ప్రపంచంలో ఎంత కొమ్ములు తిరిగిన సంస్థలైనా చేసిన పొరబాట్లను ప్రాప్త కాలజ్ఞతతో దిద్దుకోకుంటే పోటీగా మరొకరు ఎదుగుతారనడానికి చాలా ఉదాహరణలు కనబడతాయి. అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్ ’ ఇటీవల తన 40 సంవత్సరాల కంపెనీ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించుకుని ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. సాఫ్ట్‌వేర్ రంగంలో తనకు ఎదురు లేదన్న భ్రమలో ఇంతకాలం కేవలం డెస్క్‌టాప్ కంప్యూటర్ల వరకే ఆలోచించి, అంతకుమించి సాఫ్ట్‌వేర్ రంగం ముందుకు వెళ్ళబోదని ఈ కంపెనీ గట్టిగా భావించింది. అయితే, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే సాఫ్ట్‌వేర్ అవసరాలు ల్యాప్‌టాప్‌ని దాటిపోయి, మొబైల్ ఫోన్లకు చేరి పోయాయి. ఈ పరిణామాన్ని తాము సకాలంలో గుర్తించలేకపోయినందుకు మూల్యం చెల్లించుకున్నామని, ఇది తమ చారిత్రక తప్పిదమని మైక్రోసాఫ్ట్ నిర్వాహకులు చింతించారు. ఇకపై దిద్దుబాటుకు ఉపక్రమించారు.
ఖండాల సరిహద్దులను సైతం చెరిపివేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఈరోజుల్లో కాలంతోపాటు మారకుంటే సంస్థలకు మనుగడ కష్టం. విశ్వవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొంది, 140 కోట్లమంది యాక్టివ్ వినియోగదారులున్న సోషల్ మీడియా సంస్థ ‘ఫేస్‌బుక్’. రెండు రోజుల క్రితం ఈ సంస్థ తీసుకున్న ఒక కీలక నిర్ణయం కూడా ఇలాంటి దిద్దుబాటు చర్యే. ఈ నిర్ణయం అటు దాని విస్తృతిని పెంచడం తోపాటు, ఇటు భావ స్వేచ్ఛాప్రియులను చిరకాలంగా ఇబ్బందిపెడుతున్న సున్నితమైన సమస్యను పరిష్కరిస్తుంది. ఫేస్‌బుక్‌లో ప్రస్తుతం ఎవరైనా ఖాతాదారు తన అకౌంట్ వాల్‌పై ఒక చిత్రం లేదా కథనం, వ్యాఖ్య, దృశ్యం వంటివి పోస్టు చేస్తే, దానిని వీక్షించిన, చదివిన వారు తమ స్పందనను ‘లైక్, కామెంట్, లేదా షేర్’ ఆప్షన్‌లలో తప్పనిసరిగా ఏదో ఒకటి ఎంచుకుని తీరాలి. మరో గత్యంతరం లేదు. 2004లో ఫేస్‌బుక్ ఆవిర్భవించిన నాటి నుంచి ఏదైనా విషయం నచ్చితే వినియోగదారులు ‘లైక్’ బటన్‌ను నొక్కుతూనే ఉన్నారు.
ప్రతిరోజూ ఫేస్‌బుక్‌లో నమోదవుతున్న లైక్‌ల సంఖ్య ప్రస్తుతం 450 కోట్లకు చేరుకుంది. నచ్చకపోతే మరో అభిప్రాయం వెల్లడించడానికి మరో ఆప్షన్ లేనేలేదు. భావవ్యక్తీకరణ ప్రక్రియలో ఇదో ఇరకాటమైనస్థితి. ఎందుకంటే, ఏదైనా ఒక అంశాన్ని ఒక వ్యక్తి ఇష్టపడటానికి, ఇష్టపడ క పోవడానికి (లైక్, డిస్ లైక్) మధ్య మరెన్నో సున్నితమైన ఉద్వేగాలు ఉంటాయి. అభినందన, ప్రశంస, ఆశ్చర్యం, దిగ్భ్రాంతి, చిరు మందహాసం, చిరునవ్వు, పగలబడి నవ్వడం, విచారం, దుఃఖం, సానుభూతి, అనునయం, మద్దతు, పాక్షికంగా ఏకీభవించడం లాంటివి ఇందులో కొన్ని. ఈ భావాలను వ్యక్తీకరించడానికి ఫేస్‌బుక్‌లో ఎలాంటి బటన్స్ లేవన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలో ‘డిస్‌లైక్’ బటన్‌ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇందులో ఇతర భావోద్వేగాలు పంచుకోవడానికి కూడా సబ్ బటన్‌లు ఉండబోతున్నాయని ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
