Spare Parts
-
రూ.230 కోట్ల డ్రోన్ కాంట్రాక్టులు రద్దు
న్యూఢిల్లీ: దేశీయ డ్రోన్ల తయారీదారులకు భారత సైన్యం షాక్ ఇచ్చింది. రూ.230 కోట్ల విలువైన డ్రోన్ల కొనుగోలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఆయా డ్రోన్లలో చైనా విడిభాగాలు ఉన్నట్లు తేలడమే ఇందుకు కారణం. తూర్పు లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట మోహరించడానికి 400 డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత సైన్యం తొలుత నిర్ణయించింది. ఇందులో 200 మీడియం–అల్టిట్యూడ్ డ్రోన్లు, 100 హెవీవెయిట్ డ్రోన్లు, 100 లైట్‌వెయిట్ డ్రోన్లు ఉన్నాయి. సైన్యానికి డ్రోన్లు సరఫరా చేయడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. ఒప్పందాలు సైతం కుదుర్చుకున్నాయి. అయితే, చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను ఈ డ్రోన్ల తయారీలో ఉపయోగిస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇలాంటి వాటితో దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఆయా కాంట్రాక్టులకు రద్దు చేస్తున్నట్లు సైన్యం ప్రకటించింది. అయితే, దేశ భద్రతకు సంబంధించిన పరికరాల్లో చైనా విడిభాగాలు అమర్చడం ఇదే మొదటిసారికాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు బహిర్గతమయ్యాయి. మన రక్షణ వ్యవస్థలో చైనా హార్డ్‌వేర్ గానీ, సాఫ్ట్వేర్ గానీ ఉపయోగించడానికి వీల్లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్(డీజీఎంఐ) గతంలో రెండుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. చైనా తప్ప ఇతర దేశాల విడిభాగాలను డ్రోన్లలో ఉపయోగించేందుకు అనుమతి ఉందని అధికారులు అంటున్నారు. -
ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్‌పార్ట్స్
చెన్నై: టీవీఎస్ మొబిలిటీ గ్రూప్‌లో భాగమైన మైటీవీఎస్ తాజాగా భారత్‌లో తొలిసారిగా బిజినెస్ టు బిజినెస్ క్విక్ కామర్స్‌లోకి ప్రవేశించింది. మైటీవీఎస్ యాప్‌లో ఆర్డర్ ఇచ్చిన రెండు గంటల్లో వాహన విడిభాగాలు, లూబ్రికెంట్స్‌ను రిటైలర్లు, వ్యాపార భాగస్వాములకు చేరుస్తారు. మూడేళ్లలో దేశవ్యాప్తంగా 250 డార్క్ స్టోర్లను మైటీవీఎస్ హైపర్‌మార్ట్ పేరుతో ఏర్పాటు చేస్తామని సంస్థ ఎండీ జి.శ్రీనివాస రాఘవన్ తెలిపారు.2025 మార్చి నాటికి 50 డార్క్ స్టోర్లు అందుబాటులోకి వస్తాయని రాఘవన్ పేర్కొన్నారు. ‘ఈ దుకాణాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సరఫరా వ్యవస్థ సాంకేతికతను ఉపయోగించుకుంటాయి. సరైన ఉత్పత్తిని సరైన స్థలం, సమయానికి అందజేస్తాం. కన్సైన్మెంట్ ఇన్వెంటరీ విధానాన్ని అమలు చేస్తాం. రిటైలర్లు భారీగా స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వర్కింగ్ క్యాపిటల్ భారం తగ్గుతుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్అతిపెద్ద డిజిటల్ కేటలాగ్..పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కంపెనీ తమిళనాడు, కర్ణాటకలో 14 డార్క్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం అయిందని రాఘవన్ చెప్పారు. ఇది ప్రతి స్టోర్‌కు లాభదాయకతను పెంచుతుందని, మూడు నెలల్లో భాగస్వామి రిటైలర్లకు అత్యుత్తమ రాబడిని అందించిందన్నారు. వాణిజ్య, ప్యాసింజర్ వాహనాల కోసం విడిభాగాలు, లూబ్రికెంట్స్ విభాగంలో 1.2 కోట్లకుపైగా స్టాక్–కీపింగ్ యూనిట్లతో దేశంలో అతిపెద్ద డిజిటల్ కేటలాగ్ నిర్మించామని తెలిపారు. 2025 నాటికి భారత్‌లో 50,000 గరాజ్‌లు, రిటైలర్లను కనెక్ట్ చేయాలన్నది లక్ష్యమని వివరించారు. ప్రస్తుతం మైటీవీఎస్ 1,000కు పైగా సర్వీసింగ్ కేంద్రాలను నిర్వహిస్తోంది. 10 లక్షలకుపైగా కస్టమర్లు ఉన్నారు. -
ICRA: ఆటో విడిభాగాల సంస్థల ఆదాయానికి బ్రేకులు
న్యూఢిల్లీ: దేశీయంగా అమ్మకాల పరిమాణం, ఎగుమతులు తగ్గే అవకాశాలు ఉండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) దిగ్గజ ఆటో విడిభాగాల తయారీ సంస్థల వార్షిక ఆదాయ వృద్ధి మందగించనుంది. 5–7 శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు అంచనాలతో నివేదికను రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 2.7 లక్షల కోట్ల వార్షిక ఆదాయాలు ఉన్న 45 ఆటో విడిభాగాల సంస్థలను ఈ అధ్యయనం కోసం పరిగణనలోకి తీసుకుంది. అధిక బేస్, ఎగుమతుల్లో ఒక మోస్తరు వృద్ధే ఉన్నప్పటికీ దేశీయంగా డిమాండ్ ఆరోగ్యకరమైన స్థాయిలో ఉన్నందున వీటి ఆదాయాలు ఈ ఆర్థిక సంవత్సరం 9–11 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం దేశీయంగా అమ్మకాల పరిమాణం మందగించవచ్చని, ఎగుమతుల పరిస్థితి కూడా బలహీనంగానే ఉండవచ్చని ఇక్రా పేర్కొంది. ఈ నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి కూడా మందగించే అవకాశం ఉందని తెలిపింది. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► సామర్ధ్యాలను పెంచుకునేందుకు, టెక్నాలజీని మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా ఇన్వెస్ట్ చేశాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగనుంది. 2024–25లో పరిశ్రమ పెట్టుబడి వ్యయాలు కనీసం రూ. 20,000–25,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► కొత్త ఉత్పాదనల తయారీ, అధునాతన టెక్నాలజీ అభివృద్ధి మొదలైన అంశాలపై అదనంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలు, సామర్ధ్యాల పెంపు, నియంత్రణ సంస్థపరంగా రాబోయే కొత్త మార్పుల అమలు మొదలైన వాటి కోసం మరింతగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ► అంతర్జాతీయ దిగ్గజ తయారీ సంస్థలు (ఓఈఎం) కొత్త తరహా వాహనాల కోసం సరఫరాదారులను విస్తృతంగా ఎంపిక చేసుకుంటూ ఉండటం, విదేశాల్లో ఆఫ్టర్ మార్కెట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతూ ఉండటం వంటివి భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు సానుకూలం కాగలదు. ► మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు .. ప్రీమియం వాహనాలు .. స్థానికంగా తయారీకి ప్రాధాన్యం పెరుగుతుండటం, విధానాలపరమైన మార్పులు మొదలైన అంశాలు ఆటో విడిభాగాల సరఫరా సంస్థల స్థిర వృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. రెండంకెల స్థాయిలో టూ–వీలర్ల ఆదాయ వృద్ధి ప్రీమియం మోడల్స్‌కు మరింత డిమాండ్– వచ్చే ఆర్థిక సంవత్సరంపై హీరోమోటో సీఈవో గుప్తా అంచనా వచ్చే ఆరి్థక సంవత్సరం దేశీ ద్విచక్ర వాహనాల పరిశ్రమ ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. ప్రీమియం మోడల్స్‌కు డిమాండ్ మరింతగా పెరగనుండటం ఇందుకు దోహదపడగలదని చెప్పారు. టూ–వీలర్ల విషయంలో కొనుగోలుదారులు ఎక్కువ ఫీచర్లు ఉండే మోడల్స్ వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నాళ్లుగా అమ్మకాలు ఒక మోస్తరుగానే ఉంటున్న ఎంట్రీ స్థాయి బైకుల విభాగం కూడా కోలుకుంటోందని తెలిపారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ డిమాండ్ గణనీయంగా మెరుగుపడిందని గుప్తా వివరించారు. ప్రీమియం సెగ్మెంట్ మోడల్స్ విక్రయం కోసం తమ అవుట్‌లెట్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 300 డీలర్íÙప్‌లను అప్‌గ్రేడ్ చేసినట్లు గుప్తా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి వీటి సంఖ్యను 400కు, వచ్చే ఏడాది 100 ప్రీమియా స్టోర్స్‌తో పాటు 500కు పెంచుకుంటామన్నారు. హీరో మోటోకార్ప్ గతేడాది అక్టోబర్‌లో ప్రీమియా బ్రాండ్ పేరుతో తొలి ప్రీమియం–ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ప్రారంభించింది. ప్రీమియం సెగ్మెంట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మావ్రిక్ 440 డెలివరీలు ఏప్రిల్ నుంచి ప్రారంభం కాగలవని గుప్తా పేర్కొన్నారు. -
అయిదేళ్లలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆటో విడిభాగాల పరిశ్రమ తదనుగుణంగా సామరŠాధ్యలను పెంచుకోవడంపై, టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో 6.5 –7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయం 12.6 శాతం పెరిగి రూ. 2.98 లక్షల కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఏడాదీ ఇదే ధోరణి కొనసాగవచ్చని, రెండంకెల స్థాయిలో అమ్మకాలు ఉండగలవని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడి ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘పండుగ సీజన్లో వివిధ సెగ్మెంట్లలో గణనీయంగా అమ్మకాలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆటో విడిభాగాల రంగం మరింత మెరుగ్గా రాణించగలదని ఆశాభావంతో ఉన్నాము‘ అని ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు. దేశ, విదేశ కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా సామర్ధ్యాలను పెంచుకుంటున్నట్లు ఆమె చెప్పారు. గత అయిదేళ్లలో సుమారు 3.5–4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ చేయగా.. రాబోయే అయిదేళ్లలో 6.5–7 బిలియన్ డాలర్లు వెచి్చంచనున్నట్లు వివరించారు. 875 పైచిలుకు సంస్థలకు ఏసీఎంఏలో సభ్యత్వం ఉంది. సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో వీటికి 90 శాతం పైగా వాటా ఉంటుంది. స్థిరంగా ఎగుమతులు.. వాహన విక్రయాలు, ఎగుమతులు స్థిరమైన పనితీరు కనపరుస్తున్నాయని ఏసీఎంఏ డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా తెలిపారు. వాహన పరిశ్రమలోని అన్ని సెగ్మెంట్లకు ఆటో విడిభాగాల సరఫరా నిలకడగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆటో విడిభాగాల ఎగుమతులు 2.7 శాతం పెరిగి 10.4 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 3.6 శాతం పెరిగి 10.6 బిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. దిగుమతుల్లో ఆసియా వాటా 63 శాతంగా ఉండగా, యూరప్ (27 శాతం), ఉత్తర అమెరికా (9 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ తోడ్పాటుతో దేశీయంగా తయారీని పెంచేందుకు పరిశ్రమ గట్టిగా కృషి చేస్తోందని మెహతా వివరించారు. మార్వా, మెహతా చెప్పిన మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో ఎగుమతులకు సంబంధించి చెరి 33 శాతం వాటాతో ఉత్తర అమెరికా, యూరప్ అతి పెద్ద మార్కెట్లుగా కొనసాగాయి. ► ఇదే వ్యవధిలో దేశీయంగా ఉత్పాదనల తయారీ సంస్థలకు (ఓఈఎం) విడిభాగాల అమ్మకాలు 13.9 శాతం పెరిగి రూ. 2.54 లక్షల కోట్లకు చేరాయి. ► భారీ, శక్తిమంతమైన వాహనాలపై ఆసక్తి పెరుగుతుండటం .. ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరు వృద్ధికి దోహదపడుతోంది. ఆఫ్టర్‌మార్కెట్ సెగ్మెంట్ 7.5 శాతం పెరిగి రూ. 45,158 కోట్లకు చేరింది. ► ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్ వృద్ధి కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి ఈవీల విడిభాగాల విక్రయాలకు సంబంధించిన ఆదాయం గణనీయంగా పెరిగింది. -
స్కంద ఏరోస్పేస్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్: స్కంద ఏరోస్పేస్ టెక్నాలజీ (ఎస్ఏటీపీఎల్) తమ అత్యాధునిక గేర్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. మొదటి దశలో రూ. 75 కోట్లు, వచ్చే రెండు మూడేళ్లలో మరో రూ. 150 కోట్ల మొత్తాన్ని కంపెనీ వెచ్చించనుంది. దేశీయంగా విమానాలు, హెలికాప్టర్లతో పాటు అంతర్జాతీయంగా విమానాల మార్కెట్‌కు అవసరమైన విడిభాగాలను ఇందులో ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం ఇందులో 150 మంది వరకు ఉద్యోగులు ఉండగా, మూడేళ్లలో దీన్ని 1,000కి పెంచుకోవాలని సంస్థ యోచిస్తోంది. రఘువంశీ మెషీన్ టూల్స్, రేవ్ గేర్స్ కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. స్కంద ఏరోస్పేస్‌కు ఏటా 9 మిలియన్ డాలర్ల ఆర్డర్లు ఇవ్వనున్నట్లు రేవ్ గేర్స్ తెలిపింది. ప్లాంటు ప్రారంభ కార్యక్రమంలో రఘువంశీ ఎండీ వంశీ వికాస్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ ప్రవీణ్ పి.ఎ. తదితరులు పాల్గొన్నారు. -
2030 నాటికి మూడవ స్థానానికి
న్యూఢిల్లీ: భారత వాహన పరిశ్రమ 2030 నాటికి ప్రపంచంలో మూడవ స్థానానికి ఎగబాకుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వాహనాలు, విడిభాగాల తయారీని పెంపొందించేందుకు ఉద్ధేశించిన రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి పథకాలు ఇందుకు దోహదం చేస్తాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివరించింది. ‘పీఎల్ఐ కోసం దరఖాస్తు చేసే కంపెనీలు పరిశ్రమ వృద్ధిలో కీలకంగా వ్యవహరించనున్నాయి. వాహన పరిశ్రమ మద్దతు, వృద్ధి లేకుండా దేశంలో అధునాతన ఆటోమోటివ్ సాంకేతికత, ఉత్పత్తుల స్థానికీకరణ, అభివృద్ధి లక్ష్యం సాధ్యం కాదు. దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్తంభాలలో వాహన పరిశ్రమ ఒకటి. దేశీయ స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా 1992–93లో 2.77 శాతమే. ఇప్పుడు ఏకంగా ఇది 7.1 శాతానికి ఎగసింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.9 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తోంది. వాహన రంగంలో ద్విచక్ర వాహనాలు 77 శాతం, ప్యాసింజర్ కార్లు 18 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్యాసింజర్ కార్లలో చిన్న, మధ్యస్థాయి కార్లదే సింహ భాగం. 2024 డిసెంబర్ నాటికి ఆటోమొబైల్ రంగం రెండింతలై రూ.15 లక్షల కోట్లకు చేరుకోవాలన్నది భారత్ లక్ష్యం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రూపంలో ఈ రంగంలోకి 2000 ఏప్రిల్ నుంచి 2022 సెపె్టంబర్ మధ్య 33.77 బిలియన్ డాలర్ల నిధులు వెల్లువెత్తాయి. ఈ కాలంలో భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐల్లో వీటి వాటా 5.48 శాతం’ అని తెలిపింది. -
ఢిల్లీ టూ రాంకోఠి!
హైదరాబాద్: సుజుకీ కంపెనీకి చెందిన టూవీలర్, ఫోర్ వీలర్ల నకిలీ స్పేర్ పార్ట్స్ అమ్మకాలు చేస్తున్న రాంకోఠిలోని ‘బాలజీ ఆటో పార్ట్స్’ షాపుపై సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. సుజుకీ కంపెనీకి చెందిన హోలోగ్రామ్ డూప్లికేట్ది తయారు చేసి ఇదే నిజమైన కంపెనీదంటూ నమ్మిస్తూ వాహనదారులను కొంతకాలంగా మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించారు. దీంతో పాటు సుజుకి కంపెనీకి చెందిన క్యూఆర్ కోడ్లను సైతం క్రియేట్ చేసి ఈ నకిలీ దందాకు పాల్పడుతున్నట్లు స్పష్టత వచ్చింది. దీంతో ‘బాలాజీ ఆటో పార్ట్స్’ షోరూంలో భారీ ఎత్తున ఫేక్ స్పేర్ పార్ట్స్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీజ్ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు యజమాని మహేందర్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ నుంచి దిగుమతి.. రాంకోఠి కేంద్రంగా కొంతకాలంగా ద్విచక్ర, కారు, ఆటోలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ నకిలీ దందా నడుస్తుంది. ఈవిషయంపై సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకుని శనివారం రాత్రి ‘బాలాజీ ఆటో పార్ట్స్’ షోరూంపై రైడ్ చేశారు. షోరూంకు చెందిన మహేందర్ కుమార్ గత కొంతకాలంగా న్యూఢిల్లీ నుంచి నకిలీ స్పేర్ పార్ట్స్‌ను ఇక్కడకు తీసుకొస్తున్నాడు. హోలోగ్రామ్‌ను కూడా ఇదే షోరూంలో నకిలీది తయారు చేసి ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఆ పరికరాలపై వేస్తున్నారు. దీంతో పాటు క్యూఆర్ కోడ్ సైతం పరికరాల కవర్లపై ఉండటంతో ఎవరికీ ఇది ఫేక్ అని అనుమానం లేదు. న్యూఢిల్లీలో సుమారు రూ.500కు కొనుగోలు చేసిన పార్ట్స్‌ను ఇక్కడ రూ.1000కి అమ్ముతున్నారు. ఇలా కొంతకాలంగా చేస్తున్న నకిలీ స్పేర్‌పార్ట్స్ వ్యవహారంపై సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ సాయికిరణ్ రైడ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాదాపు రూ.10 లక్షల నకిలీ పార్ట్స్ సీజ్ రైడ్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 14 సిలిండర్ పిస్టాన్ కిట్స్, 26 ఎయిర్ ఫిల్టర్లు, 6 అబ్సోర్బేర్ అస్సీ రేర్ షాక్, 45 షూసెట్బ్రేక్లు, 45 ప్లేట్ క్లచ్‌లు, 8 సీడీఐ యూనిట్లు, 5 హబ్ రేర్ వీల్స్, 5 ఎయిర్ ఫిల్టర్ బాక్సులు, 5 డిస్క్ క్లచ్ ప్రెజర్లు, 5 హబ్క్లచ్ స్టిక్కర్స్, 75 వారిటర్ బాడీలు, ఒక డెల్ ల్యాప్‌టాప్, ఒక ప్రింటర్, సుజుకీ క్యూ ఆర్‌కోడ్ స్టిక్కర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర దాదాపు రూ.10 లక్షలు ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. -
చంద్రయాన్–3లో తెలుగు రక్షణ కవచం!
సాక్షి, అమరావతి: జాబిలిపై అన్వేషణకు బయల్దేరిన చంద్రయాన్–3 ఉపగ్రహానికి రక్షణ కవచం తొడిగారు బెజవాడకు చెందిన ఇంజినీరు బొమ్మారెడ్డి నాగభూషణరెడ్డి (బీఎన్ రెడ్డి). ఉపగ్రహంలో గుండెకాయ వంటి అత్యంత కీలకమైన బ్యాటరీలను కాపాడే రక్షణ కవచాన్ని, మరికొన్ని విడిభాగాలను బీఎన్ రెడ్డి స్థాపించిన ‘నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీనే అందించింది. ఉపగ్రహాల్లో బ్యాటరీలకు రక్షణ కవచాల తయారీలో ఈ సంస్ధ దేశంలోనే పేరెన్నికగన్నది. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఈ కంపెనీ ఇప్పటివరకు 50 శాటిలైట్లకు విడి భాగాలను అందించింది. తాజాగా చంద్రయాన్–3లో రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్లో బ్యాటరీలను అమర్చే అల్యూమినియం స్టాండ్స్, నాసిల్స్, స్లీవ్స్‌ను సమకూర్చింది. గతంలో చంద్రయాన్–1, చంద్రయాన్–2తో పాటు ఇస్రో నిర్వహించిన అనేక ప్రయోగాల్లో ఈ సంస్థ భాగస్వామి అయ్యింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)తో కలిసి పని చేయడంతో పాటు ఏరో స్పేస్, యుద్ధ విమానాల విడిభాగాలను కూడా వివిధ విమాన తయారీ సంస్థలకు సమకూరుస్తోంది. ఏరో స్పేస్ రంగంలో ఉజ్వల భవిష్యత్తును ఊహించి.. బీఎన్ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి విజయవాడ, గన్నవరంలో రైల్వే ఇంజినీరుగా పని చేసేవారు. ఈ క్రమంలోనే బీఎన్ రెడ్డి విద్యాభ్యాసం కేబీఎన్, సిద్థార్థ ఇంజినీరింగ్ కాలేజీల్లో సాగింది. 1982లో హైదరాబాద్ వెళ్లిన ఆయన ఓ చిన్న పరిశ్రమలో ఉద్యోగిగా చేరారు. అనంతరం జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్, డిజైనింగ్స్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. తర్వాత అల్విన్ లిమిటెడ్‌లో ఉద్యోగంలో చేరారు. ఏరో స్పేస్ రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గ్రహించి 1994లో సొంతంగా ‘నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. తొలినాళ్లలో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ పరికరాలను తయారు చేసేవారు. 1998 నుంచి ఇస్రో ప్రయోగాలకు అవసరమైన వివిధ ఉపకరణాలను అందించడంపై దృష్టి పెట్టారు. బీఎన్ రెడ్డి పనితీరు, నైపుణ్యాన్ని ఇస్రో ఉన్నతాధికారులు 6 నెలల పాటు పరీక్షించారు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత అవకాశం కల్పించారు. అల్యూమినియం ప్లాంటు ఏర్పాటుకు విశేష కృషి ఒకప్పుడు శాటిలైట్‌లో విడి భాగాల తయారీకి ఉపయోగించే ప్రత్యేక అల్యూమినియాన్ని ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇది అధిక సమయం, ఖర్చుతో కూడుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే నాణ్యమైన అల్యూమినియం ప్లాంటు ఏర్పాటు జరిగింది. ఈ ప్లాంటు ఏర్పాటుకు బీఎన్ రెడ్డి విశేష కృషి చేశారు. దీని ద్వారా ఖర్చు, సమయం ఆదా అవుతున్నాయి. ఇస్రో, నాసాతో భాగస్వామ్యమే లక్ష్యం ‘‘ఇస్రో, నాసాల శాటిలైట్ ప్రయోగాల్లో నా కంపెనీ భాగస్వామ్యం ఉండాలన్నదే నా లక్ష్యం. స్వదేశీ పరిజ్ఞానంతో పరికరాల తయారీ ద్వారా ప్రయోగాల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు చంద్రయాన్–3ని కూడా తక్కువ ఖర్చుతోనే చేపట్టారు. ప్రయోగంలో శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అని బీఎన్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. -
అంచనాలను మించి పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాలు, వాహన విడిభాగాల తయారీ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం జోష్ నింపింది. వచ్చే అయిదేళ్లలో రూ.42,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయగా.. ఏకంగా రూ.67,690 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు రావడం విశేషం. పీఎల్ఐ పథకం కింద మొత్తం 115 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. పథకం, మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 23న ప్రకటించింది. వచ్చిన దరఖాస్తుల్లో 85 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటిలో చాంపియన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 18 సంస్థలు, కంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 67 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండు విభాగాల్లోనూ రెండు కంపెనీలు ఎంపికైనట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విదేశీ కంపెనీలు సైతం.. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఎంపికైన కంపెనీల జాబితాలో భారత్‌తోపాటు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యూఎస్, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, నెదర్లాండ్స్ కంపెనీలు ఉండడం గమనార్హం. అంచనాలను మించి పెట్టుబడి ప్రతిపాదనలు రావడం ప్రపంచస్థాయి తయారీ కేంద్రంగా భారత పురోగతికి నిదర్శనమని ప్రభుత్వం తెలిపింది. ఆత్మనిర్భర్ ప్రణాళికలో భాగంగా భారతీయ తయారీదార్లను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతుల పెంపు, భారత్‌ను ప్రపంచ సరఫరా వ్యవస్థలో భాగం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
భారత్ ఫోర్జ్ లాభంలో క్షీణత
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం జులై–సెప్టెంబర్(క్యూ2)లో 48 శాతం క్షీణించి రూ.141 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 270 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,386 కోట్ల నుంచి రూ. 3,076 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 1.50 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. అల్యూమినియం ఫోర్జింగ్ బిజినెస్ విక్రయాలు మందగించడంతో యూరోపియన్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు భారత్ ఫోర్జ్ పేర్కొంది. ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంటులో ఉత్పత్తిని దశలవారీగా హెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం నిర్వహణా లాభస్థాయికి దిగువనే వినియోగమున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో అల్యూమినియం ఫోర్జింగ్ బిజినెస్ టర్న్అరౌండ్ సాధించే వీలున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ బీఎన్ కళ్యాణి అభిప్రాయపడ్డారు. ఫలితాల నేపథ్యంలో భారత్ ఫోర్జ్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం క్షీణించి రూ. 853 వద్ద ముగిసింది. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఈవీ జోరు.. ముందుంది మంచి కాలం.. ఏకంగా 72 వేల కోట్ల వ్యాపారం!
ముంబై: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం (ఈవీ) వృద్ధి చెందుతుండడంతో.. ఆటో విడిభాగాల కంపెనీలకు 2027 నాటికి 9–11 శాతం మేర ఆదాయం ఈవీల నుంచి రావచ్చని క్రిసిల్ అంచనా వేసింది. ఇదే కాలంలో సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ (ఐసీఈ) వాహనాల నుంచి కూడా విడిభాగాల కంపెనీలకు వ్యాపారం వృద్ధి చెందుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయంలో ఈవీ విడిభాగాల వాటా ఒక శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఈవీలకు సంబంధించి ఆటో విడిభాగాల మార్కెట్ ఏటా 76 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి చెందుతూ 2026–27 నాటికి రూ.72,500 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇందులో 60 శాతం బ్యాటరీల నుంచే ఉంటుందని పేర్కొంది. 15 శాతం మేర డ్రైవ్‌ట్రైన్‌లు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఉంటుందని తెలిపింది. 220 తయారీ సంస్థల నుంచి వివరాలు తీసుకుని విశ్లేషించగా.. ఈవీలకు మళ్లడం అనేది అవకాశాలతో పాటు సవాళ్లను కూడా తీసుకొస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అయ్యింది. వ్యాపారంలో వైవిధ్యం.. ‘‘బ్యాటరీలు, డ్రైవ్‌ట్రైన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఇతర విడిభాగాలు ఆటో కాంపోనెంట్స్ కంపెనీలు తమ ఆదాయాన్ని ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్‌కు వెలుపల విస్తరించుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీపై కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్నాయి. ఇందులో ఐసీఈ విడిభాగాల కంపెనీలతో పాటు, కొత్తగా ఏర్పాటవున్న ఈవీ విడిభాగాల కంపెనీలు కూడా ఉన్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నవీన్ వైద్యనాథన్ తెలిపారు. ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు ఈవీ వైపు వ్యాపార అవకాశాల విస్తరణకు మద్దతుగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈవీ విభాగంలో టూవీలర్ల వాటా ప్రస్తుతమున్న 2.5 శాతం నుంచి 19 శాతానికి, ప్యాసింజర్ కార్ల వాటా 1 శాతం నుంచి 7 శాతానికి చేరుతుందని పేర్కొంది. -
‘బాష్’కు భారతీయత
సాక్షి, బెంగళూరు: భారత్‌కు బాష్ కంపెనీ ఎప్పుడో జర్మనీ నుంచి వచ్చినా ఇప్పుడు అది పూర్తిగా భారతీయతను సంతరించుకుందని ప్రధాని మోదీ కొనియాడారు. ఆటోమొబైల్ విడిభాగాలు మొదలుకొని సెక్యూరిటీ, గృహోపకరణాలు తయారు చేసే బాష్ కంపెనీ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించి వందేళ్లయింది. ఈ సందర్భంగా గురువారం బాష్ బెంగళూరులో ‘స్పార్క్ నెక్ట్స్‘ పేరుతో నిర్మించిన భవనాన్ని ప్రధాని ఆవిష్కరించారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ ఆవిష్కరణలో ప్రధాని మాట్లాడుతూ భారతీయ శక్తి, జర్మన్ ఇంజినీరింగ్‌ల సమర్థ మేళవింపునకు బాష్ కంపెనీ మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న సమయంలో బాష్ వందేళ్లు పూర్తి చేసుకోవడం ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకతను కల్పిస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. భారత్‌లో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ డిజిటల్, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కృత్రిమ మేథతోపాటు అనేక అత్యాధునిక టెక్నాలజీలు కలిగిన ‘స్పార్క్ నెక్ట్స్’వంటి భవనాలు దేశంలో రేపటితరం ఉత్పత్తుల తయారీని వేగవంతం చేస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశానికి అవసరమైన మరిన్ని ఉత్పత్తులు, టెక్నాలజీలను బాష్ తయారు చేయాలని, రానున్న25 ఏళ్ల కు లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. బెంగళూరు ప్రతిష్ట బాష్ ‘స్పార్క్ నెక్ట్స్’తో మరింత పెరిగిందని కర్ణాటక సీఎం బొమ్మై కొనియాడారు. సుస్థిరత... మా తారకమంత్రం: ఫెలీజ్ అల్చెర్ట్ ‘స్పార్క్ నెక్ట్స్‘ నిర్మాణానికి ఐదేళ్లలో రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు బాష్ కంపెనీ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యురాలు ఫెలీజ్ ఆల్చెర్ట్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశామన్నారు. 76 ఎకరాల్లో మొత్తం 10 వేల మంది పని చేయగల ‘స్పార్క్ నెక్ట్స్‘లో ఏటా 5.8 కోట్ల లీటర్ల వాననీటి సంరక్షణ జరుగుతుందని చెప్పారు. వినియోగం తగ్గిందని వివరించారు. భారత్‌లో బాష్ పెట్టుబడులు మరిన్ని పెరగనున్నాయని, త్వరలో 25 కోట్ల యూరోలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. బాష్ కంపెనీ దశాబ్దాలుగా ఆత్మ నిర్భర్ భారత్ కోసం కృషి చేస్తోందని ఉత్పత్తుల డిజైనింగ్ మొదలు తయారీ వరకూ అన్నీ చేపట్టడం ద్వారా మేకిన్ ఇండియాకూ ఊతమిస్తున్నామని బాష్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య తెలిపారు. -
ఆటో విడిభాగాల సంస్థలకు డిమాండ్ ఊతం
ముంబై: డిమాండ్ స్థిరంగా ఉండటం, సరఫరా వ్యవస్థపరమైన అడ్డంకులు తొలగిపోతుండటం తదితర అంశాలు ఆటో విడిభాగాల సంస్థలకు ఊరటనివ్వనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆదాయాలు 8–10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక ప్రకటనలో ఈ అంచనాలు వెల్లడించింది. దీని ప్రకారం 31 ఆటో విడిభాగాల కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ. 1,75,000 కోట్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. దేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు (ఓఈఎం), రిప్లేస్మెంట్, ఎగుమతులు, కమోడిటీల ధరల పెరుగుదలను బదలాయించగలగడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడ్డాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లో బేస్‌తో పోలిస్తే వృద్ధి అధిక స్థాయిలో నమోదైందని, అయినప్పటికీ పరిశ్రమ ఆదాయాలు తమ అంచనాలు మించాయని ఇక్రా పేర్కొంది. ఊహించిన దాని కన్నా ఎగుమతులు మెరుగ్గా ఉండటం, కమోడిటీల ధరలు.. రవాణా వ్యయాల పెరుగుదల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కంపెనీలకు కలిసొచ్చిందని వివరించింది. తగ్గిన మార్జిన్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు పెరిగినప్పటికీ ముడి వస్తువుల ఖర్చులు, రవాణా వ్యయాల భారాన్ని ద్వితీయార్థంలో (అక్టోబర్–మార్చ్) కంపెనీలు పూర్తి స్థాయిలో, సకాలంలో బదలాయించలేకపోయాయని ఇక్రా తెలిపింది. దీనితో లాభాల మార్జిన్లపై ప్రభావం పడినట్లు పేర్కొంది. 31 ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ మార్జిన్లు గత ఆర్థిక సంవత్సరంలో అయిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయని ఇక్రా తెలిపింది. సెమీకండక్టర్ కొరత సమస్యలు, ద్విచక్ర వాహనాలు .. ట్రాక్టర్లకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ వ్యాపారాలపై భౌగోళికరాజకీయ పరిణామాల వంటి అంశాలు ఆదాయాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. ‘30 కంపెనీల (ఒక పెద్ద ఆటో విడిభాగాల సరఫరా సంస్థ కాకుండా) నిర్వహణ మార్జిన్లు 10.6 శాతంగా నమోదయ్యాయి. వార్షికంగా చూస్తే ఇది 10 బేసిస్ పాయింట్లు, మా అంచనాలతో పోలిస్తే 40 బేసిస్ పాయింట్లు తక్కువ‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుతా ఎస్ తెలిపారు. సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, ధరల పెరుగుదల భయాల కారణంగా ఆటో యాన్సిలరీలు గత ఆర్థిక సంవత్సరంలో తమ నిల్వలను భారీగా పెంచుకున్నాయని పేర్కొన్నారు. అంతక్రితం నాలుగేళ్లలో ఇదే అత్యధికమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి సంస్థల దగ్గర లిక్విడిటీ (నగదు లభ్యత) మెరుగ్గా ఉండటం సానుకూలాంశమని వినుత తెలిపారు. పీఎల్ఐ స్కీముతో దన్ను.. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో మధ్యకాలికంగా ఆటో యాన్సిలరీల విభాగంలో పెట్టుబడులకు ఊతం లభించగలదని ఇక్రా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో కొత్తగా మరిన్ని పెట్టుబడులు రాగలవని వివరించింది. ఇక పరిశ్రమకు రుణ అవసరాలు కూడా ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఆటో యాన్సిలరీల రుణాల భారం పరిస్థితి మెరుగ్గా ఉందనేందుకు సూచనగా చాలా మటుకు సంస్థలకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం .. ఆటో యాన్సిలరీలకు సానుకూలంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
మారుతి సుజుకి వినియోగదారులకు శుభవార్త..!
మీరు మారుతి సుజుకి కారు కొన్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ప్రముఖ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం తన వినియోగదారుల కోసం మరో కొత్త సేవలను అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి మారుతి సుజుకి కార్లకు చెందిన యాక్ససరీలు లేదా స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. మారుతి సుజుకి ఒక పత్రికా ప్రకటనలో.. తమ సంస్థకు చెందిన జెన్యూన్ యాక్ససరీలు ఇప్పుడు దేశంలోని 100 నగరాల్లో గల వినియోగదారులు ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చని పేర్కొంది. కస్టమర్ సౌలభ్యం కోసం హోమ్ ఇన్ స్టలేషన్ షెడ్యూల్ చేసే ఆప్షన్ కూడా ఇప్పుడు ఉంది. ప్రస్తుతం, ఆన్లైన్లో సుమారు 2,000కి పైగా యాక్ససరీలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ కామర్స్ ఫ్లాట్ ఫారాల వేదికగా ఎలాగైతే వస్తువులను కొనుగోలు చేస్తున్నామో, అలాగే మారుతి కస్టమర్లు వెబ్ సైట్ ద్వారా యాక్ససరీలను బ్రౌజ్ చేయడంతో పాటు తమకు కావాల్సిన వాటిని ఎంచుకొని చెల్లింపులు చేసే అవకాశం ఉంది. జెన్యూన్ యాక్ససరీలను వినియోగదారులకు అందించడం కోసమే ఈ సేవలు ప్రవేశ పెట్టినట్లు సంస్థ పేర్కొంది. "ఆన్లైన్లో మారుతి సుజుకి జెన్యూన్ యాక్ససరీస్ లభించడం వల్ల వినియోగదారులకు మరింత చేరువ అయ్యే అవకాశం ఉంటుందని" మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కెనిచి అయుకావా చెప్పారు. ఆన్లైన్లో మారుతి సుజుకి జెన్యూన్ యాక్ససరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. (చదవండి: వారం/నెల ‘సిప్’.. ఏది మంచిది?) -
సెల్‌ఫోన్ చోరుల కొత్త పంథా..
సెల్ఫోన్ల దొంగలు రూట్ మార్చారు. ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యథాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇలా తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం మొదలెట్టారు. ఆపై ఇతర రాష్ట్రాలు, దేశాలకు విదేశాలకు తరలించేయడం చేశారు. తాజాగా చోరీ ఫోన్లను స్పేర్ పార్ట్స్‌గా మార్చి అమ్మేస్తున్నట్లు నగర పోలీసులు గుర్తించారు. ఈ ముఠాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు కేవలం పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తరవాత వీరి దృష్టి సెల్ఫోన్లపై పడింది. పీడీ యాక్ట్ ప్రయోగం ప్రారంభమయ్యే వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు కూడా ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందాలో ఉన్నాయని అంటున్నారు. ఒకరి ‘ఏరియా’ల్లోకి మరోకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగాయి. గల్లీ దుకాణాల కేంద్రంగానే.. అనధికారిక సమాచారం ప్రకారం రాజధానిలో ఏటా దాదాపు లక్ష వరకు సెల్ఫోన్లు చోరీకి అవుతున్నాయి. రాజధాని నగరంలో అనేక ఛోటామోటా ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్‌ఫోన్ నేరం అనేది కొనసాగుతోంది. వీరిబారిన పడే వారిలో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి ఫోన్లను స్పేర్‌పార్ట్స్‌గా మార్చడం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ దందాను పెద్ద దుకాణాలు, మార్కెట్లలో కాకుండా గల్లీల్లో ఉండే చిన్న చిన్న దుకాణాల కేంద్రంగా చేస్తున్నారనే సమాచారం ఉంది. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం. – నగర పోలీసు ఉన్నతాధికారి గతంలో ఐఎంఈఐ నెంబర్ మార్చేసి... ప్రపంచంలో తయారయ్యే ప్రతి మొబైల్ ఫోన్కీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్(ఐఎంఈఐ) నెంబర్ ఉంటుంది. సదరు సెల్‌ఫోన్‌ను ఎవరు వాడుతున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఐఎంఈఐ నెంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ ఇంటర్నెట్లో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్ కేటాయించేసేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసేసే వారు. ఇలా చేస్తే సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. ఇలా విడగొట్టేసి.. అలా విక్రయాలు ఇటీవల కాలంలో చోరీ ఫోన్లను ఖరీదు చేసే నగర వ్యాపారుల పంథా పూర్తిగా మారిపోయినట్లు సిటీ పోలీసులు గుర్తించారు. వీటిని యథాతథంగా విక్రయిస్తే నిఘా సమస్య ఉంటోందని భావించారు. దీంతో స్పేర్‌పార్ట్స్‌గా మార్చేసి అమ్ముతున్నారు. ఐఎంఈఐ నెంబర్ అనేది ఫోన్ మదర్ బోర్డ్‌కు సంబంధించిన అంశం. ఈ నేపథ్యంలోనే దీన్ని మాత్రం అమ్మకుండా మిగిలిన అన్ని విడి భాగాలకు సెల్‌ఫోన్ దుకాణాలకు అమ్మేస్తున్నారు. ఇలా చేయడంతో లాభం తక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ అనేది ఉండదన్నది చోరీ సొత్తు విక్రేతల ఉద్దేశం. కొందరు సెల్‌ఫోన్ రిపేరింగ్ షాపులతో పాటు ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లతో ఈ తరహా విక్రేతలకు సంబంధాలు ఉంటున్నాయని అధికారులు తేల్చారు. ఈ దందా చేస్తున్న వ్యాపారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ► కొన్నేళ్ల నుంచి కరోనా ముందు రోజుల వరకు ఈ చోరీఫోన్లు దేశం దాటేశాయి. ► ఈ ఫోన్లను వ్యవస్థీకృత ముఠాలు ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు తరలించేసిన సందర్భాలు అనేకం. ► ఐ–ఫోన్ల వంటివైతే ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్లు చొప్పున బ్యాంకాక్ తీసుకువెళ్ళి అక్కడ మార్కెట్లో అమ్మేసి వచ్చిన చోరులు అనేక మంది ఉన్నారు. ► నగరంలో జగదీష్ మార్కెట్ మాదిరిగా ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ ఉందని, అయితే ఐ–ఫోన్లకే గిరాకీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు గుల్బర్గాలో ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దేశంలో చోరీ మాల్‌కు కేరాఫ్ అడ్రస్ అని పోలీసులు గుర్తించారు. ఇలానే రిటర్న్ మాల్ పేరుతో చైనాకు చోరీ ఫోన్లు పంపిన సందర్భాలు అనేకం. -
దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వండి
