Desktop computer
-
హాట్ కేకుల్లా డెస్క్ టాప్ సేల్స్!! భారత్‌లో కింగ్ మేకర్ ఎవరంటే!
కోవిడ్ కారణంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్‌హోమ్ తో దేశంలో పర్సనల్ కంప్యూటర్లు (పీసీ-డెస్క్‌టాప్),ల్యాప్‌ట్యాప్‌ల వినియోగం బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన క్యూ4 ఫలితాల్లో దేశీయంగా పర్సనల్ కంప్యూటర్లు 14.8 మిలియన్ యూనిట్ల షిప్ మెంట్ జరిగినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. 1.3 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌తో హెచ్‌పీ సంస్థ మార్కెట్లో కింగ్ మేకర్‌గా నిలిచింది. ►2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగింది. ►క్యూ4లో వరుసగా రెండో త్రైమాసికంలో 1మిలియన్ యూనిట్లకు పైగా షిప్పింగ్ చేస్తూ 23.6శాతం షేర్‌తో డెల్ దేశీయ మార్కెట్లో రెండో స్థానంలో నిలించింది. ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ నుండి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెల్ 38శాతం వాటాతో ఎంటర్ప్రైజ్ విభాగంలో ముందుంది. ►మరో టెక్ సంస్థ లెనోవో పీసీ సెగ్మెంట్లో 22.8శాతం వృద్ధిని సాధించింది. 24.7శాతం వాటాతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఈ) విభాగం నుండి డిమాండ్ పెరగడంతో లెనోవో..,హెచ్‌పీ కంటే మందంజతో రెండవ స్థానంలో ఉంది. ►ఏసర్ 8.2శాతం, ఆసుస్ 5.9శాతం మార్కెట్ వాటాతో నాలుగు, ఐదవ స్థానాల్ని సంపాదించుకున్నాయి. డెస్క్‌టాప్ విభాగంగాలో ఏసర్ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. ఇది 25.8శాతం మార్కెట్ వాటా ఉంది. ►ఆసుస్ సంవత్సరానికి 36.1శాతం వృద్ధి చెందింది. ఈ సందర్భంగా ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ (పీసీ డివైజెస్) భరత్ షెనాయ్ మాట్లాడుతూ వరుసగా రెండో సంవత్సరం సైతం విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు/టాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. వారిలో కొంతమంది విద్యార్ధులు మాత్రం పెద్దస్క్రీన్, వాడుకలో సౌలభ్యం వంటి ఇతర ప్రయోజనాల కారణంగా పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. -
డెస్క్‌టాప్స్ మళ్లీ ఊపందుకున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్ వచ్చాక డెస్క్‌టాప్ కంప్యూటర్ల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కార్యాలయాల్లో మాత్రం ఇప్పటికీ డెస్క్టాప్స్ను వినియోగిస్తున్నారు. కొన్నేళ్లుగా సంప్రదాయ డెస్క్‌టాప్ పీసీల స్థానాన్ని ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లు ఆక్రమించుకుంటున్నాయి. అయితే భారత్‌లో ఈ ఏడాది జనవరి–మార్చిలో పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) అమ్మకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆల్ ఇన్ వన్స్‌తో కలిపి డెస్క్‌టాప్ పీసీల విక్రయాలు సుమారు 5.2 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2020 జనవరి–మార్చితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికం. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ తరగతుల మూలంగా వీటికి తిరిగి డిమాండ్ వచ్చింది. విద్యార్థుల కోసం గతేడాది ట్యాబ్లెట్ పీసీలను ఎంచుకున్న కస్టమర్లు ఈ ఏడాది డెస్క్‌టాప్‌లకు మళ్లారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆఫ్‌లైన్‌లోనే అధికం.. ఆల్ ఇన్ వన్స్ పూర్తిగా వ్యవస్థీకృత రంగానిదే. ఈ విభాగంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. ఇక డెస్క్‌టాప్స్‌లో అసెంబుల్డ్ వాటా 65–70 శాతం, మిగిలినది బ్రాండెడ్ కంపెనీలది. వీటికి కావాల్సిన విడిభాగాలను 100 వరకు టాప్ బ్రాండ్లు, 250 దాకా లోకల్ బ్రాండ్స్ సరఫరా చేస్తున్నాయి. 95 శాతం డెస్క్‌టాప్స్ అమ్మకాలు ఆఫ్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. డెస్క్‌టాప్స్ రూ.17,000ల నుంచి రూ.65,000 వరకు లభిస్తాయి. ఆల్ ఇన్ వన్స్ ధరల శ్రేణి రూ.24–70 వేల వరకు ఉంది. గేమింగ్ శ్రేణి రూ.45,000 నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. ల్యాప్టాప్స్ రూ.20 వేల నుంచి లభిస్తాయి. ఇదీ పీసీ మార్కెట్.. దేశవ్యాప్తంగా 2021 జనవరి–మార్చిలో సుమారు 31 లక్షల ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్స్, వర్క్‌స్టేషన్స్ అమ్ముడయ్యాయి. తొలి త్రైమాసికంలో ఈ స్థాయి విక్రయాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 2020 క్యూ1తో పోలిస్తే 73.1 శాతం వృద్ధి నమోదైందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ చెబుతోంది. పీసీ మార్కెట్లో 75 శాతంపైగా వాటాతో దూసుకెళ్తున్న ల్యాప్టాప్స్ అమ్మకాలు 116.7 శాతం అధికమయ్యాయి. తొలి స్థానంలో ఉన్న హెచ్‌పీ వాటా 32.9 శాతంగా ఉంది. రెండవ స్థానంలో నిలిచిన డెల్ టెక్నాలజీస్ 21.8 శాతం వాటా కైవసం చేసుకుంది. లెనోవో 20.1 శాతం, ఏసర్ గ్రూప్‌నకు 7.7 శాతం వాటా ఉంది. పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగే అమ్మకాలు 10 శాతం ఉంటాయని పరిశ్రమ వర్గాల సమాచారం. అప్‌గ్రేడ్‌కు అనువైనవి.. గతేడాది ఒక్కసారిగా ఆన్లైన్ క్లాసులు తెరపైకి రావడంతో కస్టమర్లు ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ఫోన్లను కొన్నారు. దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది డెస్క్టాప్స్కు మళ్లారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు సైతం వీటిని ఎంచుకుంటున్నారు. అప్‌గ్రేడ్ విషయంలో ల్యాప్‌టాప్‌తో పోలిస్తే డెస్క్‌టాప్ అనువైనది. కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా హార్డ్ డిస్క్, ర్యామ్, గ్రాఫిక్స్ కార్డ్, ఎస్ఎస్డీ సులువుగా మార్చుకోవచ్చు. నచ్చిన సైజులో స్క్రీన్‌ను, కావాల్సిన కెమెరాను అమర్చుకోవచ్చు. పైగా దీర్ఘకాలిక మన్నిక కూడా. – అహ్మద్, ఎండీ, ఐటీ మాల్ -
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ తన వినియోగదారుల భద్రత దృష్ట్యా మరో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది. వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యాప్ లో లాగిన్ అవ్వడానికి ముందు వాట్సాప్ మరో సెక్యూరిటీని జోడించింది. వాట్సప్ యూజర్లు తమ వాట్సాప్ ఖాతాలను కంప్యూటర్‌కు లింక్ చేసే ముందు, వేలిముద్ర లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి లాగిన్ కావాలని కొరనుంది.(చదవండి: ఫేస్‘బుక్’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!) ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ ఖాతాను ఇతరుల కంప్యూటర్‌కు లింక్ చేయకుండా అడ్డుకోనుంది. ఇక నుంచి మీరు వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యాప్ కు వాట్సాప్ ఖాతాకు లింక్ చేయడానికి ముందు ఫోన్లో ఫేస్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా అన్‌లాక్ చేయమని కోరిన తర్వాత యూజర్లు మీ ఫోన్ నుంచి QR కోడ్ స్కానర్‌ను స్కాన్ చేసి యాక్సెస్ చేయవచ్చు. యూజర్ మొబైల్ ఫోన్లో ఉన్న డేటాను రక్షించడం కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఇది ఇంకా అభివృద్ది దశలో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. -
బటన్ నొక్కితే విచ్చుకునే స్క్రీన్!
