హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్‌టాప్స్ వచ్చాక డెస్క్‌టాప్ కంప్యూటర్ల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కార్యాలయాల్లో మాత్రం ఇప్పటికీ డెస్క్‌టాప్స్‌ను వినియోగిస్తున్నారు. కొన్నేళ్లుగా సంప్రదాయ డెస్క్‌టాప్ పీసీల స్థానాన్ని ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లు ఆక్రమించుకుంటున్నాయి. అయితే భారత్‌లో ఈ ఏడాది జనవరి–మార్చిలో పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) అమ్మకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆల్ ఇన్ వన్స్‌తో కలిపి డెస్క్‌టాప్ పీసీల విక్రయాలు సుమారు 5.2 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2020 జనవరి–మార్చితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికం. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ తరగతుల మూలంగా వీటికి తిరిగి డిమాండ్ వచ్చింది. విద్యార్థుల కోసం గతేడాది ట్యాబ్లెట్ పీసీలను ఎంచుకున్న కస్టమర్లు ఈ ఏడాది డెస్క్‌టాప్‌లకు మళ్లారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఆఫ్‌లైన్‌లోనే అధికం..
ఆల్ ఇన్ వన్స్ పూర్తిగా వ్యవస్థీకృత రంగానిదే. ఈ విభాగంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. ఇక డెస్క్‌టాప్స్‌లో అసెంబుల్డ్ వాటా 65–70 శాతం, మిగిలినది బ్రాండెడ్ కంపెనీలది. వీటికి కావాల్సిన విడిభాగాలను 100 వరకు టాప్ బ్రాండ్లు, 250 దాకా లోకల్ బ్రాండ్స్ సరఫరా చేస్తున్నాయి. 95 శాతం డెస్క్‌టాప్స్ అమ్మకాలు ఆఫ్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. డెస్క్‌టాప్స్ రూ.17,000ల నుంచి రూ.65,000 వరకు లభిస్తాయి. ఆల్ ఇన్ వన్స్ ధరల శ్రేణి రూ.24–70 వేల వరకు ఉంది. గేమింగ్ శ్రేణి రూ.45,000 నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. ల్యాప్‌టాప్స్ రూ.20 వేల నుంచి లభిస్తాయి.
ఇదీ పీసీ మార్కెట్..
దేశవ్యాప్తంగా 2021 జనవరి–మార్చిలో సుమారు 31 లక్షల ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్, వర్క్‌స్టేషన్స్ అమ్ముడయ్యాయి. తొలి త్రైమాసికంలో ఈ స్థాయి విక్రయాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 2020 క్యూ1తో పోలిస్తే 73.1 శాతం వృద్ధి నమోదైందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ చెబుతోంది. పీసీ మార్కెట్లో 75 శాతంపైగా వాటాతో దూసుకెళ్తున్న ల్యాప్‌టాప్స్ అమ్మకాలు 116.7 శాతం అధికమయ్యాయి. తొలి స్థానంలో ఉన్న హెచ్‌పీ వాటా 32.9 శాతంగా ఉంది. రెండవ స్థానంలో నిలిచిన డెల్ టెక్నాలజీస్ 21.8 శాతం వాటా కైవసం చేసుకుంది. లెనోవో 20.1 శాతం, ఏసర్ గ్రూప్‌నకు 7.7 శాతం
వాటా ఉంది. పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగే అమ్మకాలు 10 శాతం ఉంటాయని పరిశ్రమ వర్గాల సమాచారం.
అప్‌గ్రేడ్‌కు అనువైనవి..
గతేడాది ఒక్కసారిగా ఆన్‌లైన్ క్లాసులు తెరపైకి రావడంతో కస్టమర్లు ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్‌ఫోన్లను కొన్నారు. దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది డెస్క్‌టాప్స్‌కు మళ్లారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు సైతం వీటిని ఎంచుకుంటున్నారు. అప్‌గ్రేడ్ విషయంలో ల్యాప్‌టాప్‌తో పోలిస్తే డెస్క్‌టాప్ అనువైనది. కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా హార్డ్ డిస్క్, ర్యామ్, గ్రాఫిక్స్ కార్డ్, ఎస్‌ఎస్‌డీ సులువుగా మార్చుకోవచ్చు. నచ్చిన సైజులో స్క్రీన్‌ను, కావాల్సిన కెమెరాను అమర్చుకోవచ్చు. పైగా దీర్ఘకాలిక మన్నిక కూడా.
– అహ్మద్, ఎండీ, ఐటీ మాల్
Comments
Please login to add a commentAdd a comment