తీసిపోని వేతనాలను అందిస్తున్నాయి.
 
 మేనేజ్‌మెంట్ కళాశాలల్లో మేటి.. సిటీ:
 హైదరాబాద్‌లో ఎన్నో ఎంబీఏ కళాశాలలున్నాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ - యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (ఐపీఈ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ వంటి దేశంలోనే పేరున్న ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్స్ నగరంలో కొలువుదీరాయి. వీటితోపాటు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, జేఎన్‌టీయూ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ వంటివి కూడా మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి.
 
 పాపులర్ స్పెషలైజేషన్లు ఎన్నో:
 సిటీ.. ప్రముఖ బీ స్కూల్స్‌కే కాదు.. జాబ్ మార్కెట్‌లో అపార అవకాశాలు ఉన్న స్పెషలైజేషన్లను అందించడంలోనూ అన్నిటికంటే ముందుంది. ఫార్మా సంబంధిత కోర్సులను అందించడంలో దేశంలోనే పేరున్న సంస్థ.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్). కేంద్ర ప్రభుత్వ ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈ సంస్థ.. మన హైదరాబాద్‌లోనూ క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎంబీఏలో ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నారు.  అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ కూడా భాగ్యనగరంలోనే ఉంది. ఈ సంస్థ అగ్రికల్చర్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) కోర్సును అందిస్తోంది. సిటీలో కొలువుదీరిన మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐఆర్‌డీ). ఇది రూరల్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) కోర్సును ఆఫర్ చేస్తోంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌లో పీజీడీఎంలో అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు ఉంది.
 
 దేశంలోని బెస్ట్ బీ స్కూల్స్ సర్వేలో చోటు ద క్కించుకుంటున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజ్ (ఐపీఈ) కూడా జాబ్ మార్కెట్‌లో మంచి ఉద్యోగావకాశాలున్న పీజీడీఎం-రిటైల్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్-ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి స్పెషలైజేషన్లను అందిస్తోంది. ఉస్మానియా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ - సెల్ఫ్ ఫైనాన్స్.. ఎంబీఏలో టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకంగా హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం సంబంధిత కోర్సులను అందించడానికి ఏర్పాటైన సంస్థ డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్. గచ్చిబౌలిలో ఉన్న ఈ సంస్థ పీజీడీఎంలో భాగంగా టూరిజం మేనేజ్‌మెంట్ కోర్సును, ఎంబీఏలో భాగంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హాస్పిటాలిటీ కోర్సులను అందిస్తోంది.
 
 అర్హతలు.. ప్రవేశ విధానం:
 బీస్కూల్స్‌ను బట్టి అర్హతలు, ఎంపిక విధానం వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరొచ్చు. పీజీడీఎం - అగ్రికల్చర్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులకు మాత్రం అగ్రికల్చర్ సంబంధిత కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ ఉండాలి. ప్రముఖ బీస్కూల్స్ అన్నీ క్యాట్/జీమ్యాట్/ఎక్స్‌ఏటీ వంటి స్కోర్లతోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. మన రాష్ట్ర యూనివర్సిటీల్లో ఐసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం ఉంటుంది. నైపర్, ఎన్‌ఐఆర్‌డీ వంటి సంస్థలు సొంత ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నాయి.
 
 ఉద్యోగావకాశాలు :
 హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి స్పెషలైజేషన్లలో ఎంబీఏ పూర్తిచేసినవారికి కంపెనీల్లో పలు విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. అలాగే  నైపర్ అందించే ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేసినవారికి ఫార్మాస్యూటికల్స్ కంపెనీల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పీజీడీఎం-అగ్రికల్చర్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసినవారు వ్యవసాయ సంబంధిత కంపెనీల్లో  ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చు.  రిటైల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు మంచి వేతనాలు అందుతున్నాయి. టూరిజం మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసినవారికి అవకాశాలు కోకొల్లలు.
 
 కావల్సిన స్కిల్స్:
  క్రిటికల్ థింకింగ్  డెసిషన్ మేకింగ్
  కమ్యూనికేషన్ స్కిల్స్
  బృందాన్ని సమర్థవంతంగా నడిపించగలగడం
  మార్కెట్ రీసెర్చ్
 
 కళాశాల ఎంపిక:
 హైదరాబాద్‌లో ఎంబీఏ, పీజీడీఎం కోర్సులను అందించే సంస్థలు వందల్లో ఉన్నాయి. అయితే నాణ్యతపరంగా, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అందిస్తున్న సంస్థలు పదుల్లోనే. కాబట్టి కళాశాల గత చరిత్ర, ప్లేస్‌మెంట్స్, నిపుణులైన ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉన్న కళాశాలలను ఎంచుకోవాలనేది నిపుణుల మాట. మంచి కళాశాల ఏదో తెలుసుకోవడానికి పూర్వ విద్యార్థులు సహాయపడతారు. లేదా వివిధ సంస్థలు, పత్రికలు, మ్యాగజైన్లు దేశంలో, రాష్ట్రాల్లో బెస్ట్ బీ స్కూల్స్ సర్వేలను వెలువరిస్తుంటాయి. వీటి ఆధారంగా కూడా ఒక నిర్ణయానికి రావొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement