ఐపీఎల్ (IPL) టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం హండ్రెడ్ లీగ్‌లోని (The Hundred League) మాంచెస్టర్ ఒరిజినల్స్ (ఇంగ్లండ్) ఫ్రాంచైజీని కళ్లు చెదిరే ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీ మొత్తం విలువలో 49 శాతాన్ని ఎల్‌ఎస్‌జీ యాజమాన్యమైన RPSG గ్రూప్ దక్కించుకుంది. భారత కరెన్సీలో ఈ వాటా విలువ రూ. 1251 కోట్లు.
మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో (Manchester Originals) వాటా దక్కించుకున్న విషయాన్ని RPSG గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా వెల్లడించారు. తొలుత ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం హండ్రెడ్ లీగ్‌లోని మరో ఫ్రాంచైజీ (లండన్ స్పిరిట్) కోసం బిడ్ దాఖలు చేసింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అంతిమంగా RPSG గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటా దక్కించుకుంది. RPSG గ్రూప్‌తో జత కట్టడంపై మాంచెస్టర్ యాజమాన్యం లంకాషైర్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ డీల్‌లో టర్మ్స్ అండ్ కండీషన్స్‌పై తదుపరి 8 వారాల్లో చర్చిస్తామని పేర్కొంది.
కాగా, ఇటీవలే హండ్రెడ్ లీగ్‌లోకి మరో ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా అడుగుపెట్టింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (అంబానీ గ్రూప్).. ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఫ్రాంచైజీని భారీ ధరకు కొనుగోలు చేసింది. మరో రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హండ్రెడ్ లీగ్‌లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌కు చెందిన సన్ గ్రూప్.. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, ట్రెంట్ రాకెట్స్‌ను కొనుగోలు చేయాలని చూస్తుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అయిన జీఎమ్ఆర్ గ్రూప్ సథరన్ బ్రేవ్‌లో వాటాను దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంది.
అప్పట్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్..
లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ తెరమరుగైంది. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కు ఎంఎస్ ధోని సారధిగా వ్యవహరించాడు. 2021లో సంజీవ్ గొయెంకాకు చెందిన RPSG గ్రూప్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను రూ. 7090 కోట్లకు కొనుగోలు చేసింది. 2023లో RPSG గ్రూప్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20) డర్బన్ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీని కూడా కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment