
అమెరికా తాజాగా విధించిన ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా పరిశ్రమకు మినహాయింపు ఇస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మొత్తం యూఎస్‌లో వినియోగించే జనరిక్ ఔషధాల్లో 40 శాతం కంటే ఎక్కువగా భారత్‌లో తయారవుతున్న ఉత్పత్తులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాల విధింపు నిర్ణయం అమెరికాలోనూ ఔషధాల సంక్షోభాన్ని తీసుకొస్తుందేమోననే ఆందోళనలతో ఈమేరకు వెనక్కి తగ్గుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారతదేశం తయారు చేస్తున్న జనరిక్ మందుల పాత్రను నొక్కి చెబుతుంది.
ఈ సుంకాల మినహాయింపు భారత ఔషధ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుండగా, ఇతర రంగాల్లో అమెరికా ఎగుమతులు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా సుంకాలకు అనుగుణంగా భారత్ యూఎస్ వస్తువులపై సుంకాల్లో మార్పులు చేస్తే వాణిజ్య అడ్డంకులు తొలగిపోయి దేశంలో అగ్రరాజ్య ఎగుమతులు ఏటా 5.3 బిలియన్ డాలర్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. ఇది రెండు దేశాల మధ్య మరింత సమతుల్య వాణిజ్య సంబంధాలను పెంపొందిస్తుందనే వాదనలూ లేకపోలేదు.
భారత్‌పై సుంకాల మోత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. అనుకున్నట్లుగా విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. వియత్నాం ఉత్పత్తులపై 46 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్(ఈయూ)పై 20 శాతం, స్విట్జర్లాండ్‌పై 31, తైవాన్‌పై 32, జపాన్‌పై 24, యూకేపై 10 శాతం సుంకాలను ఖరారు చేశారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ఏప్రిల్ 2వ తేదీని ‘విముక్తి దినం’గా ట్రంప్ ప్రకటించారు.
ఇదీ చదవండి: యూఎస్ సుంకాలు.. భారత్‌పై ప్రభావం ఎంత?
టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించే టారిఫ్‌ల సంబంధ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార టారిఫ్‌ల పరిణామాలను ఎదుర్కొనే వ్యూహాలపై వాణిజ్య, పరిశ్రమల శాఖ కసరత్తు చేసినట్లు వివరించాయి.