
ప్రపంచం ఏఐతో ముందుకెళ్తోంది, వద్దనుకుంటే మనం వెనుకబడిపోతాం.
విశ్లేషణ
సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రోగ్రామర్ల నుంచి పెద్ద కంపెనీల సీఈఓల దాకా మనవాళ్లదే ఆధి పత్యం. ప్రతీ ప్రఖ్యాత సంస్థ మన దేశంలో బ్రాంచీలు తెరవాల్సిందే. మన డాక్టర్లు వైద్య రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. పంటికైనా తుంటికైనా తక్కువ ఖర్చులో మన్నికైన చికిత్స కోసం మనదాకా రావలసిందే... ఐతే, ఇకపై ఈ పరిస్థితి మారిపోతుంది; సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఉద్యోగాలుండవు; డాక్టర్లకు కొలువులుండవు; ఇది మరో యుగాంతానికి దారి తీస్తుంది... కృత్రిమ మేధపై వ్యక్తమవుతున్న భయాందోళనలివి!
మార్పును ప్రతిఘటించడం మనిషి సహజ స్వభావం. పారిశ్రా మిక విప్లవంలో యంత్రాలు ప్రవేశించినప్పుడు అవి తమ కడుపు కొడతాయన్న ఆందోళనతో కార్మికోద్యమాలు జరిగాయి. కంప్యూటర్లు వచ్చినప్పుడు అవి తమ ఉద్యోగాలను హరించివేస్తాయనే భయంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఏఐ విషయంలో కూడా అలాగే మానసిక ఆందోళనలు కనిపిస్తున్నాయి.
గతంలో మార్పును వ్యతిరేకిస్తూ కొంతకాలం ప్రతిఘటించే అవకాశమైనా ఉండేది. కానీ ఈ ఏఐ ఎవరు కాదన్నా ఆగేది కాదు. కాబట్టి ఎవరికి వారు తమకు అవస రమైన మేరకు దీన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకోవాలో నేర్చు కోవడం మంచిది. చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, కోపైలట్, గ్రోక్ వంటి ఏఐ టూల్స్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవడం మొదలుపెట్టాలి.
ఇదొక వాస్తవం
కృత్రిమ మేధ విభిన్నమైన, మరింత ఉన్నతమైన ఉద్యోగావ కాశాలు కల్పిస్తుంది. ఇది మనుషులకు ప్రత్యామ్నాయంగా వచ్చిన పరిజ్ఞానం కాదు, మనకు సహాయకారిగా ఉంటూ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు దోహదం చేస్తుంది. మనకు తెలియకుండానే మనమంతా ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నాం.
ఫోన్లో అలె క్సానో, గూగుల్‌నో ఉపయోగిస్తాం. ఏదేనా టైపు చేస్తున్నపుడు స్పెల్లింగ్ దోషాలుంటే సవరించి చూపే పరిజ్ఞానాన్ని వాడుతున్నాం. స్మార్ట్ టీవీలో మన అభిరుచికి తగిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు మనం అడగకుండానే కనిపిస్తుంటాయి. స్మార్ట్ వాచ్, ఫోన్ యాప్‌ల ద్వారా మన ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసు కునే వెసులుబాటు కలిగింది.
సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవడానికి కూడా ఏఐ ఉపకరిస్తుంది. సాధారణంగా వాట్సాప్‌లో వచ్చే సందేశాలలో కొన్ని అనుమానాస్పదంగా ఉంటాయి. ఏదైనా మెసేజ్‌పై అనుమానం కలి గితే అది నిజమా, కాదా అని ఏఐ ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రపంచం ఏఐతో ముందుకు సాగుతోంది, వద్దనుకుంటే మనం వెనుకబడి పోతాం. యువతకు ఏఐ మరింత ఉపయోగకరం, తప్పనిసరి కూడా. దీని ద్వారా సృజనాత్మకతను, వ్యూహరచనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. నిత్య విద్యార్థికి, మార్పును స్వాగతించే వారికి ఏఐ మంచి మార్గదర్శనం చేస్తుంది.
అన్ని రంగాల్లో ఉపయోగం
విద్యాభ్యాసంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, కృత్రిమ మేధ సాయంతో వారిలో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించే కార్య క్రమాన్ని ఈమధ్య ఐదు తెలంగాణ జిల్లాల్లోని ముప్పై పాఠశాలల్లో ప్రారంభించారు. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నపుడు కొంద రికి వెంటనే అర్థమవుతుంది, మరికొందరు అర్థం చేసుకోలేక క్రమంగా వెనుకబడిపోతారు.
ప్రాథమిక విద్యార్థులలో కొందరికి సరిగా చదవడం, రాయడం కూడా రాదు. చిన్నచిన్న కూడికలు, తీసి వేతలు కూడా చేయలేరు. అలాంటి వారిని గుర్తించి ఐదేళ్లలో ప్రధాన స్రవంతిలో కలపాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ పేరుతో ప్రారంభమైన కార్యక్రమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.
ఆ కార్యక్రమానికి తాజాగా కృత్రిమ మేధను జోడించి సత్ఫలితాలు సాధించే దిశగా వెళ్తున్నారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో, ప్రతి తరగతి నుంచి చదువులో వెనుక బడిన విద్యార్థులను ఎంపికచేసి వారికి ఏఐ పరిజ్ఞానంతో 40 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అవసరాన్ని బట్టి ప్రతిచోటా విద్యా లయాల్లో ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెడితే ఏఐ ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చు.