ఇటీవల సిరియా నుంచి లక్షలమంది నిస్సహాయ శరణార్థులు పడవల్లో, ఇతర వాహనాల్లో ప్రాణం దక్కించుకునేందుకు పరుగులు తీసిన దృశ్యాలను, మరీ విశేషించి బీచ్‌లో ముద్దులొలికే చిన్నారి బాలుడి భౌతిక దేహం చిత్రాన్ని వీక్షించి ప్రపంచమంతటా కోట్లమంది ఫేస్‌బుక్ వినియోగదారులు చలించిపోయారు. ఒక మానవ మహా విషాదానికి సంకేతంగా ఆ చిత్రాలు నిలిచాయి. వీటిపై ఆయా దేశాల ప్రభుత్వాలనే కదిలించే రీతిలో నెటిజన్లు స్పందించారు. ఫలితంగా, ఇల్లూవాకిలీ కోల్పోయి నీడలేని పక్షులైన శరణార్థులకు ఎంతో కొంత ఆసరా లభించింది. అయితే, నెటిజన్లకు ఇటువంటి సన్నివేశాలలోనే ఆచరణాత్మకంగా సమస్య ఎదురయ్యింది. దయనీయమైన ఈ చిత్రాలను చూసి ‘లైక్’ కొడితే సదరు చిత్రాలు బాగున్నాయన్న సందేశం ఇచ్చినట్టవుతుంది గాని, అయ్యో పాపం! అనే సానుభూతి అర్థం మిస్సవుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఫేస్‌బుక్ నిర్వాహకులు ‘ప్రపంచంలో ప్రతిదాన్నీ మంచిదనో చెడ్డదనో రెండు ముక్కల్లో చెప్పలేం. మీరేదైనా మీ పోస్టు ద్వారా చెప్పదలిస్తే మీ మిత్రులు ఇందులో వాస్తవంగా మీరనుకున్నదాన్ని గుర్తించి, అర్థం చేసుకుని, మీకు వారి స్పందన తెలపాలంటే మరిన్ని ఆప్షన్స్ అవసరమని అనుకుంటున్నామ’ ని చెప్పారు.
దేశ దేశాల్లో ఉదయం నిద్రలేవగానే ఫేస్‌బుక్ ద్వారా మిత్రులకు ‘శుభోదయం’ చెప్పిన తరవాతే దినచర్య ఆరంభించే నెటిజన్లకు కొదవలేదు. ఆకర్షణీయమైన రూపాలు, భంగిమలతో సెల్ఫీలు దిగి వాటిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం ఈ రోజుల్లో యువతీ యువకులకు సర్వసామాన్యం. అయితే, తాము పోస్టు చేసిన ఫొటోకు రోజు గడిచినా ఆశించిన ‘లైకులు’ రాలేదని బాధపడి నిద్ర పట్టని వారూ లేకపోలేదు. ఇకపై వీరి ఫొటోలను చూసిన మిత్రులు కేవలం ‘లైక్’తో సరిపెట్టకుండా వీరి మనోభావాలకు అనుగుణంగా స్పందిస్తారు. నిజానికి, మానవ భావోద్వేగాలకు భాషతో పనిలేదు. క్రమం తప్పకుండా ఫేస్‌బుక్‌ని ఉపయోగించే వారిని నిత్యం ప్రపంచంలో ఎక్కడెక్కడివో దృశ్యాలు, కథనాలు కొన్ని అలరిస్తుంటాయి, మరికొన్ని వెన్నాడుతుంటాయి. ఇలా ఎవరో పోస్టు చేసిన ఫొటోలను, వ్యాఖ్యలను ఒక్కోసారి అవి అభ్యంతరకరమైనవని తెలియక ఇతరులకు పంపి (షేర్) పోలీసుల నిఘా కళ్ళకు చిక్కి జైళ్ళ పాలైనవారు మన దేశంలోనే ఎందరో ఉన్నారు. ఇటువంటి వారు ఇకపై తమ స్పందనని ‘లైక్, కామెంట్, షేర్’ అని కాకుండా సురక్షితమైన రూపంలో మరో విధంగా వెల్లడించవచ్చు. అయితే, ఈ విషయంపై అవగాహనలేని వారు ఇష్టాను సారం ‘లైకులు’ కొట్టి నిందితులుగా మారుతున్నారు. తమ తప్పులేకున్నా సమాజం, చట్టం దృష్టిలో న్యాయస్థానం బోనెక్కిన వారిగా ముద్రపడే నెటిజన్లకు ఫేస్‌బుక్ తాజా ఆలోచన ఎంతో ఊరటనిస్తుంది. అమాయకుల పాలిట గుదిబండలుగా మారిన ప్రస్తుత సైబర్ క్రైం నిబంధనలలో సైతం మార్పు తేవడానికి నాంది పలుకుతుంది.
ఫేస్‌బుక్ : ‘డిస్’లైక్
Published Sat, Sep 19 2015 1:46 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
Advertisement