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వాలని ఆటో విడిభాగాల పరిశ్రమకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే సూచించారు. క్షేత్రస్థాయిలో స్థానికీకరణపై దృష్టి పెట్టాలని.. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిప్పించడంపైనా ఇన్వెస్ట్ చేయాలని తెలిపారు. ఆటోమోటివ్ విడిభాగాల తయారీ సంస్థల అసోసియేషన్ ఏసీఎంఏ 61వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘స్థానికంగా తయారీకి ప్రాధాన్యం లభించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశ్యం. పరిశ్రమ కూడా స్థానికీకరణ ప్రక్రియపై కసరత్తు చేస్తోందని నాకు తెలుసు. సియామ్ (వాహనాల తయారీ సంస్థల సమాఖ్య), ఏసీఎంఏ స్థానికీకరణ మార్గదర్శ ప్రణాళికను కూడా రూపొందించాయి. దాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని పరిశ్రమను కోరుతున్నాను’’ అని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఆర్అండ్డీ కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలని పేర్కొన్నారు. ఆటో విడిభాగాల పరిశ్రమకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం వాటా ఉందని, 50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 60 శాతం ఆటో విడిభాగాల ఎగుమతులు ఉత్తర అమెరికా, యూరప్ దేశాలకు వెడుతున్నాయని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 2025–26 నాటికి ఎగుమతులను 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ పరిశ్రమ వాటా 3 శాతానికి చేరగలదని వివరించారు. అలాగే 2025 నాటికి ఆటో విడిభాగాల రంగంలో ఉద్యోగాల సంఖ్య 70 లక్షలకు చేరగలదన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆటోమోటివ్ ఎగుమతులు 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 1.3 లక్షల కోట్ల డాలర్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌కు 1.2 శాతం వాటా ఉంది. ఏసీఎంఏలో 800 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. వీటికి సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో 85 శాతం పైగా వాటా ఉంది. ఎలాంటి టెక్నాలజీలనైనా స్థానికంగా వినియోగంలోకి తెచ్చేందుకు తగినంత సమయం లభించేలా దీర్ఘకాలికమైన, స్థిరమైన మార్గదర్శ ప్రణాళిక అవసరమని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ అభిప్రాయపడ్డారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: కాంత్ దేశీ ఆటోమొబైల్, విడిభాగాల రంగాలు చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటం నుంచి పూర్తిగా బైటికి రావాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సూచించారు. ఆటో విడిభాగాలు మొదలైన వాటన్నింటినీ దేశీయంగా తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఫేమ్ 2 పథకం కింద ఎంపికైన తొమ్మిది నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత నాలుగు చక్రాల వాహనాలకు (కార్లు మొదలైన వాటికి) కూడా స్కీమును వర్తింపచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. 2030 నాటికి కార్లన్నీ ఎలక్ట్రిక్: నిస్సాన్ వాహన తయారీ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కారణంగా పరిశ్రమలో సమూల మార్పులు వస్తాయని కంపెనీ సీవోవో అశ్వని గుప్తా అన్నారు. 2030 నాటికి కంపెనీ కార్లన్నీ ఎలక్ట్రిక్ ఆప్షన్స్‌తో ఉంటాయని వెల్లడించారు. ‘భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అయిదారేళ్లలో మూడవ స్థానానికి చేరడం ఖాయం. దేశంలో 1,000 మంది జనాభాకు 20 కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్నదే పెద్ద సవాల్’ అని అన్నారు. -
ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ రాకతో ఆ కంపెనీ దశ తిరిగింది..!
న్యూఢిల్లీ: భారీ అంచనాల మధ్య ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓలా సహా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లలో భాగంగా ఎస్1, ఎస్1 ప్రొ పేరుతో రెండు మోడల్స్‌ను మార్కెట్లలోకి తీసుకొనివచ్చింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 మోడల్ ధర రూ.99,999గా ఉంటే ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1,29,999గా కంపెనీ నిర్ణయించింది. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) భారత మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లు వాహన ప్రియులకు ఏవిధంగా లాభం చేకూరుస్తుందో ఇప్పడే చెప్పలేము కానీ, ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల రాకతో విడిభాగాలను తయారుచేసే ఫియమ్ ఇండస్ట్రీస్ కంపెనీ దశ మారిపోయింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌ల విడిభాగాలకు ఫియమ్ ఏకైక సరఫరాదారుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లకు హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఇండికేటర్లు, రేర్ ఫెండర్ అసెంబ్లీ, మిర్రర్స్‌ను ఫియమ్ ఇండస్ట్రీస్ అందించింది. దూసుకుపోయిన కంపెనీ షేర్లు..! తాజాగా స్టాక్ మార్కెట్లో ఫియమ్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు 20 శాతం మేర పెరిగి రికార్డుస్థాయిలో అత్యధికంగా షేర్ల విలువ రూ. 951.80 వరకు చేరుకుంది. స్టాక్మార్కెట్లో ఇప్పటివరకు ఫియమ్ ఇండస్ట్రీస్ షేర్లు 68 శాతంమేర పెరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లకు విడిభాగాలను అందించిన కంపెనీగా ఫియమ్ నిలిచిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇతర ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు కూడా విడిభాగాలను ఫియమ్ సప్తే చేస్తోంది. భవిష్యత్తులో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్లను తీర్చేందుకు ఫియమ్ సిద్ధంగా ఉందని వెల్లడించింది. (చదవండి: Apple: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..!) -
డెస్క్‌టాప్స్ మళ్లీ ఊపందుకున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్ వచ్చాక డెస్క్‌టాప్ కంప్యూటర్ల ప్రాభవం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కార్యాలయాల్లో మాత్రం ఇప్పటికీ డెస్క్టాప్స్ను వినియోగిస్తున్నారు. కొన్నేళ్లుగా సంప్రదాయ డెస్క్‌టాప్ పీసీల స్థానాన్ని ఆల్ ఇన్ వన్ డెస్క్‌టాప్‌లు ఆక్రమించుకుంటున్నాయి. అయితే భారత్‌లో ఈ ఏడాది జనవరి–మార్చిలో పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) అమ్మకాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆల్ ఇన్ వన్స్‌తో కలిపి డెస్క్‌టాప్ పీసీల విక్రయాలు సుమారు 5.2 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2020 జనవరి–మార్చితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికం. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ తరగతుల మూలంగా వీటికి తిరిగి డిమాండ్ వచ్చింది. విద్యార్థుల కోసం గతేడాది ట్యాబ్లెట్ పీసీలను ఎంచుకున్న కస్టమర్లు ఈ ఏడాది డెస్క్‌టాప్‌లకు మళ్లారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఆఫ్‌లైన్‌లోనే అధికం.. ఆల్ ఇన్ వన్స్ పూర్తిగా వ్యవస్థీకృత రంగానిదే. ఈ విభాగంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్ బ్రాండ్స్ పోటీపడుతున్నాయి. ఇక డెస్క్‌టాప్స్‌లో అసెంబుల్డ్ వాటా 65–70 శాతం, మిగిలినది బ్రాండెడ్ కంపెనీలది. వీటికి కావాల్సిన విడిభాగాలను 100 వరకు టాప్ బ్రాండ్లు, 250 దాకా లోకల్ బ్రాండ్స్ సరఫరా చేస్తున్నాయి. 95 శాతం డెస్క్‌టాప్స్ అమ్మకాలు ఆఫ్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. డెస్క్‌టాప్స్ రూ.17,000ల నుంచి రూ.65,000 వరకు లభిస్తాయి. ఆల్ ఇన్ వన్స్ ధరల శ్రేణి రూ.24–70 వేల వరకు ఉంది. గేమింగ్ శ్రేణి రూ.45,000 నుంచి రూ.2.5 లక్షల వరకు ఉంటుంది. ల్యాప్టాప్స్ రూ.20 వేల నుంచి లభిస్తాయి. ఇదీ పీసీ మార్కెట్.. దేశవ్యాప్తంగా 2021 జనవరి–మార్చిలో సుమారు 31 లక్షల ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్స్, వర్క్‌స్టేషన్స్ అమ్ముడయ్యాయి. తొలి త్రైమాసికంలో ఈ స్థాయి విక్రయాలు నమోదు కావడం ఇదే తొలిసారి. 2020 క్యూ1తో పోలిస్తే 73.1 శాతం వృద్ధి నమోదైందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ చెబుతోంది. పీసీ మార్కెట్లో 75 శాతంపైగా వాటాతో దూసుకెళ్తున్న ల్యాప్టాప్స్ అమ్మకాలు 116.7 శాతం అధికమయ్యాయి. తొలి స్థానంలో ఉన్న హెచ్‌పీ వాటా 32.9 శాతంగా ఉంది. రెండవ స్థానంలో నిలిచిన డెల్ టెక్నాలజీస్ 21.8 శాతం వాటా కైవసం చేసుకుంది. లెనోవో 20.1 శాతం, ఏసర్ గ్రూప్‌నకు 7.7 శాతం వాటా ఉంది. పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగే అమ్మకాలు 10 శాతం ఉంటాయని పరిశ్రమ వర్గాల సమాచారం. అప్‌గ్రేడ్‌కు అనువైనవి.. గతేడాది ఒక్కసారిగా ఆన్లైన్ క్లాసులు తెరపైకి రావడంతో కస్టమర్లు ట్యాబ్లెట్ పీసీలు, స్మార్ట్ఫోన్లను కొన్నారు. దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది డెస్క్టాప్స్కు మళ్లారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు సైతం వీటిని ఎంచుకుంటున్నారు. అప్‌గ్రేడ్ విషయంలో ల్యాప్‌టాప్‌తో పోలిస్తే డెస్క్‌టాప్ అనువైనది. కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా హార్డ్ డిస్క్, ర్యామ్, గ్రాఫిక్స్ కార్డ్, ఎస్ఎస్డీ సులువుగా మార్చుకోవచ్చు. నచ్చిన సైజులో స్క్రీన్‌ను, కావాల్సిన కెమెరాను అమర్చుకోవచ్చు. పైగా దీర్ఘకాలిక మన్నిక కూడా. – అహ్మద్, ఎండీ, ఐటీ మాల్ -
అయిదేళ్లలో 12 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న అయిదేళ్లలో భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం ప్రకటించారు. వివిధ దిగ్గజ ఎలక్ట్రానిక్ తయారీదారులు వచ్చే అయిదేళ్లలో దేశంలో భారీస్థాయిలో స్మార్ట్ఫోన్లు, విడిభాగాల తయారీ చేసేలా ప్రతిపాదించారని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 లక్షల వరకు ఉద్యోగాలు సృష్టించనున్నారని వెల్లడించారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) కింద దేశంలో రాబోయే ఐదేళ్లలో11 లక్షలకు కోట్ల రూపాయలకు పైగా విలువైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు తయారు కానున్నాయని కేంద్రం మంత్రి వెల్లడించారు. పెగాట్రాన్, శాంసంగ్ , రైజింగ్ స్టార్ , ఫాక్స్ కాన్, విస్ట్రాన్ ఐదు అంతర్జాతీయ బ్రాండ్లతో సహా మొత్తం 22 కంపెనీలు ఈ పథకం కింద 22 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు. ఈ కంపెనీల 7 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేయనున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు లక్షల ప్రత్యక్ష, తొమ్మిది లక్షల పరోక్ష ఉద్యోగాలు దేశీయంగా లభిస్తాయని పేర్కొన్నారు. ఈ పథకం ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహిస్తుందని, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని భావిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో టీవీఎస్ నకిలీ పార్ట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉప్పు, పప్పులే కాదండోయ్.. వాహన విడిభాగాల్లోనూ నకిలీలున్నాయ్! అవి కూడా హైదరాబాద్‌లో. ఇటీవల వాహన తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ జరిపిన దాడిలో ఈ విషయం వెల్లడైంది. హైదరాబాద్ రాంకోఠికి చెందిన ఓ ప్రముఖ విక్రయశాలలో రూ.6 లక్షల విలువ చేసే ద్విచక్ర, త్రిచక్ర వాహనాల నకిలీ విడిభాగాలను స్వాధీనం చేసుకున్నామని.. సంబంధిత స్టోర్ యజమాని మీద కేసులు కూడా నమోదు చేశామని టీవీఎస్ మోటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (పార్ట్స్ బిజినెస్) కె.వెంకటేశ్వర్లు గురువారమిక్కడ చెప్పారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... నకిలీ బ్రేకులు, క్లచ్‌లు.. మూడు నెలలుగా హైదరాబాద్‌తో సహా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, కోయంబత్తూరు నగరాల్లోని 55 ప్రాంతాల్లో దాడులు నిర్వహించాం. వీటిలో రూ.55 లక్షల విలువ చేసే నకిలీ విడిభాగాల్ని గుర్తించాం. బ్రేకులు, చెయిన్, కేబుల్స్, క్లచ్ ప్యాడ్స్ వంటి ఎక్కువ విక్రయాలు జరిగే విడిభాగాలే నకిలీలున్నాయి. ఇవి బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతాల్లోని 8 కేంద్రాల్లో తయారవుతున్నాయి. అక్కడి నుంచే దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు సరఫరా అవుతున్నాయి. సంబంధిత తయారీ కేంద్రాలు, యాజమాన్యం మీద కాపీ రైట్స్ చట్టం కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్‌లో మాత్రం తయారీ కేంద్రం ఉన్నట్లు గుర్తించలేదు. అయితే దాడులింకా పూర్తవ్వలేదు. ఈ ఏడాదంతా కొనసాగుతాయి. నకిలీ విడిభాగాలను గుర్తించేందుకు, దాడులు చేసేందుకు 12 ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకున్నాం. అవి గుర్తించిన ఉత్పత్తులను కంపెనీ పరిశోధన బృందం పరీక్షించి అవి నకిలీ ఉత్పత్తులేనని తేలాక.. సంబంధిత ప్రాంతాల్లో పోలీసు, ఏజెన్సీలతో కలసి దాడులు చేస్తాం. ఏప్రిల్‌లో హెచ్‌అండ్‌ఎస్ కేంద్రాలు.. హబ్ అండ్ స్పోక్ (హెచ్‌అండ్‌ఎస్) విధానంలో విడిభాగాలను విక్రయించాలని నిర్ణయించాం. ఈ కేంద్రాలేం చేస్తాయంటే.. కంపెనీ నుంచి హబ్‌కు బల్క్‌లో టీవీఎస్ ఉత్పత్తులను పంపిస్తాం. అక్కడి నుంచి 150 కి.మీ. పరిధిలోని డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరుతాయి. ప్రతి హబ్ 2 నెలలకొకసారి ప్రతి రిటైలర్లతో సంప్రతించడం, పర్యవేక్షించడం వంటివి చేయాలి. ఇదంతా టెక్నాలజీతో కలిసి ఉంటుంది. ప్రతి రిటైల్ స్టోర్, ఉత్పత్తులు ట్రాక్ అవుతాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద ఏడాదిన్నర క్రితం నుంచి తమిళనాడులో 10 హెచ్‌అండ్‌ఎస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూషన్లున్నాయి. వీటినే హెచ్‌అండ్‌ఎస్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏప్రిల్‌లో అధికారికంగా ప్రారంభిస్తాం. ఏడాది ముగిసే నాటికి మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఈ విధానాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించాం. విపణిలోకి అదనపు ఫీచర్లతో ఉత్పత్తులు.. ప్రతి విడిభాగం గరిష్ట అమ్మకం ధర (ఎంఆర్పీ) మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే అది నకిలీనా? ఒరిజినలా? అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ క్యూఆర్ కోడ్‌ను ఒకసారి స్కాన్ చేస్తే రెండోసారి చేసేటప్పుడు గతంలో వినియోగించారని వస్తోంది. అందుకే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న విడిభాగాల్లో అదనపు ఫీచర్లను జోడిస్తున్నాం. ప్రతి ఉత్పత్తి మీద సూక్ష్మ అక్షరాలతో టీవీఎస్ అని ఉంటుంది. ఇది చూసేందుకు రంగుతో ఉంటుంది కానీ, పరీక్ష చేస్తే కంపెనీ పేరు కనిపిస్తుంది. ఇలాంటి ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను విపణిలోకి ప్రవేశపెడుతున్నాం. -
హీరో కంపెనీ నకిలీ స్పేర్‌పార్టులు
విజయవాడ: ఆటోమొబైల్స్ షాపులపై గురువారం విజయవాడ విజిలెన్స్ అధికారుల బృందాలు దాడులు చేశారు. హీరో కంపెనీకి చెందిన నకిలీ స్పేర్‌పార్ట్స్‌ను అదే కంపెనీ పేరుతో లేబుల్స్, కవర్లు ముద్రించి విక్రయిస్తున్నారని కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుపై విజిలెన్స్ విభాగానికి చెందిన ఆరు బృందాలు ఆరు షాపులపై ఏకకాలంలో దాడులు చేశాయి. నాలుగు షాపుల్లో నకిలీ స్పేర్‌పార్ట్‌లు దొరికాయి. విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ విజయ్‌పాల్ తెలిపారు. గవర్నర్‌పేట ఏరియాలోని కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డులో ఆం«ధ్రా ఆటో ఏజెన్సీలో విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ షాపులో సుమారు రూ. 10 లక్షల విలువైన నకిలీ స్పేర్‌పార్టులు దొరికాయి. అజిత్ సింగ్‌నగర్‌లో సాయి వైష్ణవి ఆటో మొబైల్ షాపులో నకిలీ పార్టులు గుర్తించారు. సుమారు రూ. 35వేల విలువైన నకిలీ పార్టులు స్వాధీనం చేసుకున్నారు. బీసెంట్ రోడ్డులోని జయలక్ష్మి ఆటోమొబైల్స్, గుడివాద వర్ణమాన్ ఆటోమొబైల్స్ షాపులోనూ నకిలీ వస్తువులను గుర్తించారు. -
సొంతంగా ఐఫోన్ తయారీ.. వీడియా వైరల్
-
సొంతంగా ఐఫోన్ తయారీ.. వీడియా వైరల్
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బ్రాండెట్ ఫోన్ గా ముద్రపడిన ఐఫోన్ కొనుక్కోవాలంటే మీరందరూ ఎక్కడికి వెళ్తారు.. ఆపిల్ స్టోర్ కు లేదా ఆన్ లైన్ ను ఆశ్రయిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం మీ అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఐఫోన్ కొనుక్కోవాలంటే వాటి వద్దకే వెళ్లాలా.. సింపుల్ గా మనమే తయారీచేసుకుంటే పోలా అని రంగంలోకి దిగేశాడు. ఐఫోన్ కు కావాల్సిన విడి భాగాలన్నింటిన్నీ చైనాలోని ఫేమస్ మార్కెట్ షెన్జెన్ నుంచి సేకరించి, బెస్ట్ సెల్లింగ్ మొబైల్ గా పేరు తెచ్చుకుంటున్న ఐఫోన్ 6ఎస్ ను తయారీచేసేశాడు. తాను ఐఫోన్ 6ఎస్ ఎలా రూపొందించాడో తెలుపుతూ ప్రాథమిక ప్రక్రియ నుంచి తుది దశ వరకు ఐఫోన్ తయారీ వీడియోను యూట్యూబ్ లోని స్ట్రేంజ్ పార్ట్స్ ఛానల్ లో పెట్టాడు.ఇక అంతే ఆ వీడియోకు లైక్స్, కామెంట్స్ యూట్యూబ్ లో దంచికొడుతున్నాయి. కేవలం ఆ ఒక్క వీడియోతోనే ఆ ఛానల్ కు 20వేల మంది సబ్స్క్రైబర్లు యాడ్ అయ్యారు. అది కూడా కేవలం 22 గంటల్లోనేనట. ఆ వ్యక్తి రూపొందించిన వీడియోకు 2500 కామెంట్లు రాగా, 25వేల లైక్స్, లక్షల కొద్దీ వ్యూస్ వెల్లువెత్తాయి. మెటల్ బ్యాక్ కేసును సెర్చ్ చేయడం నుంచి వీడియో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఐఫోన్ కు అవసరమైన విడిభాగాలన్నింటిన్నీ చైనాలోని షెన్జెన్ మార్కెట్లో వెతుకుతూ ఒక్కొక్కటిగా అమర్చడం ఈ వీడియోలో చూపించాడు ఆ వ్యక్తి. గ్లాస్ ప్యానల్, డిజిటైజర్, ఎల్సీడీ ప్యానల్, బ్యాక్ లైట్, లాజిక్ బోర్డు, బ్యాటరీ, కెమెరా మోడ్యుల్, హోమ్ బటన్, స్క్రీవ్యూస్ వంటి వాటిని ఆ వ్యక్తి మార్కెట్లో పొందడం, అమర్చడం, ఫెయిల్ అవ్వడం మళ్లీ అసెంబ్లింగ్ చేయడం వంటివన్నీ ఈ వీడియోలో చూపించాడు. ఎట్టకేలకు తన కోసం తాను సొంతంగా ఐఫోన్ 6ఎస్ తయారుచేసుకున్నట్టు పేర్కొన్నాడు. -
ఆన్లైన్లో ఇండస్ట్రియల్ స్పేర్ పార్ట్స్
♦ హైదరాబాద్‌లో స్పేర్ పార్ట్స్ ♦ జూన్‌లోగా గిడ్డంగుల ఏర్పాటు ♦ కంపెనీ కో-ఫౌండర్ దినేష్ అగర్వాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలను ఆన్లైన్లో విక్రయిస్తున్న స్పేర్ఎన్పార్ట్స్.కామ్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 350 మంది విక్రేతలతో చేతులు కలిపిన ఈ కంపెనీ.. ఇప్పుడు భాగ్యనగరిలో ఉన్న రిటైలర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 200 ఇండస్ట్రియల్ క్లస్టర్లలో హైదరాబాద్ మొదటి 20 స్థానాల్లో ఉంటుందని గ్లోబల్ స్పేర్ఎన్పార్ట్స్ సహ వ్యవస్థాపకులు దినేష్ కుమార్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ఇక్కడ సిబ్బందిని నియమించడం ద్వారా దక్షిణాది మార్కెట్లో విస్తరిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా కస్టమర్లకు 3-7 రోజుల్లో ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నట్టు తెలిపారు. 100కుపైగా ప్రధాన బ్రాండ్ల ప్రొడక్టులను విక్రయిస్తున్నామని వివరించారు. 40 శాతం దాకా డిస్కౌంట్.. కంపెనీ మొత్తం 24 విభాగాల్లో 1 లక్షకుపైగా ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. సేఫ్టీ ప్రొడక్ట్స్, బేరింగ్స్, బెల్ట్స్, ఎలక్ట్రికల్స్ వంటివి వీటిలో ఉన్నాయి. ఏడాదిలో ఈ సంఖ్యను 10 లక్షలకు చేరుస్తామని దినేష్ వెల్లడించారు. 40 శాతం దాకా డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. ‘తక్కువ సమయంలో ప్రొడక్టుల డెలివరీ కోసం వచ్చే జూన్ కల్లా హైదరాబాద్‌సహా 20 ప్రధాన ఇండస్ట్రియల్ ఏరియాల్లో గిడ్డంగులను ఏర్పాటు చేస్తాం. ఇందుకు అవసరమైన నిధులను ప్రైవేటు ఈక్విటీ ద్వారా సమీకరిస్తాం. ఇండస్ట్రియల్ స్పేర్స్ మార్కెట్ 22 శాతం వార్షిక వృద్ధిరేటుతో భారత్‌లో రూ.2 లక్షల కోట్లుంది. అయిదేళ్లలో ఇది రెండింతలు కానుంది. మొత్తం మూడు కంపెనీలు ఆన్లైన్లో వీటిని విక్రయిస్తున్నాయి. ఆన్లైన్ వాటా కేవలం రూ.150 కోట్లు మాత్రమే’ అని వివరించారు.