జన్యుపరీక్షల ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీ కరించి, భవిష్యత్తులో రాగల వ్యాధులను పసిగట్టే సామర్థం ఏఐకి ఉందని వైద్యులు చెబుతున్నారు. రోగి ఎక్స్–రేలో కంటికి కనిపించని సూక్ష్మమైన మచ్చలను కూడా విశ్లేషించి రోగనిర్ధారణ చేయడం ఏఐ వల్ల సాధ్యమవుతోందని వైద్యనిపుణులు అంటున్నారు.
కృత్రిమ మేధపై అన్ని రంగాల్లో మాదిరిగానే వైద్యరంగంలో కూడా భయా లున్నాయి. ఐతే ఏఐ వల్ల వారి ప్రాధాన్యం తగ్గదనీ, అందులో ప్రావీణ్యం లేకపోతే వెనుకబడే అవకాశాలు మాత్రం ఉన్నాయనీ ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి చెప్పినట్లు ఈమధ్య చదివాను. ఇప్పటిదాకా కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా వచ్చిందంటే దాన్ని అందిపుచ్చుకునే ఆర్థిక స్థోమత అందరికీ ఉండేది కాదు.
దానికి భిన్నంగా ఏఐ ఫలితాలను వైద్యరంగంలో అందరికీ అందించే అవకాశాలున్నాయనీ, పల్లెలోనైనా పట్నంలోనైనా అందరికీ సమానంగా వైద్యం అందుబాటులోకి వచ్చేరోజు ఎంతోదూరంలో లేదనీ నిపుణులు అంటున్నారు. కొత్త ఔషధాలను ఆవిష్కరించే పరిశోధన లలో కూడా ఏఐని ఉపయోగించి వేగవంతమైన ఫలితాలను సాధిస్తున్నారు.
వ్యవసాయం సాధారణంగా శాస్త్ర సాంకేతిక పరిశోధనల ఫలితా లను అందుకోవడంలో చివరి వరుసలో ఉంటుంది. ఐతే, ఈమధ్య రైతులలో చైతన్యం, ప్రభుత్వాల చొరవ వలన ఈ రంగంలో సాంకేతి కత వినియోగం పెరుగుతోంది. మహారాష్ట్రలోని బారామతి జిల్లాలో ఉష్ణోగ్రతలు, భూసారానికి సంబంధించి ఏఐ అందించిన సమాచా రాన్ని ఉపయోగించుకున్న ఓ రైతు మంచి దిగుబడి సాధించాడు.
వాతావరణానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం వల్ల ఎరు వుల ఖర్చు, నీటి వినియోగం గణనీయంగా తగ్గి, పంట దిగుబడి ఇరవై శాతం పెరిగిందని చెప్పే ఓ రైతు ప్రత్యక్ష అనుభవాన్ని మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల పంచుకున్నారు. కరవు, నీటి ఎద్దడి కారణంగా వ్యవసాయం నష్టదాయకంగా మారిన బారామతి జిల్లాలో మైక్రోసాఫ్ట్ సంస్థ ఐఏ ఆధారిత వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పింది. దేశవ్యాప్తంగా ఇలాంటి సహాయ సహకారాలు లభిస్తే వ్యవసాయం లాభదాయకం కావడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తుంది.
మానవ మేధకూ పదును...
కృత్రిమ మేధ ఒక ప్రాంతానికో, దేశానికో కాకుండా యావత్తు విశ్వాన్ని ప్రభావితం చేయగల విస్తృత సామర్థ్యం కలిగిన పరిజ్ఞానం కావడం వలన ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో కచ్చితమైన మార్గ దర్శకాలు, నియంత్రణలు ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది. దీన్ని వికాసం కోసం వినియోగిస్తే మేలు జరుగుతుంది, విధ్వంసం కోసం వినియోగిస్తే కీడు జరుగుతుంది.
కృత్రిమ మేధలో అతి ముఖ్యమైన అంశం మానవ మే«ధా సామర్థ్యం. మనం ఎంత సమర్థవంతంగా ప్రశ్న అడిగితే జవాబు
అంత కచ్చితంగా, సూటిగా వస్తుంది. మనం అడిగే ప్రశ్నను ప్రాంప్ట్ అంటారు. ఏఐ ద్వారా పనులు చేయించే ప్రాంప్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. ఏఐ టూల్స్ వినియోగించే టప్పుడు మనమంతా ప్రాంప్ట్ ఇంజినీర్లమే.
ప్రతి పౌరుడూ, విద్యార్థీ, సాంకేతిక నిపుణుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి... కృత్రిమ మేధ నిన్నెప్పుడూ తప్పించలేదు,కృత్రిమ మేధ తెలిసినవాడు నిన్ను తప్పించగలడు. కాబట్టి, మానవ మేధకు పదును పెట్టుకుంటూ సమర్థంగా ముందుకు సాగుదాం!
పి. వేణుగోపాల్ రెడ్డి
వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్
ఈ–మెయిల్: pvg@ekalavya.net
Comments
Please login to add a commentAdd a comment