బటన్ నొక్కితే విచ్చుకునే స్క్రీన్!
లండన్: ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌లు ఎన్ని ఉన్నా... ఓ డెస్క్‌టాప్ కంప్యూటర్‌తో వచ్చే సౌలభ్యమే వేరు. విశాలమైన స్క్రీన్‌తో డెస్క్‌టాప్‌పై ఎలాంటి పవర్‌పాయింట్ ప్రెజెంటేషనైనా, ఎక్సెల్‌షీట్‌నైనా సులువుగా రన్ చేయవచ్చు. మార్పులు చేర్పులు చేయవచ్చు. కానీ పెద్ద సైజు వల్ల డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను మనకు కావాల్సిన చోటుకు తీసుకెళ్లలేము. దీన్ని అధిగమించేందుకు వినూత్నమైన ఆలోచన చేశారు అలెగ్జాండర్ వీస్లీ. మీటనొక్కగానే విచ్చుకునే గొడుగు మాదిరిగా అరచేతిలో ఇమిడిపోయే హెచ్‌డీ డిస్‌ప్లేను సిద్ధం చేశాడు. ‘స్పడ్’ అని పిలుస్తున్న ఈ సరికొత్త కంప్యూటర్ డిస్‌ప్లే కొంచెం అటుఇటుగా సెట్‌టాప్ బాక్స్ సైజు ఉంటుంది.
బటన్ నొక్కగానే ఒక్క సెకన్‌లో 24 అంగుళాల స్క్రీన్‌గా మారుతుంది. వైర్‌లెస్‌గా కానీ హెచ్‌డీఎంఐ కేబుల్ ద్వారాగానీ ఇన్‌పుట్‌లు అందుకోవచ్చు. ప్రత్యేకమైన వినైల్‌తో తయారైన స్క్రీన్ 1280 ్ఠ 720 రెజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ నమూనాలు రెడీ అయిపోగా... వాణిజ్యస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు వీస్లీ కిక్‌స్టార్టర్ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్నీ సవ్యంగా సాగితే ఒక్కో స్పడ్ ఖరీదు దాదాపు రూ. 21 వేల వరకూ ఉండవచ్చు.