లండన్: ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లు ఎన్ని ఉన్నా... ఓ డెస్క్‌టాప్ కంప్యూటర్‌తో వచ్చే సౌలభ్యమే వేరు. విశాలమైన స్క్రీన్‌తో డెస్క్టాప్పై ఎలాంటి పవర్‌పాయింట్ ప్రెజెంటేషనైనా, ఎక్సెల్షీట్నైనా సులువుగా రన్ చేయవచ్చు. మార్పులు చేర్పులు చేయవచ్చు. కానీ పెద్ద సైజు వల్ల డెస్క్‌టాప్ కంప్యూటర్ను మనకు కావాల్సిన చోటుకు తీసుకెళ్లలేము. దీన్ని అధిగమించేందుకు వినూత్నమైన ఆలోచన చేశారు అలెగ్జాండర్ వీస్లీ. మీటనొక్కగానే విచ్చుకునే గొడుగు మాదిరిగా అరచేతిలో ఇమిడిపోయే హెచ్డీ డిస్ప్లేను సిద్ధం చేశాడు. ‘స్పడ్’ అని పిలుస్తున్న ఈ సరికొత్త కంప్యూటర్ డిస్ప్లే కొంచెం అటుఇటుగా సెట్‌టాప్ బాక్స్ సైజు ఉంటుంది. బటన్ నొక్కగానే ఒక్క సెకన్లో 24 అంగుళాల స్క్రీన్‌గా మారుతుంది. వైర్‌లెస్‌గా కానీ హెచ్డీఎంఐ కేబుల్ ద్వారాగానీ ఇన్పుట్లు అందుకోవచ్చు. ప్రత్యేకమైన వినైల్‌తో తయారైన స్క్రీన్ 1280 ్ఠ 720 రెజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ నమూనాలు రెడీ అయిపోగా... వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు వీస్లీ కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్నీ సవ్యంగా సాగితే ఒక్కో స్పడ్ ఖరీదు దాదాపు రూ. 21 వేల వరకూ ఉండవచ్చు. -
ఫేస్బుక్ : ‘డిస్’లైక్
ప్రపంచంలో ఎంత కొమ్ములు తిరిగిన సంస్థలైనా చేసిన పొరబాట్లను ప్రాప్త కాలజ్ఞతతో దిద్దుకోకుంటే పోటీగా మరొకరు ఎదుగుతారనడానికి చాలా ఉదాహరణలు కనబడతాయి. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్ ’ ఇటీవల తన 40 సంవత్సరాల కంపెనీ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించుకుని ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. సాఫ్ట్వేర్ రంగంలో తనకు ఎదురు లేదన్న భ్రమలో ఇంతకాలం కేవలం డెస్క్‌టాప్ కంప్యూటర్ల వరకే ఆలోచించి, అంతకుమించి సాఫ్ట్వేర్ రంగం ముందుకు వెళ్ళబోదని ఈ కంపెనీ గట్టిగా భావించింది. అయితే, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే సాఫ్ట్వేర్ అవసరాలు ల్యాప్‌టాప్‌ని దాటిపోయి, మొబైల్ ఫోన్లకు చేరి పోయాయి. ఈ పరిణామాన్ని తాము సకాలంలో గుర్తించలేకపోయినందుకు మూల్యం చెల్లించుకున్నామని, ఇది తమ చారిత్రక తప్పిదమని మైక్రోసాఫ్ట్ నిర్వాహకులు చింతించారు. ఇకపై దిద్దుబాటుకు ఉపక్రమించారు. ఖండాల సరిహద్దులను సైతం చెరిపివేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఈరోజుల్లో కాలంతోపాటు మారకుంటే సంస్థలకు మనుగడ కష్టం. విశ్వవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొంది, 140 కోట్లమంది యాక్టివ్ వినియోగదారులున్న సోషల్ మీడియా సంస్థ ‘ఫేస్బుక్’. రెండు రోజుల క్రితం ఈ సంస్థ తీసుకున్న ఒక కీలక నిర్ణయం కూడా ఇలాంటి దిద్దుబాటు చర్యే. ఈ నిర్ణయం అటు దాని విస్తృతిని పెంచడం తోపాటు, ఇటు భావ స్వేచ్ఛాప్రియులను చిరకాలంగా ఇబ్బందిపెడుతున్న సున్నితమైన సమస్యను పరిష్కరిస్తుంది. ఫేస్బుక్లో ప్రస్తుతం ఎవరైనా ఖాతాదారు తన అకౌంట్ వాల్‌పై ఒక చిత్రం లేదా కథనం, వ్యాఖ్య, దృశ్యం వంటివి పోస్టు చేస్తే, దానిని వీక్షించిన, చదివిన వారు తమ స్పందనను ‘లైక్, కామెంట్, లేదా షేర్’ ఆప్షన్లలో తప్పనిసరిగా ఏదో ఒకటి ఎంచుకుని తీరాలి. మరో గత్యంతరం లేదు. 2004లో ఫేస్బుక్ ఆవిర్భవించిన నాటి నుంచి ఏదైనా విషయం నచ్చితే వినియోగదారులు ‘లైక్’ బటన్‌ను నొక్కుతూనే ఉన్నారు. ప్రతిరోజూ ఫేస్బుక్లో నమోదవుతున్న లైక్‌ల సంఖ్య ప్రస్తుతం 450 కోట్లకు చేరుకుంది. నచ్చకపోతే మరో అభిప్రాయం వెల్లడించడానికి మరో ఆప్షన్ లేనేలేదు. భావవ్యక్తీకరణ ప్రక్రియలో ఇదో ఇరకాటమైనస్థితి. ఎందుకంటే, ఏదైనా ఒక అంశాన్ని ఒక వ్యక్తి ఇష్టపడటానికి, ఇష్టపడ క పోవడానికి (లైక్, డిస్ లైక్) మధ్య మరెన్నో సున్నితమైన ఉద్వేగాలు ఉంటాయి. అభినందన, ప్రశంస, ఆశ్చర్యం, దిగ్భ్రాంతి, చిరు మందహాసం, చిరునవ్వు, పగలబడి నవ్వడం, విచారం, దుఃఖం, సానుభూతి, అనునయం, మద్దతు, పాక్షికంగా ఏకీభవించడం లాంటివి ఇందులో కొన్ని. ఈ భావాలను వ్యక్తీకరించడానికి ఫేస్బుక్లో ఎలాంటి బటన్స్ లేవన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలో ‘డిస్లైక్’ బటన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఇందులో ఇతర భావోద్వేగాలు పంచుకోవడానికి కూడా సబ్ బటన్లు ఉండబోతున్నాయని ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ఇటీవల సిరియా నుంచి లక్షలమంది నిస్సహాయ శరణార్థులు పడవల్లో, ఇతర వాహనాల్లో ప్రాణం దక్కించుకునేందుకు పరుగులు తీసిన దృశ్యాలను, మరీ విశేషించి బీచ్‌లో ముద్దులొలికే చిన్నారి బాలుడి భౌతిక దేహం చిత్రాన్ని వీక్షించి ప్రపంచమంతటా కోట్లమంది ఫేస్బుక్ వినియోగదారులు చలించిపోయారు. ఒక మానవ మహా విషాదానికి సంకేతంగా ఆ చిత్రాలు నిలిచాయి. వీటిపై ఆయా దేశాల ప్రభుత్వాలనే కదిలించే రీతిలో నెటిజన్లు స్పందించారు. ఫలితంగా, ఇల్లూవాకిలీ కోల్పోయి నీడలేని పక్షులైన శరణార్థులకు ఎంతో కొంత ఆసరా లభించింది. అయితే, నెటిజన్లకు ఇటువంటి సన్నివేశాలలోనే ఆచరణాత్మకంగా సమస్య ఎదురయ్యింది. దయనీయమైన ఈ చిత్రాలను చూసి ‘లైక్’ కొడితే సదరు చిత్రాలు బాగున్నాయన్న సందేశం ఇచ్చినట్టవుతుంది గాని, అయ్యో పాపం! అనే సానుభూతి అర్థం మిస్సవుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఫేస్బుక్ నిర్వాహకులు ‘ప్రపంచంలో ప్రతిదాన్నీ మంచిదనో చెడ్డదనో రెండు ముక్కల్లో చెప్పలేం. మీరేదైనా మీ పోస్టు ద్వారా చెప్పదలిస్తే మీ మిత్రులు ఇందులో వాస్తవంగా మీరనుకున్నదాన్ని గుర్తించి, అర్థం చేసుకుని, మీకు వారి స్పందన తెలపాలంటే మరిన్ని ఆప్షన్స్ అవసరమని అనుకుంటున్నామ’ ని చెప్పారు. దేశ దేశాల్లో ఉదయం నిద్రలేవగానే ఫేస్బుక్ ద్వారా మిత్రులకు ‘శుభోదయం’ చెప్పిన తరవాతే దినచర్య ఆరంభించే నెటిజన్లకు కొదవలేదు. ఆకర్షణీయమైన రూపాలు, భంగిమలతో సెల్ఫీలు దిగి వాటిని ఫేస్బుక్లో పోస్టు చేయడం ఈ రోజుల్లో యువతీ యువకులకు సర్వసామాన్యం. అయితే, తాము పోస్టు చేసిన ఫొటోకు రోజు గడిచినా ఆశించిన ‘లైకులు’ రాలేదని బాధపడి నిద్ర పట్టని వారూ లేకపోలేదు. ఇకపై వీరి ఫొటోలను చూసిన మిత్రులు కేవలం ‘లైక్’తో సరిపెట్టకుండా వీరి మనోభావాలకు అనుగుణంగా స్పందిస్తారు. నిజానికి, మానవ భావోద్వేగాలకు భాషతో పనిలేదు. క్రమం తప్పకుండా ఫేస్‌బుక్‌ని ఉపయోగించే వారిని నిత్యం ప్రపంచంలో ఎక్కడెక్కడివో దృశ్యాలు, కథనాలు కొన్ని అలరిస్తుంటాయి, మరికొన్ని వెన్నాడుతుంటాయి. ఇలా ఎవరో పోస్టు చేసిన ఫొటోలను, వ్యాఖ్యలను ఒక్కోసారి అవి అభ్యంతరకరమైనవని తెలియక ఇతరులకు పంపి (షేర్) పోలీసుల నిఘా కళ్ళకు చిక్కి జైళ్ళ పాలైనవారు మన దేశంలోనే ఎందరో ఉన్నారు. ఇటువంటి వారు ఇకపై తమ స్పందనని ‘లైక్, కామెంట్, షేర్’ అని కాకుండా సురక్షితమైన రూపంలో మరో విధంగా వెల్లడించవచ్చు. అయితే, ఈ విషయంపై అవగాహనలేని వారు ఇష్టాను సారం ‘లైకులు’ కొట్టి నిందితులుగా మారుతున్నారు. తమ తప్పులేకున్నా సమాజం, చట్టం దృష్టిలో న్యాయస్థానం బోనెక్కిన వారిగా ముద్రపడే నెటిజన్లకు ఫేస్బుక్ తాజా ఆలోచన ఎంతో ఊరటనిస్తుంది. అమాయకుల పాలిట గుదిబండలుగా మారిన ప్రస్తుత సైబర్ క్రైం నిబంధనలలో సైతం మార్పు తేవడానికి నాంది పలుకుతుంది. -
మైక్రోసాఫ్ట్ వండర్ టెక్ హాలో లెన్స్!
డెస్క్‌టాప్ కంప్యూటర్ పేరు చెప్పగానే.... ఓ స్క్రీన్, మౌస్.. కీబోర్డు కళ్లముందు కదులుతాయి. అనంత విశ్వం కూడా ఈ బుల్లిపెట్టెలోనే ఇమిడిపోతుంది. ఆ స్క్రీన్‌పైనే రకరకాల ప్రాంతాల్లో రకరకాల సమాచారాన్ని చూసుకుంటూ అర్థం చేసుకుంటూ మార్చుకుంటూ గడిపేస్తాం మనం. ఇకపై ఆ అవసరం లేదంటోంది మైక్రోసాఫ్ట్. కొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్న హాలోలెన్స్ టెక్నాల జీతో మీరున్న గదే పీసీ తెరగా మారిపోతుందంటోంది. ఏమిటీ హాలోలెన్స్ టెక్నాలజీ? ఎలా పనిచేస్తుంది? హాలీవుడ్ సినిమా ఐరన్‌మ్యాన్ చూశారా? దాంట్లో జార్విస్ పేరుతో ఓ సూపర్ కంప్యూటర్ ఉంటుంది. దాని సీపీయూ ఎక్కడుంటుందో సినిమాలో చూపించలేదుగానీ... హీరో మాటలనే ఆదేశాలుగా స్వీకరిస్తూ, మాట్లాడుతూ పనిచేస్తుందది. అంతేకాదు. హీరో డిజైన్ చేస్తున్న శక్తిమంతమైన సూట్ తాలూకూ వివరాలన్నింటినీ హీరో ఉన్న చోటే గాల్లో ప్రదర్శిస్తూంటుంది. హీరో గాల్లో చేతులు ఊపుతూ, కదుపుతూ ఆ డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తూంటాడు. మైక్రోసాఫ్ట్ తన లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘విండోస్ 10’లోకి చేర్చిన హాలోలెన్స్ కూడా దాదాపుగా ఇదేమాదిరిగా పనిచేస్తుంది. కాకపోతే ఐరన్మ్యాన్లో హీరో కళ్లజోడు లాంటిది పెట్టుకోడు. హాలోలెన్స్కు హైటెక్ గ్లాస్ లాంటి పరికరం అవసరమవుతుంది. అంతే! ఊహూ... ఇది గూగుల్ గ్లాస్ మాదిరిగా కళ్లజోడులోని అద్దంపై కంప్యూటర్ స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేయదు. హాలోగ్రామ్ల ఆధారంగా పనిచేసే తొలి కంప్యూటర్ ఇదని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. మన కంటికి కనిపించే వస్తువులు ఎలాగైతే పదార్థాలతో తయారవుతాయో అలాగే హాలోగ్రామ్లో కనిపించే వస్తువులు అచ్చంగా కాంతితో తయారవుతాయి. హాలోలెన్స్ కోసం మైక్రోసాఫ్ట్ ప్రత్యేకంగా ఓ హాలోగ్రామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సిద్ధం చేసింది. కళ్లజోడు లాంటి ఈ పరికరాన్ని తగిలించుకుని నచ్చిన ఫీచర్లను మీ గదిలోని రకరకాల వస్తువులపై ఉంచవచ్చు. వాటితో ఆడుకోవచ్చు. ఉదాహరణకు మీ పీసీలో వీడియో ప్లేయర్‌ను తీసుకుందాం. దీన్ని మీ గది గోడపై ‘పిన్’ చేయవచ్చు. అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లు ఉన్న ఫోల్డర్‌ను బీరువా ముందుభాగంలో... ఫొటోలు, ఆడియోఫైళ్లను కాఫీటేబుల్పై.. అలా అన్నమాట. ఈ పనులన్నీ చక్కబెట్టేందుకు హెచ్‌పీయూలో ప్రత్యేకమైన సెన్సర్లు, హైడెఫినిషన్ లెన్స్‌లు ఉంటాయి. అయితే ఏంటి? ఎన్ని హైటెక్ హంగులున్నా ఇది కూడా ఓ పీసీనే కదా? నాకు కలిగే అదనపు ప్రయోజనమేమిటి అనుకుంటున్నారా? చాలానే ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ మాటల్లో చెప్పాలంటే... ‘‘మీరు ప్రపంచాన్ని చూసే దృష్టి మారినప్పుడు ప్రపంచమూ మారిపోతుంది’’ అని. హాలోలెన్స్ టెక్నాలజీతో మీరు పీసీని కీబోర్డు, మౌస్‌లతో వాడరు. నేరుగా మీ చేతులనే ఉపయోగించుకుంటూ ఫైళ్లను నియంత్రిస్తూంటారు. ఒక దగ్గర స్థిరంగా కూర్చోవాల్సిన పని అంతకంటే లేదు. ఎంచక్కా అటు ఇటూ నడుస్తూనే పీసీతో చేసే అన్ని పనులు చేసుకోవచ్చు. 2డీలో ఉన్న ఫైళ్లను త్రీడీలో చూసుకోగలగడం, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోగలగడం దీంట్లోని మరో ప్రత్యేకత. ఒకవైపు మీ ఫైళ్లు చూస్తూనే... ఇతర వస్తువులను కూడా మామూలుగా చూడగలిగేలా హాలోలెన్స్ వస్తువులన్నీ పారదర్శకంగా ఉంటాయి. గూగుల్ గ్లాస్‌తోపాటు అకలస్ రిఫ్ట్ వంటి వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్సెట్లు కొన్ని ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ వాటికంటే మైక్రోసాఫ్ట్ హాలోలెన్స్ భిన్నమైందని నిపుణుల అంచనా. వీఆర్ సెట్స్ గేమింగ్ ఏరియాను పరిమితం చేస్తే హాలోలెన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇతర ఉత్పత్తులు ఎక్స్‌బాక్స్, కైనిక్ట్లతో కలిసి పనిచేయగల సామర్థ్యం ఉంటే హాలోలెన్స్ కంప్యూటర్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లేనని అంటున్నారు. చూద్దాం... ఏమవుతుందో?