ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు లాభాల పంట పండిస్తోంది. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీల కోసం బడా వ్యాపారవేత్తలు అప్పట్లో ఎగబడ్డారు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరిస్తున్నారు. వివిధ దేశాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నమెంట్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ లు కడుతున్నారు.
తాజాగా ఐపీఎల్‌లో హైదరాబాద్ వేదికగా పోటీ పడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న 'ది హండ్రెడ్' టోర్నమెట్‌లోకి రంగ ప్రవేశం చేసింది.
మూడో ఐపీఎల్ ఫ్రాంచైజీ
బుధవారం నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌ను కొనుగోలు కోసం నిర్వహించిన వేలంలో కళానిధి మారన్ యాజమాన్యంలోని సన్ గ్రూప్ పాల్గొని మొత్తం వంద శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు యొక్క 49 శాతం వాటాను, ఈ క్లబ్ నిర్వాహకులైన యార్క్‌షైర్ యొక్క 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి అంగీకారాన్ని పొందింది.
దీంతో 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో 100% వాటాను పొందిన తొలి ఫ్రాంచైజ్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో వాటాలు చేజిక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఫ్రాంచైజీ కావడం విశేషం. సూపర్‌చార్జర్స్ కొనుగోలు కోసం సన్ గ్రూప్ ఏకంగా 100 మిలియన్ పౌండ్లు వెచ్చించినట్టు తెలుస్తోంది.
నాలుగో స్థానంలో సూపర్‌చార్జర్స్
యార్క్‌షైర్‌కు వేదికగా పోటీ పడుతున్న సూపర్‌చార్జర్స్ గత సీజన్‌లో పురుషులు మరియు మహిళల టోర్నమెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. సూపర్‌చార్జర్స్ పురుషుల జట్టుకు ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ జట్లు లో సభ్యుడైన హ్యారీ బ్రూక్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్ నిర్వాహకులైన ఆర్ పి ఎస్ జి గ్రూప్, ముంబై ఇండియన్స్ నిర్వాహకులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 'ది హండ్రెడ్' టోర్నమెంట్ లో పోటీ పడుతున్న జట్ల స్టాక్‌లను కొనుగోలు చేసిన కొన్ని రోజుల తర్వాత సన్ గ్రూప్ కూడా ఈ టోర్నమెంట్ లో పెట్టుబడి పెట్టింది.
ప్రారంభంలో లండన్ స్పిరిట్ కొనుగోలు హక్కులను దక్కించుకోవడంలో విఫలమైన ఆర్ పి ఎస్ జి గ్రూప్ తర్వాత మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటాను కొనుగోలు చేసింది. రాబోయే రోజుల్లో ది హండ్రెడ్‌లో మరో ఐపీఎల్ క్లబ్ కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల కథనం.
మొదటి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్
టాటా గ్రూప్ 2024-2028 సంవత్సరానికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దాదాపు 2,500 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది మునుపటి ఒప్పందం కంటే దాదాపు 50 శాతం అధికం. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విషయానికొస్తే, 231.0 మిలియన్ డాలర్లతో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విలువైన ఫ్రాంచైజీ గా కొనసాగుతోంది. గత సంవత్సరం ఈ క్లబ్ తొమ్మిది శాతం వృద్ధి రేటు ని సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 227.0 మిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉంది. గత సంవత్సరం ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ వ్యాపార వృద్ధి లో 19.3 శాతం పెరుగుదలతో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ముంబై ఇండియన్స్ 204.0 మిలియన్ డాలర్లతో బ్రాండ్ విలువతో నాలుగో స్థానంలో ఉంది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (132 మిలియన్ డాలర్లు), రాజస్థాన్ రాయల్స్ (113 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.
లాభాల పంట
వాణిజ్య ప్రకటనల ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. దాదాపు ప్రతి జట్టుకు 5 మిలియన్ డాలర్ల నుండి 12 మిలియన్ డాలర్ల వరకు స్పాన్సర్‌షిప్ ఆదాయం లభించడమే కాక టెలివిజన్ హక్కుల ద్వారా కూడా గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మూడేళ్ల ఒప్పందం కోసం ఖతార్ ఎయిర్‌వేస్ దాదాపు 175 కోట్ల రూపాయలతో ఒప్పందం ఖరారు చేసుకుందంటే ఐపీఎల్ ఫ్రాంచైజీల ఆదాయం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment